లక్షల కోట్ల చీరల వ్యాపారంలో గుత్తాధిపత్యం లేదెందుకు..?!

లక్షల కోట్ల చీరల వ్యాపారంలో గుత్తాధిపత్యం లేదెందుకు..?!

Friday April 15, 2016,

3 min Read


చీర- నిలువెత్తు భారతీయం..! చీర- నిలువెత్తు సంప్రదాయం...!!

చీర- ఏడు మల్లెలెత్తు సింగారం.. ! చీర- నిండైన హుందాతనం !! 

సీతాకోక చిలుకకు వళ్లెంత అతిశయమో..! అతివకు చీరంత అతిశయం..!! 

మగువ లాలిత్యానికి చీరే అసలైన చిరునామా...!!

ఎర్రరంగు చీరలో సందెపొద్దులా..! పచ్చరంగు చీరలో పంట చేలలా..!! 

ఇలా చీర గురించి చెప్పుకుంటూ పోతే.. తెలుగు కవులంతా కట్టగట్టుకుని పూనుతారు..!! 

ప్రపంచం వేగంగా మారిపోతోంది. రోజుకో ఫ్యాషన్ పుట్టుకొస్తోంది. కట్టు మారుతోంది. బొట్టు మారుతోంది. ఆంగికం, వాచకం, వ్యవహారికం.. అన్నీ మారుతున్నాయి. అయినా సరే, ఆహార్యం విషయంలో చీరకు సాటి మరే వస్త్రమూ లేదు. మంచి గంధం ఇగిరిపోనట్టే- చీర గొప్పతనమూ పోలేదు. కార్పొరేట్ కాలంలో కూడా మన సంప్రదాయ విలువలు ఇంకా సజీవంగా ఉన్నాయంటే కారణం- ఆరు గజాల చీర. 

ఇంటావిడని తీసుకెళ్లి చీరల షోరూంలో వదిలేయండి.. మీరు ఆలోపు హైదరాబాద్ నుంచి అమెరికాకి వెళ్లి రావొచ్చు. ఆడవాళ్లకి చీరలంటే అంత మోజు. చీరలంటే అంత ఇష్టం. చీరలంటే అంత ప్రాణం. కేజీల లెక్కన తూచి ఇచ్చినా తీసుకుంటారు. లక్షల్లో ఫిక్స్ డ్ రేట్లు పెట్టినా కొనేస్తారు. అందుకే మన దేశంలో చీరల మార్కెట్ విలువ లక్ష కోట్లకు పైమాటగానే వుంది. వంద రూపాయల నుంచి లక్షా రెండు లక్షల వరకు చీరలున్నాయి. కలర్స్, డిజైన్స్, ఫ్యాబ్రిక్ ఇలా మార్కెట్లో వందల బ్రాండ్స్ ఉన్నాయి. వేలాది కంపెనీలు చీరల్ని తయారుచేసి అమ్ముకుంటున్నాయి. కొన్ని బ్రాండ్స్ ఎక్కువ పాపులరయ్యాయి. ప్రఫుల్ శారీస్ బ్రాండ్ బిల్డింగ్ పై ఎక్కువ ఖర్చు చేస్తోంది. డిజైన్లకు పెట్టిందిపేరు సత్యపాల్. నల్లి, కుమారన్, పోతీస్, కళ్యాణ్ సిల్క్స్ సౌతిండియాలో చాలా ఫేమస్ స్టోర్స్. పెళ్లిళ్లలో ఇప్పటికీ పట్టు చీరలకే పెద్ద పీటవేస్తున్నారు. పట్టుశారీ కట్టుకోవడం నేటి తరానికి ఫ్యాషన్ కూడా.

లక్ష కోట్ల రూపాయల చీరల మార్కెట్లో ఏ ఒక్క బ్రాండ్ కూ గుత్తాధిపత్యం లేదు. ఇంతపెద్ద మార్కెట్ ను ఏకపక్షంగా దున్నేయడం ఏ ఒక్క సంస్థకూ సాధ్యంకాదు కూడా. ఎన్ని బ్రాండ్స్ వస్తున్నా మార్కెట్లో ఇంకా చాలా చీరలకు చోటుంది. అసలు ఈ మార్కెట్ ఎలా ఉంది… ? ఎందుకు సింగిల్ బ్రాండెడ్ కాలేకపోతోందో ఒక లుక్కేద్దాం...

image


1. చీరల్లో వెరైటీలు అనంతం. రామకోటి రాసినట్టుగా చీరకోటి రాయొచ్చు. వందల కాంబినేషన్స్ ఉన్నాయి. వేల వెరైటీలు. ఇన్ని రకాల చీరల్లో ఏది కొనాలో లేడీస్ కు ఒక పట్టాన తెగదు. చీరలు సెలెక్ట్ చేసుకోవడం అంత ఆషామాషీ వ్యవహారం కూడా కాదు. అన్ని వెరైటీలు షాపుల్లో ఉంచడం కూడా సాధ్యం కాదు. ఒక్క షాపులో సగటున వెయ్యి నుంచి రెండు వేలు మాత్రమే ఉంటాయి. అసలు ఈ మార్కెట్లో ఎన్ని షాపులున్నాయో చెప్పలేం… అందుకే మల్టిపుల్ బ్రాండ్స్ కు అవకాశం ఎక్కువ. ఈ రంగంలోకి ఎన్ని పెట్టుబడులు వస్తున్నాయో కూడా అంచనా వేయడం కష్టం.

2. చీరల మార్కెట్లో క్వాలిటీ గురించి ఎవరూ గ్యారెంటీ ఇవ్వరు. ఇవ్వలేరు కూడా. షాపు యజమాని మాటే హామీగా తీసుకోవాలి. బయ్యర్లే మంచి క్వాలిటీని సెలెక్ట్ చేసుకోవాలి. ధరకూడా వారే అంచనా వేసుకుని బేరమాడి కొనాలి. కొన్ని దశాబ్దాల క్రితం భారత్ లో నగల మార్కెట్ కూడా ఇలాగే ఉండేది. అప్పట్లో తమకు తెలిసిన షాపు నుంచే నగలు, ఆభరణాలు కొనేవారు. కొత్త షాపులను నమ్మేవారు కాదు. అందుకే కొత్తగా జ్యూవెలరీ షాపులు మొన్నటి దాకా రాలేదు. కేవలం నమ్మకంపై మాత్రమే వ్యాపారం జరిగేది. కార్పొరేట్ కంపెనీలు వచ్చాక గోల్డ్, డైమండ్ మార్కెట్ల సీన్ మారిపోయింది. నమ్మకం స్థానంలో క్వాలిటీ వచ్చి చేరింది. అందుకే వాటికి ఆదరణ పెరిగింది. ఇవాళ జివెల్రీ షాపులు వేలకోట్ల రూపాయల వ్యాపారాలు చేస్తున్నాయి. మరి ఈ పరిస్థితి చీరల మార్కెట్ కు ఎందుకు రావడం లేదు. నగల్లా చీరల్ని తయారుచేయడం, అమ్మడం ఒకే కంపెనీ ఎందుకు చేయడం లేదు. ఎందుకు ఈ మార్కెట్లో గుత్తాధిపత్యానికి తావులేదు..?

౩. అసలు శారీ మార్కెట్లో ధరల విషయంలో ఒక పద్ధతీపాడూ లేదు. డిజైన్ డిజైన్ కీ- షాపు షాపుకూ రేట్లు మారిపోతుంటాయి. డిస్కౌంట్లనీ, బంపర్ బొనాంజాలనీ, గిఫ్టు కూపన్లనీ, పండగ స్పెషల్ అనీ.. రకరకాలుగా కస్టమర్లకు తరలించుకుపోవడమే మార్కెట్ స్ట్రాటజీ అయింది. అందుకే ఫలానా రేంజ్ చీరలే మా దగ్గర దొరుకుతాయని ఏ షాపూ బోర్డు పెట్టలేదు. మ్యారేజ్ శారీస్, డిజైనర్ శారీస్ అని మాత్రమే ఫ్లెక్సీలు, హోర్డింగులు కనిపిస్తాయి. మన దేశంలో పెళ్లిళ్ల సమయంలో చీరలపై ఖర్చుకు వెనుకాడరు. పైగా ఈ చీరకు ఇంత రేటు అని గొప్పగా చెప్పుకుంటారు కూడా. సేల్స్ సెగ్మెంట్ కు కూడా టార్గెట్ మార్కెట్ అంటూ ఏమీ లేదు. అందుకే కొంతమంది కస్టమర్ల కోసం ప్రత్యేక బ్రాండ్స్ తయారు చేయడం సాధ్యంకాదు. సరే, తయారుచేశారే అనుకుందాం.. ఖర్మకాలి ఒకవేళ ఆ కస్టమర్ కొనకపోతే- నష్టం సంగతి దేవుడు చూస్తాడా..? అందుకే మహిళల అభిరుచిని దృష్టిలో పెట్టుకునే బ్రాండ్స్ తయారు చేస్తాయి కంపెనీలు. చీరల మార్కెట్లో ఒక ప్రత్యేక గ్రూప్ కస్టమర్లను టార్గెట్ చేయడం సాధ్యంకాదు. సెగ్మెంటేషన్ కష్టం. ఎందుకంటే కస్టమర్ల టేస్ట్ తరచూ మారిపోతుంటుంది.

image


ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకునే చీరల వ్యాపారంలోకి దిగాలి. రిస్క్ ఎక్కువ. మహిళల అభిరుచులను ఎప్పటికప్పుడు గమనిస్తుండాలి. భారతదేశంలోనేకాదు- శ్రీలంక, నేపాల్, భూటాన్ సహా దక్షిణాసియాలోని చాలా దేశాల్లో మగువలు చీరలు కడతారు. ఇది ఎవర్ గ్రీన్ మార్కెట్. అందుకే గుత్తాధిపత్యం లేదు. ఎవరైనా వ్యాపారం చేయవచ్చు. మనదేశంలో చీరల వ్యాపారానికి తిరుగులేదనే చెప్పొచ్చు. అందుకే సింగిల్ బ్రాండెడ్ ఆధిపత్యం ఎట్టిపరిస్థితుల్లో సాధ్యం కాదు.