మీ విజయగాధల మధ్య నాదీ ఓ చిన్న కథ

ప్రతికూలతే నా ప్రధమ గురువు..యువర్ స్టోరీ ఎందుకు ఏర్పాటైంది ?ఇన్ని వేల మంది జీవితాలను ఎందుకు స్పృశిస్తున్నాం ?యువర్ స్టోరీ ఫౌండర్, చీఫ్ ఎడిటర్ శ్రధ్ధా శర్మ అంతరంగం ఆమె మాటల్లోనే

మీ విజయగాధల మధ్య నాదీ ఓ చిన్న కథ

Monday April 13, 2015,

4 min Read

శ్రద్ధా శర్మ, యువర్ స్టోరీ చీఫ్ ఎడిటర్

శ్రద్ధా శర్మ, యువర్ స్టోరీ చీఫ్ ఎడిటర్


ఓ చిన్న వ్యాయామంతో ప్రారంభిద్దాం. మీరంతా ఓ పదిహేను సెకండ్లపాటు.. కళ్ళు మూసుకుని మీ జీవితాన్ని మలుపు తిప్పిన ఒకటి రెండు ఘటనలను స్ఫురణకు తెచ్చుకోండి. అవి జీవితం, ఉద్యోగం, వ్యాపారం ఏవైనా కావొచ్చు !

నేను ఈ వ్యాయామాన్ని కొద్ది మంది చేసి చూశాను. ఫలితం ఎప్పుడూ ఒక్కటిగానే ఉంటోంది. అందరి సమాధానాల్లోనూ ఒకటే మాట తరచూ వినిపిస్తూ వచ్చింది. అదే ప్రతికూలతను అధిగమించడం. ఇప్పుడు మీరు చూస్తున్న మార్పు ముమ్మాటికీ ప్రతికూలతను సవాలుగా స్వీకరించి ఎదిరించడం ద్వారా సిద్ధించిందే !

image


కార్యసిద్ధికి ప్రతికూలతే సాధనం

“ నన్ను అభిమానించే ఒకరు ‌చిమ్మచీకటిని పోలిన ఒక పెట్టెను ఇచ్చారు. చాలా ఏళ్ళు గడిచాక గానీ నాకు అర్థం కాలేదు.. అది కూడా ఒక బహుమతేనని” మేరీ ఆలివర్ రాసిన మాట నాకు గుర్తుకొస్తోంది.

పరిపూర్ణత సాధించే వ్యక్తి వెనుక రహస్యం.. ప్రతికూలతే.

హైందవ పురాణాల్లో దీని గురించి చాలా చక్కగా వివరించి ఉంటుంది. మృత్యు ప్రతిరూపమైన కాళీమాత ద్వారా మనం దీన్ని గమనించగలం.

“మనలను ప్రతిఘటించే శక్తి.. మన హృదయాల్లో దడపుట్టిస్తుంది.. మన మార్గాలను నిరోధిస్తుంది.. ఆమెను విధ్వంసకారిణిగా భావించి చాలా మంది భయపడతారు. అయితే అది ఆమె కర్తవ్యపాలన. ఆమె సాగించే విధ్వంసం.. సరికొత్త ఆవిష్కరణలకు మార్గాన్ని చూపుతుంది. సర్వాన్ని విధ్వంసం చేస్తూ.. మరేదో మహత్తర శక్తి ఉందన్న సంగతిని గుర్తు చేస్తుంది.”

కాళి.. పంచభూతాలు విచ్ఛేదనమయ్యే రుద్రభూమినే శ్మశానాన్నే ఆవాసంగా చేసుకొని నివసిస్తుంది. భువిపై మనలను వేధించే.. కామ, క్రోధ, లోభ, మద మాత్సర్యాలను రుద్రభూమిలోని కాళిక నాశనం చేస్తుంది. పంచభూతాలను దహనం చేయడం ద్వారా, ఆమె మన బాధా తప్త హృదయాలనూ తేటపరుస్తుంది. తననే శరణు వేడిన వారిని, తన అగ్ని జ్వాలలతో, పరిశుద్ధులను చేస్తుంది. ఫలితంగా జీవుడు పంచభూతాల బారి నుంచి విముక్తులవుతారు. ఈ అనుభూతిని జ్ఞానాగ్ని అంటారు. అజ్ఞానాంధకారంలో మగ్నమై.. జీవనం కొనసాగిస్తున్న వారికి, ఈరకంగా జ్ఞానాగ్నిని అందిస్తుంది. ఈ కథ.. నల్లటి పెట్టెను కూడా మంచి బహుమతిగా చూడాలన్న అంశాన్ని ప్రబోధిస్తుంది.

ప్రతికూలతే మానవునికి మహాశక్తి

ఆమెను, ఆమె తత్వాన్ని తెలుసుకునేందుకు నాకు ఎక్కువ సమయం పట్టకపోయినా పదే పదే నా కథలో కాళీ దర్శనమైంది. 

2014 టెడ్ ఎక్స్ బే ఏరియాలో మాట్లాడుతూ

2014 టెడ్ ఎక్స్ బే ఏరియాలో మాట్లాడుతూ


నా కుటుంబం విచ్ఛిన్నమైంది. బాల్యపు బాధలను ఇక్కడ పొందుపరచలేక పోతున్నాను గానీ, చీకటే నాకు నిత్యం తోడుగా ఉండేది. వర్తమానం నుంచి భవిష్యత్తులో సుందరమైన జీవితం నాకు అందివస్తుందన్నది నాకు తెలిసేది. ఆ దిశగా, కొన్నేళ్ళ క్రితం అత్యంత కఠినమైన పరీక్షను ఎదుర్కొన్నాను. మా అమ్మ 70 శాతం కాలిన గాయాలతో మృత్యువుతో పోరాడుతుండగా చూశాను. ఆమె వంటగదిలో వంట చేస్తూ.. ఫోన్లో మాట్లాడుతూ ఉండగా.. చీర చెంగుకు మంటలు అంటుకున్నాయి. ఆ క్షణాలు, మా అమ్మనే కాదు.. నన్నూ శాశ్వతంగా మార్చివేశాయి.

ఆమె చర్మం కరిగిపోయినా బతకడం కోసం ఆమె పడిన ఆరాటం, చేసిన పోరాటం మాత్రం సామాన్యమైంది కాదు. ఆ స్థితిలో అమ్మను అలా చూస్తూ కుంగిపోయాను. నిత్యం అక్కడే కూర్చేని ఉన్నా ఏవో తెలియని బరువైన చీకట్లు నాలో కమ్ముకునేవి. పైకి ఊపిరి తీసుకుంటున్నానే కానీ లోపల ఏదో తెలియని నిస్సత్తువ ఆవరించేది నిస్సహాయురాలిగా వికల మనసుతో మిగిలిపోయాను. అప్పుడే బలంగా మారాలని నిర్ణయించుకున్నాను. అయితే ఎలా అనే స్పష్టత నాలోలేదు. ఆ కారుచీకట్ల మధ్యలోనే.. ఏదో అద్భుతం జరిగింది.

నా చుట్టూ కాలిన గాయాలతో ఒంటరిగా వేదనలు అనుభవించే వాళ్లెందరో ఉన్నారు. వాళ్లను పట్టించుకునే దిక్కు లేదు, ఓదార్చే నాధుడూలేడు. వారిని నవ్వించడం, డ్యాన్సులు చేయడం, వారితో మాట్లాడడం చేస్తూ.. వీలైనంత ఎక్కువ కాలాన్ని వారితోనే గడపడం మొదలు పెట్టాను. పేషెంట్లను నవ్వించడం ద్వారా, నా హృదయానికి అయిన గాయం మానుతున్నట్లు గుర్తించాను. గాయాల వేధిస్తున్నా.. మా అమ్మ కూడా నవ్వేది కానీ చివరకు ఆ బాధ భరించలేక తనువు చాలించింది.

image


కాలిన గాయాల రోగులుండే వార్డులో.. ఎన్ని బాధలు ఉన్నా.. ఐకమత్యం మాత్రం కొట్టొచ్చినట్లు కనిపించేది. దాన్ని మాటల్లో వర్ణించలేము. కాలి ఊడొచ్చిన చర్మాలతో.. ఈ మానవులంతా ఒక్కటే. వారి బాధా ఒక్కటే. వారు నవ్వే క్షణాలూ ఒక్కటే.

ఈ భయంకరమైన అనుభవంతో.. నేనొక గుణపాఠాన్ని నేర్చుకున్నాను. ప్రతికూలతే మానవత్వపు సూపర్ పవర్ అనే విషయం అర్థమైంది. ఆ ప్రతికూలతే మనల్ని ఉన్నత భావాల దిశగా నడుపుతుంది. ప్రతికూల పరిస్థితులే మన వేదనలను మాపుతుంది. గతానికి భిన్నంగా మనలో గొప్ప మార్పును తీసుకు వస్తుంది. వేదనల్లో.. మనిషి ఐకమత్యం దిశగా సాగుతాడన్న నగ్నసత్యం ఈ అనుభవంతో నాకు తెలిసొచ్చింది. మనమంతా ఒక్కటే. మనం శ్వాసించే గాలి, పంచభూతాల అనుభూతులు సమమేనని తెలిసొచ్చింది.

సూపర్ స్టార్స్ అందరి కథా వేదికే ఈ యువర్ స్టోరీ

నాకు ప్రతీ స్టోరీ ముఖ్యమే. ప్రతీదీ నన్ను ప్రభావితం చేసేదే. ఒకరి కథకు మరొకరి కథకు ఎంతో వ్యత్యాసం ఉంది. ప్రతీదీ భిన్నమైనదే. ఈ అనుభవాలే నన్ను మరింత ధృడపరిచాయి. ప్రతీ ఒక్కరీ కథకు ఉన్న గొప్పదనాన్ని గుర్తించేలా చేశాయి. మనలో ఒకరే సూపర్ స్టార్ ఎందుకు..? నిజానికి మనలో ప్రతి ఒక్కరూ ఒక్కో సూపర్ స్టారే… ?

ఓసారి మననం చేసుకుంటే, యువర్ స్టోరీ డాట్ కామ్‌ని ఏర్పాటు చేయడానికి ఈ అనుభవాలే స్ఫూర్తిని ఇచ్చాయని భావిస్తున్నాను. ప్రతిఒక్కరూ తమ అనుభవాలను, అనుభూతులను కథలుగా వివరించే వేదికగా దీన్ని మార్చడానికి ఇదే కారణమని అనుకుంటున్నాను. గడచిన ఏడేళ్లలో నేను పరిశీలించింది ఏంటంటే.. ప్రతీ ఒక్క కథకూ ఒక జీవం ఉంది. ఇప్పటివరకూ మేము దాదాపు 20,000 కథలను చెప్పాము. ఇకపైనా ఇదే రీతిలో ప్రతిరోజూ కొత్త కథలను జోడిస్తూ ఉంటాము. మీ గురించి తెలుసుకుంటూనే ఉంటాం. మీరు ఎంతో ముఖ్యం.

మనలను అనావశ్యక విషయాల నుంచి వేరు చేసి చూపడమే నా కల. భాష, భాష, వర్ణం, ఉద్యోగం, బాధ, దూరం, వయసు వంటివన్నీ ఆశక్తులు. మనల్ని కలిపి ఉంచేదే నిజమైన శక్తి, అలాంటి కథలే ఇక్కడ పొందు పరిచాము. అవే మిమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చాయి.
ఇక్కడ ఒకొక్కరిదీ ఒక్కో గాధ

ఇక్కడ ఒకొక్కరిదీ ఒక్కో గాధ


నేను ఈరోజు నా కథను ఎలా వినిపించానో.. మీరు కూడా మీలోకి ఒకసారి తొంగి చూసి, కదిలించే కథలను నాకు, మనందరికీ వినిపించండి.

మీ కాళిక ఎవరు ? మీరు మోసుకు తిరుగుతున్న, మిమ్మల్ని వెంటాడుతున్న బాధ ఏంటి..? మీ హృదయాన్ని రగిలించే జ్వాల ఏది..? మీకు ఎదురైన నష్టం ఇంకా భాదిస్తోందా..? లేక మీ వేదనలను తగ్గించి మహత్తర శక్తినిచ్చేది నమ్మకమనే బహుమతిని అందుకున్నారా ?

అలాగైతే, మీరూ మీ కథను పంచుకుంటారా..? వాటిని చూసి ఇతరులు సంతోషపడొచ్చు. నేర్చుకోవచ్చు... లేదా ధైర్యాన్ని కూడగట్టుకోవచ్చు. బాక్స్ ఆఫ్ డార్క్‌నెస్‌లో మేరే ఆలివర్స్ చెప్పినట్లు, దాన్ని ప్రపంచం కోసం తెరుస్తావా..? తద్వారా దాన్నివెలుగుతో నిండిపోనిస్తావా..? వెలుగు వేదనల్లో ఉన్న వారికి చిరు నమ్మకాన్ని కలిగిస్తావా ?

ముక్తాయింపులో మూడు అంశాలను నేను పంచుకోవాలనుకుంటున్నాను.

  • మన జీవితాల్లోని అనిర్వచనీయమైన అనుభూతులు, మనం ఎదుర్కొన్న ప్రతికూలతల నుంచే ఉద్భవించాయి. మనమెవరో తెలుసుకునే దిశగా అవి కొనసాగుతూనే ఉంటాయి. మనం ప్రతికూలతను అధిగమిద్దాం.
  • నా దగ్గర ఒక కథ ఉంది. మీ దగ్గరా ఓ కథ ఉంది. ప్రతి ఒక్కరికీ ఓ గాధ ఉంది. ధైర్యంగా వాటిని పంచుకుందాం. ప్రస్తుత కథతోమీరు సంతోషంగా లేకుంటే.. దాన్ని మంచి కథగా మలిచేందుకు ఏమేమి చేయాలని భావిస్తున్నారో ఆ మార్పులు చేయండి.
  • ప్రతికూలతలను ఎదుర్కొని, వాటిని అధిగమించిన ఇతరుల కథల తెలుసుకుని నేర్చుకోవడం ప్రారంభిద్దాం. ఉన్నతంగా, మరింత మెరుగ్గా ఆలోచించే దిశగా వాళ్ళు మనకు సహకరిస్తారు. స్వీయ కథలను శక్తిమంతంగా మలిచేందుకు మార్గం చూపుతారు. మా వెబ్ సైట్ లో ప్రస్తుతం 20 వేలకుపైగా కథలు ఉన్నాయి. తొలి కథ ఇక్కడి నుంచే ప్రారంభించండి.

- శ్రద్ధా శర్మ