45 రోజుల అంగడి.. వందల కోట్ల రాబ‌డి.. హర్‌ ఏక్ మాల్ అడ్డా హైదరాబాద్‌ నుమాయిష్ !!

45 రోజుల అంగడి.. వందల కోట్ల రాబ‌డి.. హర్‌ ఏక్ మాల్ అడ్డా హైదరాబాద్‌ నుమాయిష్ !!

Saturday December 19, 2015,

4 min Read

ఆటో ఆపి- భయ్యా నాంపల్లి ఎగ్జిబిషన్ వస్తావా అని అడిగితే- మారు మాట్లాడకుంటా బైఠో అంటాడు! ఎందుకంటే ఆటో రిటర్న్ వచ్చేప్పుడు ఖాళీగా రావడం అన్నమాటే ఉండదు! ఈ ఒక్క ఎగ్జాంపుల్ చాలు నుమాయిష్ అంటే హైదరాబాదులో ఎంత ఫేమసో! తిరిగి తిరిగి.. కొసరి కొసరి.. ఏరికోరి కొనడంలో తెలియని కిక్కుంది! ఇది ఉంటుంది-అది ఉండదు అని లేదు! గుండుపిన్ను దగ్గర్నుంచి మోటార్ బైక్ దాకా! ఆల్ ఇన్ వన్! ఓన్లీ ఆన్ నుమాయిష్!

image


దేశం నలుమూలల నుంచి వచ్చే కళాకారుల పనితనం కళ్లముందు కనిపిస్తుంది. కాశ్మీరీల హస్తకళలు అబ్బురపరుస్తాయి. రాజస్థానీ హాండ్ వర్క్స్ చెమ్కాయిస్తుంటాయి. ఉత్తర్ ప్రదేశ్ అత్తరు ఘుమాయిస్తుంది. చీరల స్టాల్ దగ్గర్నుంచి ఆడవాళ్లు ఎంతసేపైనా కదలకుండా ఉంటారు. ఏ శాలువా చూసినా నులివెచ్చగా పలకరిస్తుంది. కొన్ని అచ్చంగా నుమాయిష్ కోసమే తయారు చేసినవే. వంటింటి ఉపకరణాలు చూస్తుంటే భలే ఉన్నాయే అనిపిస్తుంది. కొనేదాకా మనసు నిలవదు. వందేగా అనిపించి కోనేస్తాం. ఇంతేనా అనిపించి తీసుకుంటాం. ఎలక్ట్రానిక్స్ గూడ్స్‌, బట్టలూ , బొమ్మలూ, పింగాణీ వస్తువుల , ప్లాస్టిక్ సామాను, కట్లరీ ఐటెమ్స్, ఫర్నిచర్, లాడ్ బజారుని మరిపించే గాజులు- ఇలా ఒకటేమిటి. బ్యాగుల దగ్గర్నుంచి బైకుల వరకు. రకరకాల మెటీరియల్స్. ఎన్నడూ చూడనివి. ఎప్పుడూ వాడనివి. మన మనసుకు తగ్గట్టుగా. మన పర్సుకు తగ్గట్టుగా. కొనకపోయిన ఫరవాలేదు. కొత్త డిజైన్లు చూడ్డానికైనా వెళ్లాలి. చిన్నపిల్లల కోసమైనా పోయిరావాలి. 

ఎన్నెన్ని రైడ్లుంటాయని. టోరటోర అని, రంగుల రాట్నమని, హెలికాప్టర్, రోలింగ్ కప్ సాసర్, రోలింగ్ టవర్, ఫ్రిజ్బీ, రేంజర్‌ పాటు మోటారు బైకులపై విన్యాసాలు, సర్కస్ ఫీట్లు- ఇలా చూసినా కొద్దీ భలే ముచ్చటేస్తుంది. భూమ్మీద నడిచే రైలైతే వండర్. ఎన్నిసార్లు ఆగి ఆగి చూస్తామో! షుగర్ క్యాండీ సూపరుంటుంది. మిర్చీబజ్జీలు మనవైపు మిర్రిమిర్రి చూస్తాయి! జిలేబీలు మిసమిసలాడుతుంటాయి. వాటిని చూస్తుంటే నాలుక లబలబలాడుతుంది. లోకల్ పిజ్జా – అదేనండి- సర్వపిండి! కచ్చితంగా రుచిచూడాల్సిందే!

నుమాయిష్! ఒక్కమాటలో చెప్పాలంటే జాతీయ సమైక్యతకు చిహ్నం. జనవరి ఒకటో తేదీ ప్రపంచానికి ఆంగ్ల సంవత్సరాది. కానీ, హైదరాబాదుకు మాత్రం అది అచ్చంగా నుమాయిషే. ఏమీ కొనకపోయినా, ఓ 500 నోటు విడిపిస్తే చాలు. అదోరకం తృప్తి. 46 రోజులపాటు సాగే వేడుక. 75 ఏళ్లుగా హైదరాబాదీలతో అనుబంధాన్ని పెనవేసుకున్న అపురూపమైన అంగడి. ఏడాదికోసారి వచ్చే ఆనందాల సింగిడి.

image


నిజాం ప్రభుత్వ సహకారంతో తొలి అడుగులు వేసి, ఏటికేడు ప్రతిష్టను పెంచుకుంటూ మున్ముందుకు సాగుతూ 76వ ఏట అడుగుపెట్టింది. మొదటిసారిగా లో నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ లో నుమాయిష్ ని అప్పటి నిజాం స్టేట్ ప్రధాన మంత్రి సర్ అక్బర్ హైదరీ ప్రారంభించారు. విజయవంతం చేసేందుకు ఆనాటి నగర మున్సిపల్ కమిషనర్ నవాబ్ మెహిది నవాజ్ జంగ్ బహదూర్ కృషి చేశారు. నిర్వహణ కోసం అప్పట్లో సమీకరించిన నిధి కేవలం రెండున్నర వేలే. అంత తక్కువ బడ్జెట్ తో ప్రారంభమైన ఈ ప్రదర్శనకు నిజాం ప్రభుత్వం పదివేల రూపాయలు ఆర్థికసాయం చేసింది. ఈ ప్రోత్సాహంతో అసోసియేషన్ కు ఆర్థిక కష్టాలు తప్పాయి. తొలి ప్రదర్శనలో 100 స్టాళ్లను ఏర్పాటు చేశారు.15 రోజులపాటు సాగిన ఈ ఎగ్జిబిషన్ ని 50 వేల మంది సందర్శించారు. తొలి నుమాయిష్ లో లక్ష రూపాయల విక్రయాలు జరిగాయి. తర్వాత స్థలం సరిపోకపోవడంతో 1942లో ప్రస్తుతం ఉన్న ఎగ్జిబిషన్ గ్రౌండ్ కు తరలించారు. 50 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ అప్పటి నిజాం ప్రధానమంత్రి మిజ్రా ఇస్మాయిల్ 1946లో ఫర్మానా జారీ చేశాడు. 1956లో ఎగ్జిబిషన్ సొసైటీని కంపెనీ యాక్ట్ ప్రకారం రిజిస్ట్రేషన్ చేశారు.

ఉస్మానియా గ్రాడ్యుయేట్స్ ఆలోచనల్లోంచి పురుడు పోసుకున్న నుమాయిష్.. ఇంతింతై వటుడింతై అన్నట్లు సాగింది. 100 స్టాళ్ల నుంచి నేడు రెండున్నరవేల స్టాళ్లతో ఆసియాలోనే అతిపెద్ద పారిశ్రామిక వస్తు ప్రదర్శనశాలగా ఎదిగింది. 2015నాటికి ప్లాటినం జూబ్లీ వేడుకలు జరుపుకోవడం మరుపురానిది. ప్రచార సాధనాలు, హంగూ ఆర్బాటాలు లేని ఆ కాలంలోనే కొత్త కొత్త ఉత్పత్తులను ఆన్వేషించే వేదికగా నిలిచింది నుమాయిష్. కేవలం 46 రోజుల్లో సుమారు వంద కోట్లకు పైగా క్రయవిక్రయాలు సాగించడమంటే మాటలు కాదు. కొత్త కొత్త ప్రాడక్ట్స్ ని అంతర్జాతీయస్థాయిలో వినియోగదారులకు పరిచయం చేసేందుకు ఎంతోమంది పారిశ్రామిక వేత్తలు నుమాయిష్ ను వేదికగా చేసుకుంటారు.

సందేహమే లేదు! సేఫ్ అండ్ సెక్యూర్డ్ ప్లేస్ నుమాయిష్! పిల్లలు తప్పిపోయినా భద్రంగా అప్పగిస్తారు! పోకిరీల తాట తీసేందుకు 25-30 షీ టీమ్స్ మఫ్టీలో తిరుగుతుంటాయి! వందల మంది వాలంటీర్లు ఉండనే ఉన్నారు. పోలీసుల పహారా ఎలాగూ ఉంటుంది . దొంగల భయం లేదు. అగ్నిప్రమాదల టెన్షన్ లేదు. మంచినీళ్ల దగ్గర్నుంచి మెడికల్ కియోస్క్ వరకు. ఎక్కడా రాజీపడరు. ఒక పిక్నిక్ కి పోయినట్టు- ఒక పెళ్లికి హాజరైనట్టు- ఎక్స్ కర్షన్ వెళ్లినట్టు- ఎక్కడా అలసట ఉండదు. ఏదీ బోర్ రాదు. మైదానంలో అత్యాధునిక సౌకర్యాలుంటాయి. గాంధీ సెంటనరీ హాల్ను పూర్తి స్థాయిలో ఏసీగా రూపొందించారు. ఎగ్జిబిషన్ రహదారులపై దుమ్ము ధూళీ లేవకుండా సీసీ రోడ్లు నిర్మించారు. ఏయే స్టాల్ ఎక్కడెక్కడ ఉన్నాయో, ఎలా చేరుకోవాలో తెలుసుకునేందుకు గేట్ దగ్గర ఎలక్ట్రానిక్ మ్యాప్లు సహకరిస్తాయి. డైలీ సాయంత్రం ఎంటర్ టైన్ మెంట్ ప్రోగ్రామ్స్ అలరిస్తాయి. చిన్నారుల ఆటవిడుపు కోసం పార్కులు, లాన్లు డెవలప్ చేశారు. పోలీసుశాఖ సమన్వయంతో సెక్యూరిటీ, నిరంతర నిఘా, తనిఖీల కోసం సుశిక్షితులైన యువతను రంగంలోకి దిగుతుంది. సీసీ కెమెరాలతో నిఘా పక్కాగా ఉంటుంది. అన్ని కెమెరాలకు కలిపి ఒక కంట్రోల్ రూం ఉంది. పార్కింగ్ కోసం పరిసరాల్లోని ప్రభుత్వ, ప్రయివేట్ సంస్థల భవనాలు, మైదానాలను ఎంపిక చేస్తారు. మూడు గేట్ల దగ్గర డోర్ మెటల్ డిటెక్టర్స్, హ్యాండ్ మెటల్ డిటెక్టర్లతో తనిఖీ చేసి లోపలికి అనుమతిస్తున్నారు. ముందు జాగ్రత్తగా జనరేటర్లు, అంబులెన్స్ లు, అగ్నిమాపక వాహనాలను అందుబాటులో ఉంటాయి. నేరస్తులను పట్టుకున్న సెక్యూరిటీ సిబ్బందికి రివార్డు కూడా ఇస్తారు.

image


45 రోజులు. 25 లక్షల మంది. పార్కింగ్ దగ్గర్నుంచి స్టాల్ ఆదాయం దాకా! కొన్ని కోట్ల రూపాయల బిజినెస్. ఇదంతా లాభాపేక్ష కోసం కాదు. ఇందులో ఎవరి వ్యక్తిగత స్వార్ధమూ లేదు. అందరూ కలిసి దీన్ని ఒక గొప్ప ఆశయంతో నడిపిస్తున్నారు. విద్యాదానం అనే మహాకార్యాన్ని నిర్విఘ్నంగా చేపడుతున్నారు. 18 ఇన్ స్టిట్యూషన్స్ నడుస్తున్నాయి. పొయిన ఏడాది కరీంనగర్ జిలాల్లో అనాథల కోసం ప్రత్యేక వసతి గృహాన్ని ఏర్పాటు చేశారు. హబ్సీగూడలో ఫార్మసీ కాలేజీ కొత్త భవనాన్ని ప్రారంభించారు. 35 వేల మంది పిల్లలకు విద్యాదానం చేస్తున్నారు. దేశంలోనే తొలిసారిగా మహిళల కోసం ప్రత్యేకంగా పాలిటెక్నిక్ కళాశాలను ప్రారంభించిన ఘనత సొసైటీకే సొంతం. పాతబస్తీలో మూడు పాఠశాలలో విద్యార్థులకు అవసరమయ్యే మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నారు.

పారిశ్రామిక ప్రగతికి తోడ్పడిన నుమాయిష్ ఏటికేడు ప్రతిష్టను పెంచుకుంటూ మున్ముందుకు సాగుతోంది. అంతర్జాతీయస్థాయి ఖ్యాతిని ఆర్జించిన ఈ ఎగ్జిబిషన్ వాణిజ్య స్వావలంబనకు పట్టుగొమ్మలా నిలిచింది. దేశానికే గర్వకారణమైన హైదరాబాద్ నుమాయిష్.. ఢిల్లీ ప్రగతి మైదానానికి దీటుగా ఎదగాలని ఆశిద్దాం.