అక్షరం ముక్క రాదు.. అయినా కోట్ల టర్నోవర్ బిజినెస్..!!

ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కేందుకు ముగ్గురు మహిళలు చేసిన ప్రయత్నం

అక్షరం ముక్క రాదు.. అయినా కోట్ల టర్నోవర్ బిజినెస్..!!

Thursday May 05, 2016,

4 min Read


కష్టించి పనిచేసేతత్వం, సాధించాలన్న పట్టుదల ఉండాలేగానీ… ఎంత పెద్ద సమస్యలకైనా పరిష్కారం దొరుకుతుంది. ఇదే విషయాన్ని రుజువు చేశారు రాజస్థాన్ లోని ధోల్ పూర్ కు చెందిన ముగ్గురు మహిళలు. అక్షరం ముక్కరాకపోయినా కంపెనీ పెట్టి తమతో పాటు నలుగురికి ఉపాధి కల్పిస్తున్నారు. ఒకప్పుడు తినేందుకు తిండిలేక నానా ఇబ్బందులు పడ్డ ఆ మహిళలు ఇప్పుడు కోట్ల టర్నోవర్ సాధించే కంపెనీని పరుగులు పెట్టిస్తున్నారు. వీళ్ల సక్సెస్ స్టోరీని తెలుసుకునేందుకు మేనేజ్ మెంట్ స్టూడెంట్స్ ఆ ఊరికి క్యూ కడుతున్నారు.

కష్టాలు మనిషిలో కొత్త ఆలోచనలు పుట్టిస్తాయి. సమస్య నుంచి గట్టెక్కే మార్గం చూపిస్తాయి. ధోల్ పూర్ జిల్లా కరీంపూర్ కు చెందిన అనిత, హరిప్యారీ, విజయ శర్మ విషయంలోనూ ఇదే జరిగింది. 11క్రితం అత్తారింట్లో అడుగుపెట్టిన ఈ ముగ్గురు మహిళలకు కష్టాలు స్వాగతం పలికాయి. ముగ్గురి భర్తలు పనిపాటా లేకుండా తిరిగేవారు. సంపాదన లేకపోడంతో రోజు గడవడం కష్టంగా మారింది. ఇరుగుపొరుగున ఉండే ఈ ముగ్గురు మహిళలను పరిస్థితులు స్నేహితురాళ్లుగా మార్చాయి. ఒకరి బాధ మరొకరితో పంచుకునే ఈ ముగ్గురు.. బతుకుబండి నడిపించేందుకు ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకున్నారు. ఊరిలో కొంతమంది సలహామేరకు గేదెలు కొని పాలు అమ్మాలని నిర్ణయించుకున్నారు. ఓ వడ్డీ వ్యాపారి దగ్గర ఆరు వేల రూపాయల చొప్పున అప్పు తీసుకుని గేదెలు కొన్నారు. వాటిని కొననైతే కొన్నారు గానీ, ఆ ముగ్గురి ఆర్థిక పరిస్థితిలో ఏమాత్రం మార్పురాలేదు. పాలవాడు రోజూ ఏదో ఒక సాకు చెప్పి కొనేందుకు నిరాకరించేవాడు. ఒకసారి ఫ్యాట్ తక్కువుందని అంటే, మరోసారి నీళ్లు కలిపారని మెలికలు పెట్టేవాడు. చివరకు సాయం చేస్తున్నట్లు నటిస్తూ ఎంతో కొంత డబ్బు ముట్టజెప్పి పాలు తీసుకెళ్లేవాడు. రోజులు గడుస్తున్నాయి. వడ్డీతో కలుపుకుని అప్పు పెరిగిపోతోంది. పాలవాడి తీరుతో విసిగిపోయిన ఆ ముగ్గురు మహిళలు.. ఓ రోజు స్వయంగా డెయిరీకి వెళ్లారు. అక్కడికెళ్లాక పాలవాడు ఇన్ని రోజులుగా తమను ఎంత మోసం చేస్తున్నాడో అర్థమైంది.

ఇక ఆ రోజు నుంచి ఆ ముగ్గురు పాలను స్వయంగా డెయిరీకి తీసుకెళ్లడం మొదలుపెట్టారు. కొన్ని రోజులు గడిచాక ఓ జీపును కిరాయికి మాట్లాడుకుని, తమ పాలతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో మిల్క్ సేకరించి డెయిరీకి సప్లై చేయడం ప్రారంభించారు. తెల్లవారు జామున మూడింటికే రంగంలోకి దిగి వెయ్యి లీటర్ల పాలు సేకరించేవారు.

image


అలా ప్రస్థానాన్ని ప్రారంభించిన ముగ్గురు స్నేహితురాళ్లు ఇక వెనుదిరిగి చూసుకోలేదు. పాలకు ఎక్కువ రేటు ఇవ్వడమే కాకుండా.. టైంకి పేమెంట్ ఇస్తుండటంతో చాలా మంది పాలు విక్రయించేందుకు ముందుకొచ్చారు. దీంతో ముగ్గురు కలిసి సొంతంగా మిల్క్ కలెక్షన్ సెంటర్ ను ప్రారంభించారు. తమ ఊరి వారితో పాటు చుట్టుపక్కల గ్రామాల వారంతా పాల సేకరణ కేంద్రానికి వచ్చి పాలు పోసి వెళ్లేవారు.

image


“పాల సేకరణ ఎక్కువకావడంతో వ్యాపారాన్ని విస్తరించాలనుకున్నాం. ఓ ఎన్జీఏ సాయంతో ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నాం. వారి సూచన మేరకు స్వయం సహాయక బృందాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మా కష్టాన్ని చూసి సాయం చేసేందుకు చాలామంది ముందుకొచ్చారు.”-హరిప్యారీ

వ్యాపార విస్తరణకు అవసరమైన పెట్టుబడి కోసం మళ్లీ వడ్డీ వ్యాపారుల వద్దకు వెళ్లలేదు. స్వయం సహాయక బృందం తరఫున బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్నారు. లక్ష రూపాయల పెట్టుబడితో 2013 అక్టోబర్ ఒకటిన అప్నీ సహేలీ ప్రొడ్యూసర్ పేరుతో కంపెనీ ప్రారంభించారు. మంజలి ఫౌండేషన్ అందిస్తున్న సాంకేతిక సహకారంతో కరీంపూర్ గ్రామంలో మిల్క్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. ఇందుకోసం నాబార్డ్ నుంచి 4లక్షల రూపాయల రుణం తీసుకున్నారు. చుట్టు పక్కల గ్రామాల మహిళల్ని ప్లాంటులో భాగస్వాముల్ని చేసుకునేందుకు వారికి షేర్లు అమ్మారు. ప్రస్తుతం కంపెనీలో 8వేల మంది మహిళలు షేర్ హోల్డర్లుగా ఉన్నారు. ఏడాదిన్నర వ్యవధిలోనే కంపెనీ విలువ కోట్ల రూపాయలకు చేరింది. బోర్డులో ప్రస్తుతం 11 మంది మహిళలు మెంబర్లుగా ఉన్నారు. అప్నీ సహేలీ గురించి తెలుసుకున్న రాజస్థాన్ ప్రభుత్వం.. మహిళల్ని మరింతగా ప్రోత్సహించేందుకు 5లక్షల రూపాయలు అందజేసింది. ఆ మొత్తాన్ని గ్రామాల్లో మహిళలకు రుణంగా ఇచ్చి వారని సహేలీ భాగస్వాములయ్యేలా చూడాలని సూచించింది.

image


“మొదట్లో మహిళలు ఇంటి నుంచి బయట అడుగుపెట్టేందుకు భయపడేవారు. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ధైర్యంగా జైపూర్, ఢిల్లీ వరకు వెళ్లగలుగుతున్నారు. మిల్క్ కలెక్షన్ సెంటర్ వల్ల మాకు ఉపాధి దొరకడమే కాకుండా నలుగురికి ఉపాధి కల్పిస్తున్నాం. ఇప్పుడు డబ్బు కోసం ఎవరి ముందు చేయి చాచాల్సిన దుస్థితి లేదు.”-విజయ శర్మ

గ్రామంలో పాలవాడు మహిళల నుంచి లీటరుకు 20 నుంచి 22 రూపాయలు ఇచ్చి పాలు కొనేవాడు. ఇప్పుడు కంపెనీ లీటరుకు 30 నుంచి 32రూపాయలు ఇస్తోంది. రేటు పెరగడంతో మహిళల ఆదాయం పెరిగింది. కంపెనీ లాభాల్లో షేర్ హోల్డర్లకు వాటా ఇస్తున్నారు.

మిల్క్ ప్లాంట్ ఏర్పాటుతో ఆదాయం నాలుగింతలైంది. అవసరం ఉన్నప్పుడు కంపెనీ నుంచి అడ్వాన్స్ కూడా తీసుకోవచ్చు. కంపెనీ పుణ్యమాని నా కూతుర్ని జైపూర్ లో 12వ తరగతి చదివిస్తున్నాను. ఇదంతా కంపెనీ చలువే అంటారు మిల్క్ ప్లాంట్ లో భాగస్వామైన కుసుమాదేవి.

ప్రస్తుతం 18 గ్రామాలకు చెందిన మహిళలు కంపెనీలో షేర్ హోల్డర్లుగా ఉన్నారు. ప్రతి గ్రామంలో వారి ఇళ్ల దగ్గరే మిల్క్ కలెక్షన్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. అక్కడకు మహిళలు స్వయంగా వచ్చి పాలు పోసి వెళ్తారు. గ్రామాన్ని మూడు భాగాలుగా విభజించి మూడు వాహనాల ద్వారా పాలను కరీంపూర్ ప్లాంట్ కు చేరుస్తాయి. ప్లాంట్ కార్యకలాపాలు చూసుకునేందుకు బ్రజ్ రాజ్ సింగ్ ను సీఈఓగా నియమించుకున్నారు. ఆయనకు నెలకు 20వేల రూపాయల జీతం ఇస్తున్నారు.

“అనిత, హరిప్యారీ, విజయ శర్మ కారణంగా పురుషుల ఆలోచన విధానంలో మార్పు వచ్చింది. గతంలో పురుషులు మహిళల్ని ఇంటి గడప దాటనిచ్చేవాళ్లు కాదు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. మగాళ్లే ఇప్పుడు మహిళల్ని వెన్ను తట్టి ప్రోత్సహిస్తున్నారు.”- బ్రజ్ రాజ్ సింగ్, ప్లాంట్ సీఈఓ

ఆర్థిక సమస్యల నుంచి బయటపడేందుకు ముగ్గురు స్నేహితురాళ్లు చేసిన ప్రయత్నం వారికి కొత్త జీవితాన్ని ఇచ్చింది. చుట్టుపక్కలున్న 18 గ్రామాల మహిళల తలరాత మార్చింది. కష్టాలు ఎదురైనప్పుడు వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలి. అప్పుడే విజయం వరిస్తుంది. ఈ ముగ్గురు స్నేహితురాళ్లు చేసింది అదే. కష్టాల్లో ఉన్నామని ఏడుస్తూ కూర్చొకుండా వాటి నుంచి బయటపడే ప్రయత్నం చేశారు. ఆత్మ విశ్వాసంతో ముందుకు నడిచారు. కంపెనీ పెట్టి కోట్ల రూపాయల టర్నోవర్ సాధిస్తున్నారు. ఇంట్లో మహిళలు సాధికారత సాధిస్తే కుటుంబంలో సుఖ సంతోషాలకు కొదవుండదని చెప్పేందుకు ఈ ముగ్గురి జీవితమే ప్రత్యక్ష ఉదాహరణ.