ఒకప్పుడు నెలకు రూ.150 జీతం! ఇప్పుడు నెలకు రూ. 30 కోట్ల వ్యాపారం! గణపతి బన్ గయా కరోడ్ పతి!!

1

మెల్లగా ఎలాగోలా బతికేద్దామని ముంబైకి రాలేదు.. ఓ సినిమాలో హీరో యమా కసితో చెప్పే డైలాగ్ మీకు గుర్తుండే వుంటుంది. అలాంటి వీరోచితమైన మాటలేం లేవిక్కడ. కానీ అక్కడ హీరోకి ఎంత కాన్ఫిడెన్స్ వుందో ఇక్కడ హీరోకీ అంతే వుంది. ఆ సంకల్పమే 150 రూపాయల జీతం నుంచి 30 కోట్ల టర్నోవర్ బిజినెస్ దాకా తీసుకెళ్లింది. ఎలా సాధమ్యమైందనేగా మీ సందేహం..? అయితే లేటెందుకు చదివేయండి.

ప్రేమ్ గణపతి ఇల్లొదిలినప్పుడు అతని వయసు 17. ఇంట్లో చెప్పా పెట్టకుండా బయటపడ్డాడు. సొంతూరు తమిళనాడు ట్యూటికోరిన్ దగ్గర. ఫలానా తీరుగా బతుకుదామని కాకుండా - ఎలాగోలా బతుకుదామని ముంబై చేరుకున్నాడు. మహానగరం అర్ధం కావడానికి టైం పట్టింది. ఆకలి రూపంలో తొలిపరీక్ష ఎదురైంది. ముందు కడుపు బాధ తీరాలి. తర్వాతే ఏదైనా అనుకున్నాడు. మొత్తానికి ఓ బేకరిలో అంట్లు తోమే పనికి కుదరాడు. తిండిపెట్టి, షెల్టర్ ఇచ్చి, నెలకు 150 ఇస్తామన్నారు. సరే అన్నాడు.

అలా రెండేళ్లు గడిచిపోయాయి. వెనక్కి తిరిగి చూసుకుంటే చిరుగుల చొక్కా, మాసిపోయిన ప్యాంటు తప్ప జీవితంలో ఏమీ లేదు. ఆ వయసుకి చేతినిండా పనిలేదనేదే అతని ఇంటెన్షన్. అందుకే మరి కొన్ని రెస్టారెంట్లను మాట్లాడుకున్నాడు. తిండి ఎలాగూ బేకరిలో వుంది. కనుక ఎంతోకొంత మనీ సేవ్ అవుతుంది అనేది అతని ప్లాన్. కొన్నాళ్లకు పిజా డెలివరీ బాయ్ అవతారమెత్తాడు. అలా జీవితం నవీ ముంబైకి చేరుకుంది. అక్కడ ఒక రెస్టారెంట్లో డిష్ వాషర్ గా పనికి కుదిరాడు.

కాలం గిర్రున తిరిగింది. చేతిలో చిల్లిగవ్వ లేదు. ఇలా అయితే లాభం లేదనుకున్నాడు. తెలిసిన వాళ్ల దగ్గర కొంత చేబదులు తీసుకుని ఒక తోపుడు బండి రెంటుకు తీసుకున్నాడు. దానిమీద ఇడ్లీలు, దోశెలు పెట్టి వషి రైల్వేస్టేషన్ ముందు నిలబడ్డాడు. కానీ మున్సిపాలిటీ వాళ్లు ఊరుకుంటారా? రోడ్డువారగా దుకాణం అంటే చాలు.. ఇరగ్గొట్టేదాకా వాళ్ల మనసు ఊరుకోదు. గణపతి పరిస్థితి అదే. బండి ఇలా పెట్టాడో లేదో- అలా మున్సిపాలిటీ వ్యాన్ వచ్చి ఈడ్చి ఇవతల పడేసింది. అలా ఎన్నిసార్లు బండిని ఎత్తుకెళ్లారో లేక్కేలేదు. అయినా గణపతి బెదరలేదు. ఎత్తుకెళ్లనీ.. ఎన్నిసార్లు తీసుకెళ్తారో చూద్దాం అకున్నాడు. మొండిఘటం టైపు.

ఈ పాజిటివ్ యాటిట్యూడ్ గణపతికి ఎలా అబ్బిందంటే -అతని రూమ్మేట్లలో కాస్త చదువుకున్న వాళ్లున్నారు. అలా వాళ్ల ద్వారా కాన్ఫిడెన్స్ గెయిన్ చేశాడు. అంతేకాదు కంప్యూటర్ నాలెడ్జ్ కూడా సంపాదించాడు. వీలు దొరికినప్పుడల్లా నెట్ కేఫ్ లో కూచుని గంటా రెండు గంటలు అలా సర్ఫింగ్ చేసేవాడు. అప్పుడే వ్యాపారం అనే మాట మదిలో పడింది. బిజినెస్ వార్తలమీద మనసు మళ్లింది. చాలా రీసెర్చ్ చేశాడు. పైగా తను బండి పెట్టే దగ్గర కొత్తగా మెక్ డోనాల్డ్స్ ఓపెన్ చేశారు. అదెంత తక్కువ సమయంలో పాపులర్ అయిందో ఇతను కళ్లారా చూశాడు. అక్కడ ఫిక్సయ్యడు గణపతి. ఎలాగైనా రెస్టారెంట్ పెట్టాలని డిసైడయ్యాడు.

1997లో ఒక చిన్న ప్లేస్ లీజుకు తీసుకున్నాడు. దానికి నెలకు 5 వేలు రెంటు. హోటల్ కు ప్రేమ్ సాగర్ దోశ ప్లాజా అని పేరు పెట్టాడు. పేరులోనే దోశ వుంది కాబట్టి దోశలో ప్రయోగాలు చేయాలనుకున్నాడు. రెగ్యులర్ దోశలు ఎక్కడైనా దొరుకుతాయి. కానీ ఇక్కడంటూ ఒక స్పెషాలిటీ వుండాలిగా. అందుకే రకరకాల ఎక్స్ పరిమెంట్స్ చేశాడు. మొదటిసారి ఒక 26 వెరైటీలు జనాలకు పరిచయం చేశాడు. షెజ్వాన్ దోశ, పనీర్ చిల్లీ, స్ప్రింగ్ రోల్ దోశ ఇలా.. అనేక ప్రయోగాలు చేశాడు. 2002 నాటికి ప్రేమ్ దోశ ప్లాజా ముంబై వాసులకు ఫేవరెట్ బ్రేక్ ఫాస్ట్ అడ్డాగా మారిపోయింది. 20-30 కాదు 105 రకాల దోశలు వేసి జనం చేత శెభాష్ అనిపించుకున్నాడు.

భాగ్యవంతుడిని ఎవరూ చెడగొట్టలేరు.. దరిద్రుడని ఎవరూ బాగుచేయలేరంటారుగా. సేమ్ అదే టైప్. గణపతి సుడి ఎలా తిరిగిందంటే- ఇతని దోశ ప్లాజా దగ్గర ఒక పెద్ద షాపింగ్ మాల్ ఓపెనైంది. అందులో మేనేజ్ మెంట్, సిబ్బంది అంతా ఇతని రెస్టారెంటులోనే తినేవారు. ఇంత మంచి ఫుడ్ ఎక్కడో బయట ఎందుకు వుండాలి.. తమ మాల్ లో ఔట్ లెట్ ఎందుకు వుండొద్దు అనుకున్నారు. మాల్ లో స్టాల్ పెట్టమని సలహా ఇచ్చారు. అంతే మనోడి దశదిశా అన్నీ ఒక్క దోశెతో తిరిగిపోయాయి.

కట్ చేస్తే, ప్రేమ్ సాగర్ దోశ ప్లాజాలు ఇండియా అంతటా 45 ఔట్ లెట్స్ వెలిశాయి. యూఏఈ, ఒమన్, న్యూజిలాండ్ కలిపి మూడుదేశాల్లో 7 ఇంటర్నేషనల్ ఔట్ లెట్స్ అవతరించాయి. అవిగాక ఫ్రాంచైజీ రిక్వెస్టులు. అందులో విదేశాలనుంచి కూడా. ఒకప్పుడు నెలకు 150 రూపాయల జీతంతో బతికిన ప్రేమ్ గణపతి- ఇవాళ కరోడ్ పతి. ఒకటి కాదు రెండు కాదు. 30 కోట్ల రూపాయల టర్నోవర్.

పేదరాశి పెద్దమ్మ చెప్పిన రాకుమారుడి కథల్లో వీరోచితం వుందో లేదో గానీ.. ప్రేమ్ గణపతి కథలో మాత్రం అణువణువూ హీరోచితమే.

Related Stories