ఆ ఊరిలో ఏ ఇంటికీ త‌లుపులుండ‌వు! బ్యాంక్‌కు కూడా! అయినా దొంగ‌త‌నం అన్న‌మాటే లేదు!!

-తలుపులులేని గ్రామం శని శింగనాపూర్‌..-శతాబ్దాలుగా కొనసాగుతున్న ఆచారం..

ఆ ఊరిలో ఏ ఇంటికీ త‌లుపులుండ‌వు! బ్యాంక్‌కు కూడా! అయినా దొంగ‌త‌నం అన్న‌మాటే లేదు!!

Friday January 01, 2016,

2 min Read

ఇంటికి తాళం వేయకుండా బయట అడుగుపెట్టలేని కాలమిది. ఇంట్లో వాళ్లు ఒక రూంలో ఉండగానే పక్క రూంలో దొంగలు తమ పని తాము చేసుకుపోయే రోజులివి. మరి ఇలాంటి పరిస్థితుల్లో తలుపులు లేని ఇళ్లు ఉన్నాయంటే నమ్ముతారా? అదీ ఒకటి రెండో కాదు ఏకంగా ఓ గ్రామంలోని వారంతా తమ ఇళ్లకు తలుపులు పెట్టుకోలేదంటే నమ్ముతారా? నమ్మశక్యంగా లేకున్నా నమ్మాల్సిందే. నమ్మి తీరాల్సిందే!

image


శని శింగనాపూర్‌. మహారాష్ట్రలోని అహ్మద్‌ నగర్ జిల్లాలో ఉంది ఈ చిన్న గ్రామం. ప్రసిద్ధ పుణ్య క్షేత్రం షిర్టీకి 70కిలోమీటర్లు, నాసిక్‌ కు 75 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇండియాలోనే కాదు మొత్తం ప్రపంచంలోని ఇలాంటి గ్రామం మరెక్కడా లేదు. ఈ గ్రామ విశిష్టతను చూసి శని శింగనాపూర్‌లో అడుగుపెట్టిన కొత్త వాళ్లు ముక్కున వేలేసుకోక మానరు. ఎందుకంటే అక్కడ ఇళ్లకు తలుపులు ఉండవు. గ్రామం అంతా వెతికినా ఏ ఒక్క ఇంటికి కూడా తలుపులు కనిపించవు. ఊరిలో శనీశ్వరుడి ఆలయమే అందుకు కారణం.. స్థానికులంతా భక్తి ప్రపత్తులతో పూజించే శనీశ్వరుడు తమ గ్రామాన్ని రక్షిస్తాడని అక్కడి ప్రజల విశ్వాసిస్తారు.

శని శింగనాపూర్‌లో ఇప్పటి వరకు ఎలాంటి దోపిడీలు, దొంగతనాలు జరగలేదు. ఎవరైనా దొంగతనం చేస్తే వారు గ్రామం సరిహద్దులు దాటే లోపే చనిపోతారని లేదా పిచ్చి వాళ్లవుతారని జనం గట్టిగా నమ్ముతారు. శని దేవుడు శిక్షిస్తాడన్న భయంతో ఎవరూ నేరాలకు పాల్పడరు.

“కొన్నేళ్ల క్రితం భక్తుల కలలో వచ్చిన శని దేవుడు ఇళ్లకు తలుపులు పెట్టుకోవాల్సిన అవసరం లేదని చెప్పాడు. నేను మిమ్మల్ని రక్షిస్తానని చెప్పాడు. అందుకే మేం ఇళ్లకు తలుపులు బిగించుకోలేదు.” -జయ శ్రీ, స్థానికురాలు

ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే బ్యాంకుకు సైతం తాళం వేయరు. గ్రామ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ 2011లో యునైటెడ్‌ కమర్షియల్‌ (యూకో) బ్యాంకు ఇక్కడ బ్రాంచ్‌ ఏర్పాటు చేసింది. అయితే బ్యాంకుకు కూడా ఏనాడు తాళం వేసిన దాఖలాలు లేవు. దేశంలో ఇలాంటి తరహా బ్యాంకు ఇది ఒక్కటే.

శతాబ్దాలుగా శని శింగనాపూర్‌లో ఎలాంటి దొంగతనాలు జరగలేదు. అయితే 2010లో మాత్రం ఓ వాహనం నుంచి 35 వేల విలువైన నగదుతో పాటు కొన్ని వస్తువులు చోరీ అయినట్లు సకల్‌ టైమ్స్‌ పత్రిక కథనాన్ని ప్రచురించింది. ఆ తర్వాత 2011లో ఇలాంటి ఘటనే మరొకటి జరిగింది. 2012 జనవరిలో ఆలయంలోని కొన్ని బంగారు నగలు చోరీకి గురయ్యాయి. అయినా ఈ ఘటనలు స్థానికులపై ఎలాంటి ప్రభావం చూపలేదు. శని దేవునిపై ఉన్న నమ్మకంతో ఇళ్లకు తలుపులు లేకుండానే హాపీగా బతుకుతున్నారు.