హోమ్ డిజైన్స్‌కు తొలి కంటెంట్ ప్లాట్‌ఫామ్ రెనోమానియా

Friday February 19, 2016,

4 min Read

ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అన్నారు పెద్దలు.. ఇల్లు, పెళ్లి రెండూ చాలా కష్టమైన వ్యవహారాలన్నది పెద్దల అభిప్రాయం. అయితే ఇప్పుడు గృహ నిర్మాణం చాలా సింపులైపోయింది. ఎవరికైనా కాంట్రాక్ట్ ఇస్తే చాలు వారే ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసి, గృహప్రవేశానికి సిద్ధం చేసి ఇస్తారు. అలాంటి హోమ్ డిజైన్ సంస్థలు దేశంలో ఎన్నో ఉన్నాయి. అయితే అన్నింటిలోకి ఢిల్లీకి చెందిన రెనోమానియా కాస్త డిఫరెంట్. ఇంటిని నిర్మించేందుకు అవసరమైన అన్ని రకాల సలహాలను, ఇంటీరియర్‌ డిజైన్లను, బిల్డర్స్, ఆర్కిటెక్చర్స్, ప్రొఫెషనల్ వివరాలను ఒకే చోట అందిస్తూ కస్టమర్ల మనసును దోచుకుంటోంది. హోమ్ డిజైన్స్‌కు తొలి కంటెంట్ ప్లాట్‌ఫామ్‌గా చెప్పుకుంటున్న రెనోమానియాపై కస్టమర్ల నమ్మకం రోజు రోజుకు పెరిగిపోతున్నది.

26 ఏళ్ల హోమ్ డెకార్ ఇండస్ట్రీలో నవ్‌నీత్ మల్హోత్రా (50), రీతూ మల్హోత్రా ఎంతోమంది క్లయింట్లకు సలహాలిచ్చారు. ఇంటి డిజైన్ల కోసం కొందరు డజన్ల కొద్దీ మేగజైన్లు, వెబ్‌సైట్లలో ఉన్న ఫొటోలతో వీరి వద్దకు వచ్చేవారు. ఇంటీరియర్ డిజైన్ల విషయంలో ఇప్పటికీ దేశంలో ఇంటి యజమానులు సమస్యలను ఎదుర్కొంటున్నారని భార్యభర్తలిద్దరూ గ్రహించారు. ఇదే వీరిని ఇంటీరియర్ డిజైనింగ్ సంస్థ రెనోమానియాను స్థాపించేందుకు పురికొల్పింది. దీన్ని వీరు 2015 సెప్టెంబర్‌లో ప్రారంభించారు.

ఢిల్లీ కేంద్రంగా నడుస్తున్న ఈ రెనోమానియాలో గృహాలకు సంబంధించిన అందమైన చిత్రాలు, లేటెస్ట్ డిజైన్ ట్రెండ్స్‌కు సంబంధించి ఆర్టికల్స్, హోమ్ డిజైన్‌కు సంబంధించిన సలహాలు, రీమోడలింగ్ ప్రాసెస్ వంటి అంశాలుంటాయి. ఈ వెబ్‌సైట్‌ను ఫొటో, స్క్రాప్‌బుక్‌, ప్రొ ఫైండర్, బ్లాగ్స్‌ ఇలా నాలుగు కేటగిరీలుగా విభజించారు.

undefined

undefined


ఫొటో: రెనోమానియా వ్యవస్థాపకులు రీతు మల్హోత్ర, రాహుల్ లోధా, నవ్‌నీత్ మల్హోత్ర

ప్రొఫైండర్ సెక్షన్‌లో నైపుణ్యం కలిగిన ఆర్కిటెక్ట్స్, ఇంటీరియర్ డిజైనర్స్, ల్యాండ్‌స్కేప్ డిజైనర్స్, కాంట్రాక్టర్స్, డెవలపర్స్, హోమ్ ప్రాడక్ట్‌ బ్రాండ్స్, బిల్డర్స్ వివరాలుంటాయి. ప్రఖ్యాత ఆర్చిటెక్ట్స్ డిజైన్ చేసిన అందమైన ఇళ్ల ఫొటోలు రెనోమానియా ఇన్‌హౌజ్‌ ఫొటోగ్రాఫర్లు దేశమంతా పర్యటించి చిత్రీకరించారు. వాటిని కూడా ఈ వెబ్‌సైట్‌లో పొందుపర్చారు. ఎనిమిది ఇన్ హౌజ్ ఫోటోగ్రాఫర్స్ లు చిత్రీకరించిన 70 వేల హెచ్‌డీ ఫొటోగ్రాఫ్స్‌ ఈ వెబ్‌సైట్‌లో ఉన్నాయి. అలాగే 600 మంది ఇంటీరియర్ డిజైన్ ప్రొఫెషనల్స్ వివరాలు కూడా ఉన్నాయి.

‘‘ప్రొఫెషనల్ ఆర్చిటెక్ట్స్ రూపొందించిన అందమైన షోకేస్ వివరాలను కూడా మా క్లయింట్లకు ప్రదర్శించొచ్చు. ఆ డిజైన్లకు సంబంధించి ఆన్‌లైన్‌లో ఎలాంటి సమాచారమైనా వారి దగ్గరే ఉంటుంది. మా వెబ్‌సైట్‌లో హోమ్ ఓనర్ల కమ్యూనిటీని నిర్మించాం. కిచెన్‌కు ఎలాంటి గ్రానైట్ వాడాలి? బెడ్‌రూమ్ వాల్‌కు ఎలాంటి కలర్ అయితే బాగుంటుంది. బాత్‌రూమ్‌లో ఎలాంటి టైల్స్ ఉపయోగించాలి అన్న అంశాలపై వారు చాట్ చేసుకోవచ్చు’’- నవ్‌నీత్ 

రెగ్యులర్ బేసిస్‌లో ప్రొఫెషనల్స్ తమ ప్రాజెక్ట్‌లను అప్‌లోడ్ చేసుకోవచ్చు. వాటిని ఫాలో అవుతున్నవారి వివరాలను, రివ్యూలను, రేటింగ్స్‌ను, కామెంట్స్‌ను ఎప్పటికప్పుడు చూడొచ్చు. అలాగే తమ వర్క్స్‌ను ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగ్రామ్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియాలో కూడా షేర్ చేసుకోవచ్చు.

ప్రొఫెషనల్ జర్నీ..

రీతూ, నవ్‌నీత్‌లకు రెనోమానియా రెండో ప్రాజెక్ట్. 1989 లోనే వీరిద్దరూ కలిసి AA డిజైన్ కన్సల్టెంట్స్ ప్రయివేట్ లిమిటెడ్ పేరుతో ఢిల్లీలో ఓ ఆర్కిటెక్చర్, డిజైన్ ఫర్మ్‌ను ఏర్పాటు చేశారు. స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ అర్కిటెక్చర్‌లో రీతు గ్రాడ్యుయేషన్ చేశారు. అదే యూనివర్సిటీ నుంచి నవ్‌నీత్ గ్రాడ్యుయేషన్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), ఢిల్లీ నుంచి ‘కన్‌స్ట్రక్షన్ ఇంజినీరింగ్ అండ్ మేనేజ్‌మెంట్’లో నవ్‌నీత్ ఎంటెక్ కంప్లీట్ చేశారు. ఏయే డిజైన్ కన్‌సల్టెంట్స్‌కు ఒకప్పటి క్లయింట్ అయిన రాహుల్ లోధా (33) కూడా రెనోమానియాలో కో ఫౌండర్, చీఫ్ ఆఫ్ టెక్నాలజీగా చేరారు. ఐఐటీ ఖరగ్‌పూర్ నుంచి 2004లో బీటెక్ పూర్తి చేసిన రాహుల్‌కు ఈ రంగంలో 11 ఏళ్ల అనుభవం ఉంది. రెనోమానియాలో చేరకముందు 99Acres.comలో ఇంజినీరింగ్ విభాగంలో వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. శాంసంగ్,యాహులలో కూడా రాహల్ పనిచేశారు.

సపోర్టివ్ సిస్టమ్..

రెనోమానియాలో హోంషాప్18 సీఈవో సందీప్ మల్హోత్ర కూడా అడ్వయిజర్‌గా చేరడంతోపాటు పెట్టుబడులు కూడా పెట్టారు. రీతు, నవ్‌నీత్‌ రెనోమానియా గురించి చెప్పడంతో, వారి ఐడియా నచ్చి సందీప్ వారితో చేతులు కలిపారు.

‘‘సందీప్ బిజినెస్ కన్‌సల్టెన్సీతోపాటు సలహాలు కూడా ఇస్తుంటారు. హోంషాప్18ను విజయవంతంగా నడుపుతున్న అనుభవం మాకు ఎంతో కలిసొచ్చింది’’ అని రీతు తెలిపారు.

వేగంగా వృద్ధి..

సంస్థను ప్రారంభించి ఐదు నెలలు కూడా గడవకముందే, ఇప్పటికే మూడులక్షలకు పైగా సందర్శకులు రెనోమానియా వెబ్‌సైట్‌ను సందర్శించారు. ఇక ప్రతి నెలా 50% గ్రోథ్ కనిపిస్తున్నది. ఏప్రిల్‌2016లోగా ఐదులక్షల మందికి చేరువకావాలన్నదే రెనోమానియా ఓనర్ల లక్ష్యం. 35% మంది సందర్శకులు, వెబ్‌సైట్‌ను రిపీటెడ్‌గా సందర్శిస్తున్నారని నవ్‌నీత్ చెప్తున్నారు. ఇప్పటివరకు ఈ సంస్థ కస్టమర్ల నుంచి ఎలాంటి ఫీజు వసూలు చేయడం లేదు. 2016 ఏప్రిల్ చివర్లోగా అడ్వర్టయిజ్‌మెంట్, ప్రాడక్ట్ కంపెనీలు (పెయింట్స్, లైటింగ్, టైల్స్) లిస్టింగ్ ఫీజ్ వసూలు చేయాలనుకుంటున్నది. అలాగే ప్రొఫెషనల్స్ కోసం మరో విధానాన్ని కూడా రూపొందించనుంది. కొద్ది మొత్తంలో ఫీజును ప్రొఫెషనల్స్ నుంచి కూడా వసూలు చేయాలనుకుంటున్నది.

ప్రస్తుతం రెనోమానియాలో ఎనిమిది మంది ఫొటోగ్రాఫర్లతో కలిసి మొత్తం 36 మంది ఉద్యోగులున్నారు. వచ్చే ఏప్రిల్‌లోగా లక్ష ఫొటోలను వెబ్‌సైట్‌లో పొందుపర్చాలన్నది సంస్థ లక్ష్యం. ప్రొఫెషనల్స్ సంఖ్యను కూడా వెయ్యికి పెంచాలనుకుంటున్నది. హోమ్ డిజైన్ల గురించి ఇంటి ఓనర్లు ఇతర కస్టమర్లతో చర్చించేందుకు వీలుగా త్వరలోనే రెనోమానియా యాప్‌ను కూడా లాంచ్ చేయనున్నారు.

యువర్‌స్టోరీ టేక్..

దేశంలో ఆన్‌లైన్ హోమ్ డెకార్ మార్కెట్ ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్నది. ఇలాంటి స్టార్టప్స్ కారణంగా కస్టమర్లు దేశీయ, అంతర్జాతీయ మానుఫాక్చరర్స్‌ను ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది. దేశంలో హోమ్ డెకార్ మార్కెట్ కంపౌడ్ యాన్యువల్ గ్రోథ్ రేట్ (సీఏజీఆర్) 2019లోగా 50.42% వృద్ధి చెందుతుందని టెక్నావియా సంస్థ అంచనా వేసింది. లివాస్పేస్, హోమ్‌లేన్, అర్బన్‌ల్యాడర్, ఫ్యాబ్‌ఫర్నిష్, పెప్పర్‌ఫ్రై, ఫర్‌లెన్సో, నెస్టోపియా వంటి సంస్థలు ఈ రంగంలో ఇప్పటికే తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. హెలైన్ వెంచర్ పార్ట్‌నర్స్, బెస్సెమర్ వెంచర్ పార్ట్‌నర్స్ సంస్థలు లివా స్పేస్‌లో 4.6 మిలియన్ డాలర్లు, సెకోషియా క్యాపిటల్, అరిన్ క్యాపిటల్ సంస్థలు హోమ్‌లేన్‌లో 4.5 మిలియన్ డాలర్లు పెట్టుబడులుగా పెట్టాయి. రాకెట్ ఇంటర్నెట్, కెన్నివిక్ సంస్థలు ఫ్యాబ్ ఫర్నిష్‌లో ఇన్వెస్ట్ చేయగా, పెప్పర్‌ ఫ్రై ఇటీవలే మూడో రౌండ్ ఫండింగ్‌గా 15 మిలియన్ డాలర్లను దక్కించుకుంది. అలాగే లైట్‌బాక్స్ వెంచర్స్ 6 మిలియన్ డాలర్లను ఫర్‌లెన్సలో ఇన్వెస్ట్ చేసింది.

ఇప్పటికే ఎన్నో సంస్థలు ఈ రంగంలో ఉన్న నేపథ్యంలో దేశంలో హోమ్ డిజైనింగ్‌కు తొలి కంటెంట్ ప్లాట్‌ఫామ్‌గా చెప్పుకొంటున్న రెనోమానియా అభివృద్ధి విషయంలో ఇప్పుడే కామెంట్ చేయడం తొందరపాటే అవుతుంది. 

వెబ్ సైట్