మమ్మల్ని గాలి కూడా పీల్చుకోనివ్వరా..?గ్రీన్ ట్రైబ్యునల్ ను నిలదీసిన ఆరేళ్ల చిన్నారి !

0

మీకు గుర్తుండే ఉంటుంది.. మొన్న ఏప్రిల్ లో ఉత్తరాఖండ్ కి చెందిన రిధిమా పాండే అనే తొమ్మిదేళ్ల బాలిక గ్రీన్ ట్రైబ్యునల్ పై ప్రశ్నల బాణం ఎక్కుపెట్టింది. ప్రకృతి సర్వనాశనమై పోతుంటే ఇంతకాలం ప్రభుత్వాలు ఏం చేశాయంటూ నిలదీసింది. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ కి చెందిన మరో ఆరేళ్ల చిన్నారి కూడా రిథిమా పాండేలాగే గ్రీన్ ట్రైబ్యునల్ ను నిగ్గదీసింది.

అర్జున్ మాలిక్ చదివే స్కూల్ దగ్గర పౌల్ట్రీఫాం ఉంది. దాన్నుంచి రోజూ భయంకరమైన దుర్గంధం. చిన్నపిల్లలు ఆ వాసనకి ఉక్కిరి బిక్కిరవుతున్నారు. ఘాటైన స్మెల్ వల్ల చాలామంది పిల్లలు శ్వాస తీసుకోలేకపోతున్నారు. ఈ విషయంపై అర్జున్.. గ్రీన్ ట్రైబ్యునల్ ని నిలదీశాడు. పౌల్ట్రీ యజమానిపై పిటిషన్ దాఖలు చేశాడు. స్టేట్ పొల్యూషన్ బోర్డుకి ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. నిబంధనలు తుంగలో తొక్కినా వాళ్లు పట్టించుకోవడం లేదని పేర్కొన్నాడు. స్వచ్ఛమైన గాలిని పీల్చుకునే పిల్లల హక్కుని కాలరాస్తున్నారని తెలిపాడు.

ఆ ఏరియాలో సుమారు మూడువేల మంది చిన్నారులు స్కూలుకి వెళ్తున్నారు. అందరిదీ ఒకటే సమస్య. పౌల్ట్రీ నుంచి వచ్చే భయంకరమైన వాసన తట్టుకోలేకపోతున్నారు. కోళ్లపెంట మూలంగా పిల్లలు శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్నారు. కోళ్ల ఫారంలో ఎలాంటి ట్రీట్మెంట్ ప్లాంట్ లేకపోవడంతో, పెంటనంతా విచ్చలవిడిగా ఎక్కడపడితే అక్కడ పారబోస్తున్నారు. దానివల్ల వాసన దట్టంగా అలుముకుని పసివాళ్లను ఊపిరి సలపనివ్వడం లేదు.

స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అలసత్వం, పర్యవేక్షణ లేని కారణంగా పౌల్ట్రీ చుట్టుపక్కల ప్రాంతాలు దుర్గంధం వెదజల్లుతున్నాయి. ప్రజలు క్రమంగా రోగాలబారిన పడుతన్నారు. పిల్లల అవస్థ మరీ దారుణంగా వుంది.

చిన్నారి వేసిన పిటిషన్ ను స్వీకరించిన గ్రీన్ ట్రైబ్యునల్ పౌల్ట్రీ యజమానికి నోటీసులు పంపింది. వారంలోగా జవాబు ఇవ్వాలని ఆదేశించింది.