చమురు లీకేజీలకు చెక్. ప్రపంచ పర్యావరణ కాలుష్యానికి 18 ఏళ్ల కుర్రాడి పరిష్కారం

చమురు లీకేజీలకు చెక్. ప్రపంచ పర్యావరణ కాలుష్యానికి 18 ఏళ్ల కుర్రాడి పరిష్కారం

Friday November 13, 2015,

6 min Read

పర్యావరణాన్ని పరిరక్షించాలన్న అతని తపన ఓ నూతన ఆవిష్కరణకు తెరతీసింది. 18 ఏళ్ల వయసులోనే ప్రతిష్టాత్మక ఇంటెల్ యంగ్ సైంటిస్ట్ అవార్డును తెచ్చిపెట్టింది. ఎన్నో దశాబ్దాలుగా మానవాళికి సవాలు విసురుతున్న సముద్ర గర్భంలో చమురు లీకేజీలకు అతనో అద్భుత పరిష్కారాన్ని కనుగొన్నాడు. సముద్ర పర్యావరణ వ్యవస్థకు ముప్పుగా పరిణమించిన చమురు లీకేజీలకు అడ్డుకట్ట వేసేలా ఓ భారీ పరికరాన్ని సృష్టించాడు భారత సంతతికి చెందిన యువ సంచలనం కరణ్ జెరాత్. 2010లో గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో సంభవించిన ప్రమాదంతో ప్రభావితమైన కరణ్.. వాటికి ఎలాగైనా అడ్డుకట్ట వేయాలని నిర్ణయించుకున్నాడు. అప్పటి నుంచి అతను రోజుకు 9 నుంచి 10 గంటల పాటు పరిశోధనలు చేస్తూ కొత్త పరికరాన్ని తయారుచేయడానికి రకరకాల డిజైన్లు రూపొందించడంలో నిమగ్నమయ్యాడు. చివరికి విజయవంతమయ్యాడు. ఆ పరిశోధన అతనికి 50 వేల డాలర్ల ప్రైజ్ మనీ గల ఇంటెల్ అవార్డును తెచ్చిపెట్టింది. అయితే అతని అద్భుత ఆవిష్కరణకు మీడియాలో తగిన ప్రాధాన్యం దక్కకపోవడంతో అది క్రమంగా మరుగునపడిపోయింది. కరణ్ ఆవిష్కరించిన పరికరం తాలూకు డిజైన్ ఇప్పటికీ అతని బెడ్ రూంలోనే ఉంది. దానిని మరింత ముందుకు తీసుకెళ్లడానికి ప్రోత్సహించేవాళ్లే కరువయ్యారు. టెక్సాస్ యూనివర్సిటీలో పెట్రోలియం ఇంజినీరింగ్ చదువుతున్న కరణ్.. తనకు వచ్చిన ప్రైజ్ మనీని తన ఫీజు కోసం ఉపయోగించుకున్నాడు. తాను రూపొందించిన మోడల్‌ను ముందుకు తీసుకెళ్లడానికి యూనివర్సిటీ ఇచ్చే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కరణ్ భావిస్తున్నాడు. తన అద్భుత ఆవిష్కరణతోపాటు దానికి దారితీసిన అనుభవాలను కరణ్ ‘యువర్ స్టోరీ’తో పంచుకున్నాడు. పట్టుదల, ఆలోచనలకు పదును పెట్టే తత్వం ఉంటే యువత ఏదైనా సాధించవచ్చంటున్న కరణ్ జెరాత్ అంతరంగం ఇది.

image


మీ చిన్నతనం ఇండియా, మలేషియా, అమెరికాలలో గడించింది. ఈ ప్రభావం మీ దృక్పధంలో ఎలాంటి మార్పు తీసుకొచ్చింది ?

నేను ముంబైలో పుట్టినా ఏడాది వయసున్నపుడే మలేషియా వెళ్లాల్సి వచ్చింది. ఆ దేశంలో పెరగడం, కౌలాలంపూర్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో చదవడం నన్ను ఓ గ్లోబల్ సిటిజన్‌గా మార్చేశాయి. వివిధ ఆలోచనలను అలవర్చుకోవడం, విభిన్న సంస్కృతులకు అలవాటు పడటం అక్కడే నేర్చుకున్నాను. 2008లో టెక్సాస్‌లోని ఫ్రెండ్స్ వుడ్‌కు షిఫ్ట్ అయ్యాము. అక్కడి నుంచే నాలో శాస్త్రీయ ఆలోచనలు మొగ్గతొడిగాయి.

image


మీపై మీ కుటుంబ ప్రభావం ఎంత వరకు ఉంది ?

మా నాన్న ఓ మెకానికల్ ఇంజినీర్. ఆయన నార్వేజియన్ షిప్పింగ్ కంపెనీలో పనిచేస్తారు. మా అమ్మ ఓ ఆర్టిస్ట్. చిన్నప్పటి నుంచే ఇద్దరి రంగాల్లోని అత్యుత్తమ లక్షణాలు నాకు అలవడేలా చేశారు. మా నాన్న శాస్త్రీయ దృక్కోణం, అమ్మలోని కళ నన్ను రెండు రంగాల్లోనూ రాటుదేల్చాయి.

అమెరికాలోని కొత్త జీవన విధానానికి మిమ్మల్ని మీరు ఎలా మలుచుకున్నారు ?

అమెరికాలో తొలిసారి అడుగుపెట్టినపుడు చాలా భయపడ్డాము. అక్కడ నాన్న సహోద్యోగి కుటుంబంతో తప్ప మిగతా ఎవరితో పరిచయం లేదు. అక్కడి జీవన విధానానికి అలవాటు పడటానికి నాకు కొంత సమయం పట్టింది. అక్కడ హైస్కూల్లో చదువుతున్నపుడే సైన్స్ పట్ల ఇష్టం ఏర్పడింది. కొత్త ఆవిష్కరణలు చేయాలన్న ఉత్సుకత ఉండేది.

ఈ పరికరాన్ని తయారు చేయాలని ఎందుకు అనిపించింది ?

మా అమ్మవాళ్ల కుటుంబం సింగపూర్‌లో ఉంటుంది. అక్కడికి సరదాగా గడపడానికి వెళ్లినపుడు గల్ఫ్ ఆఫ్ మెక్సికో దుర్ఘటన సంభవించింది. మేము ఉండే ప్రదేశంలో సంభవించిన ఈ ప్రమాదంతో నేను చాలా ప్రభావితమయ్యాను. ఈ రోజుల్లో పర్యావరణం ఎదుర్కొంటున్న అతిపెద్ద సంక్షోభాల్లో ఒకటైన చమురు లీకేజీలకు పరిష్కారం కనుగొనాలని అప్పుడే నిర్ణయించుకున్నాను. అప్పటి నుంచే లైబ్రరీలకు వెళ్లి దీనిపై చదవడం మొదలుపెట్టాను. వివిధ డిజైన్లు రూపొందించి వాటికి సంబంధించిన బ్లూప్రింట్స్ తయారుచేసేవాడిని.

ఈ దుర్ఘటనకు ముందు కూడా మీరు పర్యావరణ పరిరక్షణ కోసం ఏమైనా పాటుపడ్డారా ?

పర్యావరణ పరిరక్షణ గురించి నేను కూడా ఆలోచించేవాడిని. అయితే గల్ఫ్ ఆఫ్ మెక్సికో దుర్ఘటన సంభవించకముందు వరకు పర్యావరణవేత్తగా మారాలని మాత్రం అనుకోలేదు. ఆ ప్రమాదం నాలో ఓ ఉత్తేజాన్ని కలిగించింది. ఈ సమస్యను ఎదుర్కోవడానికి ఏదో ఒకటి చేయాలని అనుకున్నాను.

image


అమెరికా తిరిగి వచ్చిన తర్వాత మీ ఆలోచనను ఎలా ముందుకు తీసుకెళ్లారు ?

అమెరికా తిరిగి రాగానే మా స్కూల్లో సైన్స్ ఫెయిర్ జరిగింది. దానికోసం ఓ ప్రాజెక్ట్ ప్రపోజల్ సబ్‌మిట్ చేయాల్సి వచ్చింది. మా కెమెస్ట్రీ టీచర్‌తో నా ఆలోచనను పంచుకున్నాను. ఆమె దానికి అంగీకరించి నాకు మార్గదర్శనం చేయడానికి ఓ మెంటార్‌ను పరిచయం చేసింది. అయితే ఈ సమస్యకు సంబంధించిన సమగ్ర సమాచారం ఆన్ లైన్ లో లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. గతంలో ఎవరూ ఈ సమస్య గురించి ఆలోచించకపోవడం దీనికి కారణం కావచ్చు. అయితే మా మెంటార్ హిల్ ఇచ్చిన తోడ్పాటుతో పట్టు వదలకుండా ప్రయోగాలు చేస్తూ పోయాను.

మీ ఆలోచనలను ముందుకు తీసుకెళ్లడానికి మీ దగ్గర ఎలాంటి వనరులు ఉన్నాయి ?

మా మెంటార్ ఫోస్టర్ హైడ్రాలిక్స్‌లో పనిచేస్తారు. ఆయన సాయంతో దీనికి సంబంధించిన సమాచారాన్ని రాబట్టాను. నేను వాస్తవానికి పరికరాన్ని తయారుచేయలేదు. స్టోనర్ పైప్ లైన్ సిమ్యులేటర్ అనే సాఫ్ట్‌వేర్ సాయంతో వివిధ మోడల్స్ అభివృద్ధి చేశాను. మా మెంటార్ కంప్యూటర్‌లో ఆ సాఫ్ట్ వేర్ ఉండేది. వాళ్ల ఆఫీస్‌లో అనుమతి తీసుకున్న తర్వాత రోజూ అక్కడికెళ్లి 9 నుంచి పది గంటల పాటు నా ప్రాజెక్ట్ పై పనిచేసేవాడిని. నేను రూపొందించిన పరికరం ఎత్తు 75 అడుగులు ఉంటుంది. దాన్ని తయారుచేసేంత డబ్బు నా దగ్గర లేదు. సంబంధిత సాఫ్ట్‌వేర్ లో ఆ పరికరం పనితీరును పరీక్షించడమే నేను వేసిన గొప్ప అడుగుగా భావిస్తున్నాను. ఆ పరికరాన్ని తయారుచేయడానికి సాయపడే వారి కోసం నేను ఎదురుచూస్తున్నాను.

మీ పరికరం ఇంకా సైద్ధాంతిక దశలోనే ఉంది. ఇప్పటివరకు సముద్రంలో దాని పనితీరును పరీక్షించలేదు. మరి చమురు లీకేజీలను అరికట్టడంలో మీ పరికరం విజయవంతమవుతుందన్న నమ్మకం మీకుందా?

ఏదైనా ఓ ఆవిష్కరణను సైద్ధాంతికంగా పరీక్షించడమే తొలి అడుగుగా భావిస్తారు. నేను ఉపయోగించే స్టోనర్ పైప్ లైన్ సిమ్యులేటర్ చాలా గొప్పది. చాలా ఇండస్ట్రీలలో దానిని ప్రామాణికంగా వినియోగిస్తారు. దానివల్లే నా పరికరం విజయవంతంగా పనిచేస్తుందన్న నమ్మకం నాకు కుదిరింది. నా ఆలోచనను అమలు చేయడం, పరికరాన్ని తయారుచేయడమే నా తర్వాతి అడుగు. టెక్సాస్ యూనివర్సిటీలోని వివిధ ప్రొఫెసర్ల దగ్గర ఉన్న ఆధునిక సాఫ్ట్ వేర్ సాయంతో నా ఆలోచనను మరింత ముందుకు తీసుకెళ్లాలని భావిస్తున్నాను.

image


మీ ఆలోచన కార్యరూపం దాల్చడానికి ఎంతకాలం పట్టింది ?

నేను చాలా మందితో మాట్లాడాను. చాలా డాక్యుమెంటరీలు చూశాను. ఎన్నో పుస్తకాలు చదివాను. బ్రిటిష్ పెట్రోలియం ఇలాంటిదే ఓ పరికరం తయారుచేసింది. కానీ అదొక ఖాళీ గొట్టంలా ఉంటుంది. దానికే నేను కొన్ని కీలకమైన మార్పులు చేశాను. సుమారు 30 రకాలు డిజైన్లు తయారుచేసిన తర్వాత ప్రస్తుతం రూపొందించిన డిజైన్ ఖరారు చేశాను.

మీ పరికరం సముద్రంలో పేరుకుపోయిన చమురును ఎంతసేపట్లో శుద్ధి చేస్తుందని మీరు భావిస్తున్నారు ?

లీకేజీ అయిన బావి ఇంకా చమురును ఇంకా ఉత్పత్తి చేస్తూనే ఉంటుంది. సదరు కంపెనీ ఆ బావిని శాశ్వతంగా మూసివేసేవరకు ఆ పరికరం బావిపై ఉండి ఆ చమురును సేకరిస్తుంది. ఈ విధంగా చమురు సముద్రాన్ని కలుషితం చేయకుండా, అక్కడి ఆవరణంపై ఎలాంటి దుష్ప్రభావం చూపకుండా ఈ పరికరం తనవంతు పాత్ర పోషిస్తుంది.

75 అడుగుల పరికరం అంటున్నారు. అంటే దాని బరువు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. మరి ప్రమాదం జరిగిన చోటుకు దాన్ని తరలించడం సాధ్యమేనని మీరు భావిస్తున్నారా?

రవాణా పెద్ద సమస్య కాబోదు. పరికరాన్ని తరలించగల ఓడలు ఉన్నాయి. 300 టన్నుల బరువు వల్ల అది సముద్ర గర్భంలోకి వెళ్తుంది తప్ప పైకి తేలే ప్రసక్తే లేదు. అందువల్ల సంభావ్యత అన్న సమస్యే తలెత్తదు.

అవార్డు వల్ల వచ్చిన మొత్తాన్ని మీ పరికరాన్ని మరింత అభివ్రుద్ధి చేయడానికి వినియోగిస్తారా?

నాకు వచ్చిన ప్రైజ్ మనీని నా కాలేజీ ఫీజు కోసం వినియోగిస్తాను. అందువల్ల నా తల్లిదండ్రులు దాని గురించి చింతించాల్సిన అవసరం రాదు. నేను ప్రపంచంలోనే నంబర్ వన్ పెట్రోలియం ఇంజినీరింగ్ సంస్థ యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ కు వెళ్తున్నాను. అక్కడ అత్యుత్తమ ప్రొఫెసర్లు, పరికరాలు అందుబాటులో ఉంటాయి. దానిని నా పరికరం అభివ్రుద్ధికి ఉపయోగించుకుంటాను.

ఇంటెల్ అవార్డు పొందిన తర్వాత మిమ్మల్ని ఎవరైనా ఇన్వెస్టర్లుగానీ, కంపెనీలుగానీ సంప్రదించాయా?

ఇంతవరకు ఎవరూ రాలేదు. కానీ తొందర్లోనే ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెడతాను. నా కాలేజీ జీవితాన్ని, ఆవిష్కరణలను ఎలా సంతులనం చేసుకుంటూ వెళ్లాలో నిర్ణయించుకున్న తర్వాత ఆ పని చేస్తాను.

మీ ఆవిష్కరణకు ఎంతో పేరొచ్చింది. పర్యావరణానికి పెనుముప్పుగా పరిణమిస్తున్న సంక్షోభానికి ఇది సరైన పరిష్కారం చూపిస్తుందని చాలా మంది కొనియాడారు. కానీ అవార్డు అందుకున్న తర్వాత నెలకొన్న పరిస్థితులు మీ ఆసక్తిని సన్నగిల్లేలా చేశాయా ?

నేనేమీ నిరుత్సాహానికి గురికాలేదు. నా పరికరంతో నేను చేయాల్సి ఉంది ఎంతో ఉంది. మొదట దానికి పేటెంట్ హక్కులు తీసుకుంటాను. యూనివర్సిటీ సాయంతో దానికి మరింత అభివృద్ధి చేస్తాను. ఆ తర్వాత ఇన్వెస్టర్లను కలుస్తాను. డిసెంబర్లో ఇండియాకు కూడా వస్తున్నాను. నా ప్రాజెక్ట్ గురించి వివరిస్తే అక్కడ తగిన ప్రయోజనం దక్కుతుందని ఆశిస్తున్నాను.

ఈ ప్రయత్నంలో వైఫల్యాలు ఏమైనా ఎదురయ్యాయా ?

జీవితంలో ఏ మార్గంలో ప్రయాణించాలో తెలియక చాలా కాలం పాటు అభద్రతాభావంతోనే గడిపాను. కానీ సైన్స్ ఫెయిర్ల సాయంతో ఇంజినీరింగ్‌లో నాకున్న ఆసక్తిని గమనించాను. ఇంటెల్ అవార్డు నాపై చాలా సానుకూల ప్రభావాన్ని చూపించింది. నా ఆవిష్కరణలను ముందుకు తీసుకెళ్లడానికి, నా ఆలోచనలను ప్రపంచంతో పంచుకోవడానికి కావాల్సిన ఆత్మవిశ్వాసాన్ని నాకిచ్చింది. మీ వయసు చిన్నదా, పెద్దదా.. మీ ఆలోచన చిన్నదా ? పెద్దదా అన్నదానితో సంబంధం లేకుండా దానిని వాస్తవరూపంలోకి తీసుకెళ్లేందుకు మీరు ప్రయత్నిస్తున్నంత కాలం ప్రపంచం మిమ్మల్ని గుర్తిస్తూనే ఉంటుందన్న వాస్తవాన్ని తెలుసుకున్నాను.

చివరగా వర్ధమాన ఆవిష్కర్తలకు మీరిచ్చే సలహా ఏమిటి ?

యువత ‘ఎందుకు’ అన్న ప్రశ్నను పదేపదే వేసుకుంటూ ఉండాలి. భవిష్యత్తులో వచ్చే పేరు ప్రతిష్టల కోసం కాదు. ఈ ప్రపంచాన్ని మరింత మెరుగ్గా మార్చేందుకు అవసరమైన ఆవిష్కరణల కోసం క్రుషి చేయాలి. మీ ఆలోచనలకు ఎప్పుడూ పదును పెడుతూనే ఉండండి. మిమ్మల్ని మీరు రాటుదేల్చుకోండి.