సామాన్యులకు చేరువైన 'సన్ కింగ్'

వారి ప్రయత్నంతో పిల్లల చదువుకునే సమయంలో 75 శాతం పెరుగుదల కనిపించింది. పేద ప్రజల కుటుంబ ఆదాయం 25 శాతం పెరిగింది. వారి ఉత్పత్తులు వినియోగించే వారు ఇప్పుడు సురక్షితంగా ఉన్నామన్న ధైర్యంతో ఆనందమయ జీవనం గడుపుతున్నారు. ముగ్గురు మిత్రుల ముచ్చటైన ఈ సంస్థే గ్రీన్ లైట్ ప్లానెట్.

సామాన్యులకు చేరువైన 'సన్ కింగ్'

Tuesday June 23, 2015,

4 min Read

ప్రపంచ జనాభాలో ఐదోవంతు జనానికి పొద్దు గూకితే కాలరాత్రే. నూట యాభై కోట్ల మంది జనం కరెంట్ దీపానికి నోచుకోలేదు. అభివృద్ధి చెందుతున్న ఆసియా దేశాల్లోనూ.. సబ్ సహారన్ ఆఫ్రికా దేశాల్లోను 95 శాతం మంది ఆధునిక ఇంధన వనరులు లేకుండానే కాలం వెళ్లదీస్తున్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో సగటు విద్యుదీకరణ 77 శాతంగా ఉంది. పట్టణ ప్రాంతాల్లో అది 91 శాతానికి పెరిగితే.. గ్రామీణ ప్రాంతాల్లో 65 శాతానికి పరిమితమైంది. ఇండియాలో 35 కోట్ల మంది భారత్ వెలిగిపోతోంది అనే పాటకు నృత్యం చేయలేని పరిస్థితి. ఇంటి దీపం వెలిగేందుకు స్విచ్ నొక్కలేని దుస్థితిని ఎదుర్కొంటున్నారు. ఇలాంటి గణాంకాలు చదివితే వేసవిలో కూడా వెన్నులో చలి పడుతుంది. ఆగండాగండి, కాస్త ఆగండి అన్ని దుర్వార్తలు అనుకుంటే పొరపాటే. మీకు శుభ వార్త కూడా చెబుతాం. సన్ కింగ్ పేరుతో సోలార్ రీఛార్జిబుల్ ఎల్.ఈ.డీ లైట్లు ఇప్పటికే 39,20,267 ఇళ్లలో వెలుగులనిస్తున్నాయి. సౌర శక్తి పరికరాలతో జనం సురక్షితంగా ఉండగలుగుతున్నారు. అగ్నిప్రమాదాలు జరగవని నమ్ముతున్నారు. రాత్రి పూట నిశ్చింతగా గడుపుతున్నారు.

image


సౌర శక్తి పరికరాల ఆలోచన 2005లో మొలకెత్తింది. ఇలినాయ్ విశ్వవిద్యాలయానికి చెందిన ఎలక్ర్టికల్ ఇంజనీరింగ్ విద్యార్థులు.. ప్యాట్రిక్ వాల్ష్, మయాంక్ శేక్సారియా, అనిష్ టక్కర్‌లు కలిసి ఈ ప్రయత్నం చేశారు. లక్షల ఇళ్లలోవెలుగు నిస్తామని అప్పట్లో వారికి తెలీదు.

ఇంజనీర్స్ వితవుట్ బోర్డర్స్‌తో కలిసి ప్యాట్రిక్ ఒక సారి వేసవిలో ఒడిశా వచ్చారు. వ్యవసాయ రంగంలో పనికొచ్చే బయో డీజిల్ జనరేటర్లను ఏర్పాటు చేసే ఉద్దేశంతో ఆయన వచ్చారు. కొంత కాలానికి స్థానికులు వాటిని ఇళ్లలో విద్యుత్ అవసరాల కోసం వాడుకోవడం కనిపించింది. ఇదే అనుభవం సౌర దీపం నమూనా తయారు చేసేందుకు దారి తీసింది. అనిష్ టక్కర్‌... ఈ నమూనాతో సీడ్ ఫండింగ్ కోసం ప్రయత్నించారు. జెడ్.ఎస్. సహ వ్యవస్థాపకుడైన తన మాజీ బాస్ డాక్టర్ సిన్హాను ఆయన సీడ్ ఫండ్ అడిగారు. తర్వాత మరో దశ స్వల్ప స్థాయి పెట్టుబడిని కూడా డాక్టర్ సిన్హా అందించారు. 

2008 శీతాకాలంలో అనిష్ , మయాంక్ ఇండియా వచ్చేశారు. గ్రీన్ లైట్ ప్లానెట్ వ్యాపారాన్ని అభివృద్ధి చేయడం ప్రారంభించారు. ప్యాట్రిక్ చైనాలోని షెన్జెన్ లో ఉంటూ అక్కడి వ్యాపార కార్యకలాపాలు చూసుకుంటున్నారు. 31 దేశాల్లో విద్యుత్ కు నోచుకోని మారుమూల ప్రదేశాల్లో గ్రీన్ లైట్ సేవలు అందిస్తోంది.

సామాన్యులు కొనే రేటుకు ఇవ్వడమే సక్సెస్ మోడల్

అందరూ కొనుక్కోగలిగినంత తక్కువ ధరకే విద్యుత్ దీపాలు అందించడం గ్రీన్ లైట్ ప్లానెట్ వ్యాపార రహస్యం. జనానికి దాతృత్వం అవసరం లేదు. వాళ్లు కొనుక్కోగలిగిన రేటుకు ఇస్తే చాలు. సబ్ సహారన్ ఆఫ్రికాతో పాటు అభివృద్ధి చెందుతున్న ఆసియా దేశాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో జనం కొనుక్కోగలిగిన స్థాయిలో విద్యుత్ దీపాలు అందించడమే వీరి ముఖ్యోద్దేశం. ప్రస్తుతం యాభై శాతం విక్రయాలు ఆఫ్రికా దేశాల్లోనే జరుగుతున్నాయి అక్కడ స్థానిక కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకుని మారు మూల ప్రదేశాల్లోనూ వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఆఫ్రికా ఖండంలో పునరుత్పాదక విద్యుత్ అవసరాలను చూస్తే…. కంపెనీ విస్తరణ ప్రణాళిక సరైన దిశలోనే సాగుతున్నట్లు భావించాలి.

సన్‌కింగ్ పనిచేసే తీరు

ఛార్జింగ్ అయ్యేందుకు వీలుగా సన్‌కింగ్ లాంతర్‌ను రోజంతా సూర్యరశ్మిలో ఉంచాలి. రాత్రి పూట వెలుతురు కోసం, సెల్ ఫోన్ ఛార్జింగ్ కోసం దాన్ని వాడుకోవచ్చు. సన్ కింగ్ ఉత్పత్తులు నాలుగు రకాల్లో ప్రతీ రకానికి మూడు రీతుల్లో అందుబాటుకు వచ్చాయి. తక్కువ శక్తిమంతమైన టార్చ్ మొదటి రీతిగా చెప్పొచ్చు. ఒక రోజంతా ఛార్జ్ చేస్తే 16 గంటలు వెలుగునిస్తుంది. రెండోది మధ్యస్థ స్థాయి లాంతరు. అది పదహారు గంటలు వెలుగునిస్తుంది. మూడోది హై పవర్ టర్బో ల్యాంప్. అది శక్తిమంతమైన వెలుగును నాలుగు గంటల పాటు అందిస్తుంది. సన్‌కింగ్ ఉత్పత్తిని చేతిలో పట్టుకుని ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. నీటిలో తేలియాడే గుణం కూడా ఉంది. దానికి బహుళార్థ ప్రయోజనం ఉంది. టేబుల్ మీద పెట్టుకునే దీపంగా వాడుకోవచ్చు.ఇంటి పైకప్పుకు వేలాడదీసుకోవచ్చు. నడిచి వెళ్లేప్పుడు టార్చ్ లైటుగా ఉపయోగపడుతుంది. దీని బ్యాటరీ ఐదేళ్ల పాటు పనిచేస్తుంది.

అనిష్ టక్కర్, గ్రీన్ లైట్ సంస్థ సహ వ్యవస్థాపకులు

అనిష్ టక్కర్, గ్రీన్ లైట్ సంస్థ సహ వ్యవస్థాపకులు


గ్రీన్ లైట్ ప్లానెట్ ముఖ్యాంశాలు

  • అత్యుత్తమ ఉత్పత్తి- 2009 నుంచి గ్రామీణ ప్రాంతాల్లో పద్నాలుగు లక్షల సౌర దీపాలను , మొబైల్ ఛార్జర్లను విక్రయించారు.
  • గ్రామీణ ప్రాంతాల్లో విస్తరణ – వాణిజ్య సంస్థలు చేరుకోలేని ప్రదేశాలకు సైతం స్వంత మార్కెటింగ్ వ్యవస్థలతో గ్రీన్ లైట్ ప్లానెట్ చేరుకోగలుగుతోంది. నేరుగా గ్రామీణ ప్రాంత ప్రజలకు అందుబాటుకు వస్తోంది.
  • ఉద్యోగులు- 2014 ఆఖరుకు స్థానికంగా శిక్షణ పొందిన 25 వేల మంది సేల్స్ అసోసియేట్స్ ఉన్నారు. ప్రస్తుతం ఆరువేల మంది విక్రయ బృందం ఉంది. వారికి తోడు 800 మంది ఫుల్ టైమ్ ఉద్యోగులున్నారు.
  • వినియోగదారులకు సేవలు – వినియోగదారులకు విలువ ఇచ్చే అవకాశం లేని ప్రదేశాల్లో కూడా అసాధారణ కస్టమర్ సర్వీస్ అందిస్తున్న అత్యుత్తమ సంస్థ గ్రీన్ ప్లానెట్.
  • అవార్డులు – 2014 ఆష్డేన్ అవార్డుల్లో గ్రీన్ లైట్ ప్లానెట్ ఫైనల్ కు చేరుకుంది.
  • భాగస్వామ్యాలు – టోటల్, వన్ యాకర్ ఫండ్, ఫుల్లర్టన్ ఇండియా లాంటి నమ్మకమైన సంస్థలతో గ్రీన్ ప్లానెట్ భాగస్వామ్య ఒప్పందాలు చేసుకుంది.
చీకటిని చీల్చే ఆ వెలుగుల్లో నే భవిష్యత్తుకు బాటలు

చీకటిని చీల్చే ఆ వెలుగుల్లో నే భవిష్యత్తుకు బాటలు


సన్‌కింగ్ – సాంఘిక, ఆర్థిక ప్రభావం

650 రూపాయలతో ప్రారంభమయ్యే సన్ కింగ్ ల్యాంప్స్‌ను ఈ కంపెనీ విక్రయిస్తుంది. కిరోసిన్ వినియోగాన్ని తగ్గించుకుని.. రాత్రి పొద్దుపోయిన తర్వాత వెలుతురును పొందుతూ వినియోగదారులు ప్రయోజనాన్ని అందుకుంటున్నారు. కిరోసిన్ దీపపు వెలుగులో కలుషిత వాయువులు పీల్చుకుండా సన్ కింగ్ దీపాలు వాడుతూ జనం ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. గ్లోబల్ బర్డన్ ఆఫ్ డిసీస్ అధ్యయనం ప్రకారం వంటచెరకు, కలప కాల్చడం వల్ల వచ్చే శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో ఏటా 35 లక్షల మంది చనిపోతున్నారు. మృతుల్లో మహిళలు, పిల్లలే ఎక్కువ మంది ఉంటున్నారు. మలేరియాతో 12 లక్షల మంది చనిపోతుంటే.. ఎయిడ్స్‌తో 15 లక్షల మంది చనిపోతున్నారు. శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో చనిపోయే వారి సంఖ్య ఇంతకు రెట్టింపు ఉంది. ఈ దీపాలు వాడటం వల్ల ఆర్థిక ప్రయోజనం కూడా ఉంది. ప్రత్యక్ష విక్రయ పద్దతిలోనే గ్రీన్ లైట్ ప్లానెట్ తన ఉత్పత్తులను పంపిణీ చేస్తుంది. సాథీలు అని పిలిచే పంపిణీదారుల నెలవారీ ఆదాయం 34 శాతం పెరగడంలో ఈ సంస్థ తన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించింది. సాథీలు నమ్మకంగా పనిచేసి గ్రామీణ ప్రాంతాల్లో విక్రయాలు జరపడం వల్ల ప్రకటనల వ్యయం కూడా తగ్గించగలిగారు. సరైన, చవకైన ఇంధన వనరులతో ఆధునిక మానవ అభివృద్ధి సాధ్యం. 

ప్రపంచంలో విద్యుత్ సరఫరాకు నోచుకోని వారి సంఖ్య 150 కోట్లు దాటింది. ఇదీ మనిషికి కనీస అవసరం. సంపదను సృష్టించాలన్నా, సామాజికాభివృద్ధి సాధించాలన్న విద్యుత్ అనివార్యం. అందుకే గ్రీన్ లైట్ ప్లానెట్ కు శుభాకాంక్షలు, శుభాశీస్సులు అందించడంలో మాతో కలిసి రండి. మీ స్పందన కోసం వేచి ఉంటాం.