నాడు ఒక సాధారణ గృహిణి.. నేడు మహిళా పారిశ్రామికవేత్తలకే రోల్ మోడల్..

నాడు ఒక సాధారణ గృహిణి.. నేడు మహిళా పారిశ్రామికవేత్తలకే రోల్ మోడల్..

Wednesday May 20, 2015,

5 min Read


చదువు పూర్తైంది, పెళ్లి - ముగ్గురు పిల్లలతో హ్యాపీగా సాగిపోతున్న గృహిణి జీవితం ఆమెది. కానీ ఆమె భర్త తీసుకున్న నిర్ణయం తన జీవితాన్నే మార్చేస్తుందని తను ఎన్నడూ ఊహించలేనే లేదు. ఇంట్లో పిల్లలతో కాలక్షేపం చేసుకుంటూ రోజంతా గడిపేసే తను ఊపిరి సలపనంత చేస్తూ.. ఊరికి ఉపకారి అనిపించుకునే స్థాయికి ఎదుగుతారని ఎన్నడూ అనుకోలేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని వందలాది మంది మహిళా పారిశ్రామికవేత్తలకు ఆమె ఓ రోల్ మోడల్. ఆడవాళ్లు కూడా పరిశ్రమలు ఏర్పాటు చేసి... పర్ఫెక్ట్‌గా నడిపించగలరు, అవసరమైతే మరో పది మందికీ మార్గదర్శిగా కూడా నిలవగలరు అనేందుకు అసోసియేషన్ ఆఫ్ లేడీ ఆంట్రప్రెన్యూర్స్ - ఎలీప్ అధ్యక్షురాలు రమాదేవి ప్రత్యక్ష ఉదాహరణ. 

రమాదేవి, ఎలీప్ వ్యవస్థాపక అధ్యక్షురాలు

రమాదేవి, ఎలీప్ వ్యవస్థాపక అధ్యక్షురాలు


యువర్ స్టోరీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆమె అనేక ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అనుకోకుండా ఈ వ్యాపార రంగంలోకి ఎందుకు రావాల్సి వచ్చింది ? తన పాతికేళ్ల ప్రస్థానంలో ఎదుర్కొన్న ఇబ్బందులు, అధిగమించిన సవాళ్లు.. పొందిన ఆత్మ సంతృప్తి వరకూ చాలా విషయాలను వివరించారు.

''మాది మధ్యతరగతి కుటుంబం. నేను డిగ్రీ పూర్తి చేసిన తర్వాత పెళ్లైంది. ముగ్గురు పిల్లలకు తల్లినయ్యాను. ఇక ఇల్లే నా జీవితం అనకుంటున్న పరిస్థితుల్లో మా వారు ఫ్యాబ్రికేషన్ రంగంలో ఉన్న ఒక సిక్ ఇండస్ట్రీని తీసుకున్నారు. దాంతో ఆయనకు కష్టాలు ఎక్కువయ్యాయి. తలకు మించిన భారం కావడంతో ఆయన సతమతమయ్యేవారు. ఆ పరిస్థితులు చూడలేక నేను కూడా ఎంతో కొంత సాయం చేయాలని నిర్ణయించుకున్నాను. ఆయనతో కలిసి 1983లో కంపెనీ కార్యకలాపాల గురించి తెలుసుకుంటూ.. ఒకొక్కటిగా సమస్యను పరిష్కరించుకుంటూ రాగలిగాం. ఆ తర్వాత 1990లో శివానీ ఫ్యాబ్రికేషన్స్ పేరుతో ఒక కంపెనీని ఏర్పాటు చేశాం. ఒక్క బస్సు నుంచి పది బస్సులు తయారు చేసే స్థాయికి కంపెనీని తీసుకు వచ్చాం. ఎంతో అనుభవం వచ్చింది.

ఇన్సులేషన్ వ్యాన్స్, బస్సుల తయారీ మా ప్రత్యేకత. కోస్తా తీర ప్రాంతాల నుంచి సీ ఫుడ్‌ను దూరప్రాంతాలకు తీసుకువెళ్లేందుకు వీలుగా ప్రత్యేక రవాణా వాహనాలను తయారు చేయడం మా ప్రత్యేకత. అక్కడ సూపర్ సక్సెస్ సాధించామనే చెప్పాలి'' అంటూ తాను అనుకోకుండా ఈ వ్యాపార రంగంలోకి దిగిన వైనాన్ని గుర్తుచేసుకున్నారు రమాదేవి.

image


ఒక్క క్షణం చేసిన ధైర్యమే జీవితాన్ని మార్చేసింది !

ఈ క్రమంలోనే ఆమె ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫ్యాప్సీ) మహిళా విభాగానికి అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. ఔత్సాహిక మహిళలకు ఎంతో చేయాలనే తాపత్రయం ఉన్నా అప్పట్లో మేల్ డామినేషన్ వల్ల ఏదీ సాధ్యపడలేదంటారు ఆమె. 'ఇంటి పనులు చూసుకోక మీకెందుకమ్మా ఈ వ్యాపారాలు..' అంటూ అందరూ ఉచిత సలహాలు ఇచ్చేవారే తప్ప ఊతమిచ్చిన వాళ్లే అప్పట్లో లేరనేది రమాదేవీ ఆవేదన. ఒకసారి అనుకోకుండా ficci ఢిల్లీ నుంచి అంతర్జాతీయ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయాలనే పిలుపు వచ్చింది. ఆ బాధ్యతను రమాదేవి భూజానికి ఎత్తుకుని కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపించారు. ఈ కార్యక్రమానికి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న కోట్ల విజయభాస్కర్ రెడ్డి చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. చురుకుగా కదులుతూ ఉత్సాహంగా ఉన్న రమాదేవిని చూసి.. మహిళా పారిశ్రామికవేత్తలకు ఏం కావాలని కోరారు. 'తమను అందరూ ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తున్నారని, తాము కూడా సమాజంలో గౌరవంగా, హుందాగా బతకేలా చూడాలని కోరారు. వీలైతే మహిళల కోసం ప్రత్యేకంగా పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేందుకు ఇరవై ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించాలని అడిగారు' రమ. 

ప్రభుత్వంతో పనంటే అంత సులువా ?

ఇది పెద్ద కోరికే అయినా ధైర్యం చేసే అడిగేశానని, ఆశ్చర్యంగా ఆయన వెంటనే ఓకె చేయడంతో పాటు జిఓ కూడా విడుదలైంది. ఈ లోపే అసోసియేషన్ ఆఫ్ లేడీ ఆంట్రప్రెన్యూర్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (ఎలీప్) పేరుతో ఓ సంస్థ ప్రాణం పోసుకుంది. ప్రభుత్వంతో పనంటే ఎలా ఉంటుందో అప్పుడే ఆమెకు తెలిసొచ్చింది. జిఓ విడుదలైంది కానీ 20 ఎకరాల స్థలం ఎక్కడిచ్చారో చెప్పే నాధుడే లేడు. అప్పుడే ప్రభుత్వాలు మారిపోవడంతో ఆ భూమి వ్యవహారం మరుగున పడింది. చేతుల్లోకి వచ్చిన అవకాశం చేజారిపోకూడదని ఆమె అప్పటి సిఎం ఎన్టీఆర్‌ను కూడా పదే పదే కలిశారు. పరిశ్రమల శాఖ వ్యవహారాలు చూస్తున్న అప్పటి మంత్రి చంద్రబాబు కూడా తాత్సారం చేస్తూనే వచ్చాను. మళ్లీ ప్రభుత్వం మారి అధికార పగ్గాలు చంద్రబాబు చేతికి వచ్చాయి. అప్పుడు మళ్లీ రమాదేవి చంద్రబాబును కలిసి పాత ఫైలుకు మోక్షం కల్పించమని కోరారు. అయితే కేంద్ర ప్రభుత్వ సాయంతో పాటు ఇతర ప్రయోజనాలు పొందేందుకు అదనంగా మరో 10 ఎకరాలు కూడా స్థలం కావాలని కోరడంతో ఆయన వెంటనే సాంక్షన్ చేసి హైదరాబాద్‌లోని గాజులరామారంలో 30 ఎకరాల స్థలాన్ని సబ్సిడీ ధరకు కేటాయించారు. నగరానికి అప్పట్లో 18 కిమీ దూరంలో కొండలు, గుట్టలు, అడవిలా ఉన్న ఆ ప్రాంతాన్ని చూసి రమాదేవి అండ్ టీం అప్పటికే బిక్కచచ్చిపోయింది. 

కొండల్లో మహిళలకు ఇండస్ట్రియల్ పార్క్

ఇక్కడ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు సాధ్యమేనా, మౌలిక వసతుల కల్పనకే భారీగా ఖర్చవుతుందేమో.. తక్కువ ధరకు మహిళలకు భూములు ఇవ్వగలమా అని పునరాలోచనలో పడ్డారు. అయినా సరే తమ దగ్గర ఉన్న నిధులతో పనులు ప్రారంభమయ్యాయి. పవర్, వాటర్, డ్రైనేజ్, రోడ్స్ వంటి ప్రధాన పనులు మెల్లిగా సాగుతున్నాయి. ఈ లోపు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ గురించి తెలుసుకుని అప్పటి కేంద్ర మంత్రి వసుంధరా రాజేను కలిశారు. తమ సంస్థ చేస్తున్న కృషిని వివరించి మహిళల పురోగతికి తోడ్పడాలని కోరారు. హైదరాబాద్ వచ్చి ఎలీప్ సందర్శించి ఆశ్చర్యానికి లోనై వసుంధర.. ఢిల్లీ వెళ్లిన వెంటనే నిధులను కేటాయించారు. ఇక అప్పటి నుంచి ఎలీప్ వెనక్కి తిరిగి చూడలేదు. ప్రస్తుతం గాజులరామారంలో ఉన్న 120 ప్లాట్లలో దాదాపు 140 పరిశ్రమలు కొలువుదీరాయి. పచ్చళ్లతో మొదలై.. ట్రాన్స్‌ఫార్మర్లు, పెయింట్ల తయారీ వరకూ చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఎన్నో అక్కడ కొలువుదీరాయి. త్వరలో 83 ఎకరాల్లో జర్మనీ సహకారంతో మరో ఇండస్ట్రియల్ పార్క్ కూడా ఎలీప్ ఆధ్వర్యంలో రాబోతోంది.

విదేశీ బృందంతో రమాదేవి

విదేశీ బృందంతో రమాదేవి


ఎలీప్ ప్రత్యేకత ఏముంది ?

అయితే ప్రభుత్వం నుంచి భూమిని కొని పరిశ్రమలకు ఇస్తే అది కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారమే అవుతుంది. అందులో ఎలీప్ గొప్పదనం ఏముంది ? అని ఎవరైనా అడగొచ్చు. కానీ ఇక్కడ మాత్రం వ్యవహారం పూర్తిగా భిన్నం. ఏదైనా వ్యాపారం చేయాలని ఉంది.. అని వచ్చే వాళ్లకు ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి ఇవ్వడం మొదలు బ్యాంకర్లతో మాట్లాడడం, రుణాలు ఇప్పించడం, కౌన్సిలింగ్ నిర్వహించడం, వారి అవసరాలకు తగ్గట్టు మార్కెటింగ్ సౌకర్యాలను కూడా కల్పిస్తూ మహిళలకు మార్గదర్శనం చేయడంలోనే ఎలీప్ విజయం సాధించింది. అక్కడే తన ప్రత్యేకతను చాటుకుంది. దీనివల్లే సార్క్, యూరోపియన్ యూనియన్ దేశాలు ఎలీప్‌ను రోల్ మోడల్‌గా గుర్తించాయి. మహిళల ఉన్నతికి వీళ్లు చేస్తున్న మోడల్‌ను వాళ్లూ అవలంభించడం మొదలుపెట్టాయి. అంతే కాదు దేశంలో ఇలాంటి మోడల్‌ రూపకల్పన చేయడంతో పాటు చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధికి అందిస్తున్న తోడ్పాటును గుర్తించిన కేంద్రం 'పిఎం టాస్క్‌ఫోర్స్ ఆన్ ఎంఎస్ఎమ్ఈ'లో రమాదేవిని సభ్యురాలిగా తీసుకుంది. 'ఇదో పెద్ద విజయమని, జీవితంలో మరిచిపోలేనిదని, ప్రధాని అధ్యక్షత వహించే కార్యక్రమానికి తను ఓ మెంబర్‌గా పనిచేయడం' గొప్ప అనుభూతిగా ఆనందపడిపోతూ చెబ్తారు రమాదేవి.

మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం,  ఎపి సిఎం చంద్రబాబుతో కలిసి

మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం, ఎపి సిఎం చంద్రబాబుతో కలిసి


ఇప్పుడు ఎలీప్ జర్మన్, ఆఫ్రికా దేశాలతోనూ సంయుక్తంగా వివిధ ప్రాజెక్టుల్లో పనిచేస్తోంది. 16 కేంద్ర మంత్రిత్వ శాఖలతో నిత్యం సంప్రదింపులు జరుపుతోంది. తెలుగు రాష్ట్రాల్లో మూడు పారిశ్రామిక పార్కులు, ఒక శిక్షణా సంస్థతో ప్రగతి పథంలో దూసుకుపోతోంది. ప్రస్తుతం కర్నాటకలో కాలుమోపిన ఎలీప్ త్వరలో తమిళనాడు సహా దక్షిణాది రాష్ట్రాల్లోనూ ఇలాంటి సక్సెస్‌ఫుల్ మోడల్‌ను వర్కవుట్ చేయాలని చూస్తోంది.

image


పారిశ్రామికవేత్తగా మారాలనుకునేవాళ్లకు ఇచ్చే సలహా

  • డబ్బుల కోసమే పరిశ్రమలు పెట్టొద్దు
  • 9-5 ఉద్యోగానికి బదులు ఏదో ఒకటి చేయాలనే తపన ఉంటేనే ఇందులోకి దిగండి
  • కష్టనష్టాలు ఎదురైనప్పుడు అధైర్య పడి పరిస్థితులకు లొంగిపోవద్దు. ధైర్యంగా పోరాడి ఎదురు నిలబడండి.
  • ఏదో కొత్తగా చేయాలని అనుకోవద్దు. మీకు ఏం వచ్చో మీకు ఎందులో ప్రావీణ్యం ఉందో గుర్తించండి. అదే వ్యాపారానికి బీజం.
  • పచ్చళ్లు పెట్టడం వచ్చా.. అయితే అదే నైపుణ్యం. అందులోనే మీ ప్రతిభ చాటండి.
  • అన్నింటికంటే క్రమశిక్షణ చాలా విషయం.
  • టైమ్ మేనేజ్‌మెంట్ చేసుకోండి.


ఇండస్ట్రియల్ పార్కులోని ఓ సంస్థలో పనిచేస్తున్న మహిళలు

ఇండస్ట్రియల్ పార్కులోని ఓ సంస్థలో పనిచేస్తున్న మహిళలు


'దేశంలో ఉన్న ప్రతీ ఇల్లూ ఒక పరిశ్రమగా మారి.. ప్రతీ మహిళా నెలకు కనీసం రూ.10 వేలు సంపాదించేలా చేయాలనే అతి భారీ లక్ష్యం తన ముందు ఉందని, అందులో ఎంత చేసినా తాను సక్సెస్ సాధించినట్లేననేది' రమాదేవి మాట.