ఏటా 10 లక్షల మంది పేరెంట్స్ చేతుల్లోకి బేబీ బాక్స్

ఎఫ్‌ఎంసీజీ కంపెనీలకు కొత్త వ్యాపార వేదిక 32 నగరాల్లోని ఆసుపత్రులకు విస్తరించిన కంపెనీతల్లిదండ్రులకు వివిధ కంపెనీల ఉత్పత్తులతో శాంపిల్ బాక్సులు

ఏటా 10 లక్షల మంది పేరెంట్స్ చేతుల్లోకి బేబీ బాక్స్

Thursday July 02, 2015,

3 min Read

ప్రముఖ బ్రాండ్లకు చెందిన డయాపర్స్, బేబీ వైప్స్, సానిటైజర్స్, సబ్బులతో కూడిన శాంపిల్ బాక్స్ ఉచితంగా లభిస్తే! అది కూడా మీ కుటుంబంలోకి పాప/బాబు అడుగు పెట్టిన సమయంలో వస్తే ఆనందమే కదా. సమయానికి వచ్చిన ఈ ఉత్పత్తులపై ఎవరికైనా సదభిప్రాయం ఉండక మానదు. ఆసుపత్రి వారి చేతుల మీదుగా బాక్స్ అందుకోవడం కూడా ఇందుకు మరో కారణం.

కస్టమర్లకు బ్రాండ్లను దగ్గర చేసే విధానాల్లో శాంపిళ్లు (ఉచిత నమూనా) ఒకటి. పశ్చిమ దేశాల్లో ఇది విజయవంతంగా అమలవుతోంది. అంతర్జాతీయ బ్రాండ్లు ఈ విధానాన్ని కొన్ని దశాబ్దాలుగా అనుసరిస్తున్నాయి. ఆస్ట్రేలియాలో బౌంటీ అనే కంపెనీ ఇలాంటిదే. 30 ఏళ్లుగా ఈ కంపెనీ లక్షలాది శాంపిల్ బ్యాగ్స్‌ను తల్లులకు అందజేసింది. భారత్‌కూ ఈ ట్రెండ్ పాకింది. బేబీ బాక్స్ అనే కంపెనీ కేసీఎల్, హెచ్‌యూఎల్, డాబర్, మహీంద్రా రిటైల్, ఐసీఐసీఐ ప్రూడెన్షియల్, ఆదిత్య బిర్లా గ్రూప్ తదితర కంపెనీల శాంపిళ్లను లక్ష్యిత కస్టమర్లకు చేరుస్తోంది. ఈ కంపెనీలు తయారు చేసిన ఉత్పత్తులను శిశువులు, వారి తల్లులు ఆస్వాదించేందుకు వేదికగా నిలుస్తోంది బేబీ బాక్స్. తద్వారా కంపెనీలకు బ్రాండ్ ఇమేజ్‌ను పెంచడమేకాదు వాటి వ్యాపారాన్ని వృద్ధిలోకి తీసుకు రావడంలో కీలక పాత్ర పోషిస్తోంది.

image


ఏటా 10 లక్షలకు పైగా..

ఏడాదికి 10 లక్షల మందికి పైగా కస్టమర్లు బేబీ బాక్స్ ఖాతాలో వచ్చి చేరుతున్నారు. 32 నగరాలకు కంపెనీ విస్తరించింది. 3,392 ఆసుపత్రులు, ప్రసూతి కేంద్రాలతో కంపెనీ చేతులు కలిపింది. యూనిచార్మ్, పిరమల్ హెల్త్‌కేర్, కోడక్, మదర్‌కేర్, విప్రో, ఫిలిప్స్ అవెంట్, కన్సాయ్ నెరోలాక్, హగ్గీస్, కంఫర్ట్, మామీ పోకో, మామ్ అండ్ మీ, ప్యూరెట్టా క్లయింట్ల జాబితాలో ఉన్నాయి. ఏటా 10 లక్షల కస్టమర్ల స్థాయికి మూడేళ్లలోపే చేరుకున్నాం. అంతేకాదు వేగంగా వృద్ధి చెందుతున్నాం’ అని బేబీ బాక్స్ ఫౌండర్ దీపక్ వర్మ అంటున్నారు.

దీపక్ వర్మ

దీపక్ వర్మ


ఆలోచన ఇలా వచ్చింది

శిశువుల తల్లిదండ్రులకు బ్రాండెడ్ కంపెనీల శాంపిళ్లతో కూడిన గిఫ్ట్ బాక్స్‌ను బేబీ బాక్స్ అందజేస్తోంది. ఈ ఆలోచన తాను కొత్తగా తండ్రి అయిన సమయంలో వచ్చిందని చెప్పారు దీపక్. ‘మా పాపకు ఏవి అవసరమో అన్న ఆసక్తి నాకు, నా భార్యకు ఉండేది. అవసరమయ్యే ఉత్పత్తుల కోసం చాలా చోట్ల వెతికాం. పాపకు తల్లిపాలు పట్టించే ఉపకరణాన్ని అనుకోకుండా మార్కెట్లో గుర్తించాను. ఈ ఉపకరణాన్ని తమకు ముందుగా ఎవరూ సిఫార్సు చేయలేదు’ అని ఆయన వివరించారు.

అడ్వెర్టైజింగ్, మార్కెటింగ్ విభాగాల్లో ప్రముఖ మీడియా సంస్థల్లో 13 ఏళ్లకుపైగా పనిచేసిన అనుభవం దీపక్‌ది. ఏదైనా వినూత్న వ్యాపారం చేయాలని ఆయన నిర్ణయించుకున్నారు. సరైన ఉత్పాదనకు, కస్టమర్‌కు చేరడానికి మధ్య ఉన్న అంతరాన్ని ఆయన గుర్తించారు. ముఖ్యంగా కొత్త పేరెంట్స్‌కు ఉత్పత్తుల పరిచయం, అనుభవాన్ని ఇచ్చే వేదికను ఏర్పాటుచేయాలని నిర్ణయించి బేబీ బాక్స్‌ను మే 2011లో ప్రారంభించారు. అంతకు రెండేళ్ల ముందు కంపెనీ స్థాపనకు కావాల్సిన ఏర్పాట్లపై నిమగ్నమయ్యారు.

ఆసుపత్రుల సహకారంతో..

కొత్త పేరెంట్స్‌ను చేరుకోవడానికి ఆసుపత్రులు, క్లినిక్స్, ప్రసూతి కేంద్రాలు కేంద్ర బిందువులని దీపక్ గుర్తించారు. ఆసుపత్రులను తన ఖాతాలో చేర్చుకోవడమే ఆయన ముందున్న సవాల్. ఆసుపత్రి పెద్దను కలుసుకోవడానికి గంటల తరబడి వేచి ఉండేవారు. అలా ఇప్పుడు 3,392 ఆసుపత్రులతో చేతులు కలిపారు. ఆసుపత్రి సిబ్బంది, వైద్యులు, నర్సులు శిశువుల తల్లిదండ్రులతో చనువుగా ఉంటారు. బేబీ బాక్స్ ప్రచారంలో వీరే ముఖ్య భూమిక అంటారు దీపక్. ఈ నేపథ్యమే బేబీ బాక్స్‌ను బహుమతిగా ఆసుపత్రి సిబ్బంది చేత ఇప్పించాలన్న నిర్ణయానికి వచ్చానని చెప్పారు. బాక్సులో ఉండే ఉత్పత్తులు అప్పుడే పుట్టిన శిశువుకు, తల్లికి చాలా అవసరం. కొన్ని ఉత్పత్తులను ముందే కొన్నప్పటికీ, బాక్సులో ఉన్న వాటిని సైతం వినియోగించాలని తల్లిదండ్రులు భావిస్తారని ఆయన తెలిపారు. ఆసుపత్రి నుంచి బహుమతిగా వస్తే ఆ ఉత్పత్తుల పట్ల విశ్వాసం ఉంటుందని అంటారాయన. పెద్ద ఆసుపత్రులను మెప్పిస్తే చిన్న ఆసుపత్రులు వాటిని అనుసరిస్తాయని చెప్పారు.

అవసరమైన వారికి మాత్రమే

పంపిణీ, ఉచిత నమూనా అనుభూతిని కల్పించడంలో ప్రత్యేక వ్యవస్థను కంపెనీ అనుసరిస్తోంది. బేబీ బాక్స్‌ను అందుకున్న తల్లిదండ్రులు రుజువు కింద రిజిస్ట్రేషన్ కార్డును నింపాల్సి ఉంటుంది. అసలైన వ్యక్తులకే బాక్స్ చేరిందా లేదా అన్న విషయం తెలుసుకోవడానికి లబ్దిదారులతో కంపెనీ సిబ్బంది ఫోన్‌లో సంప్రదిస్తారు. ఆసుపత్రి ఉన్న ప్రాంతం, సాధారణ ప్రసూతికి (డెలివరీకి) వసూలు చేస్తున్న చార్జీ, నమోదవుతున్న జననాల ఆధారంగా ఆసుపత్రులను మూడు విభాగాలుగా కంపెనీ పరిగణిస్తోంది. ఐశ్వర్యవంతులు, అధికంగా ఖర్చు చేసేవారు, అవసరానికి తగ్గట్టుగా ఖర్చు పెట్టేవారు అనే విభాగాలుగా విశ్లేషిస్తోంది. తద్వారా కంపెనీలకు లక్ష్యిత కస్టమర్‌ను చేరుకోవడానికి మార్గం ఏర్పడుతుందని దీపక్ అంటున్నారు.

కంపెనీ ఊపిరి పోసుకున్న నాటి నుంచి కలారి క్యాపిటల్‌తోపాటు ఈ సంస్థ ఎండీ వాణి కోల వెన్నంటే ఉన్నారు. ‘వాణి నుంచి పూర్తి స్థాయి మద్దతు ఉంది. శాంపిల్ విధానాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నారు. భారత్‌లో ఈ విధానం ఇప్పుడే మొదలైంది. ఈ రంగంలో ఎంతో చేయాల్సి ఉంది. ఆమె మొదటి నుంచి బేబీ బాక్స్‌లో నిమగ్నమయ్యారు. శాంపిల్ విధానం కట్టుదిట్టంగా అమలయ్యేందుకు, కస్టమర్‌కు విలువ చేకూర్చేందుకు విలువైన సూచనలు ఇస్తున్నారు’ అని దీపక్ గుర్తు చేశారు.

శాంప్లింగ్ విధానం ఎఫ్‌ఎంసీజీ రంగంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తోంది. భారత్‌లో నాల్గవ అతిపెద్ద రంగమైన ఎఫ్‌ఎంసీజీ వ్యాపార పరిమాణం సుమారు రూ.82,530 కోట్లుంది.

బేబీ బాక్స్ అటు ఆన్‌లైన్‌లోనూ విస్తరించింది. ఇప్పటికే కంపెనీ లాభాలను ఆర్జిస్తోంది. ఫార్మా, బ్యూటీ, వెల్‌నెస్ తదితర రంగాలకూ శాంప్లింగ్ ప్లాట్‌ఫాంను పరిచయం చేయాలన్నది కంపెనీ ఆలోచన.