2015లో ఆమె చేసిన అద్భుతాలు!!

2015లో ఆమె చేసిన అద్భుతాలు!!

Thursday January 07, 2016,

3 min Read

ఆమె! ఒక శక్తి ప్రవాహం! కుటుంబ భారాన్ని లాగ‌డ‌మే కాదు.. ప్ర‌పంచాన్ని ముందుకు న‌డిపించ‌డంలోనూ మ‌హిళ‌ల‌ది పురుషుల‌తో స‌మాన పాత్ర‌! రాజ‌కీయ‌, ఆర్థిక‌, సామాజిక‌- ఇలా ఏ కోణంలో చూసినా ఆడ‌వాళ్లు అద్భుతాలు చేస్తున్నారు! ఆకాశంలోనే కాదు, అన్ని విజ‌యాల్లోనూ స‌గభాగం పంచుకుంటున్నారు! ఆటో డ్రైవ‌ర్ నుంచి పైల‌ట్ దాకా ఇప్పుడు అన్ని రంగాల్లోనూ మ‌హిళ‌లదే హవా ! మ‌రి కాలచ‌క్రంలో గిర్రున తిరిగిపోయిన 2015 సంవ‌త్స‌రంలో ది బెస్ట్ గా నిలిచిన మ‌హిళ‌లు ఎవ‌రు? వారు క్రియేట్ చేసిన వండ‌ర్స్ ఏంటి?

image


1. భ‌క్తి శ‌ర్మ‌

భార‌త స్విమ్మింగ్ చ‌రిత్ర‌ను కొత్త తీరాల‌కు చేర్చిన ఓపెన్ స్విమ్మ‌ర్. అంటార్కిటికా స‌ముద్రంలో 2.25 కిలోమీట‌ర్ల దూరాన్ని కేవలం 52 నిమిషాల్లో ఈదేసి ప్ర‌పంచ రికార్డు సృష్టించారు. అది కూడా గ‌డ్డ క‌ట్టించే జ‌న‌వ‌రి ఉష్ణోగ్ర‌త‌ల్లో! అంటార్కిటికా స‌ముద్రాన్ని ఈదిన అతి పిన్న వ‌యస్కురాలిగా భ‌క్తి శ‌ర్మ కీర్తి పొందారు. ఆమె ఇప్ప‌టికే ప్ర‌పంచంలోని ఐదు మ‌హాసముద్రాల‌ను, ఎనిమిది ఇతర స‌ముద్రాల‌ను ఈదేశారు.

2. ప్రియాంకా చోప్రా

ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. బాలీవుడ్ లో ఓ వెలుగు వెలుగుతున్న ప్రియాంక‌.. సింగ‌ర్ గానూ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫేమ్ సంపాదించారు. అంతేకాదు, గ‌త ఏడాది యూఎస్ టీవీ ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. క్వాంటికో అనే యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ లో లీడ్ రోల్ ప్రియాంకదే!

3. ఇండియ‌న్ ఉమెన్స్ హాకీ టీమ్

మూడు ద‌శాబ్దాల క‌ల‌ను ఇండియ‌న్ ఉమెన్స్ హాకీ టీమ్ గ‌త ఏడాది సాకారం చేసింది. 2016 రియో గేమ్స్ కు అర్హ‌త సాధించింది. ఇండియ‌న్ ఉమెన్స్ హాకీ టీమ్ ఒలింపిక్స్ కు క్వాలిఫై అవ‌డం ఇది రెండోసారి. చివ‌రిసారిగా 1980లో ఇండియ‌న్ టీమ్ ఒలింపిక్స్ ఆడింది. అప్పుడు మ‌న దేశానికి నాలుగో స్థానం ల‌భించింది.

4. బెనో జెఫైన్

వ‌య‌సు 25 ఏళ్లు! నిజంగా అసాధ్యురాలు! ఇండియ‌న్ ఫారిన్ స‌ర్వీసెస్ లోకి అడుగు పెట్టిన తొలి అంధురాలిగా రికార్డుల‌కెక్కారు. బెనో జెఫైన్ హండ్రెడ్ ప‌ర్సంట్ విజువ‌ల్లీ ఛాలెంజ్డ్ ప‌ర్స‌న్! అంత‌కుముందు ఆమె స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ప్రొబేష‌న‌రీ ఆఫీస‌ర్ గా ప‌నిచేశారు.

5. సైనా నెహ్వాల్ 

ఇండియ‌న్ బ్యాడ్మింట‌న్ కు 2015 సంవ‌త్స‌రాన్ని గోల్డెన్ ఇయ‌ర్ గా మార్చిన ఘ‌న‌త సైనా నెహ్వాల్ దే! వ‌ర‌ల్డ్ నెంబ‌ర్ వ‌న్ ర్యాంకు సాధించిన తొలి భార‌తీయ బ్యాడ్మింట‌న్ ప్లేయ‌ర్ గా సైనా చ‌రిత్ర సృష్టించారు. అంతేకాదు, ఆల్ ఇంగ్లండ్ ఛాంపియ‌న్ షిప్ ఫైన‌ల్లోనూ ఆడారు. వ‌ర‌ల్డ్ ఛాంపియ‌న్ షిప్స్ ఫైన‌ల్ కు చేరిన ఫ‌స్ట్ ఇండియ‌న్ గా కూడా ఘ‌నత సాధించారు.

6. పూజా ఠాకూర్

భారత రిపబ్లిక్ డే వేడుకలకు వచ్చిన అమెరికా ప్రెసిడెంట్ బరాక్ ఒబామాను రాష్ట్రపతి భవన్ లో సైనిక వందనానికి తోడ్కొని వెళ్లిన తొలి మహిళా సైనిక అధికారి. పూజా ఠాకూర్ పేరు అమెరికాలో కూడా మారుమోగింది.

7. జె. మంజుల

డిఫెన్స్ రీసెర్స్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేష‌న్ (డీఆర్డీవో)కి చెందిన ఎల‌క్ట్రానిక్స్ అండ్ క‌మ్యూనికేష‌న్స్ సిస్ట‌మ్ క్ల‌స్ట‌ర్ లో తొలి మ‌హిళా డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ గా నియ‌మితుల‌య్యారు. 2015 సెప్టెంబ‌ర్ లో ఆమెను అపాయింట్ చేశారు. 2011 సంవ‌త్స‌రానికి గాను ఉత్త‌మ సైంటిస్టుగా మంజుల డీఆర్డీవో అవార్డు అందుకున్నారు.

8. ప్రొ. మ‌నాబి బందోపాధ్యాయ‌

ఓ కాలేజీ ప్రిన్సిప‌ల్ గా నియ‌మితులైన తొలి ట్రాన్స్ జెండ‌ర్ ఈమె. ప‌శ్చిమ బెంగాల్ లోని క్రిష్ న‌గర్ ఉమెన్స్ కాలేజీలో ప‌నిచేస్తున్నారు. పీహెచ్డీ చేసిన తొలి భార‌తీయ ట్రాన్స్ జెండ‌ర్ కూడా ఈమే కావడం మరో విశేషం!

9. సానియా మీర్జా

ఈ టెన్నిస్ దిగ్గ‌జానికి 2015 ది బెస్ట్ ఇయ‌ర్ అని చెప్పొచ్చు. స్విట్జ‌ర్లాండ్ స్టార్ ప్లేయ‌ర్ మార్టినా హింగిస్ తో క‌లిసి సానియా గ‌త ఏడాది వండర్స్ చేసింది. ఈ జంట వ‌రుస‌గా 22 మ్యాచ్ ల‌ను గెలిచారు. సానియా నంబ‌ర్ వ‌న్ ర్యాంక్ తో అద‌ర‌గొట్టింది. 10 డ‌బ్ల్యూటీఏ టైటిళ్లు, రెండు గ్రాండ్ స్లామ్ లు గెలుచుకుంది.

10. కిర‌ణ్ గాంధీ

అన్నింటికీ మించి గ‌త ఏడాది ప్ర‌త్యేకంగా చెప్పుకోవాల్సింది మహిళల రుతుస్రావపు కట్టుబాట్ల గురించి! ఆడ‌వాళ్ల మంత్లీ పీరియడ్స్ కి సంబంధించిన అపోహ‌ల‌పై ఒక ఉద్య‌మ‌మే జ‌రిగింద‌ని చెప్పాలి. చాలా మంది పురుషులు, మ‌హిళ‌లు రోడ్ల మీదికి వ‌చ్చి విస్తృతంగా ప్ర‌చారం నిర్వ‌హించారు. కిర‌ణ్ గాంధీ అయితే త‌న పీరియ‌డ్ స‌మ‌యంలో ఎలాంటి ప్యాడ్ ధ‌రించ‌కుండా లండ‌న్ లో మార‌థాన్ నిర్వ‌హించింది. ఆ సంఘ‌ట‌న గురించి ప్ర‌పంచ‌మంతా మాట్లాడుకుంది.

మొత్తంగా 2015లో ఇవీ మ‌హిళ‌లు చేసిన అద్భుతాలు! ఉమెన్ ప‌వ‌ర్ కు సెల్యూట్ చేద్దాం! 2016లో మ‌హిళామ‌ణులు మ‌రిన్ని విజ‌యాలు సాధించాల‌ని ఆశిద్దాం!!