అనుకోకుండా జరిగిన ఓ సంఘటన ఆంట్రప్రెన్యూర్‌ని చేసింది!

అనుకోకుండా జరిగిన సంఘటన జీవితాన్నే మలుపు తిప్పింది...ఆన్ లైన్ జ్యోతిష్యంలో దూసుకుపోతున్న డైనప్...

అనుకోకుండా జరిగిన ఓ సంఘటన ఆంట్రప్రెన్యూర్‌ని చేసింది!

Thursday December 17, 2015,

5 min Read


తిన్నామా పడుకున్నామా తెల్లారిందా! కొందరి యాటిట్యూడ్ ఇలాగే ఉంటుంది. నలుగురితో పాటు నారాయణ అన్నట్టే ఉంటారు. కానీ డైనప్ లాంటి వాళ్లు కొందరే ప్రత్యేకత కోసం ఆరాటపడతారు. కసితో నాస్తి దుర్భిక్షం అన్న నానుడిని క్రియేట్ చేస్తారు! మొదటిసారి ఓడిపోవచ్చుగాక. రెండోసారి. మూడోసారి. కానీ నాలుగోసారి రాదా -గెలుపు? మోగించమా- విజయభేరి! అప్పుడు చరిత్రలో మనకంటూ కొన్ని పేజీలుంటాయి! డైనప్ క్రియేట్ చేసిన హిస్టరీ అలాంటిదే. ఒకప్పుడు డెలివరీ బోయ్. ఇప్పుడు సక్సెస్ ఫుల్ ఆంట్రపెన్యూర్. మరి తినబోయే ముందు రుచి ఎందుకు? అతడి కథేంటో చదివేయండి!

తండ్రి కల ఒకటైతే.. కొడుకు ఆలోచన మరొకటి

డైనప్ కల్లేరిళ్. సొంతూరు కేరళలోని పట్టిమట్టం అనే చిన్న గ్రామం. సాధారణ కుటుంబం. తండ్రి ప్లంబర్. సంపాదించిన దాంట్లోనే అంతోఎంతో కూడబెట్టి కొడుకుని గొప్ప చదువులు చదివించాలనేది అతడి ఆశ. ఎందుకంటే వంశంలోనే అప్పటి వరకూ డిగ్రీ చదివిన వారే లేరు. కనీసం తన కొడుకైనా పెద్దచదువు చదివి, మంచి ఉద్యోగం సంపాదించాలి. ఇంకో కోరిక ఏంటంటే- కొడుకు విదేశాల్లో స్థిరపడాలి. తండ్రిగా పెద్ద కలే ఉంది. కానీ డైనప్ అలోచనలే అలా లేవు.

DINUP KALLERIL

DINUP KALLERIL


చదువుకు మధ్యలోనే టాటా!

డైనప్ బాల్యం అంతా అందరిలానే సాధారణంగానే సాగిపోయింది. సచిన్ టెండూల్కర్ వీరాభిమాని. సరదాగా క్రికెట్ ఆడుతూ, ఊరి చివర చెరువులో ఈత కొడుతూ స్కూల్ లైఫ్ గడిపేశాడు. లైఫ్ లో ఏం కావాలన్న దానిపై క్లారిటీ లేదు. కానీ రోటీన్ నైన్ టూ ఫైవ్ జాబ్ లో సెటిలవ్వాలని మాత్రం లేదు. ఇంటర్ పాసైన తర్వాత ఇంజనీరింగ్ లో జాయినయ్యాడు. కానీ మనసు చదువు మీద లేదు. ఏవేవో ఆలోచనలు. ఉక్కిరి బిక్కిరి చేసేవి. బుర్రలో కుప్పలు తెప్పలు ఐడియాలు. అవన్నీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకునేవాడు. చదువుకుంటూనే పార్ట్ టైం జాబ్ చేశాడు. స్క్రాప్ బిజినెస్- సిమ్ కార్డ్స్ అమ్మడం- ట్రావెల్ ఏజెన్సీలో పనిచేయడం. అలా వచ్చిన డబ్బుతో 2008లో మొదటిసారి కంప్యూటర్ కొన్నాడు. ఆ సిస్టమే డైనప్ లైఫ్ సిస్టమ్ ని మార్చేసింది. అప్పటి వరకు ఉన్న జీవితం ఒక్కసారిగా మారిపోయింది. మారుతున్న టెక్నాలజీ- ప్రపంచాన్ని ఎలా మార్చేస్తోందో గ్రహించాడు. సెకెండ్ ఇయర్‌లోనే చదువు వదిలేశాడు. స్టార్టప్ కోసం ప్రయత్నాలు ప్రారంభించాడు.

కేరళ నుంచి చెన్నయ్ కి

కొడుకు పై చదువులు చదవాలని తండ్రి ఒకపక్క కలలు కంటుంటే- ఇతనేమో ఏకంగా కాలేజీయే వదిలేశాడు. ఆ సమయంలో ఏ తండ్రికైనా ఎలా వుంటుంది? తిట్టాడు. కొడుకుతో మాట్లాడడం మానేశాడు. అయినా డైనప్ ఆలోచనలు మారలేదు. కేరళ నుంచి చెన్నై షిఫ్టయ్యాడు. అక్కడ బతుకు తెరువు కోసం రకరకాల పనులు చేశాడు. అప్పుడే వచ్చిందో ఐడియా. అన్ లైన్లో టీ-షర్ట్స్ అమ్మితే ఎలా వుంటుంది. షాపింగ్ పోర్టల్ థాట్‌ రాగానే మళ్లీ కొచ్చి చేరాడు. 2012. అప్పటికీ కేరళలో ఆన్ లైన్ షాపింగ్ కేరళ లో అంత పాపులర్ కాలేదు. అందుకే తన ఫస్ట్ వెంచర్ కి సేఫ్ ప్లేస్‌ కేరళే అని డిసైడయ్యాడు. 

ఆదిలోనే ఎదురుదెబ్బ

అప్పటిదాకా డైనప్ దాచుకున్న రూ. 25 వేలు పోర్టల్ స్టార్ట్ చేశాడు. కానీ ఆన్ లైన్ షాపింగ్ అంత లాభదాయకంగా కనిపించలేదు. ఆర్డర్లన్నీ కాష్ ఆన్ డెలివరీ కావడంతో డబ్బులు చేతికి వచ్చేటప్పటికీ చాలా సమయం పట్టేది. మరోవైపు ఖర్చులు కూడా బాగా పెరిగిపోయాయి. గత్యంతరం లేక తనే డెలివరీ బాయ్ గా మారాడు. ఇతర కంపెనీల తరుపున కూడా ఆర్నెల్లు డెలివరీ బాయ్ గా పనిచేశాడు. ఎక్కడో ఏదో లోపం. గిట్టుబాటు అవడం లేదు. దాంతో పోర్టల్ ను కొచ్చి లోని ఓ బిజినెస్‌ మేన్ కి అమ్మేశాడు. పక్కాగా డబ్బులొచ్చే బిజినెస్ ఇంకేమైనా ఉందా అని అన్వేషించాడు. అప్పుడు తట్టింది ఐడియా! అన్ లైన్ సర్వీసెస్. పెట్టుబడి తక్కువ. లాభం ఎక్కువ.

యాదృచ్ఛికంగా వచ్చిన ఐడియా

అనుకోలేదు. ఆ రోజు జరిగిన సంఘటన బిజినెస్ ఐడియాలా మారుతుందని. 2013 డిసెంబర్‌లో డైనప్ ఓ ఫ్రెండ్ ఇంటికి వెళ్లాడు. అప్పుడే స్నేహితుడి ఫాదర్ ఓ జ్యోతిష్యుడిని కలిసేందుకు వెళ్తున్నాడు. అది తెలుసుకున్న డైనప్- అంతదూరం వెళ్లడం ఎందుకు? ఆన్ లైన్ లో ట్రై చెయ్యొచ్చు కదా అన్నాడు. ఇదేదో బావుందని ల్యాప్ టాప్ తీసుకుని అలాంటి సర్వీసెస్ కోసం వెతికారు. కానీ విచిత్రంగా ఒక్కటి కూడా దొరకలేదు. అదే ప్రాసెస్ లో అస్ట్రాలజీ వెబ్ సైట్స్ కూడా చూశారు. డేట్, టైమ్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే ఆటోమేటిగ్గా హరోస్కోప్ జనరేట్ చేసే సైట్స్ కనిపించాయి. వెంటనే ఓ ఐడియా బుర్రలో మెరిసింది. ఆస్ట్రాలజీ తో అన్ లైన్ వ్యాపారినికి మంచి భవిష్యత్‌ ఉందని అర్థమైంది.


“ఇండియన్స్ లైఫ్ లో జ్యోతిష్యం చాలా ముఖ్యమైంది. చాలామంది డెసిషన్ మేకింగ్ కోసం జ్యోతిష్యంపై ఆధారపడతారు. ఇప్పుడున్న ఇంటర్నెట్ జమనాలో అస్ట్రాలజీ సర్వీసెస్ ఆన్ లైన్లో అందిస్తే బిజినెస్‌ అదిరిపోదా. అ ఆలోచననే మాంక్ వ్యాసకి కారణమైంది” డైనప్

పార్ట్‌ నర్‌ కోసం అన్వేషణ

ఐడియా ఉంటే సరిపోదు. బిజినెస్ నడవాలంటే గట్టి టెక్నికల్ టీం కావాలి. అలాగని ఎక్కువ డబ్బిచ్చి డిజైనర్ ని తెచ్చుకునే పరిస్థితి లేదు. టెక్నికల్ సపోర్ట్ ఇచ్చే వారికోసం నాలుగు నెలలు కాళ్లరిగేలా తిరిగాడు. విసిగివేసారి పోయాడు. ఒకరోజు కొచ్చి ఇంటర్నేషన్ క్రికెట్ స్డేడియం పక్కన ఓ టీ కొట్టు దగ్గర కూర్చొని ఉండగా- సాప్ట్ వేర్ డెవలపర్ గా పనిచేస్తున్న స్నేహితుడు శరత్ కలిశాడు. క్షణం ఆలస్యం చేయకుండా తన బిజినెస్ ఐడియా చెప్పాడు. అస్ట్రాలజర్స్ ఆన్ లైన్ మార్కెట్ ప్లేస్ గురించి వివరించాడు. అది విన్న శరత్ చాలా ఎక్సయిట్ అయ్యాడు. ఇద్దరు కలిసి పనిచేసేందుకు రెడీ అయ్యారు. మరి ఎలా? అఫీస్ అంటూ లేదు. ఫర్నిచర్ లేదు. అయినా వెనకడుగు వేయలేదు. ఎక్కడైతే కలిశారో- అదే టీ స్టాల్ దగ్గర తాత్కాలికంగా ప్లాన్ చేశారు. ఆలోచనలు ఓ కొలిక్కి వచ్చాయి. స్టార్టప్ పేరు మాంక్ వ్యాస. శరత్ తను చేసే జాబ్ వదిలేశాడు. కో ఫౌండర్ గా పూర్తిగా దీనికే అంకితమైపోయాడు.

DINUP IN COLLEGE DAYS

DINUP IN COLLEGE DAYS


అంతలోనే మళ్లీ కష్టాలు

రెండు నెలలు గడిచాయి. కష్టపడి ప్రోగ్రామ్స్, ఫ్లో చార్టు తయారు చేశారు. మొత్తమ్మీద వెబ్ సైట్ కి ఓ రూపం తెచ్చారు. ఇంతవరకు బాగానే ఉంది. మరి జ్యోతిష్యులు ఎక్కడ? ఎవరు ఒప్పుకుంటారు? ఇంటర్నెట్ పరిజ్ఞానం పెద్దగా లేకపోవడంతో వారు ముందుకు వచ్చేవారు కాదు. ఇలా అయితే లాభం లేదని జ్యోతిష్యులకు ట్రైనింగ్ ఇచ్చారు. మొత్తానికి ఒప్పించారు. అక్కడితో కష్టాలు ఆగిపోలేదు. డిజైన్ చేసిన వీడియో కన్సల్టేషన్ ప్లాట్ ఫాం బీటా టెస్టింగ్ లో బాగానే పనిచేసింది. పేమెంట్ గేట్ వే తో ఇంటిగ్రేట్ చేసిన తర్వాత మొరాయించింది. కథ మొదటికొచ్చింది. దీంతో వెబ్ సైట్ మూసేసి మళ్లీ డిజైన్ మీద వర్క్ చేయడం స్టార్ట్ చేశారు. శ్రమ ఫలించింది. ఎట్టకేలకు 2015 ఏప్రిల్ లో వెబ్ సైట్ రీ-స్టార్ట్ అయింది. ఆ వెంటనే టీఐఈ కేరళలో సభ్యత్వంతో పాటు మెంటార్ షిప్ కూడా లభించింది. డైనప్ ఐడియా నచ్చడంతో కొచ్చి బేస్డ్ ఇంక్యుబేటర్ స్టార్టప్ విలేజ్ చైర్మన్ సంజయ్ విజయ్ కుమార్ ఫండింగ్ చేయడానికి ముందుకు వచ్చారు. ఆలా మాంక్ వ్యాస ప్రస్థానం ప్రారంభమైంది.

బిజినెస్ మోడల్

15 మంది జ్యోతిష్యులు. నెలకి 22 కన్సల్టేషన్స్. 2015 ఏప్రిల్ లో మొదలైన మాంక్ వ్యాస ఇప్పుడు 25 మంది అస్ట్రాలజర్స్ తో నడుస్తోంది. రోజూ 22 కన్సల్టేషన్స్ తో సక్సెస్ ఫుల్ గా సాగిపోతోంది. కన్సల్టేషన్స్ కోసం డైలీ 500 పైగా ఎంక్వైరీలు. 75వేల నుంచి లక్ష రూపాయల రెవెన్యూ వస్తోంది. ప్రతి ట్రాన్సాక్షన్ కి అస్ట్రాలజర్స్ నుంచి 15 శాతం కమిషన్ వస్తుంది. వీడియో చాట్ లేకుంటే ఆఫ్ లైన్ ఫోన్ కాల్ అప్షన్ నుంచి ఏదో ఒకటి యూజర్లు ఎంచుకోవచ్చు. ఒక్కో కన్సల్టేషన్ కి 500 రూపాయలు ఫీజు. అయితే ఎవరైనా అస్ట్రాల్జర్ ని ఆన్ బోర్డ్ తీసుకునే ముందు అతని క్రెడెన్షియల్స్ అన్నీ పరిశీలించి మాత్రమే అవకాశమిస్తాం.. అదే వినియోగదారుల్లో నమ్మకాన్ని పెంచుతుందంటారు డైనప్. ఇండియాలోని ప్రఖ్యాత జ్యోతిష్యులందరినీ ఒకే ఫ్లాట్ ఫాం పైకి తీసుకురావడమే డైనప్ ముందున్న లక్ష్యం. రాబోయే మూడేళ్లలో 2000 మంది జ్యోతిష్యులను ఏకంచేయడమే కాకుండా- 200 మిలియన్ డాలర్ల టర్నోవర్ రీచ్ కావాలనేది మనోడి డ్రీమ్.

అపజయం ఎదురైన ప్రతి సారీ రెట్టించిన ఉత్సాహంతో పనిచేసి..స్థాపించిన సంస్థను తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దిన డైనప్ జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకం. అందులో సందేహమే లేదు.