టిసిఎస్‌‌ వదిలి 'టీ షర్ట్స్' అమ్మకాల్లో కొత్త ట్రెండ్

టిసిఎస్‌‌ వదిలి 'టీ షర్ట్స్' అమ్మకాల్లో కొత్త ట్రెండ్

Saturday October 31, 2015,

5 min Read

గుజరాత్‌లోని ఆదిపూర్ అనే చిన్న పట్టణం నుంచి వచ్చారు అభిమన్యు చౌహాన్. శక్తి, పట్టుదల, కోరిక.. ఇవన్నీ ఉంటే ఏదైనా సాధించచ్చు అనడానికి అభిమన్యు చక్కని ఉదాహరణ. సొంతగా ఏదైనా చేయాలనే తపన పాఠశాల స్థాయి నుంచే అభిమన్యులో కనిపించేది. ఏదైనా తయారీ కర్మాగారం ఏర్పాటు చేయాలన్నది ఇతని చిన్నప్పటి ఆలోచన. అభిమన్యు ఆలోచనలను అర్ధం చేసుకున్న అతని తండ్రి.. పూర్తి మద్దతును అందించి సహకరించారు.

అభిమన్యు చౌహాన్

అభిమన్యు చౌహాన్


ఎప్పుడూ తన లక్ష్యం గురించే ఆలోచించే అభిమన్యు.. అందుకు తగినట్లుగా బాటలు వేసుకునేందుకు వీలైన విద్యనే ఎంచుకున్నారు. ఆర్ట్స్, కామర్స్‌ల వెంట వెళ్లకుండా.. సాంకేతిక విద్యకే మొగ్గు చూపారుు. ఇలా గుజరాత్ టెక్నికల్ యూనివర్సిటీలో ఓ ఇంజినీరింగ్ కోర్సులో చేరాడు. అయితే ఈ విద్యావిధానం ఎంతో పాతదిగా, పురాతనమైనదిగా కనిపించింది. తాను ఏవైనా కొత్తగా నేర్చుకోవడానికి క్లాస్ రూం బయట ఏర్పాటు చేసే వర్క్ షాపులే అనువైనవని గ్రహించిన అభిమన్యు.. వాటిలోనే ఎక్కువ సమయం గడిపేందుకు మొగ్గు చూపేవాడు.

అయితే జీవితం ఎప్పుడూ అనుకున్నట్లుగా కోరికలు తగినట్లుగా ఉండదు. 2008 ఫిబ్రవరి అభిమన్యు తండ్రి హఠాత్తుగా మరణించడంతో.. తనకు మద్దతు, శక్తి అందించే వ్యక్తికి దూరమయ్యాడీయన.

image


“నా ఆలోచనలను, ఆసక్తిని విపరీతంగా మార్చిన సంఘటన ఇది. దీంతో నాకు నేనే కొన్ని బాధ్యతలను చేపట్టాల్సి వచ్చింది. ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను అపుడు. క్యాట్ వంటి ఎగ్జామ్స్‌కి కూడా ప్రిపేర్ అవుతున్నాను. ఆ సమయంలో ఐటీ కంపెనీలు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ కోసం రాసాగాయి. ఇంటిలో పెద్ద కొడుకును కావడంతో.. కుటుంబ పోషణ బాధ్యతను చేపట్టాల్సి వచ్చింది.”-అభిమన్యు చౌహాన్


అభిమన్యు కలలను ప్రోత్సహించే తండ్రి లేకపోవడంతోపాటే, సానుకూలమైన సంఘటనలు కూడా ఏమీ జరగలేదు. దీనికి తోడు కుటుంబాన్ని పోషించాల్సిన బాధ్యత కూడా ఉంది. అందుకే ముంబైలోని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌‌లో ఉద్యోగం చేయడం ప్రారంభించారు అభిమన్యు. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ విభాగంలో డెబిట్, క్రెడిట్స్ చూసుకునేవారు.

“ఆ ఉద్యోగం చేయడం నాకు ఎంత మాత్రం ఇష్టం లేదు. దీనితో జీవితంలో ఏమీ సాధించలేననే విషయం తక్కువ కాలంలోనే అర్ధమైంది. ఏదైనా సృజనాత్మకంగా చేయాలని ఆలోచించాను. అంతే.. చేతిలో మరో ఉద్యోగానికి ఆఫర్ కానీ, ఆదాయ వనరు కానీ లేకపోయినా.. చేస్తున్న ఉద్యోగం వదిలేశాను. ఉద్యోగం లేకుండా ఒంటరిగా కూర్చుని ఆలోచించడం నాకు చాలా సంగతులు నేర్పించింది. నా జీవితంలో నేను ఏం సాధించాలనే అంశానికి దారి చూపింది”-అభిమన్యు

ఉద్యోగం వదిలేశాక.. కచ్ ప్రాంతంలోని తన సొంత ప్రాంతానికి రావడం తన జీవితంలో చేసిన అతి పెద్ద రిస్క్ అంటారు అభిమన్యు. చుట్టుపక్కలవారి మాటలు భరించడం చాలా కష్టమైందని చెబ్తున్నారు.

“ఆ సమయంలో నేను చాలా ఒత్తిడికి గురయ్యాను. ఏ రోజు కూడా రాత్రి సరిగా నిద్ర పోలేదు. సమాజం నుంచి ఎదురయ్యే ఒత్తిడితో పాటు వీడు ఏమీ చేయలేడనే భావన వెంటాడేది. ఆ సమయంలో 'సవాలు అనిపించేది ఏదైనా చేయమన్న'నా తండ్రి చెప్పిన మాటలే గుర్తొచ్చేవి. వాటిని నేను ఎప్పటికీ మర్చిపోలేను.”

సమాజం ఎలా అనుకున్నా అభిమన్యు తల్లి మాత్రం అతనికి మద్దతుగా నిలిచారు. టీసీఎస్‌లో పని చేస్తున్న సమయంలోనే ఓ వెంచర్ గురించిన ఆలోచన బలంగా ఉండేది అభిమన్యు మనసులో. వాటిలో మర్కండైజింగ్ కూడా ఒక చిన్న భాగం. ఆ విభాగాన్నే లీడ్‌గా తీసుకుని.. సోక్రటీస్ పేరుతో వెంచర్ ప్రారంభించారు అభిమన్యు.

image


సోక్రటీస్.. ఇదొక భారతీయ వస్త్రాలకు సంబంధించిన బ్రాండ్. పాప్ కల్చర్‌‌ని మిళితం చేసిన నాణ్యమైన దుస్తులను.. ఈ టీం నమ్మిన ఆలోచనలకు అనుగుణంగా రూపొందించేవారు. తాను స్ఫూర్తి పొందిన వాటి నుంచే డిజైన్లు, ఉత్పత్తులను రూపొందించామంటారు సోక్రటీస్ వ్యవస్థాపకుడు.

“కస్టమర్లు వెతికే టీ షర్ట్‌లను తయారు చేసి అందించాలన్నదే మా లక్ష్యం.. సరైన డిజైన్‌‌కి ఫిలాసఫీని జత చేస్తాం. అంటే అదో రబ్బర్ స్టాంప్‌ను ప్రింట్ చేయడంతో సరిపెట్టేందుకు మేం వ్యతిరేకం. అత్యంత మృదువైన వస్త్రాన్ని మరింత స్మూత్‌‌గా ఉండే కుట్టుపనితో జత చేయడంతోపాటు.. భుజాలు, మెడ భాగంలో లూజ్ అయ్యి జారిపోకుండా ఉండేలా రూపొందిస్తాం. వాషింగ్ మెషీన్‌‌లో ఉతికినా సరే ఇవి ఏ మాత్రం పాడవవు.”

టీషర్ట్‌‌‌లపై ఉండే ప్రింట్స్ తాము నివసిస్తున్న సంస్కృతికి అనుగుణంగా ఉండడంతోపాటు.. స్ఫూర్తిని కలిగించేవిగా ఉండేలా జాగ్రత్త పడతారు సోక్రటీస్ టీం. అంతే కాదు.. ఒకవేళ టీ షర్ట్ కొన్న తరువాత కస్టమర్ మనసు మార్చుకుంటే... సులువుగా రిటర్న్, సైజ్ సరిపోకపోతే ఎక్స్‌ఛేంజ్ చేసుకోవడం, డిజైన్ మార్చుకోవడం వంటి సేవలకు అధిక ప్రాధాన్యతనిచ్చారు. దీంతో అనతికాలంలోనే ఈ బ్రాండ్‌‌కు ఆదరణ పెరిగింది.

ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్, అమెజాన్ వంటి టాప్ ఆన్‌లైన్ మార్కెట్‌‌ప్లేస్‌ల ద్వారా విక్రయాలు చేపడుతోంది సోక్రటీస్. ప్రస్తుతం ఈ టీంలో 7గురు సభ్యులు ఉన్నారు. మార్కెటింగ్ విషయానికొస్తే సామాజిక సైట్లలో ప్రచారానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. దీంతోపాటు ఈవెంట్ నిర్వహణ భాగస్వామ్యాల ద్వారా ఆఫ్‌లైన్ ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు. బెంగళూరు, హైద్రాబాద్‌‌లలో నిర్వహించే కోమికాన్‌‌తో ఒప్పందాలు ఉన్నాయి. వెంచర్‌‌కు సోక్రటీస్ అనే పేరు పెట్టడంపై ఆసక్తికరమైన వివరాలు చెబ్తున్నారు ఫౌండర్ అభిమన్యు.

“నాకు గ్రీక్ పేర్లంటే చాలా ఇష్టం. అంతే కాదు ప్రతీ టీ షర్ట్ ద్వారా ప్రత్యేకమైన సిద్ధాంతాన్ని, కథని చెప్పచ్చు. అందుకే సోక్రటీస్ పేరుతో వెంచర్‌ నిర్వహించాలని నిర్ణయించుకున్నానం”టున్నారు అభిమన్యు.
image


ఇప్పటివరకూ సాధించినది ఏంటంటే ?

అభిమన్యు చెబుతున్న వివరాల ప్రకారం కచ్ నుంచి నిర్వహిస్తున్న ఈ వెంచర్.. అద్భుతంగా నడుస్తోంది. ఇప్పటివరకూ ₹30లక్షల విలువైన ప్రొడక్టులను విక్రయించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి నిర్ణయించుకున్న లక్ష్యం ₹24 లక్షలు కాగా.. దాన్ని ఇప్పటికే దాటేశారు. అక్టోబర్ నుంచి ఆర్థిక సంవత్సరంగా పరిగణిస్తే.. గతేడాదితో పోల్చితే 200 శాతం వృద్ధి నమోదు చేయడం విశేషం. గతేడాది 9 నుంచి 10 లక్షల ఆదాయం మాత్రమే లభించింది.

మరోసారి ఎదురుదెబ్బ

వెంచర్‌ని విజయవంతంగా ప్రారంభించాక.. అనుకున్నవన్నీ సాఫీగా నడిచిపోలేదు. ఈ వెంచర్‌‌కి అత్యధిక ఆర్డర్లు క్యాష్ ఆన్ డెలివరీపైనే వస్తుండేవి. మొత్తం ఆర్డర్లలో సీఓడీ వాటానే అధికంగా ఉండేది. ఈ పేమెంట్స్‌ని కొరియర్ కంపెనీలు కొనుగోలుదారుల నుంచి సేకరించి.. డెలివరీ చేసిన 15-30 రోజుల్లో సోక్రటీస్ అకౌంట్‌కు జమ చేసేవి. కానీ 2014 మార్చ్‌లో ఓ సమస్య ఎదురైంది. సోక్రటీస్‌కు లాజిస్టిక్స్ నిర్వహించే కంపెనీ.. రికార్డులు సరిగా నిర్వహించకపోవడంతో.. పేమెంట్లు దాదాపు 3 నెలల పాటు నిలిచిపోయాయి. అప్పటికి వెంచర్ ప్రారంభించి 6-7 నెలలు మాత్రమే అవడంతో చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది.

ఈ సమస్య సోక్రటీస్ వెంచర్‌ను ఇబ్బందుల్లో నెట్టేసింది. అమ్మకాలు బాగానే ఉన్నా.. స్టాక్ పెంచుకునే అవకాశం లేదు. కొత్త డిజైన్లను అందించే ఛాన్స్ లేదు. కేవలం కస్టమర్ల ఆన్‌లైన్ పేమెంట్స్ పైనే ఆధారపడాల్సి వచ్చింది.

చాలామంది కస్టమర్లు అవుటాఫ్ స్టాక్ అని ఉన్న డిజైన్లు ఎప్పుడొస్తాయంటూ మెయిల్స్ చేసేవారు. దీంతో కంపెనీ అభివృద్ధి నిలిచిపోయింది. ఆ లాజిస్టిక్స్ కంపెనీతో వ్యాపారం కొనసాగించడం కూడా సాధ్యం కాదని తేలిపోవడంతో.. తమ వ్యాపార విధానాన్ని పునాదుల నుంచి పునర్నిర్మించుకోవాల్సి వచ్చింది సోక్రటీస్‌‌కి.

“సోక్రటీస్ నిర్వహణ కోసం ఉంచిన నిధులన్నిటినీ పూర్తిగా ఖర్చు చేసేశాం. సామాజికంగా ఎదురైన ఒత్తిడి, కుటుంబ బాధ్యతలు మరిన్ని ఇబ్బందులకు కారణమయ్యాయి. 2014 ఏప్రిల్ నాటికి బాండ్లలోనూ, భవిష్యత్ అవసరాల కోసం సెక్యూరిటీస్‌‌లో దాచిన మొత్తాన్ని.. అంతా తెచ్చి సోక్రటీస్‌లో పెట్టేశాను. ఇది నాకు చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి. ఒక వేళ తేడా వస్తే.. తట్టాబుట్టా సర్దుకుని వ్యాపారం మూసేయాల్సిందే అని నాకు తెలుసు.”

కష్టాన్ని నిరంతరంగా నమ్మకున్న వాళ్లకి అదృష్టం ఏదో ఒక సమయంలో కలిసొస్తుంది. కొత్తగా అందిన మొత్తంతో బాగా డిమాండ్ ఉన్న డిజైన్స్‌ను స్టాక్ పెట్టడంతోపాటు.. ధైర్యం చేసి కొన్ని కొత్త డిజైన్లను కూడా అందించాం. 2014 జూలై నాటికి కష్టాల కడలిని దాటి.. గట్టెక్కింది సోక్రటీస్ గట్టెక్కింది. అనుకున్నదానిలో 80శాతం మొత్తం తిరిగొచ్చింది. మిగిలిన 20శాతం కోసం ఇప్పటికీ ఆ లాజిస్టిక్స్ కంపెనీతో మెయిల్స్ ద్వారా పోరాటం కొనసాగిస్తూనే ఉన్నారు అభినవ్. దీనికంటే ముఖ్యమైనది. అభివృద్ధి కోణంలో చూస్తే కీలకమైన 3-4 నెలల విలువైన సమయం పోగొట్టుకోవాల్సి వచ్చింది. అయితే.. వ్యాపారంలో దూసుకుపోవడంతో 2014 నవంబర్ నాటికే బ్రేక్ఈవెన్‌‌కి రావడం విశేషం.

image


అభివృద్ధి కోసం అభిమన్యుడి వ్యూహాలు

ప్రస్తుతం సొంత నిధులతోనే నిర్వహిస్తున్నా.. త్వరలో పోస్టర్స్ వంటి కొత్త కేటగిరీలను జత చేయబోతున్నారు. 2016 ప్రారంభం నాటికి కొత్త రేంజ్ డిజైన్లతోపాటు వ్యాపార విధానంలో చిన్న చిన్న మార్పులకు కూడా సిద్ధమవుతోంది సోక్రటీస్. దేశంలో విపరీతమైన డిమాండ్ ఉండే స్ట్రీట్‌‌వేర్ బ్రాండ్స్ పైనా దృష్టి పెట్టనున్నారు. బ్రాండ్ పాపులారిటిని పెంచేందుకు కూడా అభిమన్యు దగ్గర తగిన వ్యూహాలు ఉన్నాయి.

“కాలేజ్‌లకు విస్తృతంగా పర్యటించడం ద్వారా యువత ఇష్టాయిష్టాలను తెలుసుకోవాలని అనుకుంటున్నాం. ఆన్‌‌లైన్ వెబ్‌స్టోర్ నిర్వహించడం ద్వారా వెబ్ సమాజంలో బాగానే వృద్ధి నమోదు చేస్తున్నాం. అయితే.. ఇప్పటికీ ఒకసారి ఒక టీషర్ట్ డిజైన్ మాత్రమే అభివృద్ధి చేయగలుగుతున్నాం. ఆఫ్‌‌లైన్‌లో కూడా అమ్మకాలు పెంచుకునేందుకు ప్రణాళికలున్నాయి. త్వరలో అంతర్జాతీయ షిప్పింగ్‌ని కూడా ప్రారంభించేందుకు యత్నిస్తున్నాం” అని చెప్పారు అభిమన్యు.

ఈ రంగంలో ఒక్కో కంపెనీ ఒక్కో ప్రత్యేకతతో కస్టమర్లను ఆకట్టుకునేందుకు యత్నిస్తోంది. అల్మా మేటర్ ఇలాంటి మోడల్‌నే కలిగి ఉంది. జాక్ ఆఫ్ ఆల్ థ్రెడ్స్, వాక్స్‌పాప్‌లు నిలకడపై దృష్టి సారించాయి. నో నాస్టీస్, బ్రౌన్‌‌బోయ్‌లు ఆర్గానిక్ కాటన్‌పై ఆధారపడ్డాయి. బ్రాండ్ నిర్మాణానికి విభిన్నతే ఈ రంగంలో కీలకం కానుంది. వ్యక్తులు తమ డిజైన్లను అందించి విక్రయించడం, భాగస్వాములుగా చేర్చుకోవడం ద్వారా.. ఫ్రీకల్చర్ వంటి సైట్లు.. ఈ పోటీ వాతావరణాన్ని మరింతగా పెంచుతున్నాయి.

ఇలాంటి పోటీ ఉన్న మార్కెట్లో.. సోక్రటీస్ లాంటి చిన్న బ్రాండ్లు నిలదొక్కుకోవాలంటే.. కొత్త ఆవిష్కరణలు ఒక్కటే మార్గమని చెప్పాలి. బ్రాండ్ ప్రమోషన్, సక్సెస్‌పై ఎక్కువగా దృష్టి పెట్టాలి.

వెబ్‌సైట్