కాబోయే రాష్ట్రపతి ఈమేనా..?

కాబోయే రాష్ట్రపతి ఈమేనా..?

Saturday May 27, 2017,

1 min Read

జులై 25 నాటికి ప్రణబ్ టర్మ్ ముగుస్తుంది. మళ్లీ దాదానే రాష్ట్రపతి అవుతారనేది ప్రస్తుతానికి ఊహాగానాలే. పైగా తన అభ్యర్ధిని నిలబెట్టుకోడానికి వచ్చిన బీజేపీకి వచ్చిన అవకాశం ఇది. రాకరాక వచ్చిన ఛాన్స్ ని మోడీ ఎలా వదులుకుంటారన్నది మరో ప్రశ్న. పైగా సొంత బలం ఉన్నప్పుడు ఇలాంటి వాటికి తావులేదన్నది విశ్లేషకుల మాట. సో, చాలా కోణాల్లో ప్రధాని మోడీ సుదీర్ఘ కసరత్తు చేసి ఒడిశా గిరిజన నాయకురాలు ద్రుపదిని రాష్ట్రపతి అభ్యర్ధిగా నిలబెట్టబోతున్నారని సమాచారం. ప్రణబ్ తర్వాత రాష్ట్రపతి భవన్ లో అడుగుపెట్టబోయే ప్రెసిడెంట్ ఆమెనని మీడియా కూడా కోడై కూస్తోంది.

image


రెండు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ద్రుపది తండ్రి బిరాంచి నారాయణ్ టుడు. 1997లో రాజకీయ అరంగేట్రం చేశారు. ఒడిశా రాయ్ రంగపూర్ జిల్లా నుంచి కౌన్సెలర్ గా ద్రుపది ప్రస్థానం మొదలైంది. అదే యేడు వైస్ ఛైర్ పర్సన్ గా బాధ్యతలు నిర్వర్తించారు.

సామాజికవేత్తగా, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పోరాడే నాయకురాలిగా పేరు తెచ్చుకున్నారు ద్రుపది. ఆమెలోని నిబద్ధత చూసి బీజేపీ.. ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. ప్రజలు ఆమెకు బ్రహ్మరథం పట్టారు. రెండుసార్లు ఒడిశా శాసనసభ్యురాలిగా గెలిచారు. నవీన్ పట్నాయక్ కేబినెట్ లో మంత్రిగా కూడా పనిచేశారు. ప్రస్తుతం 2015 నుంచి జార్ఖండ్ గవర్నర్ గా వ్యవహరిస్తున్నారు.

మొత్తానికి బీజేపీ తరుపున రాష్ట్రపతి ఎన్నికల బరిలో దిగబోతున్న ద్రుపదికి కాలం, ఓట్లు కలిసొస్తే దేశ అత్యున్నత పీఠం దక్కడం నల్లేరు మీద నడకే.