రిక్షా కార్మికులను ఓనర్లుగా మారుస్తున్నసోషల్ ఆంట్రప్రెన్యూర్ నవీన్ కృష్ణ

రిక్షా కార్మికులను ఓనర్లుగా మారుస్తున్నసోషల్ ఆంట్రప్రెన్యూర్ నవీన్ కృష్ణ

Friday July 03, 2015,

4 min Read

ప్రతీవారికీ చిన్నవో... పెద్దవో కొన్ని కలలు ఉంటాయ్. ఆ కలలు, ఆశయాలే మనిషిని ముందుకు నడిపిస్తుంటాయ్. ఎంత చెట్టుకు అంత గాలి. ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ల ఆలోచనలు ఉంటాయి. ఓ కోటీశ్వరుడు మేడ మీద మేడ కట్టాలని చూస్తే.. ఓ రిక్షా కూలీ.. తానూ ఓ సొంత రిక్షా కొనుక్కోవాలని చూస్తాడు.

నవీన్ కృష్ణ అనే కుర్రాడు వాళ్ల కలలు నెరవేర్చే మాంత్రికుడిగా మారాడు. ఎస్ఎంవి వీల్స్ పేరుతో ఓ స్టార్టప్ మొదలుపెట్టాడు. చాలా మెట్రోనగరాల్లో ప్రయాణ సాధనాలంటే..కార్లు, ఆటోలే కాదు..రిక్షాలు కూడా. అదే వారణాసిలో అయితే ఈ రవాణా వ్యవస్థ ఎక్కువగానే ఉంది. ఎస్ఎంవి కంపెనీ అలాంటి పేద రిక్షా పుల్లర్లకు తాము సొంతంగా రిక్షాలు కొనుక్కునేలా సాయపడుతోంది. తామే రిక్షాలు సరఫరా చేస్తూ... వారి దగ్గర వారానికి ఇంత సొమ్మును వాయిదాల రూపంలో కట్టించుకుంటోంది.

అలా సంవత్సరం తిరిగేటప్పటికల్లా అదే రిక్షాకు వారు ఓనర్లు అవుతుంటారు. దాంతో పాటు వారానికి తాము చెల్లించే సొమ్ముతో భవిష్యత్తులో లోన్లు పొందే సదుపాయం కూడా ఎస్ఎంవి వీల్స్ కల్పించడమే విశిష్టతగా చెప్పుకోవాలి. అలా సొంతంగా రిక్షాలు పొందడంతో పాటు..ఆర్ధికస్థితి మెరుగు పరుచుకోవడానికి ఈ పద్ధతి ఉపయోగపడుతుంది. దీంతో పాటే ప్రతీ రిక్షా డ్రైవర్‌కూ బీమా సౌకర్యం కూడా కల్పిస్తున్నారు. ప్రాణాలు కోల్పోయినా, తీవ్రంగా గాయపడినా.. చికిత్స పొందడంతో పాటు ఒక వేళ రిక్షా చోరీకి గురైనా బీమా పొందే వెసులుబాటు ఉంటుంది. వారణాసిలో ప్రతీ రిక్షాకి డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. ప్రభుత్వంతో పాటు తమ సంస్థ నుంచి ప్రయోజనం పొందే ప్రతీ ఒక్కరికీ లైసెన్స్ పొందడంలో ఎస్ఎంవి వీల్స్ సాయపడుతోంది.

నవీన్.. బెనారస్ హిందూ యూనివర్సిటీ నుంచి సోషల్ వర్క్‌లో డిగ్రీ తీసుకున్నాడు. ఎస్ఎంవి వీల్స్ ప్రారంభానికి ముందు నవీన్ ఆటోరిక్షా పుల్లర్ల జీవనాన్ని దగ్గరగా చూశాడు. కేంద్ర ప్రభుత్వ అనుబంధ సంస్థ అయిన రూరల్ డెవలప్‌మెంట్ CAPARTతో పట్టణప్రాంత అభివృధ్ది పథకంలో కొన్నాళ్లు పని చేశాడు. ఆ సమయంలోనే ఆటోరిక్షా వారితో పరిచయం ఏర్పడింది. రిక్షాబ్యాంక్ ప్రాజెక్టుకు నేషనల్ కో ఆర్డినేటర్ పని చేసిన నవీన్ తన అనుభవాన్ని త్రిపుర,తమిళనాడు, గుజరాత్ లో విస్తరించేందుకు వినియోగించాడు.

నవీన్ కృష్ణ smv వీల్స్ ఎంట్రప్రెన్యూర్

నవీన్ కృష్ణ smv వీల్స్ ఎంట్రప్రెన్యూర్


ప్రాజెక్టుకు జాతీయస్థాయి కో ఆర్డినేటర్‌గా పని చేసిన ఆ సమయంలో అస్సోంలో 1200మందికి సొంతంగా రిక్షాలు ఇప్పించగలిగాడు నవీన్. అలానే లక్నో,అలహాబాద్, వారణాసిలో ప్రాజెక్టు విస్తరించాడు. అప్పుడే సొంతంగా స్టార్టప్ మొదలుపెట్టే ఆలోచన వచ్చింది నవీన్‌కు. 

''అదో గ్రోత్ ఉన్న బిజినెస్‌గా కనిపించింది. మార్కె ట్లో ఉన్న డిమాండ్‌కు తగ్గ సప్లై లేదనిపించింది. మార్కెట్లో రిక్షాలు డిస్ట్రిబ్యూషన్ అవుతున్న పద్దతిలో కాకుండా... కొత్తగా చేస్తే అటు రిక్షా పుల్లర్లకూ... సంస్థకూ మేలు జరుగుతుందని ఆలోచించా. దీనివల్ల ఏదో దానం చేస్తున్నట్లుగా కాకుండా వారి గౌరవం కూడా పెరిగే రీతిలో సాయపడితే బావుంటుందని అనిపించింది'' -నవీన్.

2010లో ఎస్ఎంవి వీల్స్ ప్రారంభమైంది. అదే ఏడాది నవంబర్‌లో తన తొలి రిక్షాను అమ్మినట్లు చెప్పారు నవీన్. నవీన్ ప్రవేశపెట్టిన పద్దతిలో రిక్షాలు త్వరగా మార్కెట్లోకి వచ్చేశాయ్. అతని ఆలోచనకు అంతర్జాతీయ స్థాయిలో ఇన్వెస్టర్ల సపోర్ట్ కూడా దొరికింది.

అవార్డులూ..రివార్డులూ

2011లో smv వీల్స్‌కి సంకల్ప్ అవార్డు దక్కింది. ఫస్ట్ లైట్ విలేజ్ పురస్కారం కూడా అందుకున్నాడు నవీన్. అన్ రీజనబుల్ ఇన్స్‌టిట్యూట్ అందించే పురస్కారాల్లో కూడా రన్నర్‌గా నిలిచిన smv వీల్స్ మోడల్... మూడు లక్షల డాలర్ల కన్వర్టబుల్ డిబెంచర్ల పెట్టుబడి దక్కించుకుంది. ఈ డబ్బంతా తన ప్రాజెక్టు విస్తరణ కోసం జవున్‌పూర్‌లో మొదటి బ్రాంచ్‌లో పెట్టుబడి కోసం ఖర్చు పెట్టారు. నవీన్ ఈ మధ్యనే రిక్షా లెండింగ్‌లో అనవసర ఖర్చును తగ్గించేందుకు, పుల్లర్లకు త్వరగా అందేందుకు అవసరమైన వ్యవస్థను నిర్మించుకున్నాడు.

రిక్షాపుల్లర్లకు రిక్షాలు సరఫరా చేయడం కొత్త కాన్సెప్ట్ ఏం కాదు, కానీ తాము అనుసరించే ప్రాఫిట్ పద్ధతే మిగిలిన వాటికి భిన్నంగా చేసిందంటారు నవీన్. అదే ఇన్వెస్టర్లను ఆకర్షితులను చేస్తుందనేది అతని అభిప్రాయం. బిజినెస్ పరంగా... క్యాపిటల్‌కు అయ్యే ఖర్చు తిరిగి వస్తుంది. అదే సమయంలో రిక్షా డ్రైవర్లు కూడా రోజూ ఎంతో కొంత సంపాదిస్తారు. రోజూ తాను సంపాదించుకున్న సొమ్ములో కొంత భాగం రిక్షా సొంతం చేసుకోవడానికి వాడతారు. కాబట్టి తామేదో దయాధర్మంగా రిక్షా తీసుకున్నామనే ఫీలింగ్ ఉండదు. అది వారి డిగ్నిటీ ఆఫ్ లేబర్‌ను పెంచుతుందంటాడు.

“SMV వీల్స్ తన కస్టమర్లతో ఓ రిలేషన్ పెంచుకుంటుంది. అది వారి జీవితానికి బీమా రూపంలో భద్రత ఇస్తుంది. అదే పేమెంట్‌లో ప్రతిఫలిస్తుంది. ఇలా జరుగుతున్న వ్యాపారంలో పెట్టుబడి పెట్టడానికి ఎవరికైనా ఉత్సాహం ఉంటుంది.." నవీన్. 

రిక్షాల తయారీకి అయ్యే ఖర్చుపై కాస్త లాభం వేసుకుని అమ్మడంలో కంపెనీకి ఆదాయం వస్తుంది. రిక్షాల వెనుక పోస్టర్లు, స్టిక్కర్ల పంపిణీతో కూడా కొంత డబ్బు వస్తుంది. ఐతే అందులో కూడా రిక్షా డ్రైవర్లకు వాటా ఉంటుంది. SMV వీల్స్ కొనే రిక్షా ఇన్సూరెన్స్, లైసెన్స్, అన్నీ కలిపి 11,500లకు కొంటుంది. ఇందులోనే కేవైసీ ఫార్మ్స్ , వీక్లీ రిపెయిర్స్ అన్నీ కలిసి ఉంటాయ్. ఈ రిక్షాలు ఎవరికైతే ఇస్తారో వారు వారానికి ఓసారి ఇచ్చే పేమెంట్స్ అన్నీ కలిపి ఏడాదిలో ఓనర్లవుతారు.


SMV వీల్స్ ప్రస్తుతానికి వారణాసి, జవూన్ పూర్ లో 15మంది ఉద్యోగులతో పని చేస్తోంది. జార్ఘండ్‌లో తమ బ్రాంచ్ కోసం మరో ముగ్గురిని నియమించుకునే ప్లాన్‌లో ఉన్నాడు నవీన్. దాదాపు 1200 రిక్షాలు ఇప్పుడు ఎస్ఎంవి వీల్స్ సాయంతో రోడ్లపై తిరుగుతున్నాయి. 150మంది ఓనర్లైనవారున్నారు. వచ్చే పదేళ్లలో 20లక్షల రిక్షాలు అమ్మాలనేది మా లక్ష్యం అని చెప్తాడు నవీన్. సోలార్ ఎనర్జీతో నడిచే రిక్షాలు సరఫరా చేసేందుకు ఇప్పటికే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటికే 50 రిక్షాలను రోడ్ మీదకు పంపగలిగారు. ఈ డిమాండ్ గమనించిన నవీన్ తానే సొంతంగా ఓ సోలార్ రిక్షా యూనిట్ స్థాపించే ఆలోచనలో ఉన్నాడు.

ఆరంభంలో అడ్డంకులున్నా.. ఇప్పుడు అపరిమిత ఆనందం

సక్సెస్‌ఫుల్‌గా నడుస్తున్న SMV వీల్స్ ఆరంభంలో చాలా ఇబ్బంది పడిందని నవీన్ చెప్పాడు . "వారణాసిలో వెంచర్ మొదలుపెట్టినప్పుడు ఇన్వెస్టర్లను ఒప్పించడం చాలా కష్టమైపోయింది. ఢిల్లీ, ముంబై లాగా వారణాసి అంతగా అర్బన్ సిటీ కాదు. ఇక్కడి జనాలను ఒప్పించడం చాలా ఇబ్బంది. దాదాపు 1000 కంపెనీల గుమ్మం ఎక్కి దిగి ఉంటాను. 500 పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇచ్చి ఉంటా. బిజినెస్‌లో లాభం కళ్లజూసేసరికి ఏడాదిన్నర సమయం పట్టింది" అని గుర్తు చేసుకున్నాడు నవీన్. ఇంత ప్రయత్నమంతా.. రోజూ రద్దీ రైళ్లలో తిరుగుతూ..రోడ్డుపక్కన తిండి తింటూనే చేశాడట. ఐతే అదంతా ఇప్పుడు ఓ మధుర జ్ఞాపకంగానే మిగిలిపోయిందని చెప్తాడతను. ఇప్పుడు ఓ సక్సెస్‌ఫుల్ ఆంట్రప్రెన్యూర్ కావడమే కాకుండా..వందలాది రిక్షా డ్రైవర్ల జీవితాలను మార్చగలిగినందుకు ఎంతో సంతోషిస్తాడు నవీన్.