ఒకప్పుడు గోల్ఫ్ కోర్సులో కూలీ...ఇప్పుడదే చోట ఛాంపియన్!!

ఒకప్పుడు గోల్ఫ్ కోర్సులో కూలీ...ఇప్పుడదే చోట ఛాంపియన్!!

Sunday January 24, 2016,

3 min Read

గోల్ఫ్. ధనికులు మాత్రమే ఆడే ఆట. సంపన్నుల కాలక్షేపం కోసమే ఆ గేమ్. సామాన్యులు ఆటవైపు కూడా తొంగి చూసే సాహసం చేయరు. అలాంటి ఆటలో.. కూలీకి వెళ్తే తప్ప కుటుంబాన్ని పోషించలేని ఓ కుర్రాడు ఇంటర్నేషనల్ స్టార్ అయ్యారంటే నమ్మగలరా? 

తోచినట్టుగా అందరి రాతను బ్రహ్మ రాస్తాడు. నచ్చినట్టుగా నీ తలరాతను నువ్వే రాయాలి అన్నారో సినీకవి. ఎస్ చిక్కరంగప్ప జీవితం కూడా అలాంటిదే. ఏ గోల్ఫ్ రిసార్ట్ లో కూలీగా అయితే జీవితాన్ని మొదలుపెట్టాడో అదే గోల్ఫ్ కోర్టులో ఛాంపియన్ గా కాలర్ ఎగరేశాడు. 

చిక్క రంగప్ప. అతని జీవితం వెనుక ఎన్నో కష్టాలున్నాయి. మరెన్నో కన్నీళ్లున్నాయి. విజయం ఎప్పుడూ సులువుగా చేతికి అందదు. చిక్కరంగప్పకు కూడా అంతే. ఎంతో నిరంతర కృషి, అంతులేని పట్టుదల, విజయకాంక్ష. అన్నీ కలిసి అతడిని ఈ స్థాయిలో నిలబెట్టాయి. ప్రస్తుతం చిక్క రంగప్ప ప్రపంచ గోల్ఫ్ క్రీడాకారుల్లో ఓ యువ సంచలనం. ది బెటర్ ఇండియా కథనం ప్రకారం సుజ్జన్ సింగ్ తర్వాత ఏషియన్ డెవలప్ మెంట్ టూర్ గెలుచుకున్న సెకండ్ ఇండియన్.

image


బెంగళూరు సమీపంలోని బిదాడి గ్రామంలో అత్యంత నిరుపేద కుటుంబంలో జన్మించాడు చిక్క రంగప్ప. పదేళ్ల వయస్సులోనే కుటుంబ భాద్యతల్ని భుజానికెత్తుకున్నాడు. కుటుంబ పోషణ కోసం ఊరి దగ్గర్లో ఉన్న ఓ గోల్ఫ్ రిసార్ట్ లో దినసరి కూలీగా చేరాడు. అక్కడ సంపన్నులు గోల్ఫ్ ఆడటం గంటల తరబడి చూసేవాడు. అలా ఆ ఆటపై ఇష్టం పెరిగింది. కానీ గోల్ఫ్ ఆడాలంటే చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం. కనీసం స్టిక్ కొనాలన్నా వేల రూపాయలు కావాలి. రోజంతా పనిచేస్తే యాభై రూపాయలు సంపాదించే- చిక్కరంగప్ప గోల్ఫ్ స్టిక్ కొనగలడా? 

ఏదైనా సాధించాలంటే పట్టుదల కావాలి. చిక్కరంగప్పకు అలాంటి పట్టుదలే ఉంది. ఓ చెట్టు కొమ్మను గోల్ఫ్ స్టిక్ గా ఉపయోగించేవాడు. దాంతోనే రోజూ గోల్ఫ్ ఆడేవాడు. అలా ఆడుతూ ఆడుతూ గోల్ఫ్ తో ప్రేమలో పడిపోయాడు. దాచుకున్న డబ్బులతో ఓ గోల్ఫ్ స్టిక్ కొనుక్కొని ఆడటం మొదలుపెట్టాడు. ఓసారి అతడి ఆటతీరు కోచ్ విజయ్ దివెచను అబ్బుర పరిచింది. చిక్కరంగప్పలో ఓ కూలీని కాదు- కాబోయే గోల్ఫ్ స్టార్ ను చూశాడు కోచ్ విజయ్. ప్రొఫెషనల్ స్పోర్ట్స్ ఆడతావా అని చిక్కాను అడిగాడు విజయ్. ఆశ్చర్యపోయిన చిక్కరంగప్ప... తనది నిరుపేద కుటుంబం కావడంతో మొదట్లో అయిష్టత వ్యక్తం చేశాడు. చివరికి ఒప్పుకున్నాడు. కుటుంబాన్ని ఒప్పించాడు.

విల్లు విడిచిన బాణంలా...

మట్టిలో మాణిక్యాలంటారుగా. అదే టైపు చిక్క రంగప్ప. కానీ మాణిక్యాన్ని గుర్తించేవాళ్లు కావాలి. అప్పుడే దానికి విలువ. రంగప్పకు కోచ్ విజయ్ అలాగే దొరికాడని చెప్పాలి. అప్పట్నుంచీ అంకితభావంతో పూర్తిస్థాయిలో గోల్ఫ్ పై దృష్టిపెట్టాడు చిక్కా. ఇందుకోసం స్కూలుకు వెళ్లడం కూడా మానేశాడు. పదేళ్ల వయస్సులోనే రంగప్ప విజయ పరంపర మొదలైంది. తొలిసారి ఊటీలో ప్రొఫెషనల్ టోర్నమెంట్ లో పాల్గొని రెండో స్థానంలో నిలిచాడు. ఆ తర్వాత సంవత్సరంలో తాను కూలీగా పనిచేసిన ఈగల్ టన్ గోల్ఫ్ రిసార్ట్ లో మొదటి ట్రోఫీ గెల్చుకున్నాడు. ఇక అప్పట్నుంచి వెనుతిరిగి చూడలేదు. వరుసగా ట్రోఫీలను గెలుచుకుంటూ వస్తున్నాడు. ఇండియా జూనియర్స్ టోర్నీలను మూడు సార్లు, ఆలిండియా అమెచ్యూర్ గోల్ఫ్ ఛాంపియన్ షిప్ రెండు సార్లు గెలుచుకున్నాడు. 16 ఏళ్ల వయస్సులో ఇండియా అమెచ్యూర్స్ చాంపియన్ షిప్ గెలుచుకున్న యంగెస్ట్ గోల్ఫర్ గా రికార్డు సాధించాడు. రంగప్ప సాధించిన విజయాలతో తనకే కాదు తన ఊరికీ ఎంతో పేరొచ్చింది.

రాహుల్ ద్రవిడ్ అండదండలు

చిక్కరంగప్ప ఈ స్థాయికి ఎదగడం వెనుక క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ అండదండలున్నాయి. ఎందరో యువ క్రికెటర్లకు స్ఫూర్తిగా నిలిచిన రాహుల్... చిక్కరంగప్పకు గురువుగా మారాడు. బెంగళూరుకు చెందిన 'గో స్పోర్ట్స్ ఫౌండేషన్' మెంటర్ షిప్‌ ద్వారా చిక్కరంగప్పకు మంచి భవిష్యత్తును అందించాడు ద్రవిడ్.

"గతాన్ని వదిలేసెయ్. వర్తమానంలో జీవించు. గడుస్తున్న రోజుపైనే దృష్టిపెట్టు అని రాహుల్ సర్ నాకు చెప్పారు. ఆ మాటలు నాలో ఎంతో స్ఫూర్తిని నింపాయి" అంటూ ద్రావిడ్ గురించి చెబుతాడు చిక్కరంగప్ప.

గోల్ఫ్. అసలే సంపన్నుల ఆట. తోటి క్రీడాకారులంతా గడగడా ఇంగ్లీషులో మాట్లాడుతారు. కానీ చిక్కా. నిరుపేద కుటుంబంలో పుట్టాడు. గోల్ఫ్ కోసం చదువునూ దూరం చేసుకున్నాడు. ఎక్కడికెళ్లినా ఇంగ్లీష్ భాష సమస్యగా మారేది. కానీ ఎంతో పట్టుదల ఉన్న చిక్క- రెగ్యులర్ ప్రాక్టీస్ తో ఇంగ్లీష్ సమస్యను కూడా అధిగమించాడు. ఏదైనా సాధించాలంటే... కృషి, పట్టుదల, అంకితభావం ఉండాలి కానీ... ఆర్థిక సమస్యలు, కుటుంబ నేపథ్యం అడ్డంకి కాదని చిక్కా బలంగా నమ్ముతాడు.