ఫోన్లో వేధించే ఆకతాయిల తాటతీసే హెల్ప్ లైన్  

0

ఉత్తర్ ప్రదేశ్ లోని కొన్ని ఏరియాల్లో లేడీస్ ఫోన్ నంబర్లను అమ్మే దందా నడుస్తోంది. అమ్మాయి మామూలుగా ఉంటే ఒక రేటు. అందంగా ఉంటే మరో రేటు. మినిమం రూ.50. మాగ్జిమం రూ.500. ఫోన్ రీచార్జ్ చేసే కొన్ని షాపులు గుట్టుచప్పుడు కాకుండా ఇలాంటి బిజినెస్ చేస్తున్నాయి. తమ దగ్గరికి రీచార్జ్ చేయమని వచ్చే అమ్మాయిల నంబర్లు చాకచక్యంగా సేకరించి పోకిరీలకు అమ్మి సొమ్ముచేసుకోవడం మొదలుపెట్టాయి.

అలా నంబర్లు తీసుకునే ఆకతాయిలు చాలా తెలివిగా అమ్మాయిల్ని వలలో పడేస్తారు. మొదట మిస్డ్ కాల్ ఇస్తారు. అవతలి వాళ్లు తిరిగి ఫోన్ చేయగానే అమాయకత్వం నటిస్తారు. సారీ అండీ.. ఏదో పొరపాటున మీ నంబర్ డయల్ అయిందని ఎక్కడ లేని నిజాయితీ ప్రదర్శిస్తారు. డిస్ట్రబ్ చేసినందుకు క్షమించండి అని పదేపదే ప్రాధేయపడతారు. వాళ్ల మాటలు వింటే ఆటోమేటిగ్గా జాలికలుగుతుంది. అంత తెలివిగా డీల్ చేస్తారు. అవతలి వైపు నుంచి కాస్త సానుభూతి వచ్చిందని తెలియగానే, మెల్లిగా మాట కలుపుతారు. ఫ్రెండ్ షిప్ అంటారు. ఇంకేదో అంటారు. ఇక అక్కడి నుంచి మొదలవుతుంది అసలు కథ. వేధింపులు మామూలుగా ఉండవు. కాలేజీ అమ్మాయిలైతే నరకం చూస్తారు. ఎక్కడ కాపుగాస్తాడో తెలియదు. ఎక్కడ తారసపడతాడో అర్ధం కాదు. టార్చర్ ఒక రేంజిలో ఉంటుంది.

ఒకటి కాదు రెండు కాదు ఇలాంటివి ఆరు లక్షల ఫిర్యాదులు. వాటిన్నటికీ చెక్ పెట్టాలనే ఉద్దేశంతో 1090 అనే హెల్ప్ లైన్ ప్రవేశపెట్టింది అక్కడి ప్రభుత్వం. ఫోన్లో టార్చర్ పెట్టే ఆకతాయిల భరతం పట్టే హెల్ప్ లైన్ అది. 2012లో దీన్ని ఏర్పాటు చేశారు. కాలేజీలు, స్కూళ్ల దగ్గర దీనిపై అవగాహనా కార్యక్రమాలు చేపట్టారు. హోర్డింగులు ఏర్పాటు చేశారు. వేధిస్తే నిర్భయంగా 1090కి చెప్పండి.. మీకు అండగా మేమున్నాం అనే భరోసా కల్పించారు.

చాలా ఫిర్యాదులు సింగిల్ కాల్ తోనే సాల్వ్ చేశారు. పోకిరీలకు కౌన్సెలింగ్ సరిపోతుంది అనుకుంటే కౌన్సెలింగ్ ఇస్తారు. కుటుంబ సభ్యుల ముందు బ్రెయిన్ వాష్ చేస్తారు. భగవద్గీత మీద ప్రమాణం చేయిస్తారు. ఆ తర్వాత కూడా మానకుంటే తాటతీసి కటకటాల్లోకి నెడతారు.

హెల్ప్ లైన్ పుణ్యమాని ఆకతాయిల వేధింపులు దాదాపు తగ్గాయి. మహిళల నుంచి ఫిర్యాదులు కూడా చాలామటుకు రావడం లేదు. అందరికీ ఈ నంబర్ మీద అవగాహన వచ్చింది. రిసీవ్ చేసుకున్న కాల్ ఏమాత్రం తేడా అనిపించినా.. 1090 నంబర్ కి డయల్ చేసి చెప్తున్నారు. ఆ భయానికి ఏ ఒక్క పోకిరీ మిస్డ్ కాల్ ఇవ్వడానికి కూడా సాహసం చేయడం లేదు.

Related Stories

Stories by team ys telugu