కార్పొరేట్ ఉద్యోగాలు వదిలేసి కారికేచర్స్ గీసుకుంటున్న ఆర్టిస్టులు

ఆ ముగ్గురూ కళాకారులేముగ్గూరూ కార్పొరేట్ ఎంప్లాయీలేప్యాషన్ కోసం స్టార్టప్ ఏర్పాటుచిన్న లక్ష్యాలతో పెద్ద కంపెనీగా ఎదుగుతున్న కారిక్‌మీ


కార్పొరేట్ ఉద్యోగాలు వదిలేసి కారికేచర్స్ గీసుకుంటున్న ఆర్టిస్టులు

Sunday May 31, 2015,

2 min Read

రీతేష్ రావ్, రాజేష్ ఆచార్య, కొట్రేష్ చత్రికి... వీరంతా స్వతహాగా ఆర్టిస్టులు. రీతేష్, కోట్రేష్‌లకు ఫైన్ ఆర్ట్స్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ ఉంది. పెయింటింగ్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఉంది రాజేష్‌‌కు. వీరందరికీ కార్పొరేట్ జాబ్స్ వచ్చాయి. ఓ టైంలో ముగ్గురూ బెంగళూరులోని ఇన్ఫోసిస్‌లో కమ్యూనికేషన్ డిజైన్ గ్రూప్‌తో కలిసి పని చేశారు కూడా. ఇక్కడ ఆరేళ్లపాటు ఒక టీంగాను, వ్యక్తిగతంగానూ విధులు నిర్వహించారు ముగ్గురు. విధి నిర్వహణలో భాగంగా హై డెలిగేట్ ప్రాజెక్టులు, ఈవెంట్లు నిర్వహించాల్సి వచ్చింది. ఇది వారి మధ్య సాన్నిహిత్యాన్ని పెంచడమే కాకుండా... ఒకరి సామర్ధ్యం, అనుభవంపై మరొకరికి అవగాహన, నమ్మకాన్ని ఏర్పరచింది. అంతే తమ సామర్ధ్యాన్ని నమ్ముకుని ఓ స్టార్టప్‌ మొదలుపెట్టాలనే ఆలోచనతో... కంపెనీకి గుడ్‌బై చెప్పేశారు.

రీతేష్ రావ్, రాజేష్ ఆచార్య, కొట్రేష్ చత్రికి

రీతేష్ రావ్, రాజేష్ ఆచార్య, కొట్రేష్ చత్రికి


కారికేచర్స్ గీయడంలో రాజేష్ ఎక్స్‌పర్ట్. దీన్ని మరింతగా అందుబాటులోకి తెచ్చేలా ఓ వెంచర్‌ను ప్రారంభించాలని భావించారు ముగ్గురు. అలా ప్రారంభమైందే కారిక్‌మి అనే ఈ-కామర్స్ స్టోర్. వివిధ మోడళ్లలో, పలు రకాల మెటీరియల్స్‌పై కోరిన విధంగా కారికేచర్ గీసి హోం డెలివరీ చేస్తుంది కారిక్‌మి. కస్టమర్ చేయాల్సిందల్లా ఓ ఫోటోని అప్‌లోడ్ చేసి... కారికేచర్ ఏ కాన్సెప్ట్‌పై కావాలో వివరాలిస్తే సరిపోతుంది. ఈ టీం ముందుగా ఓ సాఫ్ట్ కాపీ రూపొందించి.. కస్టమర్ అనుమతి తీసుకున్నాక ఒరిజినల్ కేరికేచర్‌ను రూపొందించి డెలివరీ చేస్తుంది.

కేరిక్‌మీ గీసిన కేరికేచర్స్

కేరిక్‌మీ గీసిన కేరికేచర్స్


రెండేళ్లకు పైగా సేవలందిస్తున్న కారిక్‌మి కంపెనీలో పని చేసేది నలుగురు మాత్రమే. అయితే నెలకు దాదాపు 350 ఆర్డర్లను వీరు హ్యాండిల్ చేస్తున్నారు. మొదట్లో ఆర్డర్స్ అన్నీ స్నేహితులు, కొలీగ్స్, మౌత్ పబ్లిసిటీ, ఫేస్‌బుక్ పోస్టుల ద్వారా వచ్చినవే. అయితే ఆర్డర్ల స్థాయి క్రమేపీ పెరిగింది. 

“కొంతమంది ఆన్‌లైన్ ప్లేయర్లతో ఒప్పందాలు కుదుర్చుకున్నాం. దీంతో రెగ్యులర్‌గా ఆర్డర్లు రావడం మొదలైంది. దీంతో మాలో నమ్మకం స్థాయి కూడా పెరిగింది. ఆ తర్వాత అమెజాన్, ఫెర్న్స్ & పెటల్స్, స్నాప్‌డీల్ వంటి సంస్థలను సంప్రదించాం. వీటి ద్వారా మా అమ్మకాల స్థాయి బాగా పెరిగింది. ఆ తర్వాత మా సొంత ఈ-కామర్స్ ప్లాట్‌ఫాం ఏర్పాటు చేసుకోగలిగాం. ప్రస్తుతం మాకు 3వేల మందికిపైగా కస్టమర్లున్నారు”అంటున్నారు రీతేష్.
ఇదీ క్యారిక్‌మీ బిజినెస్ ప్రాసెస్

ఇదీ క్యారిక్‌మీ బిజినెస్ ప్రాసెస్


బహుమతుల మార్కెట్ ప్లేస్‌గా నిలిచిపోవాలని కారిక్‌మీ అనుకోవడం లేదు. “మా ఆలోచన ప్రకారం ఒక సింగిల్ ఆర్డర్‌ని కూడా హ్యాండిల్ చేయగలగాలి. ప్రస్తుతం అనేక కంపెనీలు బల్క్ ఆర్డర్లకే ప్రాధాన్యతనిస్తున్నాయి. మా కంపెనీలో కస్టమర్లకు వారికే సొంతమైన యూనిక్ ప్రోడక్టులు అందించడమే మా లక్ష్యం” అంటారు కోట్రేష్. బిజినెస్ టూ కస్టమర్(బీ2సీ), బిజినెస్ టూ బిజినెస్(బీ2బీ) ఛానల్స్ ద్వారా సేవలందిస్తోంది ఈ కంపెనీ. బర్త్‌డే సావనీర్లు, వెడ్డింగ్ యానివర్సరీల నుంచి, కార్పొరేట్ రివార్డుల వరకూ ఇదో మంది గిఫ్ట్ ఛాయిస్‌గా రూపాంతరం చెందేలా అభివృద్ధి చేయాలన్నది వ్యవస్థాపక త్రయం ఆలోచన. ఈ కారికేచర్లు సుదీర్ఘకాలం పాడవకుండా ఉండేందుకుగాను కొంత పరిశోధన చేశారు కూడా. “ మా దగ్గర కొనుగోలు చేసిన వస్తువు ఎప్పటికీ నిలిచి ఉండేలా... అత్యత్తుమ ప్రింటింగ్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నాం. మా కస్టమర్లు ఎంతగా సంతృప్తి చెందుతున్నారంటే... మా ఆర్డర్లలో క్యాన్సిల్, రిఫండ్ శాతం కేవలం 0.5శాతమే” అంటారు కోట్రేష్.

పెద్ద లక్ష్యాలతో ప్రారంభం కాలేదు కారిక్‌మీ. ఈ మిత్రత్రయం తమకు నచ్చిన పనిని ఎంజాయ్ చేస్తూ జీవితం నిర్మించుకునేలా డిజైన్ చేసుకున్నారు. భవిష్యత్తులో కస్టమర్లు నేరుగా వచ్చి డిజైన్ ఎక్స్‌పర్ట్స్‌తో తమకు నచ్చినవిధంగా కారికేచర్ గీయించుకునేలా ఎదగాలన్నది వీరి లక్ష్యం. ప్రస్తుతానికి మాత్రం అన్ని రకాల కేరక్టర్ బేస్డ్ ఉత్పత్తులను ఆన్‌లైన్‌లోకి తేవాలని ప్రయత్నిస్తున్నారు కారిక్‌మీ వ్యవస్థాపక త్రయం.

website - caricme