కార్ పూలింగ్‌లో 'జిఫీ' కొత్త శకం ... కోట్లు కురిపిస్తున్న కాన్సెప్ట్

కార్ పూలింగ్‌లో 'జిఫీ' కొత్త శకం ... కోట్లు కురిపిస్తున్న కాన్సెప్ట్

Wednesday October 14, 2015,

4 min Read

కార్ పూలింగ్...! ఇప్పుడిదో హాట్ టాపిక్. పెరిగిపోతున్న పొల్యూషన్, ట్రాఫిక్ సమస్యలు, మండిపోతున్న ధరల నుంచి కొద్దిగానైనా ఉపశమనం పొందేందుకు మెల్లిగా జనాలు ఈ బాట పడ్తున్నారు. వివిధ మెట్రో నగరాల్లో.. ఇప్పటికే పాపులర్ అయిన ఈ కాన్సెప్ట్ హైదరాబాద్ ప్రజలకూ చేరువైంది. అయితే కేవలం.. కార్ పూలింగ్‌కే పరిమితమై భద్రతలో రాజీపడాల్సిన అవసరం లేకుండా హైదరాబాదీ స్టార్టప్ జిఫీ.. వినూత్నమైన పరిష్కార మార్గాలను చూపింది. ప్రొఫైల్ నచ్చిన వాళ్లనే కోప్యాసింజర్‌గా ఎంపిక చేసుకునే సౌలభ్యంతో పాటు రేటింగ్ ఇవ్వడం, క్యాష్‌లెస్ ట్రావెల్ వంటివి కూడా.. జిఫీలో అదనపు ఆకర్షణలు. అందుకే ఈ రంగంలో మొట్టమొదటిసారి ఈ సంస్థ ఫండింగ్ కూడా రాబట్టింది.

అనురాగ్, ప్రమోద్ కుమార్.. ఇద్దరూ.. ఇలాంటి సమస్యలనే ఎదుర్కొన్నారు. రోడ్లమీద విపరీతంగా పెరిగిపోతున్న కాలుష్యం, ఇబ్బడిముబ్బడిగా రోడ్డెక్కుతున్న కార్లను చూసి.. చికాకు పడడంతో వీళ్లద్దరిలో ఆందోళన పెరిగింది. ఇలా ఉంటే భవిష్యత్ తరాలకు అందించడానికి ఏమీ మిగలదనే భయమే తాము ఈ స్టార్టప్ ఏర్పాటు చేయడానికి కారణమైందని చెబుతారు అనురాగ్.

image


'' ఇదో పెద్ద సమస్యలా నాకు అనిపించింది. కొత్త కార్లు రోజూ కొన్ని వందల సంఖ్యలో రోడ్డుపైకి వస్తూనే ఉన్నాయి. ఒక భాధ్యతాయుత పౌరుడిగా నేను ఏమీ చేయలేనా అని నాకు అనిపించేది. ఇలా అయితే ఓ పది, ఇరవై ఏళ్ల తర్వాత ఫాజిల్ ఫ్యూయల్స్ ఏమీ మిగలవు. మన తర్వాతి తరాలు ఎలా జీవిస్తాయి ? మన పిల్లలే ఎలా ఉండగలుగుతారు ? అని ఆలోచిస్తూ నిత్యం సతమతమయ్యేవాడిని. సమస్య పరిష్కారానికి మనకు చేతననైంత చేయాలని అనుకున్నా. అందుకే కార్ పూలింగ్ కాన్సెప్ట్ నా మెదిలో మెదిలింది. దీనికి తోడు నాస్కాం స్టార్టప్స్ ప్రజెంటేషన్‌లో మా ఐడియా అందరినీ ఆకట్టుకుంది. కొంత నిధులు కూడా వాళ్ల నుంచి వచ్చాయి. ఇక ఆ ధీమాతో ఉద్యోగం వదిలేసి.. ఈ స్టార్టప్ ఏర్పాటులో బిజీ అయిపోయా '' అంటారు అనురాగ్.

జిఫీ ఫౌండర్ అనురాగ్.. సిక్కిం మణిపాల్ యూనివర్సిటీలో బిటెక్ పూర్తి చేసి వెల్స్ ఫార్గో సంస్థలో ఆరేళ్లు పనిచేశారు. మరో కో ఫౌండర్ ప్రమోద్ ఐఐటి ఖరగ్‌పూర్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి యాత్రా డాట్‌ కాంలో పనిచేశారు. వీళ్లతో పాటు మరికొంత మంది టీం కూడా జతయ్యారు. 2014లో కార్ పూలింగ్ ఆలోచన వచ్చిన తర్వాత వీళ్లంతా 10 నెలల పాటు రీసెర్చ్ చేశారు. అనేక మందితో మాట్లాడి.. మోడల్ ఎలా డెవలప్ చేయాలో ఆలోచించుకున్నారు. చివరకు జూన్ 2015లో జిఫీ కొత్త యాప్ లాంఛ్ అయింది. డెస్క్ టాప్ వర్షన్ కూడా కొనసాగుతూ ఉంది. ఇప్పటివరకూ 12000 మంది యూజర్స్ వీళ్ల దగ్గర రిజిస్టర్ అయ్యారు. రోజుకు 500 రైడ్స్ వరకూ తమ ద్వారా జరుగుతున్నట్టు జిఫీ టీం చెబ్తోంది. ఇప్పటి వరకూ సుమారు 10 లక్షల కిలోమీటర్లు తమ జిఫీ ద్వారా రైడర్లు ప్రయాణించినట్టు వివరిస్తోంది.

image


ఏంటి ప్రత్యేకత, భద్రత ఎలా ?

ఇప్పటికే కార్ పూలింగ్‌ సెగ్మెంట్లో కొన్ని కంపెనీలు పనిచేస్తున్నాయి. వాటిల్లో బ్లాబ్లా కార్, కో యాత్రి, రైడ్ ఇట్, పూల్ మై కార్ వంటి సంస్థలు ఉన్నాయి. వాటిల్లో అధిక శాతం ఇంటర్‌సిటీ సేవలకే పరిమితమవుతున్నారు. ఇంట్రా సిటీ ఇంట్రెస్ట్ తక్కువ మందికే ఉంటోంది. అందుకే ఆ లోటు భర్తీ చేసేందుకే తాము జిఫీ మొదలుపెట్టినట్టు నిర్వాహకులు చెబ్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్, బెంగళూరుతో పాటు ఐర్లాండ్‌లో కూడా సేవలను అందిస్తోంది జిఫీ. అంతర్జాతీయ మార్కెట్లో కూడా బ్లాబ్లా కార్‌తో పాటు ఉబెర్ పూల్ నుంచి పోటీ ఎదురవుతోందని చెబ్తోంది.

జిఫీ మూడు అంచెల సెక్యూరిటీ విధానాన్ని పాటిస్తోంది. రైడ్ ఇవ్వాలన్నా, తీసుకోవాలన్నా.. ముందు వీళ్ల దగ్గర రిజిస్టర్ చేసుకోవాలి. అప్పుడు సదరు వ్యక్తి ఇచ్చే వివరాలతో పాటు సోషల్ ప్రొఫైల్‌ను కూడా తనిఖీ చేస్తారు. ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి వివిధ సామాజిక మాధ్యమాల నుంచి కూడా సమాచారాన్ని సేకరిస్తారు. ఆ తర్వాత ప్రభుత్వం ఇచ్చే ఏదైనా ఐడి కార్డ్ కూడా తీసుకుని వివరాలను సరిచూసుకుంటారు. అందుకే భద్రత విషయంలో ఆందోళన పడాల్సిన అవసరం లేదనేది వీళ్ల మాట. రైడ్ ఆఫర్ చేసే వాళ్ల కార్ కండిషన్, ఇన్సూరెన్స్, పొల్యూషన్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి పత్రాలను కూడా వ్యక్తిగతంగా జిఫీ టీం పరిశీలిస్తుంది.

రైడ్ ముగిసిన తర్వాత డ్రైవర్ లేదా కో ప్యాసింజర్లకు రేటింగ్ కూడా ఇచ్చే వెసులుబాటు ఉంటుంది. దీని వల్ల భవిష్యత్తులో ఇతరులు ఎవరైనా రైడ్స్ ఎంచుకునే ముందు.. స్టార్ రేటింగ్‌ను బట్టి ట్రై చేయాలో.. వద్దో నిర్ణయించుకోవచ్చు. మహిళల కోసం కూడా ప్రత్యేకంగా విమెన్ ఓన్లీ గ్రూప్స్‌ను తయారు చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో స్పందించేందుకు ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీంను కూడా ఉంది.

మీరు ఏదైనా రూట్లో వెళ్లాలని అనుకున్నప్పుడు మీ రిక్వెస్ట్‌ను యాప్‌లో పోస్ట్ చేయాలి. ఆ రూట్లో వెళ్తున్న వాళ్లు ఎవరైనా మిమ్మల్ని నేరుగా కాంటాక్ట్ చేస్తారు. భవిష్యత్తులో ఫోన్ నెంబర్లు లేకుండా తమ యాప్ ద్వారానే కాల్ చేసే సౌలభ్యాన్ని కూడా కల్పించబోతున్నట్టు అనురాగ్ వివరించారు. దీని వల్ల అదనపు సెక్యూరిటీ కూడా ఇచ్చినట్టు అవుతుందని తెలిపారు.

రెవెన్యూ మోడల్

ఒక్కో కిలోమీటర్‌కు కార్ ఓనర్.. కో ప్యాసింజర్ నుంచి రూ.5 వసూలు చేస్తారు. అందులో 20 శాతం కమిషన్‌గా జిఫీ తీసుకుంటుంది. ఒకే కారులో ఎంత ఎక్కువ మంది వెళ్తే.. అంతగా అటు డ్రైవర్‌కు ఇటు జిఫీకి లాభం ఉంటుంది. భవిష్యత్తులో ఈ టారిఫ్ రేట్లను మరింత తగ్గించి.. ఎక్కువ మందిని తమ యూజర్లుగా చేర్చుకోవాలని జిఫీ చూస్తోంది.

మరో ముఖ్య విషయం క్యాష్‌లెస్ ట్రావెల్. డ్రైవర్, కో ప్యాసింజర్ ఎవరూ చిల్లర కోసం తడుముకోవాల్సిన పనిలేదు. కో ప్యాసింజర్లు ముందే డబ్బును తమ యాప్ ద్వారా లోడ్ చేసుకోవచ్చు. రైడ్ తర్వాత జిఫీ ద్వారా కార్ ఓనర్‌కు ఆ పేమెంట్ చేయొచ్చు. ఆ తర్వాత కార్ ఓనర్ల ఖాతాకే నేరుగా ఈ సొమ్మును ట్రాన్స్‌ఫర్ చేస్తుంది జిఫీ టీం. దీని వల్ల ఇద్దరి టైం కూడా సేవ్ అవుతుంది.

ఫండింగ్

నాస్కాం 10000స్టార్టప్స్‌లో భాగంగా ఎంపికైన ఈ సంస్థకు ప్రాధమిక దశలో 50 కె వెంచర్స్, పరంపర వెంచర్స్, ట్రిపుల్ ఐటి సిఐఈ సహా ఏంజిల్ ఇన్వెస్టర్ శ్రీని కొప్పోలు నుంచి రూ.10 లక్షలు ఫండింగ్‌గా అంది. 

తాజాగా ఎస్ఓఎస్ వెంచర్స్‌తో పాటు హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు ఏంజిల్ ఇన్వెస్టర్ల నుంచి 1.90 లక్షల డాలర్లు (దాదాపు రూ.1.20 కోట్లు) ఫండింగ్‌గా అందింది. దీంతో టెక్నాలజీని అభివృద్ధి చేయడంతో పాటు కస్టమర్ల భద్రత, మార్కెటింగ్‌పై అధికంగా దృష్టి కేంద్రీకరించేందుకు సులువుగా ఉంటుందని అనురాగ్ వివరించారు.

భవిష్యత్ లక్ష్యాలు

ఆరు నెలల్లోగా మెట్రో నగరాలన్నింటిలోనూ పాగా వేయాలని జిఫీ చూస్తోంది. ప్రస్తుతం పన్నెండు వేలుగా ఉన్న యూజర్ బేస్‌ను రెండు నెలల్లోగా 50000లకు, ఆరు నెలల్లో కనీసం లక్ష మందికి పెంచాలనే లక్ష్యంతో ఉంది. అదనపు ఫీచర్స్ యాడ్ చేసి.. ఈ సెగ్మెంట్‌లో నెంబర్ ఒన్ స్థాయికి ఎదగాలని చూస్తోంది.

website