ఆన్‌‌లైన్ లాండ్రీ సర్వీస్ కేరాఫ్ 'అర్బన్ ధోబీ'

ఆన్‌‌లైన్ లాండ్రీ సర్వీస్ కేరాఫ్ 'అర్బన్ ధోబీ'

Wednesday November 18, 2015,

3 min Read

బిజీ లైఫ్‌లో ఇంట్లో పనులు చేసుకోవడానికి సమయం ఉండట్లేదు. అందుకే చేదోడువాదోడుగా నిలిచే స్టార్టప్స్ చాలా వస్తున్నాయి. అలాంటిదే అర్బన్ ధోబీ. జైపూర్‌లో ఆన్ లైన్ లాండ్రీ సర్వీసులను అందిస్తున్న స్టార్టప్ ఇది. ఉతకాల్సిన బట్టలు ఉంటే... స్వయంగా ఇంటికి వచ్చి తీసుకెళ్లి... చక్కగా ఉతికి 24 గంటల్లో ఇంటికి తీసుకొచ్చే సేవలందిస్తోంది ఈ ఆన్ లైన్ స్టార్టప్. జూన్ 2015లో 10 లక్షల రూపాయల పెట్టుబడితో ప్రారంభమైంది ఈ స్టార్టప్. ప్రస్తుతం నగరంలోని ఆరు ప్రాంతాల్లో సేవలందిస్తోంది. మూడు నెలల్లోనే ఈ స్టార్టప్‌కి రెండు వేల యూజర్స్, ఏడు వందలకు పైగా కస్టమర్స్ ఉన్నారు.

అర్బన్ ధోబీ టీమ్

సత్యం మిశ్రా, ప్రఖర్ పగారియా, తుషార్ తెట్టాయిల్, సరాంశ్ సిద్ధు... ఈ నలుగురు స్నేహితుల మానస పుత్రిక అర్బన్ ధోబీ. జూన్ 2015లో ఉద్యోగం వదిలేసి తమ ప్రాజెక్ట్ నమూనాపై కసరత్తు చేశారు వీరంతా. అర్బన్ ధోబీ ప్రారంభించడానికి ముందు ప్రఖార్, సత్యం, తుషార్‌లు అహ్మదబాద్‌లో అంతర్జాతీయ కన్సల్టింగ్ సంస్థలో పనిచేశారు. సరాంశ్ ఢిల్లీలో బైనరీ ల్యాబ్స్ స్టార్టప్‌లో పనిచేశాడు. సత్యం... అర్బన్ ధోబీ సీఈఓ. కంపెనీ కోసం కొత్త వ్యూహాలు రచించడంలో దిట్ట. మార్కెటింగ్ సేవలందిస్తారు. మిగతా నగరాల్లో కస్టమర్లను ఎలా చేరుకోవాలన్న వ్యూహాలు రూపొందిస్తారు. ప్రఖార్ కంపెనీ సీఓఓ. రోజువారీ కార్యకలాపాలు చూసుకుంటూ కంపెనీ స్ట్రాటజీ ఫాలో అప్ చేస్తుంటారు. ఇక ఐఓఎస్, ఆండ్రాయిడ్ టెక్నికల్ టీంను, వెబ్‌సైట్ డిజైనర్స్, డెవలపర్స్‌ని సరాంశ్ చూసుకుంటారు. ఈ కంపెనీ సీఎంఓ తుషార్ వేర్వేరు నగరాల్లో విస్తరించే ప్రణాళికలు రూపొందిస్తారు.

" 70 శాతానికంటే ఎక్కువ కస్టమర్లు మళ్లీమళ్లీ మాకు ఆర్డర్లు ఇస్తున్నారు. వారివి నెలకు కనీసం నాలుగు ఆర్డర్లు ఉంటున్నాయి. మేం లాండ్రీలతో ఒప్పందం కుదుర్చుకున్నాం. మా డెలివరీ బాయ్ వారి దగ్గరకు దుస్తులు తీసుకెళ్తారు. అక్కడే వాషింగ్, డ్రైయింగ్ పూర్తవుతుంది. డ్రయర్ నుంచి బయటకు తీసిన దుస్తుల్లో 80 శాతం ముడతలుండవు. ఇస్త్రీ కూడా అవసరం లేదు. కానీ కస్టమర్స్ కోరిక మేరకు ఇస్త్రీ చేస్తున్నాం. కస్టమర్లకు 24 గంటల్లోనే డెలివరీ ఇచ్చేస్తున్నాం. అంతే కాదు... కేవలం నాలుగ్గంటల్లోనే డెలివరీ ఇచ్చే ఎక్స్‌ప్రెస్ సర్వీస్ కూడా ఉంది మా దగ్గర" అంటారు అర్బన్ ధోబీ సీఈఓ సత్యం.
image


మెరుగైన సేవలు

మొదట్లో ఫౌండర్లు వేర్వేరు రెస్టారెంట్లకు, ఐటీ కంపెనీలకు, కాఫీ షాప్‌లకు వెళ్లి వారి సర్వీసు గురించి ప్రచారం చేశారు. జూన్ 30న అర్బన్ ధోబీకి తొలి ఆర్డర్ వచ్చింది. ఒక్కసారి ఆర్డర్ ప్లేస్ చేస్తే... చెప్పిన సమయానికి కంపెనీ ప్రతినిధి కస్టమర్ దగ్గరకు వస్తారు. దుస్తుల్ని డిజిటల్ వేయింగ్ మెషీన్‌పై తూకం వేసి తీసుకెళ్తారు. ఈ దుస్తుల్ని లాండ్రీకి పంపి హైటెక్ మెషీన్లపై ఉతుకుతారు. తిరిగి వీటిని కస్టమర్ ఇంటికి తీసికెళ్లి డెలివరీ చేస్తారు. క్యాష్ ద్వారా లేదా కార్డు ద్వారా పేమెంట్ తీసుకుంటారు. మూడు కిలోలకు 150 రూపాయలు, ఐదు కిలోలకు 200 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. ఆ తర్వాత ప్రతీ కిలోకు 35 రూపాయలు అదనం. వీరి సగటు ఆర్డర్ 300 రూపాయలు. అందులో 65 శాతం లాండ్రీలో చెల్లిస్తారు. కనీసం మూడు కిలోల ఆర్డర్ మాత్రమే తీసుకుంటారు.

"మాకు ప్రత్యేకమైన లాండ్రీ లేదు. బట్టలు ఉతికేవాళ్లను నియమించుకోలేదు. మా బిజినెస్ మోడల్ అంతా ఔట్ సోర్సింగ్ పై ఆధారపడి ఉంది. లాండ్రీలతో ఒప్పందం కుదుర్చుకొన్నాం. మా టీమ్ నిరంతరం వెళ్లి క్వాలిటీ చెక్ చేస్తూ ఉంటుంది. మా ప్రాసెస్ అంతా ఆటోమెటెడ్ కాబట్టి క్వాలిటీ విషయంలో ఎలాంటి తేడా రాదు" అంటారు సత్యం.

కస్టమర్ల కోసం యాండ్రాయిడ్, ఐఫోన్ యాప్స్ రూపొందించింది అర్బన్ ధోబీ. ఇది డెలివరీ యాప్. యూజర్లు తమ దుస్తులు ఎక్కడున్నాయో ట్రాక్ చేసుకోవచ్చు. ప్రస్తుతం వీరికి ఏడుగురు డెలివరీ బాయ్స్ ఉన్నారు. కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా అర్బన్ ధోబీ 'దుస్తుల దానం' కార్యక్రమాన్ని చేపట్టింది. వీరి ద్వారా పలు ఎన్జీఓలకు దుస్తుల్ని దానం ఇవ్వొచ్చు. ప్రస్తుతం ఉదయపూర్, ఢిల్లీలో రెండు ఎన్జీఓలతో ఒప్పందం కుదుర్చుకుంది.

మార్కెట్... అవకాశాలు

గత కొన్నేళ్లుగా లాండ్రీ సర్వీసెస్ మార్కెట్ పెరిగిపోతోంది. ఈ రంగంలో స్టార్టప్స్ సంఖ్య పెరుగుతోంది. లాండ్రీ మార్కెట్ విలువ రెండు లక్షల కోట్ల రూపాయలకు పెరిగే అవకాశం కూడా ఉంది. ఈ రంగం 95 శాతం వరకు అసంఘటితంగా ఉంది కాబట్టి మరిన్ని అవకాశాలున్నాయి. MyWash, Wassup, Pick My Laundry, Speed Clean, Quickclean, Dhobionline, Laundrywala, DirkDaDhobi లాంటి స్టార్టప్స్ ఆన్ లైన్ లాండ్రీ సేవలందిస్తున్నాయి. వీటిలో కొన్ని ఇన్వెస్టర్స్ ద్వారా పెట్టుబడులు సేకరించాయి. ఇటీవల చెన్నైకి చెందిన ఆన్ లైన్ లాండ్రీ సర్వీస్ స్టార్టప్ వాసప్‌కు జబాంగ్ ఫౌండర్స్ ద్వారా రెండు మిలియన్ యూఎస్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. ఆగస్ట్ 2015లో జైపూర్‌కు చెందిన ఇంక్యుబేషన్ సెంటర్ అయిన స్టార్టప్ ఒయాసిస్‌లో చేరింది అర్బన్ ధోబీ.

వృద్ధి ప్రణాళికలు

అర్బన్ ధోబీ... త్వరలో కస్టమర్ల కోసం నెలవారీ ప్లాన్ రూపొందించబోతోంది. 900 రూపాయలు రీఛార్జ్ చేసుకుంటే వెయ్యి పాయింట్లు వస్తాయి. ఈ పాయింట్స్ ఉపయోగించుకొని నెలకు ఐదుసార్లు వాష్ చేయించుకోవచ్చు. లాండ్రీలు అందుబాటులో లేని ప్రాంతాల్లో లాండ్రీలను ప్రారంభిస్తున్నారు. ప్రతీ నెలా 20 శాతం గ్రోత్ కనిపిస్తోంది. వచ్చే ఏడాదిలో రోజుకు 200 ఆర్డర్లు తీసుకునేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అంతేకాకుండా మరో ఆరు నెలల్లో అహ్మదాబాద్, కోట, చండీఘర్, ఇండోర్, పూణె, హైదరాబాద్ నగరాల్లో అడుగుపెట్టాలన్న ఆలోచన చేస్తున్నారు.