చాట్ చేయండి..! ట్రీట్మెంట్ తీసుకోండి..!!

ఆన్ లైన్ కౌన్సెలింగ్ స్టార్టప్ "టైప్ ఏ థాట్ "

చాట్ చేయండి..! ట్రీట్మెంట్ తీసుకోండి..!!

Monday April 11, 2016,

4 min Read


ఐటీ ఉద్యోగాలంటే వైట్ కాలర్ జాబ్స్ అనుకుంటారు. ఐదు రోజుల పని.. రెండు రోజుల జల్సా. ఈ రంగంలో ఉన్న కష్టానష్టాలు చాలా మందికి తెలియవు. అన్ని సౌకర్యాలు ఉన్న అందమైన ఆఫీసుల్లో.. ఏసీ గదుల్లో పనిచేసి అలసట అనేది లేకుండా ఉంటారని అనుకుంటారు. కానీ శారీరక అలసట ఉండకపోవచ్చు...కానీ మానసికంగా పడే అలజడి అంతాఇంతా కాదు. శారీరక కష్టం లేకపోవడం ఒక సమస్య.. మానసికంగా ఒత్తిడికి గురవడం మరో సమస్య. ఇలా అన్ని విషయాల్లోనూ ఐటీ ఉద్యోగులు ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇందులో ప్రధానమైనవి మానసికమైనవే.

ఒత్తిడి తట్టుకోలేక ఐటీ ఉద్యోగి ఆత్మహత్య..! 

ఇలాంటి వార్తలు ఇప్పుడు మనం ప్రతీ రోజు చూస్తూంటాం. ఆ మాటకొస్తే ప్రైవేటు ఉద్యోగులందరూ ఏదో రకంగా మానసికంగా ఒత్తిడికి గురవుతూంటారు. కొంత మంది బ్యాలెన్స్ చేసుకుంటారు. కానీ బ్యాలెన్స్ చేసుకోలేక అవస్థలు పడేవాళ్లు, వైద్య నిపుణులను సంప్రదించాలనుకునేవారు 42.5 శాతం మంది ఉన్నారని గత ఏడాది ఏప్రిల్ లో అసోచాం ప్రకటించిన నివేదికలో వెల్లడయింది. వీరికి ప్రధాన సమస్య డిప్రెషన్, యాంగ్జయిటీ డిజార్డర్.

చాలా మంది ప్రైవేటు ఉద్యోగులకు తమ సమస్య ఏమిటో కూడా అర్థం కాదు. ఎందుకు ఆందోళన చెందుతున్నారో.. ఎందుకు హైరానా పడిపోతున్నారో కూడా అర్థం కాదు. ఒత్తిళ్లతో విపరీతమైన పనులు చేసేవారు కూడా అధికంగా ఉంటారు. ఇలాంటి వారికి ఆన్ లైన్ లో సలహాలు సూచనలు అందించేందుకు ముంబై కేంద్రంగా "టైప్ ఏ థాట్" అనే స్టార్టప్ ప్రారంభమైంది. ముఫ్పైల్లో ఉన్న ఇద్దరు యువ డాక్టర్లు ఉద్యోగుల్లో పెరిగిపోతున్న మానసిక సమస్యలకు పరిష్కారం చూపించేందుకు ఈ స్టార్టప్ ను ప్రారంభించారు.    

డిప్రెషన్ కు డిజిటల్ పరిష్కారం.. !

డిప్రెషన్ లో ఉన్నవారు తమ సమస్య ఏమిటో నేరుగా డాక్టర్ ఎదుట చెప్పుకోవడానికి తటపటాయిస్తారు. కానీ చాటింగ్ లో మాత్రం మొత్తం వివరంగా చెప్పగలరు. అందుకే "టైప్ ఏ థాట్" ను డిజిటల్ కౌన్సెలింగ్ కు కేంద్రంగా తీర్చిదిద్దారు. మొదట www.typeathought.com సైట్ లో రిజిస్టర్ చేసుకోవాలి. నచ్చిన డిస్ ప్లే నేమ్ ను ఎంపిక చేసుకోవచ్చు. తర్వాత సమస్యను ఆన్ లైన్ లో ఉండే సైకాలజిస్ట్ కు వివరించి సలహాలు తీసుకోవచ్చు. ఈ ప్రక్రియ మొత్తం ఉచితంగానే నడుస్తుంది. మొదటి సెషన్ తర్వాత వ్యక్తిగతంగా కౌన్సెలింగ్ అవసరమని సైకాలజిస్ట్ అపాయింట్ మెంట్ బుక్ చేస్తాడు. "టైప్ ఏ థాట్" తో ఒప్పందం చేసుకున్న విభిన్న రంగాలకు చెందిన కౌన్సెలర్స్ అందుబాటులో ఉంటారు. ఏ నిపుణుడి అపాయింట్ మెంట్ కావాలో కస్టమరే ఎంపిక చేసుకోవచ్చు. "టైప్ ఏ థాట్" ఎక్స్ పర్ట్స్ లో సైకాలజిస్టులు, లైఫ్ కోచెస్, సైక్సాలజిస్ట్స్, సోషల్ వర్కర్లు, స్పీచ్ థెరపిస్టులు, మ్యారేజ్, ఫ్యామిలీ థెరపిస్టులు, సైకియాట్రిస్టులు ఉంటారు. వీరంతా ఈ మెయిల్, టెక్ట్స్ మెసెజస్, ఫోన్, వీడియోకాల్ ఆధారంగా కౌన్సెలింగ్ ఇవ్వడానికి రెడీగా ఉంటారు. మొదటి సెషన్ వరకే ఉచితం.. తర్వాత మాత్రం కొంత పే చేయాల్సి ఉంటుంది.

అజయ్ ఫడ్కే, అల్విన్ అల్వా, టైప్ ఏ థాట్ ఫౌండర్స్<br>

అజయ్ ఫడ్కే, అల్విన్ అల్వా, టైప్ ఏ థాట్ ఫౌండర్స్


ఫౌండర్లు డాక్టర్లే..!

ముంబైకి చెందిన అజయ్ ఫడ్కే, అల్విన్ అల్వా ఇద్దరూ వైద్యులు. పాథాలజీలో ఇద్దరూ ఎండీ. వీరు తమ విధులు నిర్వహించే సమయంలో రోగుల్లో ఎక్కువ మంది మానసిక సమస్యలతో బాధపడుతూండటం గమనించారు. వారికి అలాంటి విషయాల్లో చికిత్స తీసుకోవాలనే ఆలోచన కూడా లేకపోవడం మరింత ఆశ్చర్యపోయారు. కానీ వీరి విభాగం వేరు కాబట్టి ఏం చేయలేకపోయేవారు. అందుకే డిప్రెషన్ యాంగ్జయిటీ డిజార్డర్ లాంటి మానసిక సమస్యలకు డిజిటల్ కౌన్సెలింగ్ ఫ్లాట్ ఫామ్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. దీనిపై కొంత కాలం పరిశోధన చేసిన తర్వాత మంచి ఫలితాలు వస్తాయని అంచనా వేశారు. అయితే తమకో మెంటార్ అవసరమని గుర్తించారు. దానికోసం ముంబైలో ప్రముఖ సైకాలజిస్టుల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్న డాక్టర్ కిషోర్ ఫడ్కేను సంప్రదించారు. టైప్ ఏ థాట్ ఫౌండర్లలో ఒకరైన అజయ్ ఫడ్కే బంధువు కావడంతో సులువుగానే ఒప్పించగలిగారు. ఆయన సలహాలు, సూచనలతో టైప్ ఏ థాట్ ను రూపొందించారు. చీఫ్ ఎడ్వయిజర్ గా కిషోర్ ఫడ్కే కొనసాగుతున్నారు. రూ.70 లక్షల పెట్టుబడితో వెబ్ సైట్ ను లాంఛ్ చేశారు. వీరికి టెక్నికల్ బ్యాక్ గ్రౌండ్ లేకపోవడంతో ఏడాది పాటు వివిధ సాంకేతిక అంశాలపై అవగాహన పెంచుకున్నారు. ఇప్పుడు వెబ్ సైట్ నిర్వహణను ఔట్ సోర్సింగ్ కు ఇచ్చారు.

ప్రారంభించి రెండు నెలలు.. సక్సెస్ రేటు రెండింతలు...

టైప్ ఏ థాట్ సైట్ ను లాంచ్ చేసింది ఈ ఏడాది ఫిబ్రవరిలోనే. అంటే అటూ ఇటూగా రెండు నెలలు మాత్రమే. పది మంది ఉద్యోగులు, యాభై మంది నిపుణులు పనిచేస్తున్నారు. వారిలో 45 మంది వచ్చిన అపాయింట్ మెంట్ల ఆధారంగా సేవలు అందిస్తారు. మిగిలిన ఐదుగురు ఇన్ హౌస్ కౌన్సెలర్స్ గా విధులు నిర్వహిస్తున్నారు. సేవలు అందించేందుకు నిపుణుడిని ఎంపిక చేసుకునేటప్పుడు మూడంచెల్లో వెరిఫై చేసుకుంటారు. రిజిస్టర్ చేసుకున్నవారి డాక్యుమెంట్లు పరిశీలిస్తారు. తర్వాత వారితో మాక్ చాట్ నిర్వహిస్తారు. ఆ తర్వాత వారి అనుభవం, కౌన్సిలింగ్ తీరు లాంటివన్నీ అంచనా వేసుకుంటారు. ఆ తర్వాతే తమ సైట్ లో ఎక్స్ పర్ట్ కౌన్సిలర్ గా అవకాశం ఇస్తారు. రెండు నెలల్లోనే టైప్ ఏ థాట్ కు రెండు వేల మంది రిజిస్టర్డ్ యూజర్లు వచ్చి చేరారు. వచ్చేవారిలో ఐదు శాతం మంది పెయిడ్ యూజర్స్ గా మారారు. జూలై కల్లా ఈ సంఖ్య 8 శాతానికి పెరుగుతుందని.. రిజిస్టర్డ్ యూజర్లు పదివేల వరకూ చేరతారని అంచనా వేస్తున్నారు. ఢిల్లీ, బెంగళూరు, ముంబై, కేరళ, వెస్ట్ బెంగాల్, హైదరాబాద్ తో పాటు కశ్మీర్ నుంచి కూడా రిజిస్టర్డ్ యూజర్లు ఉన్నారని ఫౌండర్లు చెబుతున్నారు.

" మేము చాలా ప్రయోగాలు చేయాలనుకుంటున్నాం. మా సేవలను మరింత విస్త్రత పరుస్తాం. అంతా పర్ ఫెక్ట్ గా సాగే క్రమంలోనే వెళ్తున్నాం. " అజయ్ ఫడ్కే

విస్త్రత మార్కెట్

ఆన్ లైన్ కౌన్సెలింగ్ విభాగంలో మార్కెట్ కావల్సినంత ఉంది. ఇప్పటికే ఈ-సైక్లినిక్, హెల్త్ మైండ్స్ లాంటి స్టార్టప్ లు డిప్రెషన్, యాంగ్జయిటీ, కెరీస్, రిలేషన్ షిప్ ఇష్యూస్ లో కౌన్సెలింగ్ ఇస్తూ మానసిక స్థయిర్యాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నాయి. హోప్ నెట్ వర్క్ స్టార్టప్ ఇండియన్, ఇంటర్నేషనల్ థెరపిస్ట్ తో కౌన్సెలింగ్ ఏర్పాటు చేస్తోంది. టైప్ ఏ థాట్ రోజుకు 30- 40 కొత్త యూజర్లను నమోదు చేసుకుంటోంది. 150 వరకు డైలీచాట్ సెషన్స్ నమోదవుతున్నాయి. రెండు, మూడు నెలల్లో యాప్ ను కూడా లాంఛ్ చేయాలని నిర్ణయించుకున్నారు. మున్ముందు యూకే, నార్త్ అమెరికా మార్కెట్లలోకి ఎంటరవ్వాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.