ఆ సంఘటనకు చలించి బైక్ ఆంబులెన్స్ తయారుచేసిన హైదరాబాదీ

0

భార్య శవాన్ని మూడు చక్రాల బండిమీద వేసుకుని 60 కిలోమీటర్లు తోసుకుంటూ వెళ్లిన ఓ అభాగ్యుడి గురించి తెలిసే ఉంటుంది. బండరాయి చేత కూడా కన్నీళ్లు పెట్టించిన దృశ్యం ఇంకా కళ్లముందే ఉంది. సముద్రమంత దుఃఖాన్ని రెప్పల వెనుక దాచుకుని భార్య అంత్యక్రియలు కోసం ఆటో బాడుగ మాట్లాడబోతే ఐదు వేలు అడిగిన దుర్మార్గం కనుమరుగైన మానవత్వాన్ని ప్రశ్నించింది.

రాములుకి 55 ఏళ్లుంటాయి. హైదరాబాద్ లింగంపల్లి రైల్వేస్టేషన్ లో అడుక్కుంటాడు. కుష్టువ్యాధి సమాజం నుంచి వెలివేసింది. అతని భార్యకు కూడా అదే వ్యాధి. ఇద్దరి జీవితం రైల్వే స్టేషన్‌లోనే. తీవ్రమైన అనారోగ్యంతో అతని భార్య ప్లాట్ ఫారంపైనే కన్నుమూసింది. సొంతూరు వికారాబాద్ దగ్గర. కనీసం పుట్టి పెరిగిన ఊరిలో భార్యకు అంత్యక్రియలు చేయాలనుకున్నాడు. ఆటోవాళ్లని అడిగితే 5వేలు చెప్పారు. అంత స్తోమత లేదు. కనీసం వెయ్యి రూపాయలు కూడా ఇచ్చుకునే తాహతు లేదు. ఏం చేయాలో తోచలేదు. వేరే మార్గం లేక తాను అడుక్కునేందుకు తిరిగే మూడు చక్రాల బండి మీద భార్య శవాన్ని వేసి అరవై కిలోమీటర్ల దూరం తోసుకుంటూ వెళ్లాడు. ఒంట్లో శక్తిలేక ఒకచోట కూలబడితే కొందరు దయగల మారాజులు తలాకొంత చందాలు వేసి రాములుని వికారాబాద్ పంపించారు.

ఈ సంఘటన మహ్మద్‌ షాజోర్ ఖాన్ అనే యువకుడిని కదలించింది. చచ్చిపోతే దహన సంస్కారాలకు కూడా నోచుకోని రాములు లాంటి నిరుపేదలు ఇంకా ఎంతోమంది మన చుట్టూ ఉన్నారు. అలాంటి వాళ్లకోసం ఏదో ఒకటి చేయాలని భావించాడు. అతనికి నాంపల్లిలో బైక్ మెకానిక్ వర్క్ షాప్ ఉంది. అందులోని సామానుతోనే బైక్ ఆంబులెన్స్ లాంటిది ఒకటి ఎందుకు తయారు చేయకూడదు అనుకున్నాడు. ఒక్కో పార్ట్ జత చేస్తూ 35 రోజుల పాటు శ్రమించి ఆంబులెన్స్ తయారుచేశాడు. ఖాన్ తండ్రి కస్టమైజ్డ్ బైక్స్ తయారు చేయడంలో దిట్ట. అతని స్ఫూర్తితోనే షాజోర్ ఖాన్ కు బైక్ ఆంబులెన్స్ ఐడియా వచ్చింది. పదిమంది పనివాళ్లతో కలిసి అటాచ్డ్ సైడ్ కార్ రూపొందించారు. మొత్తం ఖర్చు లక్ష దాటింది.

హైదరాబాద్ వంటి నగరంలో ట్రాఫిక్ సంగతి తెలిసిందే. ఎన్నోసార్లు ఆంబులెన్స్ వాహనాలు పద్మవ్యూహంలో చిక్కుకున్నాయి. అయితే దీనికి అలాంటి భయం అవసరం లేదు. చిన్నపాటి గ్యాప్ దొరికినా సర్రున దూసుకెళ్తుంది.

షాజోర్ ఖాన్ తయారు చేసిన బైక్ ఆంబులెన్స్ గురించి విన్న హాస్పిటళ్లు అలాంటిది తమకూ కావాలని కోరాయి. డబ్బు ఎంతైనా ఇస్తామని అన్నారు. కానీ అతను కుదరదు అని చెప్పాడు. ఎందుకంటే బైక్ ఆంబులెన్స్ చేసింది లాభాపేక్షతో చేసింది కాదు. నలుగురికి ఉపయోగపడాలని చేశాను అని ఖరాకండిగా చెప్పాడు. ప్రస్తుతం ఆ బైక్ ఆంబులన్స్ పేషెంట్లను హాస్పిటల్ కి తీసుకెళ్లడంలో బిజీగా ఉంది. 

Related Stories