జనగాం కుర్రాడి కంపెనీ కొనేందుకు క్యూ కట్టిన మైక్రోసాఫ్ట్, మోటరోలా

మొబైల్ టెక్నాలజీలో వైట్ హౌస్ మనసు దోచాడు..పదేళ్ల క్రితం ప్రఖ్యాత బ్యాంకులన్నీ ఇతడి క్లైంట్లు...గ్రామీణ స్థాయి నుంచి ఉన్నతంగా ఎదిగిన దయాకర్...

జనగాం కుర్రాడి కంపెనీ కొనేందుకు క్యూ కట్టిన మైక్రోసాఫ్ట్, మోటరోలా

Monday August 31, 2015,

4 min Read

పదో తరగతి వరకూ చదువుపై అంత ఆసక్తే లేదు. ఎంత సేపూ పొలం, స్నేహితులు, ఊరే ఆ కుర్రాడి లోకం. యావరేజ్ స్టూడెంట్‌గా పేరు. కానీ ఇంటర్‌ నుంచి ఆలోచన మారింది. డిగ్రీలో డిస్టింక్షన్. యూఎస్‌లో ఎంఎస్. ఆ తర్వాత మోటరోలా, మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగం. మొబైల్ టెక్నాలజీలో సరికొత్త ఆవిష్కరణలు. అమెరికన్ వైట్ హౌస్‌ ఇతగాడి కృషిని గుర్తించి సత్కరించింది. ఆ తర్వాత స్టార్టప్ ఏర్పాటు.. దాన్ని వందల కోట్లకు ఇతర కంపెనీ కొనుగోలు. అనుభవంతో వెంచర్ క్యాపిటలిస్ట్‌గా మారారు. స్టార్టప్‌లకు మెంటార్‌గా వ్యవహరిస్తూ వాళ్లకు చేయూతనిస్తూ.. సరైన దారి చూపించడమే ఇప్పుడు అతని లక్ష్యం. ఆయనే దయాకర్ పుస్కూర్.

image


దయాకర్‌ది వరంగల్ జిల్లా జనగాంలోని లక్ష్మక్కపల్లి. పూర్తిగా వ్యవసాయ ఆధారిత కుటుంబం. పది మంది సంతానం మధ్య పుట్టారు. నాలుగేళ్లకే తండ్రి కాలం చేయడంతో మేనమామ దగ్గరే పెరిగారు. వరంగల్‌లో విద్యాభ్యాసం పూర్తైంది. అక్కాబావల బలవంతంతో 1984లో ఇష్టంలేకపోయినా అమెరికా వెళ్లారు. అక్కడ ఎంఎస్ పూర్తిచేశారు. అదే లైఫ్‌లో కీలకమైన టర్నింగ్ పాయింట్.

దయాకర్ పుస్కూర్

దయాకర్ పుస్కూర్


''నాకేమో ఊళ్లో ఉండి వ్యవసాయం చేయాలని కోరిక. మా అమ్మకేమో నేను డాక్టర్ కావాలని ఆశ. మా అక్కా,బావ నన్ను యూఎస్ వచ్చి చదవమనే వారు. అయిష్టంగానే యూఎస్ వెళ్లా. అప్పటివరకూ నాకు టెక్నాలజీపై అసలు అవగాహనే లేదు ''

మొబైల్ టెక్నాలజీ మొనగాడు

ఎంఎస్ పూర్తైన వెంటనే ఫ్లోరిడాలోని మోటరోలాలో ఏడేళ్ల పాటు పనిచేశారు. ఉద్యోగంలో చేరిన కొన్నేళ్లకే యాజమాన్యం అతడి సత్తాను గుర్తించింది. 30 ఏళ్లు కూడా దాటకుండానే అతడికి మోటరోలా - జపాన్ ఆపరేషన్స్ మొత్తం అప్పగించింది. చురుకుదనం, మొబైల్ టెక్నాలజీపై అమితమైన ప్రేమతో రాత్రింబవళ్లూ కష్టపడ్డారు. ఈ మధ్యలో కుటుంబానికి సమయం కేటాయించలేకపోతున్నామని భావించి 1996లో మోటరోలాకు గుడ్ బై చెప్పారు.

తనకు అత్యంత ఇష్టమైన రంగంలో స్టార్టప్ మొదలుపెట్టారు. అదే జెపి మొబైల్. ఎంటర్‌ప్రైజ్ మొబిలిటీ సొల్యూషన్స్ సంస్థ ఇది. ఈ-మెయిల్స్‌ను మొబైల్ టెక్నాలజీ ద్వారా పంపే పరిజ్ఞానం. పేజర్‌కి సాఫ్ట్‌వేర్ అభివృద్ధి చేయడం, చిన్న డివైజ్‌ల ద్వారా పేజర్లకు ఈ-మెయిల్స్ పంపించే సౌకర్యాన్ని కల్పించారు. మొబైల్స్‌కు మెయిల్స్‌ పంపడం వంటివి చేసేవారు. పది,పదిహేనేళ్ల క్రితం అప్పట్లో ఇదో పెద్ద సంచలనంగా మారింది. అక్కడి పత్రికలు ఈ టెక్నాలజీని కంపెనీని ఆకాశానికి ఎత్తేశాయి. పేజర్లకే ఈమెయిల్ రావడంతో న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్, జెపి మోర్గాన్, ఈఎస్‌పిఎన్, వైట్ హౌస్.. సహా.. ప్రముఖ బ్యాంకులన్నీ జెపి మొబైల్‌కు కష్టమర్లు అయిపోయారు. అప్పటివరకూ తాను సొంతంగా దాచుకున్న డబ్బుతో కంపెనీని నడిపారు దయాకర్. 20 మంది సిబ్బందితోనే 3 మిలియన్ డాలర్ల రెవెన్యూని సాధించారు. 8 పేటెంట్లను పొందారు.

దయాకర్ పుస్కూర్‌ను మొబైల్ టెక్నాలజీ విజనరీగా అమెరికన్ వైట్ హౌస్ గుర్తించి సత్కరించింది. అది కూడా అతనిలో ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసి, ఆకాశానికి ఎత్తింది.

జీవితానికి సరిపడా గుణపాఠం ఇక్కడే !

మీడియా హోరు, టెక్నాలజీలో కొత్తదనాన్ని పరిచయం చేయడంతో బ్యాంకులు, ఫండ్ హౌస్‌లు క్యూకట్టాయి. కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తామని వెంటపట్టాయి. కొన్ని కంపెనీలైతే కొనుగోలుకు కూడా ముందుకొచ్చాయి. AETHAR సిస్టమ్స్ సంస్థ జెపి మొబైల్‌కు ఏకంగా 800 మిలియన్ డాలర్ల ఆఫర్ ఇచ్చింది. అవును మీరు చదివింది కరెక్టే ఎయిట్ హండ్రెడ్ డాలర్స్. డాలర్‌ నలభై రూపాయలే ఉందని అనుకున్నా.. అప్పట్లో ఈ మొత్తం 3వేల కోట్ల పైమాటే. కానీ దయాకర్ ఆ ఆఫర్ తిరస్కరించారు.

నెల రోజుల్లో కొంత మంది నుంచి 55 మిలియన్ డాలర్ల ఫండింగ్ పొందారు. అయితే ఈలోపే 2000 క్రైసిస్‌ టెక్నాలజీ రంగాన్ని ముంచేసింది. ఒక్కసారిగా ఇలాంటి కంపెనీల ఆశలన్నీ పేకమేడల్లా కూలిపోయాయి. అయినా సరే.. నిలదొక్కుకున్నారు. నాలుగైదేళ్లు కాలాన్ని వెళ్లదీశారు. జెపి మొబైల్‌ టెక్నాలజీని కొనేందుకు మైక్రోసాఫ్ట్, మోటరోలా మళ్లీ ఆఫర్ ఇచ్చాయి. గతంలో ఇదే టెక్నాలజీని అభివృద్ధి చేద్దామని దయాకర్ ఈ రెండు కంపెనీల చుట్టూ ఎంతకాలం తిరిగినా పట్టించుకున్న దిక్కులేదు. అయితే ఇతర ఇన్వెస్టర్లు ఆ ఆఫర్లకు ఒప్పుకోలేదు. ఈ మధ్యలో గుడ్ టెక్నాలజీస్‌ అనే కంపెనీకి జెపి మొబైల్‌ను సుమారు వంద మిలియన్ డాలర్లకు అమ్మేశారు. (నాలుగు వందల కోట్లు అనుకుందాం) ఆరు నెలలు ఆగితే.. మంచి వేల్యుయేషన్ వస్తుందని..చెప్పినా ఇతర ఇన్వెస్టర్లు ఒప్పుకోకపోవడం వల్ల తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వచ్చిందని దయాకర్‌ ఇప్పటికీ చెప్తారు.

ఆశ్చర్యం ఏంటంటే.. గుడ్ టెక్నాలజీస్ సంస్థ నుంచి ఆ టెక్నాలజీని, పేటెంట్లను మోటరోలా కొనుగోలు చేసింది. అది కూడా అర బిలియన్ డాలర్లకు. అంతే కాదు జెపి రూపొందించిన 8 పేటెంట్లకు 250 మిలియన్ డాలర్ల మొత్తానికి అమ్ముకున్నారు. అంటే అది కొద్దికాలంలోనే మూడురెట్ల అధిక వేల్యూయేషన్‌తో జెపిని అమ్మేసి గుడ్ టెక్నాలజీస్ సొమ్ముచేసుకుంది.

మైక్రోసాఫ్ట్ ఆహ్వానం

మొబైల్ టెక్నాలజీపై మంచి పట్టు ఉండడంతో మూవబుల్ క్లౌడ్ ఇన్నోవేషన్ ప్రాజెక్టుకు నాయకత్వం వహించమని మైక్రోసాఫ్ట్ కోరింది. అక్కడ రెండేళ్లపాటు పనిచేసి ఆఫీస్ 365 ఇంక్యుబేషన్ ఏర్పాటు చేశారు దయాకర్. అయితే ఆంట్రప్రెన్యూర్‌గా పనిచేసిన తర్వాత అది ఎంత పెద్ద కంపెనీ అయినా పనిచేయడం కాస్త ఇబ్బందిగానే ఉంటుంది అంటారు దయాకర్.

అందుకే వెంచర్ క్యాపిటలిస్ట్‌గా మారి నయా వెంచర్స్ సంస్థను ఏర్పాటు చేశారు. మూడేళ్లుగా ఈ సంస్థ 15 కంపెనీలకు ఫండింగ్ అందించింది. ఫండింగ్ పొందిన కంపెనీల వేల్యుయేషన్ 250 మిలియన్ డాలర్ల వరకూ ఉంటుంది.

నయావెంచర్స్‌లో ఇతర భాగస్వాములతో కలిసి

నయావెంచర్స్‌లో ఇతర భాగస్వాములతో కలిసి


నా గుణపాఠాలే మీకు పాఠాలు :

  • ఎగ్జిట్ చాలా ముఖ్యం. ఏ స్టార్టప్ కంపెనీకి అయినా ఎగ్జిట్ తెలియకపోతే ఇరుక్కుపోతారు. 800 మి.డాలర్ల వేల్యుయేషన్‌ వచ్చినప్పుడు అమ్మకపోవడంతో 100 మిలియన్లకు అమ్ముకోవాల్సి వచ్చింది.
  • పేటెంట్లు చాలా ముఖ్యం. మనది కూడా ఒక ఐడియానేనా అనే కాంప్లెక్స్ వద్దు. మీ ఐడియా రేపు పొద్దున అద్భుతమైన ప్రొడక్ట్ కావొచ్చు. పేటెంట్స్ పొందండి. మేం రూపొందించిన పేటెంట్స్‌ను మా తర్వాతి యాజమాన్యం 250 మి.డాలర్లకు అమ్ముకుంది.

స్టార్టప్స్‌కు సలహా

  1. టీం చాలా ముఖ్యం. భాగస్వామినో లేదా ఫస్ట్ ఎంప్లాయినో సెలక్ట్ చేసుకోవడం చాలా కీలకం. అయితే మీ లాంటి వాళ్లనే (మీ క్లోన్) ఎంచుకోవద్దు. మిమ్మల్ని ప్రశ్నించాలి, పోరాడాలి, సూటిగా అడగాలి. అలాంటి వాళ్లవల్లే కంపెనీకి పురోభివృద్ధి.
  2. ఓ పెద్ద సమస్యను పరిష్కరించేలాంటి ఐడియా గురించి ఆలోచించండి. మీ ఆలోచనకు పరిష్కారం బిలియన్ డాలర్లకు తక్కువ కావొద్దు.
  3. ఒకవేళ ఏదైనా కాన్సెప్ట్ ఫెయిల్ అయితే త్వరగా వదిలించుకోండి. ఫాస్ట్ ఫెయిల్ అనుకుని ముందుకు కదలండి.
  4. ఉద్యోగులు, ఇన్వెస్టర్లు, సహ వ్యవస్థాపకులు, క్లైంట్లలో నమ్మకాన్ని నింపండి. మీరు వాళ్లను నష్టపరుస్తున్నారనే అభిప్రాయం ఎప్పటికీ కలగనీయొద్దు.
  5. మీది లైఫ్ స్టైల్ వ్యాపారమా..లేక విసి ఫండింగ్ అవసరమయ్యే వ్యాపారమా.. ముందే నిర్ణయించుకోండి.
''నా లక్ష్యం ఒక్కటే. ఐదేళ్లలో వంద మంది ఆంట్రప్రెన్యూర్లను తయారు చేయగలగాలి. హైదరాబాద్ నుంచి కనీసం ఒక్క బిలియన్ డాలర్ కంపెనీని అయినా సృష్టించాలి'' - దయాకర్