ఈ డాక్టర్ రక్తహీనతకు చేపమందు కనుగొన్నాడు..!!  

0

అస్తమాకు చేపమందు విన్నాం, చూశాం..

కానీ రక్తహీనతకు కూడా చేపమందా..

అని ఆశ్చర్యపోతున్నారా..?

ఏటా మృగ‌శిర‌ కార్తెలో హైదరాబాద్ బత్తిన బ్రాండ్ చేపమందు హడావిడి మనకు తెలిసిందే. చిన్నచిన్న కొర్రమీను పిల్లలను మింగడానికి అనేక రాష్ట్రాల వాళ్లు సద్ది సంకన పెట్టుకుని వచ్చే విషయం మనకు తెలిసిందే. చేపమందులో శాస్త్రీయత వుందా లేదా అన్న చర్చ పక్కన పెడితే, చేపపిల్లలు మింగడానికి చిన్నాపెద్దా అన్న తేడా లేకుండా అస్తమా పేషెంట్లు బారులు తీరుతారు. అయితే కాసేపు అస్తమా సంగతి అలా వుంచితే.. ఇక్కడ ఒక కెనడా డాక్టర్ అచ్చం అలాంటి చేపమందే కనుగొన్నాడు. కానీ అస్తమాకు కాదు. రక్తహీనతకు. విషయం ఏంటో మీరే చదవండి.

మారుతున్న ఆహారపు అలవాట్లు మానవాళిని కుంగదీస్తున్నాయి. ముఖ్యంగా ఇనుము లోపం ప్రపంచ జనాభాను పట్టిపీడిస్తున్నది. 2.5 బిలియన్ల మందిలో ఎక్కువ శాతం మహిళలు ఐరన్ డెఫిషియెన్సీతో రకరకాల సమస్యలు ఫేస్ చేస్తున్నారు. ఇనుము లోపిస్తే ఆటోమేటిగ్గా రక్తం కూడా తగ్గిపోతుంది. ఎందుకంటే హిమోగ్లోబిన్ తయారీలో ఐరన్ కీలక పాత్ర పోషిస్తుంది కాబట్టి. ఏకాగ్రత తగ్గిపోతుంది. నీరసం కమ్మేస్తుంది. చీటికీ మాటికీ చికాకు ప్రదర్శిస్తుంటారు. ఇనుము లోపం ఎక్కువగా ఉంటే జుట్టు అధికంగా రాలిపోతుంది. థైరాయిడ్ పనితీరు తగ్గిపోతుంది. హిమోగ్లోబిన్ తగ్గడం వలన చర్మం నిగారింపు కోల్పోతుంది. పెదాలు పాలిపోయి, చిగుళ్లు తెల్లగా అయిపోతాయి. నాడీవ్యవస్థకు రక్తం తగుమోతాదులో అందకపోవడంతో హైపర్ టెన్షన్ వస్తుంది. ప్రపంచ మానవాళిని పట్టిపీడిస్తున్న సమస్యలో ఇదొకటి.

ఇలాంటి సమస్యకు సింపుల్ సొల్యూషన్ కనుగొన్నాడు కెనడాకు చెందిన ఆంట్రప్రెన్యూర్ డా. గెవిన్ ఆర్మ్ స్ట్రాంగ్. 29 ఏళ్ల ఈ కెనడియన్ ఆవిష్కరించిన మందు పేరు వింటే ఆశ్చర్యపోతారు. లక్కీ ఐరన్ ఫిష్. ఇదే డా. గెవిన్ ఆవిష్కరణ. వాడకం కూడా చాలా సింపుల్. సూప్ లాంటి బ్రాత్ బేస్డ్ మీల్.. అంటే టొమాటో సూప్, మిక్స్ డ్ మష్రూమ్ సూప్, చికెన్ సూప్ లాంటి వాటితో ఈ చేపను కాసేపు ఉడకబెట్టాలి. దాంట్లో కాస్త నిమ్మరసం పిండాలి. వెంటనే దాన్నుంచి కొద్దిపాటి ఆమ్లం విడుదలై సూప్ లోకి ఇంకుతుంది. తర్వాత చేపను బయటకి తీసి కడిగేసి పక్కన పెట్టుకోవాలి. సూప్ తాగాలి. ఇలా ఒకసారి వాడిన చేప ఐదేళ్ల దాకా పనికొస్తుంది. పదే పదే కొనాల్సిన అవసరం లేదు.

2012లో మొదటిసారిగా కాంబోడియాలో ఐరన్ లోపం ఉన్నవారిపై ఈ ఫిష్ లాబ్ టెస్ట్ చేశారు. 50 శాతం వరకు మెరుగైన ఫలితాలు కనిపించాయి. తర్వాత 2014లో ప్రాడక్ట్ ను అఫీషియల్ గా లాంఛ్ చేశారు. మొదట్లో కొనడానికి ఎవరూ ముందుకు రాలేదు. కానీ ఇవాళ గంటకు కనీసం 100 చేపలు అమ్ముడవుతున్నాయి. ఇప్పటిదాకా 70వేలకు పైగా చేపల్ని అమ్మినట్టు డా. గెవిన్ తెలిపారు.

దీర్ఘకాలిక రుగ్మతను నయం చేసే మందును కనుగొన్న డా. గెవిన్.. ఫోర్బ్స్ 30 అండర్ 30 జాబితాలో సోషల్ ఆంట్రప్రెన్యూర్స్ 2016 గా ఎంపికయ్యాడు. ఈ కెనడియన్ ఆశయం ఒక్కటే. ప్రపంచంలో ఎవరూ ఇనుము లోపంతో బాధపడకూడదు. ఆ లక్ష్యం దిశగానే నా ప్రయాణం అంటున్నాడు.   

Related Stories