స్టార్టప్ అవకాశాలను వినియోగించుకునే సత్తా ఆంధ్రప్రదేశ్‌కు ఉంది

0

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడ్తున్న స్టార్టప్ కార్యక్రమాలను పూర్తిస్థాయిలో వినియోగించుకునే సత్తా ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే ఉందని భారత ప్రధాని నరేంద్ర మోడీ విశ్వాసం వ్యక్తం చేశారు. కేంద్రం ఇస్తున్న ప్రోత్సాహకాలు, అవకాశాలను అందిపుచ్చుకుని ఇక్కడి యువత మరింత ముందుకు సాగిపోవాలని ఆయన సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని శంకుస్థాపన కోసం అమరావతి చేరుకున్న ప్రధాని మోడి.. ఆంధ్రప్రదేశ్ యువశక్తిని కీర్తించారు. ప్రపంచ నలుమూలల్లో పనిచేస్తూ అత్యుత్తమ ప్రొఫెషనల్స్‌గా ఆంధ్రప్రదేశ్ యువత పేరుతెచ్చుకున్నారని గుర్తుచేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న మేధావులు, ప్రతిభావంతులు.. వినూత్నంగా ఆలోచిస్తూ.. ఇన్నోవేషన్‌కు పెద్దపీట వేయాలని ఆయన సూచించారు. స్టార్టప్స్‌కు ఓ అద్భుత వేదికగా అమరావతిని, ఆంధ్రప్రదేశ్‌ను తయారు చేయగలరనే నమ్మకం తనకు ఉందని తెలిపారు.

Pic courtesy - PIB

యువత కారణంగా ఇక్కడ త్వరలో.. ఆర్థిక క్రాంతి రాబోతోందని, కొత్త ఆంధ్రప్రదేశ్‌కు వాళ్లే కేంద్ర బిందు అవుతారని మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఆంధ్ర సహా తెలంగాణకు వేగంగా అభివృద్ధి చెందే శక్తి సామర్ధ్యాలు ఉన్నాయని, ఒకరిని ఒకరు ప్రోత్సహించుకుంటూ ముందుకు వెళ్తే.. రెండు రాష్ట్రాలూ అభివృద్ధిలో దూసుకుపోతాయని సూచించారు.

ఆధునీకరణ, పట్టణాభివృద్ధి, సుందరీకణ దిశగా ప్రపంచమంతా ఎదురుచూస్తోందని, అందుకే తమ ప్రభుత్వం కూడా స్మార్ట్ సిటీస్ కార్యక్రమానికి నడుం బిగించిందని మోడీ అన్నారు. ప్రజల జీవనంలో మార్పులు తీసుకురావడంతో పాటు ఆర్థిక వృద్ధికి కూడా ఈ కొత్త నగరాలు తోడ్పడ్తాయని వివరించారు. అత్యాధునిక ట్రాన్స్‌పోర్టేషన్ సహా వ్యర్థ రహిత నగరాలుగా స్మార్ట్ సిటీస్‌ను నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. అలాంటి గొప్ప నగరాల నిర్మాణాలకు అమరావతి.. మార్గదర్శిగా ఉండాలని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు.