గ్రామీణులకు ఇంగ్లిష్ నేర్పిస్తున్న 17 ఏళ్ల జూనియర్ శ్రీమంతురాలు

గ్రామీణులకు ఇంగ్లిష్ నేర్పిస్తున్న 17 ఏళ్ల జూనియర్ శ్రీమంతురాలు

Friday October 23, 2015,

4 min Read

17 ఏళ్ల చిన్నారులంటే.. తల్లిదండ్రుల మీద ఆధారపడే టీనేజర్లేనని అంతా భావిస్తారు. వారి జీవితాలను మెరుగుపర్చుకునేందుకు ఇతరుల సాయం తీసుకుంటారని అనుకుంటారు. కానీ 17 ఏళ్ల దియా షా మాత్రం ఏకంగా ఓ గ్రామాంలోనే వెలుగులు నింపింది. మహిళల ఆలోచనల్లోనే అనూహ్యమైన మార్పులు తీసుకొచ్చింది. ఇంగ్లిష్ అనేది ఓ బ్రహ్మవిద్యేం కాదు. దాన్ని నేర్చుకోవడానికి అంత బిడియపడాల్సిన అవసరమేం లేదు అని కేవలం రెండే నెలల్లో నిరూపించింది.

నగరాల్లో జన్మించి, అక్కడే బతికే టీనేజర్లు ఇతర పట్టణాల వాళ్లతో పోలిస్తే.. కొద్దిగా ఖరీదైన లైఫ్‌స్టైల్‌నే అనుసరిస్తారు. అదే సుఖానికీ అలవాటుపడుతారు. స్కూళ్లకు సెలవులిస్తే కొత్త ప్రదేశాలకు వెళ్లడం, హాబీలు, ఎక్స్‌ట్రా కెరిక్యూలర్ యాక్టివిటీస్‌లో పాల్గొంటారు. ఐతే 17 ఏళ్ల దియా షా మాత్రం కాస్త భిన్నం. బీడీ సోమానీ ఇంటర్నేషనల్ స్కూల్‌లో చదివే ఈ చిన్నారి కాస్త విభిన్నంగా ఆలోచించింది. ఏదైనా కొత్తగా చేయాలని నిర్ణయించింది.

ఐసీఎస్‌ఈ ఎగ్జామ్స్ పూర్తయిన తర్వాత వేసవి సెలవులను రాయ్‌గఢ్‌ సమీపంలోని ఖామ్గావ్‌ గ్రామంలో గడపాలని డిసైడైంది. ఆ గ్రామ ప్రజలకు బేసిక్ ఇంగ్లీష్, గ్రామర్‌ను బోధించాలని భావించింది. ఐతే 17 ఏళ్ల దియా షా ఈ నిర్ణయం చెప్పగానే, ఆమె తల్లిదండ్రులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఖామ్గావ్‌కు ఒంటరిగా పంపేందుకు నిరాకరించారు. కానీ గ్రామ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలన్న తమ కూతురి నిర్ణయాన్ని కాదనలేకపోయారు. ఇంత చిన్న వయస్సులో అంత గొప్ప ఆలోచనలు చేస్తున్న తమ చిన్నారిని చూసి అబ్బురపడ్డారు.

image


జరీనా స్క్రూవాలా నేతృత్వంలో నడుస్తున్న ఎన్జీవోతో కలిసి దియా పనిచేసింది. మొదట్లో స్వదేశ్‌ ఎన్జీవోలో ఇంటర్న్‌గా పనిచేసింది. సెల్ఫ్‌హెల్ఫ్ గ్రూప్స్‌ డాటాను విశ్లేషణ చేసేది. అయితే గ్రామీణ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఏదైనా సవాలుతో కూడుకున్న పని చేయాలన్నది దియా లక్ష్యం.

‘‘మనం ఊహాలోకంలో జీవిస్తున్నాం. మనదగ్గరున్న సంపదతో చెడు ఆలవాట్ల వైపు మళ్లుతున్నాం. కానీ గ్రామాల్లో ఉన్న మరో కోణాన్ని చూడలేకపోతున్నాం’’ అని దియా ఆవేదన వ్యక్తం చేస్తోంది.

గ్రామీణ ప్రజల మధ్య ఉన్న కమ్యూనికేషన్ గ్యాప్‌ను తొలిగించాలంటే ఒక్క చదువుతోనే అది సాధ్యపడ్తుందని దియా బలంగా నమ్మింది. గ్రామీణ ప్రజలకు అర్థమయ్యేలా, ఆసక్తి కలిగించేలా చెప్పేందుకు ఇంటరాక్టివ్ మాడ్యూల్స్, పవర్‌ పాయింట్ ప్రజంటేషన్స్‌ను ఆమె సిద్ధం చేసింది.

జర్నీఇలా..

2014 జూన్‌లో దియా తన కొత్త జీవితాన్ని మొదలుపెట్టింది. ఖామ్గావ్‌లోని ఓ కుటుంబంతో కలిసి జీవించింది. ఆ కుటుంబంతో పూర్తిగా కలిసిపోయిన దియా, అన్ని పనుల్లోనూ పాలుపంచుకునేది. వేకువజామునే నిదురలేచి, రోజు వారీ వ్యవహారాల్లో సాయం చేసేది. చపాతీలు చేయడం, బావి నుంచి నీళ్లు తేవడంతోపాటు మరికొన్ని ఇంటిపనులు కూడా చేసిపెట్టేది.

ఖామ్గావ్‌లో తన అనుభవాలను చెప్తుంటే ఆమె కళ్లు ఆనందంతో మెరిసేవి. ‘‘ఆ కుటుంబంతో మరాఠీలోనే మాట్లాడేదాన్ని. కొన్నిరోజుల్లోనే వారు నన్ను తమ కుటుంబంలో సభ్యురాలిగా అంగీకరించారు. వారెంతో సంతోషంగా జీవించేవారు. ఆ గ్రామమంతా ఓ కుటుంబంలా ఉంటుంది. వారి ప్రేమా, అనురాగం టిపికల్ మెట్రోపాలిటన్ ప్రజల జీవితాలపై ఎన్నో ప్రశ్నలు సంధించేవి. సంతోషంగా జీవించాలంటే డబ్బే ఉండాల్సిన అవసరం లేదు.. ఆ ఊరిని చూసిన తర్వాత నాకు అనిపించింది‘’ అని దియా తన జ్ఞాప‌కాలను గుర్తుచేసుకుంది.

కానీ జీవితంలో అభివృద్ధి చెందాలంటే ఇంగ్లీష్ అవసరం ఎంతుందో ఆ గ్రామ ప్రజలకు చెప్పడం దియాకు చాలా కష్టమైంది. కానీ తాను ఆ గ్రామానికి ఎందుకొచ్చిందో మాత్రం వారికి వివరించింది. ఎట్టకేలకు వారు ఆమె ప్రతిపాదనకు అంగీకరించారు.

ఆరంభించిన కొద్ది రోజులకే ఆ గ్రామ చిన్నారులకు ఇంగ్లీష్‌పై ఆసక్తి పెరిగింది. ఉదయాన్నే కాకుండా సాయంత్రం కూడా క్లాసులు తీసుకోవాలని వారు దియాను కోరారు. దీంతో రాత్రిళ్లు కూడా ఆమె జనాలకు చదువు చెప్పింది. ఆల్ఫాబెట్స్‌ను చిన్నారులకు అర్థమయ్యేలా వివరించడం, గ్రామర్ రూల్స్‌ను వివరించడం చేసేది.

చిన్నారులకు ఇంగ్లీష్ నేర్పిస్తున్న దియా

చిన్నారులకు ఇంగ్లీష్ నేర్పిస్తున్న దియా


ఇంగ్లిష్ మాట్లాడే వాళ్లే గొప్పా ?

భారతీయులకు ఓ అలవాటు ఉంది. ఇంగ్లీష్ మాట్లాడేవారంటే తమ కంటే గొప్ప అన్న అభిప్రాయం కూడా చాలామందిలో ఉంటుంది. ఈ కారణంగా ఇంగ్లీష్ వచ్చినవారిని చూడగానే వారు ఆత్మవిశ్వాసం కోల్పాతారు. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పెరిగిపోతుంది.

‘‘ఈ దురాభిప్రాయాన్ని తొలిగించేందుకు నేనెంతో కష్టపడ్డాను. వర్బ్స్, అడ్‌వర్బ్స్, నౌన్స్, అడ్జెక్టివ్స్, ఆర్టికల్స్ వంటి బేసిక్ ఇంగ్లిష్‌ను నేర్పించాను. తద్వారా వారు సులభంగా చిన్న చిన్న పదాలను తయారుచేసుకునేవారు’’ అని దియా చెబ్తోంది.

మరోవైపు ఆ గ్రామంలోని మహిళల కోసం స్వదేశ్ సంస్థ మధ్యాహ్నం సమయంలో కుట్టుపని నేర్పించేది. ఆ సెంటర్‌కు వచ్చే మహిళలతో మాట్లాడి, వారిని కూడా ఇంగ్లీష్ క్లాస్‌లకు వచ్చేలా ఒప్పించగలిగింది దియా. ఒక్క వారంలోనే 30 మంది మహిళలు ఇంగ్లీష్ క్లాస్‌లకు హాజరయ్యారు.

క్లాస్‌లకు వచ్చేవారి సంఖ్య పెరగడంతో మూడు బ్యాచ్‌లను ఏర్పాటు చేసింది దియా. మూడు నుంచి ఐదో స్టాండర్డ్ తరగతి చదివే చిన్నారులకు ఉదయంపూట, మహిళలకు మధ్యాహ్నం, కాలేజీ విద్యార్థులకు సాయంత్రం క్లాసులు తీసుకునేది.

బొమ్మల ద్వారా చిన్నారులకు ఇంగ్లీష్ నేర్పడంలో స్వదేశ్ సంస్థ ఎంతో సాయం చేసిందని దియా చెప్తుంది. రాయ్‌గడ్ జిల్లాలో 30 గ్రామాల్లో అంగన్‌వాడీల్లో చిన్నారులకు బొమ్మల ద్వారా విద్యను అందించేందుకు స్వదేశ్ సంస్థ సాయం చేస్తున్నది. రాయ్‌గఢ్ జిల్లాలోని 12-15 గ్రామాల్లో అంగన్‌వాడీ టీచర్లకు బొమ్మలను ఉపయోగించి చదువు ఎలా చెప్పాలో దియ వివరించేది. అంగన్‌వాడీల్లోనే కాదు మరో 25-30 స్కూల్స్‌లను కూడా దియా సంప్రదించింది.

బిదాయి-గుడ్ బై..

ఖామ్గావ్‌లో దియా గడిపిన చివరి రోజు చిరస్మరణీయం. దియాకు వీడ్కోలు పలికేందుకు ఆ గ్రామ ప్రజలు ‘‘బిదాయి-గుడ్ బై’’ పేరిట ఓ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. గ్రామ గ్రామమంతా ఆ కార్యక్రమంలో పాల్గొని దియా తమకు నేర్పిన ఇంగ్లీష్ ఎంతగా ఉపయోగడుతుందో వివరించారు. తమ బ్రోకెన్ ఇంగ్లీష్‌ను మెరుగుపర్చేందుకు దియా పడిన తపనను వారు గుర్తుచేసుకున్నారు. తమ వ్యక్తిగత జీవితాల్లో దియా ఏ మేరకు ప్రభావం చూపిందో వారు వివరించారు. ఖామ్గావ్‌లో ఏడువారాలు గడిపిన దియాకు ఆ రోజులు ఎంతో ప్రేమను, అనుబంధాన్ని అందించాయి. మానవత్వానికి మించిన వృత్తి మరోటి లేదని ఆమెకు తెలియజేసింది.

‘‘స్వప్నాలను, లక్ష్యాలను సాకారం చేసుకోవాలంటే చిన్న నగరాలు, పట్టణాలకే వెళ్లాల్సిన అవసరం లేదు. గ్రామాల్లో నివసించి కూడా లక్ష్యాలను పరిపూర్ణం చేసుకోవచ్చు. ఇప్పుడు గ్రామీణ భారతాన్ని నేను సానుభూతితో చూడటం లేదు. ఆ గ్రామ ప్రజల కళ్లల్లో ఆశను, మార్పును, సాధికారితను చూస్తున్నాను’’ అని దియా పేర్కొంది.

ఓ మంచి సందేశంతో దియా తన ఖామ్గావ్ అనుభవాన్ని ముగించింది. ‘‘ఓ ప్రదేశం గొప్పదనం అక్కడ నివసించే ప్రజలను బట్టి ఉంటుంది. 

మంచితో దేశాన్ని నిర్మిద్దాం.. 

ఇది నా దేశం, మీ దేశం, మనందరి దేశం’’ అని ముగించింది.


దియా ఆ గ్రామంలో ఎంత మందికి ఇంగ్లిష్ నేర్పింది. రెండు నెలల్లోనే వాళ్లంతా ఆంగ్లంలో ప్రావీణ్యం పొందారా అనేవి ముఖ్యం కాదు. ఆమె తీసుకున్న చొరవ ప్రశంసించాల్సిన విషయమే. రెండు పదులు కూడా నిండకుండా.. తాను చేసిన ఈ ప్రయత్నం.. రేపటి రోజున ఎన్నో మార్పులకు శ్రీకారం కావొచ్చు. తన తపన చూసి ఆ ఊరివాళ్లు కూడా మురిసిపోయి.. ఎంతో కొంత నేర్చుకోవడం కూడా హర్షించాల్సిన అంశమే. ఇలాంటి వాళ్లను ప్రోత్సహించి.. వెన్నుతడితే.. రేపటి రోజున ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేసేందుకు వాళ్లలో ఆత్వవిశ్వాసం రెట్టింపవుతుంది. అదే యువర్ స్టోరీ ఆలోచన కూడా.