పబ్లిషింగ్ రంగంలోనూ పుష్కలమైన అవకాశాలు వెతుక్కున్న సంగీత్ కౌర్

సంప్రదాయ పబ్లిషింగ్ రంగానికి సెల్ఫ్ పబ్లిషింగ్‌తో గట్టిపోటీ..భవిష్యత్ సెల్ఫ్ పబ్లిషింగ్‌దేనంటున్న నవ్‌సంగీత్ కౌర్..చండీగఢ్‌లో వైట్‌ ఫాల్కన్ పబ్లిషింగ్ హౌజ్‌ను ప్రారంభించిన కౌర్..

పబ్లిషింగ్ రంగంలోనూ పుష్కలమైన అవకాశాలు వెతుక్కున్న సంగీత్ కౌర్

Monday August 31, 2015,

4 min Read

కాలం మారుతోంది. రోజుకో కొత్త టెక్నాలజీ ప్రపంచాన్ని ముంచేస్తోంది. పుస్తకాల ప్రచురణ అంటే ఇంతకు ముందు తలకు మించిన భారంలా ఉండేది. పుస్తకాలను ప్రచురించినా, అవి ఎప్పుడు అమ్ముడవుతాయో తెలియక అల్మారాల్లో పెట్టుకునేవారు రచయితలు. ఇప్పుడా సమస్యలకు సెల్ఫ్ పబ్లిషింగ్‌తో పరిష్కారం లభించింది. భవిష్యత్ అంతా సెల్ఫ్ పబ్లిషింగ్‌దే అంటున్న నవ్‌సంగీత్ కౌర్ ఇటీవలే వైట్ ఫాల్కన్ పబ్లిషింగ్‌ హౌస్‌ను నెలకొల్పారు.

పంజాబ్‌లోని ఓ మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన నవ్‌సంగీత్ కౌర్ తమ గ్రామానికి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాఠశాలలో ఇంగ్లీష్ మీడియంలో ప్రాథమిక విద్యను అభ్యసించారు.

సెల్ఫ్ పబ్లిషింగ్‌లో సంచలనం సంగీత్ కౌర్

సెల్ఫ్ పబ్లిషింగ్‌లో సంచలనం సంగీత్ కౌర్


గ్రామీణ ప్రాంత విద్యార్థిని కావడంతో ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో చదవడం చాలా కష్టమైంది. అయితే నేర్చుకోవాలన్న కౌర్ తపన ఆమె కుటుంబాన్ని చండీగఢ్‌కు మారేలా చేసింది. చదవులో ఆమె ఎప్పుడు తల్లిదండ్రులను నిరాశపర్చలేదు. చిన్నప్పటి నుంచి టాపర్‌గా ఉంటూ వస్తున్న కౌర్ డిగ్రీ, పీజీలలో పంజాబ్ యూనివర్సిటీ గోల్డ్ మెడల్ సాధించారు.

కౌర్ తల్లిదండ్రులు మంచి సాహిత్య ప్రియులు. మంచి పుస్తకాల కలెక్షన్‌ను ఇంట్లో ఉంచేవారు. ‘‘ పాఠ్య పుస్తకాలే కాదు. ఇతర పుస్తకాలు కూడా చదివేందుకు మా అమ్మా నాన్న నన్ను ఎంతో ప్రోత్సహించేవారు’’ అని ఆమె చెప్తారు. పుస్తకాలను చదవాలన్న కోరిక ఆమెతోపాటే ఉండిపోయింది. ‘‘ నా చదువుకు, నైపుణ్యం, ఆసక్తికి సరిపోయే విధంగా ఏదైనా సొంతంగా వ్యాపారం చేసుకోవాలని అనుకున్నాను’’.

2013లో రిలయన్స్‌లో చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేశారు కౌర్. భర్త మద్దతుతో మంచి భవిష్యత్‌ను ఊహించుకుంటూ సెల్ప్-పబ్లిషింగ్ రంగంలోకి అడుగుపెట్టారు. అమెరికా యూనివర్సిటీలో రీసెర్చ్ సైంటిస్ట్‌గా పనిచేసే కౌర్ భర్త స్వయంగా కొన్ని పుస్తకాలను కూడా రచించారు. ‘‘అమెరికాలో పబ్లిషింగ్ రంగం గురించి తన అనుభవాలను ఆయన నాతో పంచుకున్నారు. అలాగే మా అత్తామామలకు కూడా పబ్లిషింగ్ రంగంలో ఉన్న అనుభవాలను నాకు చెప్పారు. ఆర్కిటెక్ట్స్‌గా పనిచేసే మా మామగారు ఎన్నో పుస్తకాలను పబ్లిష్ చేశారు. ఈ రంగంలోకి నేను అడుగుపెట్టేందుకు వారి అనుభవాలే కారణం’’ అని నవ్‌సంగీత్ కౌర్ వివరించారు.

సెల్ఫ్ పబ్లిషింగ్ మోడల్స్‌లో ఉన్న కష్టాలు, పనులపై ఆమె పరిశోధన చేశారు. మార్కెట్‌ను పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత వైట్ ఫాల్కన్ పబ్లిషింగ్ పేరుతో ఓ స్టార్టప్‌ను ప్రారంభించారు కౌర్.

‘‘వెంచర్ ప్రారంభమైన కొద్ది నెలల్లోనే మంచి పార్ట్‌నర్స్ దొరికారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో ఉన్నత స్థాయి, నాణ్యమైన ప్రపంచ స్థాయి అంశాలను పబ్లిష్‌ చేసేందుకు అవకాశం లభించింది. అనుభవం కలిగిన ఉద్యోగులూ దొరికారు. నా ఆసక్తిని తృప్తి పరిచే వెంచర్‌ను ప్రారంభించడం నాకు సంతోషంగా ఉన్నది’’ అని ఆమె పేర్కొన్నారు. .

భారత్‌లో సెల్ఫ్ పబ్లిషింగ్ రంగం..

‘‘సెల్ఫ్ పబ్లిషింగ్ రంగంలో భారత్ ప్రస్తుతం అమెరికా, యూకేల తర్వాత మూడో స్థానంలో ఉంది. మార్కెట్ అంచనా రూ. 10 వేల కోట్లు’’ అని కౌర్ వివరించారు. సెల్ఫ్ పబ్లిషింగ్ రంగం భారత్‌లో వేగంగా వృద్ధి చెందుతోంది. సంప్రదాయ పబ్లిషింగ్ రంగంలో రచయితలు, పబ్లిషర్లకు ఎదురవుతున్న సవాళ్లు సెల్ఫ్ పబ్లిషింగ్ రంగం తీర్చేస్తోంది. ఈ మోడల్‌లో రచయితే పబ్లిషర్‌గా రెండో బాధ్యతను కూడా నిర్వహిస్తున్నారు. చేతి ప్రతిని ప్రింట్‌కు రెడీ చేసేందుకు రచయితలకు ఎన్నో రకాలుగా ప్రొఫెషనల్ సర్వీసెస్‌లు అందుబాటులో ఉన్నాయి. ఒక్కసారి పని పూర్తయితే.. ఆ పుస్తకాలు ఆన్‌లైన్ చానల్స్‌లో ప్రపంచవ్యాప్తంగా అమ్మకానికి సిద్ధంగా ఉంటాయి.

నవ్‌సంగీత్ కౌర్

నవ్‌సంగీత్ కౌర్


‘‘చాలావరకు సెల్ఫ్ పబ్లిషింగ్ కంపెనీలు ప్రింట్ ఆన్ డిమాండ్ (పీఓడీ) మోడల్‌ను ఎంచుకుంటున్నాయి. ఒకేసారి పెద్ద మొత్తంలో పుస్తకాలను బల్క్ ప్రింటింగ్ చేసి పెద్ద మొత్తంలో ఖర్చు చేయకుండా, ఆన్‌లైన్ చానల్స్‌లో ఆర్డర్ ఉన్న సమయంలోనే పుస్తకాలను ప్రింట్ చేస్తారు. భారత్‌లో ప్రస్తుతం అమెజాన్.ఇన్, ఫ్లిప్‌కార్ట్, పేటీఎం, షాప్‌క్లూస్ వంటి ఈ కామర్స్‌ పోర్టళ్లలో బుక్స్ విక్రయిస్తున్నారు’’ అని నవ్‌సంగీత్ వివరించారు.

సంప్రదాయ పబ్లిషింగ్ రంగంలో ఓ పుస్తకాన్ని అచ్చేయాలంటే 6 నుంచి 12 నెలల సమయం పడుతుంది. కానీ సెల్ఫ్ పబ్లిషింగ్ రంగంలో ఓ రచయితకు తన పుస్తకాన్ని పబ్లిష్ చేసుకునేందుకు కొన్ని రోజులు, లేదా వారాలు మాత్రమే సరిపోతుంది. సంప్రదాయ పబ్లిషింగ్ రంగంలో పుస్తకాలు పూర్తిగా అమ్ముడవ్వాలంటే రెండు నుంచి నాలుగేళ్ల సమయం పడుతుంది. కానీ సెల్ఫ్ పబ్లిషింగ్‌లో ప్రింట్ ఆన్ డిమాండ్ మేరకే పుస్తకాలను విక్రయిస్తారు. అలాగే అమ్మకాలు, రాయల్టీల విషయంలోనూ పూర్తి పారదర్శకత ఉంటుంది. ఆన్‌లైన్‌లోనే అమ్మకాలు, రాయల్టీ వ్యవహారాలను రచయిత పర్యవేక్షిస్తారు. రెగ్యులర్ బేసిస్‌గా రాయల్టీని నేరుగా రచయితకే చెల్లిస్తారు.

‘‘ సంప్రదాయ పబ్లిషింగ్ రంగంతో పోలిస్తే సెల్ఫ్ పబ్లిషింగ్‌లో రాయల్టీ రేటు ఎక్కువగా ఉంటుంది. సంప్రదాయ పబ్లిషింగ్‌లోనైతే దళారులు, రీటైలర్లకు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది’’ అని కౌర్ వివరిస్తారు.

పెరుగుతున్న ఆసక్తి..

‘‘ఆన్‌లైన్‌లో పుస్తకాల విక్రయం జరిపే సెల్ఫ్ పబ్లిషింగ్ కాన్సెప్ట్‌ గురించి ఇప్పుడిప్పుడే రచయితలకు ఆసక్తి కలుగుతోంది. కొందరు రచయితలు మాత్రమే దేశవ్యాప్తంగా బుక్‌స్టోర్స్‌లో తమ పుస్తకాలను పెట్టేందుకు ఇష్టపడుతున్నారు. ప్రింట్ ఆన్ డిమాండ్ సెల్ఫ్ పబ్లిషింగ్ కాన్సెప్ట్ వచ్చిన తర్వాత, భారీ ఖర్చు చేసి పుస్తకాలను అచ్చు వేయించి స్టోర్స్‌లో పెట్టేందుకు పబ్లిషర్‌ కానీ, రచయిత కానీ ఆసక్తి చూపడం లేదు ’’ అని వివరించారు కౌర్.

అయితే నవ్‌సంగీత్ పబ్లిషింగ్ హౌజ్ సంప్రదాయ పబ్లిషింగ్‌ రంగంలోనూ పెట్టుబడులు పెట్టింది. కొన్ని ఎంపిక చేసిన పుస్తకాలను అచ్చేయించి, సెలెక్ట్ బుక్ స్టోర్స్‌లలో విక్రయిస్తున్నారు. ఇందుకోసం కొద్ది మొత్తంలో పెట్టుబడులను పక్కన పెడుతున్నారు.

అడ్వాంటేజ్ చండీగఢ్..

అందంగా, ప్రణాళిక ప్రకారం నిర్మించిన చండీగడ్‌లో మంచి సౌకర్యాలు, నాణ్యమైన జీవితం లభిస్తుంది. విద్యారంగానికి హబ్‌గా మారడంతో వైట్ ఫాల్కన్ పబ్లిషింగ్ వంటి సార్టప్‌లలో పనిచేసేందుకు మంచి నైపుణ్యం కలిగిన ప్రొఫెషనల్స్ లభిస్తున్నారు. అలాగే రెండున్నరేళ్లపాటు రిలయన్స్‌లో పనిచేసిన అనుభవం ఇప్పుడీ రంగంలో ఎంతో ఉపయోగపడుతోంది. ‘‘కొన్ని పరిమితులతో పురుషాధిక్య రంగంలోకి అడుగుపెట్టాను. కార్యకలాపాలను సొంతంగా నిర్వహించడం, సొంతంగా కీలక నిర్ణయాలు తీసుకోవడం, నేను మరింత క్రియాశీలకంగా పనిచేసేందుకు ఉత్సాహాన్నిస్తుంది. మనసుకు కూడా ఎంతో తృప్తిగా ఉంటుంది. మా అనుభవాలతో రచయితలు కూడా సంతృప్తిని వ్యక్తం చేస్తుండటంతో ఈ రంగంలో మరింత ఉత్సాహంగా పనిచేయాలని ఉంది ’’ అంటున్నరా 29 ఏళ్ల యువ పారిశ్రామిక వేత్త నవ్‌సంగీత్ కౌర్.