ఈ లేడీస్ బాగా రిచ్ గురూ !!

ఈ లేడీస్ బాగా రిచ్ గురూ !!

Wednesday January 27, 2016,

3 min Read

ఒకప్పడు మహిళలంటే ఎంతో చులకన. వంటిల్లే వారికి వైకుంఠమని.. కత్తిపీటే కైలాసమని. పిల్లల ఆలనా పాలనా తప్ప. మరేం చేతకాదనే భావన- పురుషాధిక్య సమాజంలో బలంగా వుండేది. కానీ కాలం మారింది. మహిళా లోకం గర్జిస్తోంది. నారీ భేరీ మోగిస్తోంది. అన్ని రంగాల్లో మగధీరులను ఎదిరిస్తున్నారు.

ఇంత చేసినా ధనవంతులు, సంపన్నులు అనే మాట వినగానే- అటుఇటుగా ఆరడుగులు-సూటూబూటు-కళ్లజోడు-బాల్డ్ హెడ్- ఇలాంటి టిపికల్ రూపాలే కళ్లముందుంటాయి. సంపన్నుల జాబితాలో ఫలానా అతను అని అంటారేగానీ- ఫలానా ఆమె అని అనరు. ఎందుకంటే వ్యవస్థలో శ్రీమంతులంటే మగవాళ్లే. సమాజం ద్రుష్టిల ఆ పదం ఆడవాళ్లకు వర్తించదు. అలాగే ముద్ర పడింది.

ఇప్పుడిప్పుడే పరిస్థితుల్లో మార్పులొస్తున్నాయి. మహిళలు కూడా ధనికురాలు అనే మార్క్ సంపాదిస్తున్నారు.ఈ మధ్యే ప్రకటించిన ఫోర్బ్స్ హండ్రెడ్ రిచెస్ట్ ఇండియన్స్ లిస్ట్ లో నలుగురు మహిళలు చోటు సంపాదించుకున్నారు.ఈ నలుగురి సంపద విలువ 10 బిలియన్ డాలర్లు. మొనాకో వంటి కొన్ని చిన్నదేశాల జీడీపీ కంటే ఈ నలుగురి సంపాదనే ఎక్కువట. వింటుంటే ఆశ్చర్యంగా లేదూ!

image


సావిత్రి జిందాల్

ఇండియాలో అత్యంత ధనిక మహిళ గా గుర్తింపు పొందింది సావిత్రి జిందాల్ సంపద విలువ అక్షరాలా 3.9 బిలియన్ డాలర్లు. గౌహతికి దగ్గర్లోని టిన్సూకియా అనే చిన్న పట్టణంలో పుట్టి పెరిగిన సావిత్రి.. జిందాల్ గ్రూప్ వ్యవస్థాపకుడు ఒ.పి. జిందాల్ ని పెళ్లాడారు. తర్వాత హోమ్ మేకర్ గా తొమ్మిది మంది పిల్లల బాగోగులు చూడడానికే పరిమితమయ్యారు. 2005 లో భర్త మరణం తర్వాత జిందాల్ గ్రూప్ చైర్ పర్సన్ గా బాధ్యతలు చేపట్టారు. ఆమె సమర్థ నాయకత్వంలో జిందాల్ గ్రూపు జెట్ వేగంతో దూసుకుపోయింది. హర్యానా రాష్ట్రంలో మంత్రి గా కూడా పనిచేసిన సావిత్రి.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా- అటు రాజకీయాలు ఇటు వ్యాపారం- రెండింటిలోనూ రాణిస్తున్నారు.

లీనా తివారీ

యూఎస్‌వీ ఫార్మా కంపెనీ అధినేత్రి లీనా తివారీ. సంపన్న మహిళల జాబితాలో సావిత్రి తరువాతి స్థానం ఈమెదే. ప్రముఖ సంఘ సంస్కర్త ,లీలా తాతైన విఠల్ కృష్ణ గాంధీ యూఎస్వీ ఫార్మా కంపెనీ ని ప్రారంభించారు. మొదట విదేశాల నుంచి మందుల్ని దిగుమతి చేసుకుని ఇక్కడ అమ్మిన కంపెనీ- 1960లో ఓ అమెరికా కంపెనీతో కలిసి జాయింట్ వెంచర్ గా ఇండియాలో మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ నెలకొల్పింది.

బోస్టన్ యూనివర్సిటీ నుంచి ఎంబీయే పట్టా సంపాదించిన లీనా.. భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి ముంబైలోనే నివసిస్తున్నారు. ప్రకృతి ప్రేమికురాలైన లీనాకి ట్రావెలింగ్ అంటే ఇష్టం. దేశంలోని అన్ని అడవుల్లో తిరుగుతూ వైల్డ్ లైఫ్ గురించి ఆధ్యయనం చేస్తూ ఉంటారు. వీటితో పాటు వాళ్ల ఫ్యామిలీ పూర్వీకుల చరిత్ర పై పరిశోదించడం ఈమె హాబీ. ఈమధ్యనే బియాండ్ పైప్స్ అండ్ డ్రీమ్స్-దిలైఫ్ ఆఫ్ విఠల్ బాలకృష్ణ పేరుతో ఆమె తాత జీవిత చరిత్రను పుస్తక రూపంలో తీసుకొచ్చారు.

ఇందూ జైన్

టైమ్స్ ఆఫ్ ఇండియా వంటి లీడింగ్ ఇంగ్లీష్ డైలీతో పాటు ఇతర సంస్థలకు మూల సంస్థ అయిన బెన్నెట్ కోల్ మన్ కు ఈమె అధిపతి. టైమ్స్ పౌండేషన్ పేరుతో స్థాపించిన సంస్థ అనేక అభివృద్ది కార్యక్రమాల్లో పాలు పంచుకుంటోంది. ప్రకృతి వైపరిత్యాల వంటివి సంభవించినప్పుడు టైమ్స్ రిలీఫ్ పండ్ పేరుతో విరాళాలు సేకరించి బాధితుల్ని ఆదుకోవడంలో- ఇందూ అంకిత భావంతో పనిచేస్తారు. మహిళల హక్కుల తో పాటు స్త్రీలను అన్ని రంగాల్లో ప్రోత్సహించడంలో ముందుంటారు. ఈమె నేతృత్వంలో భారతీయ జన్ పిత్ ట్రస్ట్ వివిధ భాషల్లో సాహిత్య రంగంలో సేవలందిన ప్రముఖులను అవార్డులతో సత్కరిస్తోంది. 2000 సంవత్సరంలో ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో నిర్వహించిన మిలీనియం వరల్డ్ పీస్ సమ్మిట్ అఫ్ రెలీజీయస్ అండ్ స్పిరిచ్యువల్ లీడర్స్ సమ్మిట్ లో టుగెదర్ నెస్ ఎమాంగ్ ఫెయిత్ అనే అంశం పై ఈమె చేసిన ప్రసంగం అందరి ప్రశంసలు అందుకుంది.

వినోద్ గుప్తా

ప్రముఖ వ్యాపారవేత్త కీమత్‌ రాయ్ గుప్తా సతీమణి. వినోద్ గుప్తా భర్త మరణంతో హావెల్స్ ఇండియా కంపెనీలో వారసత్వంగా లభించిన వాటాతో సంపన్నుల జాబితాలో చోటు సంపాదించుకున్నారు. 1971 లో కీమత్ రాయ్ గుప్తా హావెల్స్ ఇండియా పేరుతో ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ కంపెనీని ప్రారంభించారు. ప్రస్తుతం ఈ కంపెనీ ఆయన తనయుడు అనీల్ రాయ్ గుప్తా నడిపిస్తున్నారు."హావెల్స్..ది అన్ టోల్డ్ స్టోరీ ఆఫ్ కీమత్ రాయ్ గుప్తా" పేరుతో పుస్తకాన్ని రాసిన అనిల్- తన తండ్రి సక్సెస్ పాటు తనను తీర్చిదిద్దిన తల్లి వినోద్ గుప్తా కు ఆ పుస్తకాన్ని అంకితమిచ్చారు.

మహిళలకు సమాన వేతనాలు.. వారసత్వపు హక్కులు కూడా సరిగా అందలేని పరిస్థితుల్లోనూ -పురుషాధిక్య ప్రపంచంతో పోటీపడి ధనవంతుల జాబితాలో చోటు సంపాదించుకున్నారు వీరు. మహిళలు స్వతహాగా తమకంటూ ఓ సంపాదనా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని రిచ్చెస్ట్ లేడీస్ గా గుర్తింపు పొందడం నిజంగా స్ఫూర్తిదాయకం.