యాసిడ్ దాడి జరిగినా ఆకాశమంత ప్రేమను చాటుకున్న ప్రియుడు  

0

సరిగ్గా ఐదేళ్ల క్రితం లలితా బెనే బాన్సీ అనే యువతికి ఒక ఫోన్ కాల్ వచ్చింది. రిసీవ్ చేసుకున్న తర్వాత తెలిసింది అది రాంగ్ కాల్ అని. అయితే, అవతలి వ్యక్తి మాట్లాడిన తీరు ఆమెకి నచ్చింది. సభ్యత, సంస్కారం కలగలిసిన ఆ గొంతు లలితను కట్టిపడేసింది. తెలియని వ్యక్తే అయినా కాసేపు మాట్లాడి పెట్టేసింది. తర్వాత మళ్లీ అదే వ్యక్తి నుంచి ఫోన్. మళ్లీ కాసేపు సంభాషణ. అలా మాటా మాటా కలిసింది. మనసూ మనసూ కలిసింది. స్నేహం చిగురించి ప్రేమగా మారింది.

విషయం ఇంట్లో తెలిసి సీన్ రచ్చరచ్చ అయింది. ప్రేమ దోమ అంటే చంపి పాతరేస్తామని ఇంట్లోవాళ్లు అని బెదిరించారు. చంపినా సరే, అతణ్నే పెళ్లి చేసుకుంటానని తెగేసి చెప్పింది. గొడవ కాస్తా ముదిరింది. అంతలోనే చిన్నాన్న కొడుకు ఒకడు యాసిడ్ తెచ్చి ముఖంపై గుప్పించాడు. కోమలమైన ఆమె చర్మం యాసిడ్ ధాటికి బుసులు కొట్టింది. అగ్నిపర్వతం మొహంమీదే బద్దలైంది.

ఆవేశంలో తమ్ముడు చేసిన పనికి పశ్చాత్తాప పడ్డారు. సరే, జరిగిందేదో జరిగిందని సర్జరీ కోసం ఆసుపత్రికి వెళ్లారు. యాసిడ్ మొహాన్నంతా తినేసింది. ఒక్క సర్జరీ సరిపోదన్నారు. ఒకటి.. రెండు.. మూడు.. అలా 17 సర్జరీలయ్యాయి. మొహం కాస్త తేటపడింది మినహా, యాసిడ్ దాడి జరిగిందన్న సంగతి కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.

లలిత మీద పాశవికంగా దాడి చేశారని తెలుసుకున్న ఆమె ప్రియుడు రవి శంకర్ చలించిపోయాడు. తన ప్రేమ ఎంత బలమైందో చెప్పాలని మనసులో అనుకున్నాడు. తను ప్రేమించింది బాహ్య సౌందర్యాన్ని కాదు.. అంత:సౌందర్యాన్ని అని చాటి చెప్పడానికి మరో స్టెప్ ముందుకు వేశాడు. అమ్మను ఎలాగోలా ఒప్పించాడు. ఊపిరి ఉన్నంత వరకు చేయి విడిచిపెట్టను అని లలితకు ప్రామిస్ చేశాడు. అన్నమాట ప్రకారం న్యాయస్థానంలో పెళ్లిచేసుకున్నాడు.

రవిశంకర్ ఒక ప్రైవేటు కంపెనీలో పని చేస్తాడు. రాంచీలో ఒక పెట్రోల్ పంప్ ఉంది. ఇద్దరు కలిసి థానే దగ్గర్లో బతకాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయం తెలిసిన నటుడు వివేక్ ఒబెరాయ్ వీరిద్దరికీ థానేలో ఒక ఫ్లాట్ బహుమతిగా ఇచ్చాడు. ఆమె ఒప్పుకుంటే భవిష్యత్ లో సర్జరీకి ఆర్ధిక సాయం కూడా చేస్తానని మాటిచ్చాడు. 

Related Stories

Stories by team ys telugu