మిషన్ కాకతీయను అధ్యయనం చేయబోతున్న ఇక్రిశాట్

0

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ కింద చెరువుల పునరుద్ధరణ ప్రక్రియలో పూడికతీత మట్టి ప్రభావాలపై ఇక్రిశాట్ అధ్యయనం చేయబోతోంది. భూగర్భ జలసంపద, స్టోరేజ్ కెపాసిటీ పెరుగుదల, బయో డైవర్సిటీ, పర్యావరణం తదితర అంశాలపై శాస్త్రీయ అధ్యయనానికి ప్రభుత్వం నిర్ణయించింది.

పూడికతీత వల్ల చెరువు నీటి నిల్వ సామర్ధ్యం పెరగడం, రసాయనిక ఎరువుల వాడకం తగ్గడం, పూడిక మట్టి వాడడం వల్ల కలుగుతున్న మేలు, పంటల దిగుబడి పెరగడం, రైతులు, ఇతర రంగాల వారి ఆర్ధిక పరిస్థితుల్లో వస్తున్న మార్పులు తదితర అంశాలపై ఇక్రిశాట్ స్టడీ చేస్తుంది.

మిషన్ కాకతీయ కింద తెలంగాణలోని 46,531 చెరువులలో ఇప్పటివరకు 17 వేల చెరువులను 1, 2 దశలలో పునరుద్ధరించింది. థర్డ్ ఫేజ్ కింద 5 వేల చెరువులను గ్రౌండింగ్ చేశారు. 6,100 చెరువులకు మూడవ విడతలో నిధులు మంజూరు చేశారు. అందులో 5 వేల చెరువుల పనులను ప్రారంభించారు. ఈ వివరాలను ఇక్రిశాట్ బృందానికి వివరించారు.

మిషన్ కాకతీయ రెండు విడతలలో 15 కోట్ల క్యూబిక్ మీటర్ల పూడిక మట్టిని రైతులు పొలాల్లో చల్లుకున్నారు. దాదాపు 8 కోట్ల ట్రాక్టర్ ట్రిప్పుల పూడిక మట్టిని రైతులు వాడుకున్నారు. పూడికతీతకు ముందు ఆ మట్టి వ్యవసాయానికి పనికొస్తుందా లేదా అనే విషయమై వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పరీక్షలు జరుగుతున్నట్టు ఇక్రిశాట్కి తెలిపారు. ఇప్పటివరకు పూడికతీత తొలగింపు కారణంగా 17 వేల చెరువుల్లో 6 టీఎంసీల నీటి నిల్వ సామర్ధ్యం పెరిగింది.

ఈ విషయంపై తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ, నీటిపారుదల శాఖలు, ఇక్రిశాట్ మధ్య త్రైపాక్షిక ఒప్పందం జరగనుంది. ఈ ఒప్పందం సందర్భంగా ఇక్రిశాట్ ఆధ్వర్యంలో ఒక వర్క్ షాప్ నిర్వహించాలని నిర్ణయించారు. రెండేళ్లలో సమగ్ర నివేదికను ప్రభుత్వానికి ఇక్రిశాట్ సమర్పించనుంది. ఈ లోగా మధ్యంతర నివేదికలు కూడా ఆ సంస్థ ఇవ్వనుంది.  

Related Stories

Stories by team ys telugu