కార్పొరేట్ ఉద్యోగంలో ఉన్నత స్థాయికి చేరడం ఎలా ?

దర్శనపాయ్ విజయసూత్రాలువర్చూసా వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్న దర్శనాకుటుంబం, క్లైంట్లు, ఉద్యోగులను ఎలా మేనేజ్ చేయాలి ? కార్పొరేట్ ఉద్యోగంలో విజయతీరాలను చేరడం ఎలా ?

కార్పొరేట్ ఉద్యోగంలో ఉన్నత స్థాయికి చేరడం ఎలా ?

Wednesday July 22, 2015,

5 min Read

దర్శనపాయ్... వర్చూసా వైస్ ప్రెసిడెంట్, హైదరాబాద్ డెలివరీ ఫంక్షన్స్‌కి హెడ్‌గా కూడా సేవలందిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా టెక్నాలజీ సర్వీసెస్ అందిస్తున్న సంస్థగా వర్చుసా ప్రసిద్ది. అమెరికా, యునైటెడ్ కింగ్డమ్, యూరోపియన్ యూనియన్, తూర్పుమధ్య ఆసియాలో ఉన్న కస్టమర్లకు ఐటీ పరిష్కారాలను అందిస్తుందీ సంస్థ. వినియోగదారులకు సంతృప్తికరమైన సేవలందించడం, ఉద్యోగులను నియమించడం, వర్చూసా కార్యాలయాన్ని అభివృద్ధి చేయడం ప్రస్తుతం దర్శనపాయ్ బాధ్యతలు.

దర్శనకి ఐటీ సంస్థల్లో వివిధ స్థాయిల్లో వైవిధ్యభరితమైన వృత్తినైపుణ్యం ఉంది. గడచిన 20 సంవత్సరాల్లో విప్రో, కేప్‌జెమినీ, పట్నీ కంప్యూటర్స్ వంటి సంస్థల్లో నాయకత్వస్థాయిలో కీలక బాధ్యతలు నిర్వహించిన అనుభవజ్ఞురాలు. పెద్ద టీమ్‌లను లీడ్ చేయడం, మిలియన్ డాలర్ల విలువ చేసే ఐటీ పరిష్కారాలు అందించేవారు. యూరొప్, అమెరికా, ఆస్ట్రేలియా, సింగపూర్, జపాన్ దేశాల్లో ఫినాన్స్, ఎనర్జీ అండ్ యుటిలిటీస్, ట్రావెల్ అండ్ లీజర్, లాజిస్టిక్స్ ఇంకా ప్రభుత్వ రంగ సంస్థలకు ఆమె తన బృందం ద్వారా రిటైల్ అండ్ సీపీజీ వినియోగదారులకు సేవలందించారు.

దర్శన పాయ్, వర్చూసా వైస్ ప్రెసిడెంట్, హైదరాబాద్

దర్శన పాయ్, వర్చూసా వైస్ ప్రెసిడెంట్, హైదరాబాద్


ఇండో అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇటీవలే ఆమెను ఉత్తమ మహిళా కార్పోరేట్ లీడర్‌గా సత్కరించింది. వర్చూసా ఖాతాదారులు ఎదుర్కొంటున్న వ్యాపార సమస్యలను తన అపార అనుభవం, పరిశ్రమ కోణంలో ఆలోచించి పరిష్కరించినందుకు గాను ఈ పురస్కారమిచ్చారు. ఆమె ముంబై యూనివర్శిటీలో బీఈ చేశారు. అనంతంరం ఐఐటీ ముంబై నుంచి మాస్టర్స్ డిగ్రీ పొందారు.

ఆమె తన గొప్ప కెరీర్‌ని ఎలా నిర్మించుకున్నారో.. ప్రతికూలతను ఎలా మలచుకుని ముందుకెళ్లారో యువర్ స్టోరీ.కామ్ కి వివరించారు.

బాల్యం-కుటుంబం

''నేను మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాను. ఉత్తమ విలువలు, చదువు గొప్పతనం తెలిసిన వారి మధ్య పెరిగాను. కుటుంబంలో అందరితో మంచి అనుబంధం ఉండేది. దాంతో పాటు చిన్నవయసు నుంచే స్వతంత్రంగా ఆలోచించడం నేర్పించారు. అందుకే నేను ఇవాళ తీసుకునే నిర్ణయాలు, ఎంపికలకు సంబంధించి వాటి ప్రభావం అమితంగా ఉందని చెప్పగలుగుతున్నాను. నా భర్త ఇండియన్ నేవీలో పనిచేస్తున్నారు. నాయకురాలిగా ఎదగడంలో నా తల్లిదండ్రులు, భర్త, కుమారుడు నిత్యం సహాయం చేస్తూ మద్దతుగా నిలుస్తున్నారు''.

కెరీర్ తొలి రోజుల్లో పాఠాలు

ఐఐటీ ముంబై నుంచి పట్టా తీసుకున్న తర్వాత పట్ని కంప్యూటర్స్లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా చేరాను. కాలేజీ నుంచి కార్పోరేట్ సంస్థకు వెళ్లడం నా జీవితంలో పెద్ద మార్పు. పెద్ద టీంలో పనిచేయడం, కార్పొరేట్ సంస్కృతి అక్కడే నేర్చుకున్నారు. యూఎస్‌లో లీడింగ్ CAD సాఫ్ట్‌వేర్ డిజైన్ కంపెనీ తయారు చేస్తున్న పెద్ద మైగ్రేషన్ ప్రోగ్రామ్‌లో నేనూ భాగస్వామిని. పట్నీలో ఎనిమిదేళ్లు ఉన్నాను. సాంకేతిక పోటీతత్వాన్ని పెంచుకున్నాను, దాంతోపాటు మేనేజ్మెంట్ స్కిల్స్‌ని మెరుగుపర్చుకున్నాను. 1999లో పట్నీ వదిలి బయటకొచ్చేసరికి ప్రాజెక్టు మేనేజర్‌గా వివిధ రకాల ప్రాజెక్టులు నిర్వహించే సామర్ధ్యాన్ని సంపాదించాను. కెరీర్ తొలినాళ్లలో నా ఫోకస్ అంతా కొత్త టెక్నాలజీని నేర్చుకోవడం, ఐటీ పరిశ్రమలో వచ్చిన న్యూ ట్రెండ్స్ తెలుసుకోవడంపైనే పెట్టాను. పలు సంస్థల్లో అవలంబిస్తున్న విధానాలను, మారుతున్న వ్యాపార పరిస్థితులను అనువర్తింపచేయడం నాకు తక్కువ కాలంలోనే కార్పోరేట్ లీడర్ గా ఎదగడానికి దోహదపడ్డాయి.

నా సిద్ధాంతమేంటంటే “మీ అభిరుచిని అనుసరించండి, సొంతబలాన్ని పెంచుకోండి. సరైన బృందం, ప్రాధాన్యత క్రమంలో పనులు ఉత్తమ ఫలితాలను తెచ్చిపెడతాయి. మనం ప్రజలతో ఎంత బాగా కలిసి పనిచేస్తామో అంత బాగా మన కెరీర్ నిర్మించుకోవచ్చు. How well one works with people makes or breaks one’s career. వినియోగదారుల అవసరాలను అర్థం చేసుకోవడంపై నాకున్న ఆసక్తి వారితో ధృడమైన సత్సంబంధాలు నిర్మాణానికి.. వారికి సంతృప్తికరమైన సేవలు అందించేందుకు సాయపడింది.

టెక్నికల్, మేనేజ్మెంట్ స్థాయిల్లో 12 సంవత్సరాల పాటు పనిచేసిన అనంతరం నేను ముంబైలో క్యాప్‌జెమినీలో ఉండగా.. యూకేలో కస్టమర్లకు పరిష్కారాలు చూపే బాధ్యతలు నిర్వర్తించాను. కోర్ డెలివరీ విధుల నుంచి నాయకత్వ బాధ్యతల్లోకి మారుతూ అప్పుడే తొలి అడుగు పడింది. ఆ కంపెనీలో రవాణా, లాజిస్టిక్స్, ప్రభుత్వ అంశాల నిర్వహణను చూసేదాన్ని. ఆవిష్కరణలు, విజయాలతో మేమంతా కలిసి ఆ సంస్థను రెండో దశలోకి తీసుకెళ్లాం, వర్చూసా వేగవంతమైన అభివృద్ధి ప్రయాణంలో నేనూ భాగస్వామిని అయినందుకు చాలా సంతోషంగా ఉన్నాను. అలాంటి కీలక సమయంలో సంస్థతో కొనసాగడం, నా వంతు పాత్ర పోషించడం గొప్ప అవకాశం.

అడ్డంకులే ముందుకు నడిపించాయి

నా భర్త నేవీలో పనిచేస్తారు, ప్రతీ ఐదేళ్లకోసారి ఆయకి వేరే చోటుకి బదిలీ అవుతుంటుంది. అయితే నా భర్త నేను కలిసి తీసుకున్న అతిపెద్ద నిర్ణయమేంటంటే ఎన్ని ప్రతికూలతలున్నా కార్పోరేట్ ఐటీ సెక్టార్‌లో నేను కొనసాగాలని. ఐదేళ్ల పాటు ఒకే సంస్థలో అదీ సమాచార సాంకేతిక రంగంలో పనిచేయడం పరిశ్రమలో నిలదొక్కుకోవడానికి, ఉన్నత శిఖరాలకు చేరుకోవడానికి మంచి సమయం. నేను ఇవాళ కీలక నాయకత్వ బాధ్యతల్లో ఉన్నానంటే సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం వల్లేనని నమ్ముతున్నాను. ముఖ్యంగా ఐదేళ్ల పరిమితి నన్ను పరిగెత్తించిందనే చెప్పాలి, త్వరత్వరగా నిర్ణయాలు తీసుకునేలా, ఉన్న సమయంలోనే వీలైనన్ని ఎక్కువ విషయాలు తెలుసుకునేలా చేసింది. ఇంత సాధించిన తర్వాత ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే నాగురించి, నాకు మద్దతుగా నిలిచిన నా కుటుంబం గురించి ఎంతో గర్వంగా ఫీలవుతుంటాను.

విజయానికి సోపానాలు

మీరు ఏది ఇష్టపడతారో అదే చేయండి. మనసు చెప్పేది వినండి. ఎంచుకున్న రంగంలో ఉత్తమంగా ఉండండి. సానుకూల దృక్పథం, పట్టుదల, ప్యాషన్ (Positive approach, Perseverance and Passion) విజయానికి కావాల్సిన ఈ మూడు P లను ఎప్పడూ మర్చిపోకండి..

వర్క్ లైఫ్ ..

ఎప్పుడూ శక్తివంచనలేకుండా కృషిచేయాలి, పనిలో ఉత్సాహంగా ఉండాలి. అలా చేసుకుంటూ పోతే కార్పోరేట్ సంస్థల్లో ఉన్నత స్థాయికి ఎదగడానికి ఎంతో సమయం పట్టదు. మీ జీవితంలో చాలా వర్క్ లైఫ్ మిగిలుండగానే పెద్ద బాధ్యతలు స్వీకరిస్తారు. మీ కలలు సాకారం చేసుకునేందుకు హై ఎనర్జీ లెవల్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. అందుకే ఏది మీ ఎనర్జీ లెవల్స్‌ని కాపాడుతుందో ఏ అంశం మిమ్మల్ని నిరాశ పరుస్తుందో ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. అన్ని వయసుల వారికి శారీరక వ్యాయామం తప్పనిసరి, నేను కూడా కఠిన వ్యాయామ నియమావళిని పాటిస్తుంటాను, అది నాలో శక్తి స్థాయిలు ఎప్పుడూ అధికంగా ఉండేందుకు సాయపడుతుంటుంది.

మీలో చైతన్యం నింపుకునేందుకు, శక్తిని కూడగట్టుకునేందుకు తగిన సమయం తీసుకోండి. అందుకోసం మీకు ఇష్టమైన వ్యాపకాన్ని ఎంపిక చేసుకోండి. సంగీతం, క్రీడలు, మొక్కల పెంపకం, ధ్యానం, ప్రయాణం , ఇవేవీ కాకపోయినా ఇంట్లోనే ఏమీ చేయకుండా విశ్రాంతి తీసుకోండి. దీని వల్ల మీరు చేయబోయే పనిపట్ల తాజా దృక్పదం ఏర్పడంతో పాటు, ఫ్రెష్‌గా ఫీలవుతారు, నూతనుత్తేజం నింపుకుంటారు. మీరు నిర్దేశించుకున్న లక్ష్యాన్ని పట్టుదలతో పూర్తిచేసేందుకు ఇది చాలా సహకరిస్తుంది. మిమ్మల్ని ఉత్తేజపరిచే వ్యక్తులు ఎప్పుడూ మీ చుట్టూ ఉండాలి, ప్రత్యేకించి సవాళ్లు ఎదురైనప్పుడు వాళ్లుంటే పట్టుదలతో అనుకున్నది సాధించేందుకు తోడ్పాటు అందిస్తారు.

సహాయాన్నికోరండి

మరొకరి సహాయం కోరే గుణం అందరికీ సహజంగా రాదు, ప్రత్యేకించి మహిళలకు ఆ అలవాటు తక్కువ, కాని మనమొక్కరమే ఆ పని పూర్తిచేయలేమని అనుకున్నప్పుడు తప్పకుండా ఇంకొకరి సాయం అర్ధించాలి. మనకంటూ బలమైన మద్దతు వ్యవస్థ ఉండాలి.

లీడర్‌షిప్ మంత్ర

మీ లక్ష్యాలు,విజయాలు నిరంతరం సమీక్షించుకోండి. స్వీయ అభివృద్ధిపై పెట్టుబడి పెట్టండి. మీ సొంత టీమ్ ని నిర్మించుకోండి, ఎందుకంటే అన్ని వేళలా అది అవసరమవుతుంది. టీమ్ సంగతి చాలా చాలా ముందుగానే చూసుకోవాలి, ఆ టీమ్ లో మీ కుటుంబం, వ్యక్తిగత,వృత్తి జీవితంలో స్నేహితులు, గురువులు ఉండాలి. వారే మీ జీవితాంతం ఎత్తుపల్లాలను గమనించి మార్గనిర్దేశం చేస్తారు.

మీకంటూ ఎప్పుడూ ఒక దృక్పదం కలిగుండాలి. ఒక అచీవర్ లా ఉండాలి, పనులు పూర్తయ్యేలా చూడాలి, చేరుకోగలిగే లక్ష్యాలు నిర్దేశించుకోండి, సవాళ్లతో కూడిన పనులను స్వీకరించండి. మీరు చేసిన ప్రతీ ప్రాజెక్టులో మీ ప్రత్యేకత తెలిసేలా ఉండాలి, ఫలానా ప్రాజెక్టు, ప్రాడక్టు లేదా సర్వీసు పేరు చెప్పగానే అందులో మీ సహకారం ఠక్కున గుర్తొచ్చేలా ఉండాలి.

విజయం చిన్నదైనా పెద్దదైనా సెలబ్రేట్ చేసుకోండి. అందులో ఎవరైనా బాగా కష్టపడితే వారికి తగిన గుర్తింపు ఇవ్వాలి, చేస్తున్న పని యొక్క ప్రయోజం ఉద్దేశాన్ని అంచనా వేసేందుకు సమయం కేటాయించాలి. అవసరమైతే అందులో మార్పులు చేయాలి. అది మీరే చూసుకోవాలి, ఎవరో వచ్చి చెప్పేవరకూ వేచి చూడకూడదు.

ఎవరితో ఎలా మాట్లాడాలి అన్నది కెరీర్‌లో వీలైనంత త్వరగా నేర్చుకోవాలి. కార్పోరేట్ ఎన్వైర్‌మెంట్‌లో కొనసాగేటప్పుడు విజయాలు, వైఫల్యాలను ఎలా స్వీకరించాలో కూడా తెలుసుకోవాలి. ఆసక్తికరమైన వ్యక్తిగా ఉండాలి, పలు అంశాలు తెలుసుకునేందుకు ఉత్సుకత చూపించాలి. చదవాలి, చూడాలి, వినాలి. మీరు చేస్తున్న పనితో నేరుగా సంబంధం ఉన్నవే కాకుండా మిగతా విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేయాలి, ఎందుకంటే మీ మైండ్ లో ఎప్పుడు ఏ ఐడియా వస్తుందో చెప్పలేం. మీరు చేస్తున్న పనికి అది ప్రత్యక్షంగానో పరోక్షంగానో సాయపడొచ్చు.

కస్టమర్లు, కుటుంబం, ఉద్యోగులు అంతా హ్యాపీ

మా టీమ్ లో ప్రతిభావంతులైన వ్యక్తులను గుర్తించి వారికి తగిన ప్రాధాన్యత నిచ్చినప్పుడే నేను సాఫల్యం చెందినట్లు భావిస్తాను. ప్రతిభకు తగిన గౌరవమిస్తే అది వారిని చైతన్యపరుస్తుంది, సహజసిద్ధ ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ప్రేరణిస్తుంది అలానే కెరీర్ లో ఎదిగేందుకు సాయపడుతుంది.

మా కస్టమర్ల నాడి తెలుసుకోవడం నాకు ఇష్టం. వాళ్ల విజన్,లక్ష్యాలు అర్థం చేసుకుంటాను. దీనివల్ల నా టీమ్‌కి సరైన ఆదేశాలివ్వడంతోపాటు వినియోగదారులను సంతృప్తిపరిచే ఫలితాలు పొందగలుగుతాను. హ్యాపీ కస్టమర్లు, హ్యాపీ ఎంప్లాయీస్ పనిలో ఉత్తేజాన్నిస్తాయి. నన్ను మరింత ఉత్సాహంగా పనిచేసేలా ప్రేరేపిస్తాయి.

నా కుమారుడి మంచీచెడులు చూసుకోవడం, హిందూస్తానీ శాస్త్రీయ సంగీతం, ఫిట్నెస్ రెజీమ్ వంటి హాబీలు కొనసాగించం నన్ను ఉత్సాహంగా ముందుకు నడిపిస్తున్నాయి.