బొల్లాంట్ ఇండస్ట్రీస్ లో రతన్ టాటా పెట్టుబడులు

Monday February 22, 2016,

2 min Read

స్టార్టప్స్ లో పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా పెట్టుబడుల పరంపర కొనసాగుతోంది. ఈ-కామర్స్,హెల్త్ కేర్, ఫుడ్, ఫైనాన్స్, టెక్నాలజీ, క్లీన్ ఎనర్జీ వంటి సెక్టార్స్ లో ఇప్పటివరకూ ఇరవైకి పైగా స్టార్టప్స్ లో పెట్టుబడులు పెట్టి అందర్నీ ఆశ్చర్యపరిచిన రతన్ టాటా లేటెస్ట్ గా హైదరాబాద్ బేస్డ్ బొల్లాంట్ ఇండస్ట్రీస్ లో ఇన్వెస్ట్ మెంట్ తో మాన్యుపాక్చరింగ్ రంగంలోనూ అడుగుపెట్టారు.

అంధుడైన శ్రీకాంత్ బొల్లా 2012 లో స్టార్ట్ చేసిన బొల్లాంట్ ఇండస్ట్రీస్ ఎకో ప్రెండ్లీ పేపర్ అండ్ బయో డిగ్రేడబుల్ ప్రోడక్ట్స్ తయారీ తో వందల మంది వికలాంగులకు ఉపాధి కల్పిస్తోంది. లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో ఫస్ట్ రౌండ్ ఫండింగ్ లో 9 కోట్ల పెట్టుబడులు సేకరించిన సంస్థ.. సెకండ్ రౌండ్ లో మరో పదమూడు కోట్ల రూపాయలను పెట్టుబడుల ద్వారా సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు యువర్ స్టోరీ ఇంటర్వూ లో సీఈవో శ్రీకాంత్ తెలిపారు. ఫస్ట్ రౌండ్ లో పెట్టుబడులు పెట్టినవారిలో ఏంజిల్ ఇన్వెస్టర్స్ రవి మంతా, ఎస్ఎల్ఎన్ టెర్మినస్ ఎస్పీ రెడ్డి,జీఎంఆర్ గ్రూప్ కిరణ్ గాంధీ, డాక్టర్ రెడ్డీస్ లాబోరెటరీస్ సతీష్ రెడ్డి, పీపుల్స్ కాపిటల్ శ్రీనిరాజు వంటి పలువురు ప్రముఖులు ఉన్నారు. రవి మంతా ప్రస్తుతం బొల్లాంట్ ఇండస్ట్రీస్ కి డైరెక్టర్ గా కూడా వ్యవహరిస్తున్నారు.

ప్రస్తుతం బొల్లాంట్ ఇండస్ట్రీస్ కు తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఐదు ప్రొడక్షన్ ప్లాంట్స్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసిటీ సెజ్ లో త్వరలోనే మరో మెగా ప్లాంట్‌ను శ్రీకాంత్ ప్రారంభించబోతున్నారు. ఐదు ప్లాంట్లలో మొత్తం 400 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రారంభం నుంచి ప్రతినెలా 20 శాతం సేల్స్ పెరుగుతున్నట్టు కంపెనీ చెబుతోంది. ప్రస్తుతం 50 కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీ- 14 కోట్ల ఏంజెల్ ఇన్వెస్ట్ మెంట్ తో రాబోయే రెండున్నరేళ్లలో 100 కోట్ల రెవెన్యూ అందుకోవాలనే లక్ష్యంగా పనిచేస్తోంది.

“ఇండియా లో ప్యాకేజింగ్ ఇండస్ట్రీ అనేది ముక్కలు ముక్కలుగా కుటీర పరిశ్రమ స్థాయిలోనే ఉంది. ఈ రంగంలో ఎంత మందికైనా ఎదిగేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. సరికొత్త అభివృద్ది ప్రణాళికలతో రాకెట్ వేగంతో దూసుకుపోతున్న మా సంస్థకు ఈ కొత్త పెట్టుబడులు నూతనోత్తేజాన్ని ఇస్తాయి".-శ్రీకాంత్ బొల్లా.