విమెన్ క్యాబ్ డ్రైవర్స్... సేఫ్ జర్నీకి కేరాఫ్ అడ్రస్

విమెన్ క్యాబ్ డ్రైవర్స్... సేఫ్ జర్నీకి కేరాఫ్ అడ్రస్

Sunday March 27, 2016,

6 min Read


అర్థరాత్రి... 12 దాటింది. అప్పుడే డ్యూటీ ముగించుకొని రోడ్డుపైకి వచ్చింది ఓ మహిళా సాఫ్ట్ వేర్ ఇంజనీర్. రోడ్డంతా ఖాళీ. ఇంటికెళ్లాలి. ఏదో తెలియని భయం. నడుస్తుంటే వణుకు. క్యాబ్ వస్తుందేమోనని ఎదురుచూపులు. అర్థరాత్రి మహిళలు ఒంటరిగా ప్రయాణిస్తున్నప్పుడు జరిగిన ఘోరాలన్నీ కళ్లముందు కదలాడుతున్నాయి. ఛా... అలాంటిదేమీ జరగదులే అని తనకు తానే సర్దిచెప్పుకుంటూ ధైర్యాన్ని కూడదీసుకుంటోంది. ఇంతలో దూరం నుంచి ఓ తెల్ల కారు వస్తోంది. ఆపాలా... వద్దా? మనస్సులో సంశయం. ఏం పర్లేదు... కొద్ది దూరమే కదా వెళ్లేది అనుకుంటూ బెరుకు బెరుగ్గా క్యాబ్ ని ఆపింది. చూస్తే షాక్. ఒక్కసారిగా సంతోషం. కొండంత ధైర్యం. అప్పటిదాకా గందరగోళంగా ఉన్న మనస్సు కుదుటపడింది. టెన్షన్ పడుతున్న ఆ మహిళా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ రిలాక్స్ అయింది. కారణం... ఆ క్యాబ్ డ్రైవర్ ఓ మహిళ కావడమే.


అవును... మీరు చదివింది నిజమే. వాళ్లు మహిళా క్యాబ్ డ్రైవర్లే. క్యాబ్ లో మగ డ్రైవర్లతో ప్రయాణించాలంటే భయపడేవాళ్లకు మేమున్నామంటూ భరోసా ఇస్తున్నారు మహిళా డ్రైవర్లు. నైట్ జర్నీని సేఫ్ గా మార్చేస్తున్న ముగ్గురు డ్రైవర్ల జీవితాలు చూస్తే... వాళ్ల ధైర్యం ముచ్చటేస్తుంది. వాళ్ల కష్టాలు కన్నీళ్లు తెప్పిస్తాయి. వాళ్ల త్యాగం గర్వపడేలా చేస్తుంది. వాళ్ల పోరాటం మరెందరికో స్ఫూర్తినిస్తుంది. ఆ ముగ్గురే షబానా షేక్, పింకీ రాణి, గంగా ఆర్వీ. అర్థరాత్రి వేళల్లో అమ్మాయిలపై కన్నేసే రాక్షసమూకల్ని తరిమికొట్టే సాహసికులు వీళ్లంతా. మహిళల అవసరాలను తెలుసుకొని డ్రైవింగ్ చేస్తున్న త్యాగమూర్తులు. ఈ స్థానానికి చేరుకోవడానికి వాళ్లు ఎంతగా పోరాడాల్సి వచ్చిందో... ఇప్పుడా స్థానాన్ని నిలుపుకోవడానికీ అంతే పోరాడుతున్నారు. రోడ్డులాగా వీరి జీవితంలోనూ ఎన్నో మలుపులున్నాయి. ఎన్నో స్పీడ్ బ్రేకర్లున్నాయి. అయినా వాటిని చూసి భయపడలేదు. పట్టిన స్టీరింగ్ వదలకుండా తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు.

షబానా షేక్ అమిన్, జూన్ 2011 నుంచి డ్రైవింగ్

షబానా... పేరు చూస్తేనే తెలుస్తోంది ముస్లిం మహిళ అని. షబానాకు అందరు ముస్లిం మహిళలకు ఉన్నట్టుగానే ఆంక్షలు ఉండేవి. బురఖా వేసుకొని వెళ్లాలి... ఒంటరిగా తిరగకూడదు... ఇలా అనేక పరిమితులు ఉండేవి. హైస్కూల్ వరకు చదివిన షబానా ఎప్పుడూ స్వేచ్ఛ కోసం కలలు కనేవారు. ఈ కంచెల్ని తెంచుకొని స్వేచ్ఛగా విహరించాలనుకునేవారు. సాఫీగా సాగిపోతున్న ఆమె జీవితంలో తొలిసారి కల్లోలం. తల్లి మంచాన పడ్డారు. మెడికల్ బిల్లులు వేలల్లో అయ్యేవి. కష్టాలు తీరాలంటే ఆంక్షల్ని పక్కన పెట్టక తప్పలేదు. అలా ముంబైలోని ఓ మాల్ లో ఉద్యోగంలో చేరింది. ఆ తర్వాత క్లర్కుగా, స్టోర్ కీపర్ గా పలు ఉద్యోగాలు చేసింది. 23 ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడు... మహిళా క్యాబ్ డ్రైవర్లకున్న డిమాండ్ గురించి తెలిసింది. కానీ అప్పటికీ షబానాకు డ్రైవింగ్ గురించి తెలియదు. అయినా వెనుకడుగు వేయలేదు. విశాలమైన రోడ్లపై కారులో రయ్యిన దూసుకెళ్లాలని ఒక గోల్ ఫిక్స్ చేసుకుంది. 

"వాహనం నడపాలన్న ఆలోచనే ఎంతో ఉత్సాహాన్నిచ్చేది. నేను జాయిన్ అయిన కంపెనీ మహిళలకు ఉచిత శిక్షణను ఆఫర్ చేసింది. ఆ శిక్షణ పూర్తి చేసుకున్న వాళ్లకు ఉద్యోగాలు ఇచ్చింది. మనస్ఫూర్తిగా ఒప్పుకున్నాను. కేవలం ఉద్యోగం కోసమే నేను జాయిన్ కాలేదు. చివర్లో నాకు ఉద్యోగం రాకపోయినా పర్వాలేదు... స్వేచ్ఛగా డ్రైవింగ్ చేస్తే అదే చాలు అనిపించింది. నా తల్లిదండ్రులకు చెప్పకుండానే ట్రైనింగ్ తీసుకున్నా" షబానా.

శిక్షణ పూర్తవగానే షబానా పేరు మీద ఆఫర్ లెటర్ సిద్ధమైంది. ఇంట్లో నిజం చెప్పాల్సిన సమయం వచ్చింది. తను అడుగుతున్నది తప్పు కాదన్న నమ్మకంతో డ్రైవింగ్ గురించి ఇంట్లో చెప్పారు షబానా. మొదట్లో ఒప్పుకోలేదు. బతిమాలగా, బుజ్జగించగా సరే అన్నారు. ఏడాదిన్నర క్రితం ఉబర్ లో చేరారు. కొత్త వాహనం కొనుక్కునేందుకు సంస్థ సాయం చేసింది. అలా ఏడాదిన్నర తర్వాత ఓ వాహనానికి యజమాని అయ్యారు షబానా.

"ఉద్యోగంలో చేరిన తర్వాత జీవితం గొప్పగా మారిపోయింది. నాకు ఎక్కువగా ఎయిర్ పోర్టు డ్యూటీ ఉంటుంది. వేర్వేరు దేశాలకు చెందిన ప్రజలను కలుస్తుంటాను. ఆ పరిచయాలన్నీ ఎంతో అద్భుతంగా ఉంటాయి" - షబానా.
image


రెండేళ్ల క్రితం షబానా తల్లి చనిపోయింది. ఆ లోటు తీర్చలేనిది. రోజుకు రెండు నుంచి మూడు వేల వరకు సంపాదిస్తున్నారు. ఒక్కోసారి రాత్రంతా క్యాబ్ నడపాల్సి వస్తుంది. అయినా వెనకాడట్లేదు. ప్రస్తుతం ఆమె కుటుంబం ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కింది. తను సాధించిన దానిపట్ల గర్వంగా ఉన్నానంటారు షబానా.

పింకీ రాణి

హర్యానాలోని రోహ్తక్ లో పుట్టిపెరిగారు పింకీ రాణి. హైస్కూల్ వరకే చదివారు. అప్పుడు ఆమె తండ్రి ఆరోగ్యం బాగాలేదు. చనిపోయేలోగా కూతురు పెళ్లి చేయాలనేది ఆ తండ్రి కల. దాంతో పింకీ పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. వివాహం తర్వాత పింకీ జీవితం అనుకున్నంత సాఫీగాయేం సాగలేదు. అత్తింటివారికి కాస్మెటిక్స్, బ్యూటీ ప్రొడక్ట్స్ షాప్ ఉండేది. స్టాక్ తీసుకొచ్చే బాధ్యతల్ని పింకీకి అప్పగించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు బస్సుల్లో, రైళ్లల్లో తిరిగేవారామె. లగేజీ బ్యాగులను మోయాల్సి వచ్చేది. ఒక్కోసారి కూలీలను మాట్లాడుకోవాల్స వచ్చేది. లోడ్, అన్ లోడ్ చేయడానికి డబ్బులు చెల్లించాల్సి వచ్చేది. రిస్కీ వ్యవహారంగా మారిపోయింది. అందుకే ఓ కారు ఉంటే బెటర్ అని ఇంట్లోవాళ్లని అడిగి చూసింది.

"ఓ కారు కొనాలని నేను ఒత్తిడి చేశాను. కొన్నాళ్లు పట్టుబట్టిన తర్వాత కారు కొనేందుకు ఒప్పుకున్నారు. మా ఆయనకు కారు నడపడం అంటే భయం. ప్రతీసారీ కోపంతో తాళం చేతులు నా చేతిలో పెట్టి నన్నే డ్రైవ్ చేయమనేవారు. నాకేమో డ్రైవింగ్ చేయడమంటే ఎంతో ఉత్సాహం. ఆ అవకాశం ఇచ్చినందుకు నేను భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పాలి. అలా నా అదృష్టం మొదలైందని చెప్పాలి" అంటారు పింకీ.

కానీ ఆ అదృష్టం పింకీకి ఎక్కువ రోజులు లేదు. ఆమె భర్త అనారోగ్యం పాలయ్యాడు. డయాలిసిస్ చేయించుకోవాల్సి వచ్చేది. చికిత్స కోసం కారును ఫైనాన్స్ వాళ్లకు అమ్మేశారు. అంతలోనే ఏమైందో తెలియదు. ముగ్గురు పిల్లలతో వదిలేసిపోయాడు ఆమె భర్త. ఆ సమయంలో అత్తింటివారితో సంబంధాలు అంతంతమాత్రమే.

"పిల్లలకు, నాకు సాయం చేసేందుకు మా అత్తగారు ఒప్పుకోలేదు. కష్ట సమయాల్లో తనకు నేను పూర్తిగా సహకరించినా... నాకు మాత్రం ఎలాంటి సాయం అందలేదు. అప్పుడే 2014లో ఓలా, ఉబర్ సంస్థలు మహిళా డ్రైవర్లను నియమించుకుంటున్నారని తెలిసింది. సొంత కార్లు సమకూర్చుకునేందుకు మహిళలకు ఆర్థికంగా సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి ఆ సంస్థలు. రెండున్నర సంవత్సరాలకు ఒప్పందం కుదుర్చుకుని స్టీరింగ్ పట్టాను" - పింకీ.

ఇన్ స్టాల్ మెంట్లకు ఆమె సోదరుడు డబ్బు సమకూర్చాడు. అప్పుడు స్టీరింగ్ పట్టారు పింకీ. ఆమె నిర్ణయాన్ని బంధువులు తప్పుబట్టారు. ఎవర్నీ పట్టించుకోకుండా తన ఛాయిస్ కే కట్టుబడి ఉన్నారు. కుటుంబాన్ని పోషించాల్సిన బాధ్యత ఉండటంతో ముందడుగు వేశారు. రోజుకు రెండు నుంచి మూడు వేల వరకు సంపాదిస్తున్నారు.

"నాకు ముగ్గురు పిల్లలు. స్కూలుకెళ్తారు. నా ఆదాయమే జీవనాధారం. ఓలాలో పనివేళలు అనుకూలంగా ఉండటం వల్ల నేను ఏడెనిమిది గంటలు మాత్రమే పనిచేస్తాను. నా పిల్లలు ఎంతో సపోర్ట్ ఇస్తారు. నేనెంతో అదృష్టవంతురాలిని" - పింకీ.
image


ఇక ప్యాసింజర్స్ విషయానికొస్తే... కొన్నిసార్లు కొందరితో గొడవలు జరిగాయి. అయినా ఎప్పుడూ నిరుత్సాహపడలేదు. ఎవరెన్ని మాటలు అన్నా పట్టించుకోలేదు. కళ్లు రోడ్డుమీద పెట్టి డ్రైవింగ్ చేయడమే ముఖ్యం అనుకున్నారు. అలాగని ప్రతీసారీ ప్రతికూల పరిస్థితులేమీ లేవు. పింకీ కారులో ప్రయాణించిన చాలామంది ఆమెను మెచ్చుకున్నారు. పిల్లల్ని బాగా పెంచాలి, కస్టమర్లకు బాగా సేవలు చేయాలి... ఇదే ఆమె లక్ష్యం.

గంగా ఆర్వీ

గంగ... ఆంధ్రప్రదేశ్ లోని హిందూపురం సమీపంలో ఓ చిన్న గ్రామంలో జన్మించారు. బీకామ్ వరకే చదివారు. ఓ స్కూల్ లో ఏడేళ్లు ఇంగ్లీష్, కంప్యూటర్ టీచర్ గా పనిచేశారు. పెళ్లి తర్వాత బెంగళూరు వెళ్లారామె. బుక్ గమ్ తయారు చేసే ఓ కంపెనీలో చేరారు. ఆమె భర్త రైల్వేలో ఉద్యోగి. రైల్వే స్కూల్ లో టీచింగ్ జాబ్ సంపాదించేందుకు ఆమె భర్త చాలా ప్రయత్నించారు. గంగకు రోజూ హిందీ, ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చదివే అలవాటుంది. ఓలా సంస్థ మహిళా ఉమెన్ డ్రైవర్లను నియమించుకుంటుందని జనవరి 14, 2015న ఓ యాడ్ కనిపించింది.

"అప్పటికి నాకు డ్రైవింగ్ రాదు. కానీ ఎంతో ఆసక్తిగా, ఉత్సాహంగా అనిపించింది. నేను ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో చేరాను. ఓలా మాకు ఫ్రీ ట్రైనింగ్ ఇచ్చింది. డ్రైవింగ్ మెళకువలు నేర్పించింది. సర్టిఫికెట్ కూడా వచ్చింది. నా బ్యాడ్జ్ కూడా సిద్ధమైంది. అయితే వాహనం ఉన్నవాళ్లకే ఉద్యోగం ఇస్తారని తెలిసింది. నేను ఓ ట్యాక్సీ కాంట్రాక్టర్ ని కలిశాను. కానీ మహిళకు ఉద్యోగం ఇచ్చేందుకు ఏ ఒక్కరూ ఒప్పుకోలేదు. కారు కొందామని నేను నా భర్తను అడిగాను. ఆయన నిర్మొహమాటంగా తిరస్కరించారు. నేను డ్రైవర్ కావడం ఆయనకు ఇష్టం లేదు. టీచర్ జాబ్ అయితే మంచి ఉద్యోగం, గౌరవం ఉంటుందన్నారు. ఈ విషయంలో ఆయన నుంచి నాకు సాయం లభించదని అర్థమైంది" - గంగ.

ఆమె భర్త తాగుబోతు. ఇంటి ఖర్చులకు డబ్బులేమీ ఇచ్చేవాడు కాదు. వచ్చిన డబ్బును మద్యానికే ఖర్చు పెట్టేవాడు. వారికి ఇద్దరు పిల్లలు. స్కూలు నుంచి ఇంటి ఖర్చులన్నీ గంగ చూసుకునేవారు. ఒంటిచేత్తో సంవత్సరాలుగా కుటుంబాన్ని పోషిస్తున్నారామె. టీచర్ కు వచ్చే 20 వేల జీతం ఏమీ సరిపోలేదు. చివరకు ఆమె తల్లిదండ్రుల సాయంతో ఓ కారు కొని డ్రైవింగ్ మొదలుపెట్టారు. గంగ రోజుకు ఐదు వందల రూపాయలు ఇంధనానికి ఖర్చు చేసి రెండున్నర వేలకు పైగా సంపాదిస్తున్నారు. అయితే మొదట్లో ఇంత సంపాదన ఉండేది కాదు. మంచి డ్రైవర్ కావడానికి కొంత సమయం పట్టింది. రోడ్ల గురించి పూర్తిగా తెలియకపోయినా పట్టుబట్టి మొత్తం నేర్చుకున్నారామె. డ్రైవింగ్ చేయడంతో పాటు ట్యూషన్స్ చెబుతున్నారు. ఒక్కోరోజు అర్థరాత్రి ఒంటిగంట వరకు కూడా డ్రైవ్ చేయాల్సి వస్తుంది.

image


"మొదట్లో ప్యాసింజర్లు మహిళా డ్రైవర్ కనిపించేసరికి తిరస్కరించేవారు. మేము వేగంగా డ్రైవ్ చేయలేమని, ట్రాఫిక్ లో మేనేజ్ చేసుకోలేమని అనుకుంటారు. కానీ నా రేటింగ్సే నా పనితీరును చెబుతున్నాయి. చాలామంది కేవలం మహిళా డ్రైవర్లు కావాలని అడుగుతున్నారిప్పుడు. ముఖ్యంగా మహిళలు రాత్రివేళల్లో, తెల్లవారుజామున మహిళా డ్రైవర్లు కావాలంటున్నారు. ఇందుకు నేనెంతో గర్వంగా ఉన్నాను. విలువైన సేవలు అందిస్తున్నందుకు సంతోషంగా ఉన్నాను" - గంగ.