అమ్మ అంట్లు తోమేది.. నాన్న వేటగాడు..కానీ అమ్మాయి మాత్రం ఓ అద్భుత పుస్తక రచయిత !

తన జీవిత పాఠాలను అక్షర రూపం చేస్తున్న శిల్ప..కటిక పేదరికం అనుభవించిన కుటుంబంలో జన్మించిన శిల్ప ఆంటోనీరాజ్..శాంతిభవన్‌లో చేరడంతో మారిన శిల్ప జీవితం..తాను అనుభవించిన రెండు విభిన్న జీవితాలను పుస్తకంలో వివరించనున్న శిల్ప..ఏనుగుల వేటగాడి కూతురి వాస్తవ కథను అచ్చేసేందుకు ముందుకొచ్చిన ప్రచురణకర్త..

అమ్మ అంట్లు తోమేది.. నాన్న వేటగాడు..కానీ అమ్మాయి మాత్రం ఓ అద్భుత పుస్తక రచయిత !

Monday August 31, 2015,

4 min Read

ఉన్నత విద్యను అభ్యసించాలంటే ఆ విద్యార్థి కుటుంబం కూడా మంచి నాగరికమైనదై ఉండాలి. చదువు విలువ తెలిసి ఉండాలి. కానీ శిల్పా ఆంటోనీ రాజ్ స్టోరీ మాత్రం అలాంటిది కాదు. కటిక పేదరికం నుంచి వచ్చిన ఆమె.. ఇప్పుడు ఉన్నత విద్యనభ్యసించి, తన జీవితాన్నే అక్షర రూపం దాలుస్తున్నారు. రెండు విభిన్న ప్రపంచాల్లో ఎదిగిన ఆమె జీవితం ఎందరికో ఆదర్శప్రాయం.

image


‘‘దక్షిణ కర్ణాటకలోని థట్టగుప్పెలో జన్మించాను. క్రూర జంతువులకు నెలవైన దట్టమైన అటవీ ప్రాంతానికి సమీపంలో మా గ్రామం ఉంది. మాది దళిత క్రిస్టియన్ కుటుంబం. మా నాన్న, తాతా ఇద్దరు అక్రమ లిక్కర్ వ్యాపారం చేసేవారు. ఏనుగులనూ వేటాడేవారు. మా అమ్మ మొన్నటివరకు ఒకరి ఇంట్లో అంట్లు తోమేది’’ - శిల్ప
తల్లిదండ్రులు సోదరితో శిల్ప (తండ్రి చేతిలో..)

తల్లిదండ్రులు సోదరితో శిల్ప (తండ్రి చేతిలో..)


శిల్ప తల్లిదండ్రులకు నలుగురు పిల్లలు. అందరిలోకి చిన్నది శిల్ప ఆంటోనీ రాజ్. చిన్న వయసులోనే శిల్ప జీవితం కీలక మలుపు తీసుకుంది. శాంతి భవన్‌కు చెందిన ప్రిన్సిపల్, సైకాలజిస్ట్స్, సోషల్ వర్కర్స్ శిల్పను నాలుగేళ్ల వయసులో స్కూల్‌లో చేర్చుకునేముందు ఇంటర్వ్యూ నిర్వహించారు. శాంతి భవన్ బోర్డింగ్ స్కూల్‌ను ఇండో అమెరికన్ ఫిలాంథ్రోపిస్ట్, డాక్టర్ జార్జ్ ప్రారంభించారు. పేద కుటుంబాలకు చెందిన చిన్నారులకు హాస్టల్ వసతితోపాటు నాణ్యమైన చదువు నేర్పిస్తారు ఆ స్కూల్‌లో. అత్యంత పేద కుటుంబాల నుంచి వచ్చే విద్యార్థులకు ప్రపంచస్థాయి విద్యను అందించి పేదరికాన్ని నిర్మూలించి, వారి జీవనశైలీని మార్చడమే ఆ స్కూల్ ఉద్దేశం.

తల్లిదండ్రులు, సోదరిలతో శిల్ప (బ్లూ డ్రెస్‌లో..)

తల్లిదండ్రులు, సోదరిలతో శిల్ప (బ్లూ డ్రెస్‌లో..)


శిల్ప సోదరి ఒకరు 14 ఏళ్ల వయసులో మృతి చెందారు. ఆమెను హత్య చేశారని భావించారు. ఐతే ఆత్మహత్య ముసుగేసి ఆ కేసును క్లోజ్ చేశారు పోలీసులు. 

ఇంతకీ ఏనుగు వేటగాడికి జన్మించిన ఇద్దరు కుమార్తెల జీవితాలు ఎందుకు భిన్నంగా ఉన్నాయి ?

ఇప్పుడు శిల్పకు 21 ఏళ్లు. తన జీవిత విషయాలతో ‘‘ది ఎలిఫెంట్ చేజర్స్ డాటర్’’ పేరుతో ఓ పుస్తకాన్ని రాస్తున్నారు. శిల్ప తండ్రి ఏనుగుల వేటగాడు. తండ్రి వృత్తిని గుర్తు చేస్తూ పుస్తకానికి ఆ పేరు పెట్టారామె. చెరుకు గడలను తినేందుకు గ్రామంలోకి వచ్చే ఏనుగులను బంధించేవారాయన. ‘ ‘రెండు విభిన్న ప్రపంచాలకు నేను అడ్డంగా నిరంతరం ప్రయాణించాను ’’ అని శిల్ప గుర్తు చేసుకునేవారు.

రెండు విభిన్న ప్రపంచాలు..

రెండు విభిన్న ప్రపంచాల మధ్య గడిచిన జీవితాన్ని ఆమె పుస్తకంలో పొందుపర్చారు.

‘‘నేను ఏనుగుల వేటగాడి కూతురును అయినప్పటికీ, నాకున్న అవకాశాలను బట్టి భిన్నంగా పెరిగాను. మా కుటుంబసభ్యుల ఆలోచనలకు భిన్నంగా ఉండేదాన్ని. నా ఆలోచన, విశ్వాసాలు, ప్రవర్తన అన్నీ మా నాన్నతో పోలిస్తే చాలా వైరుధ్యంగా ఉండేవి ’’ అని శిల్ప గుర్తు చేసుకున్నారు.

శిల్ప, ది ఎలిఫెంట్ చేజర్స్ డాటర్ పుస్తక రచయిత

శిల్ప, ది ఎలిఫెంట్ చేజర్స్ డాటర్ పుస్తక రచయిత


శాంతి భవన్‌లో చదివేందుకు శిల్ప మిగతా తోబుట్టువులకు అవకాశం చిక్కలేదు. ఆమె సోదరుడు టెన్త్ పూర్తి చేయలేకపోయాడు. దీంతో సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తున్నారు. ‘‘ఏళ్లుగా మా కుటుంబ సభ్యుల జీవిత విధానం, నా జీవిత విధానానికి ఎంతో తేడా కనిపించేది. దీంతో మా కుటుంబ సభ్యులకు అసంతృప్తి ఉండేది. ఐతే వారిపై నా ప్రేమ ఏమాత్రం తగ్గలేదు’’ అని శిల్ప చెప్పారు.

అత్తా మామలతో శిల్ప

అత్తా మామలతో శిల్ప


పుస్తకం ఎందుకు ?

థట్టగుప్పెలోనే శిల్ప ఉండిపోయి ఉంటే ఆమె జీవితం మరోలా ఉండేది. ‘‘నిజమైన విద్య అంటే అకడమిక్ అనుభవమొక్కటే కాదు. మనం ఏం కావాలనుకుంటున్నాం ? మన జీవితమేంటి ? అందుకే విద్య అన్ని పరిష్కారాలకు మార్గం. స్థిరత్వం, ఆత్మ విశ్వాసం, ఆత్మగౌరవం ఇలా శాంతి భవన్‌లో చేరిన ఆరంభం నుంచే నా జీవితంలో ఎంతో మార్పు కనిపించింది. వ్యక్తిత్వ విలువలు మానవత్వం, కరుణ, ఔదార్యంతోపాటు నిజాయితీ, పారదర్శకత ప్రాధాన్యతను నేర్చుకున్నాను. ఎన్నో దేశాల నుంచి వచ్చిన వాలంటీర్ల దృష్టిలో పడిన నేను, వారి దగ్గరి నుంచి సంస్కృతిని, అనుభవాలను, నైపుణ్యాన్ని అలవర్చుకున్నాను. ఆత్మవిశ్వాసంతో ఇతరులతో మాట్లాడే సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకున్నాను. అలాగే నాయకత్వ లక్షణాలను కూడా అలవర్చుకున్నాను’’ అని శిల్ప వివరించారు.

శాంతి భవన్‌లో చదువుతున్నప్పుడు 1999లో శిల్ప (కింది నుంచి మొదటి వరుస ఎడమవైపు తొలి విద్యార్థిని)

శాంతి భవన్‌లో చదువుతున్నప్పుడు 1999లో శిల్ప (కింది నుంచి మొదటి వరుస ఎడమవైపు తొలి విద్యార్థిని)


ప్రతి చిన్నారికీ నాణ్యమైన విద్య, సాధికారత ఉంటే ఏం సాధించొచ్చో పేద పరిసరాల నుంచి వచ్చి, మంచి భవిష్యత్‌ను అందించిన ఓ స్కూల్‌లో చదివిన ఓ అమ్మాయి పుస్తక రూపంలో తీసుకొచ్చింది. సంఘ వివక్ష, పేదరికంతో ఆమె కుటుంబం ఎదుర్కొన్న సమస్యలను కూడా ఆమె పుస్తకంలో వివరించారు. ముఖ్యంగా భవిష్యత్ కోసం ఆమె ఎంచుకున్న విధానాన్ని వివరించారు.

పుస్తకాన్ని తీసుకురావడానికి శిల్పకు ఏడాది పట్టింది. ఆమె రెండు వేర్వేరు భిన్నమైన జీవితాల మధ్య చిన్నపాటి సంఘర్షణ. పాఠశాలలో ఆమెను అంతా సమర్థిస్తే.. కుటుంబ సభ్యులు మాత్రం తమ స్టోరీని రాసేందుకు ఇష్టపడలేదు.

‘‘ నా ఆలోచన మా కుటుంబానికి కొత్తగా అనిపించింది. కాలేజీకి వెళ్లకుండా పుస్తకం కోసం ఏడాది సమయాన్ని ఎందుకు తీసుకున్నానో మా కుటుంబ సభ్యులకు వివరించడం ఆరంభంలో చాలా కష్టమైంది. మావాళ్లు నా నిర్ణయాన్ని ఎందుకు వ్యతిరేకించారో నాకు అర్థమైంది. అంతకుముందు మా గ్రామంలో ఎవరూ ఇలాంటి పని చేయలేదు. అందరూ చేసినట్టుగానే నేను లాయరో, మరో వృత్తిని ఎంచుకోకపోవడంతో నాపై అసంతృప్తి ఉంది’’ అంటారు శిల్ప.

కుటుంబసభ్యులతో ...

కుటుంబసభ్యులతో ...


ఆమె నమ్మకం, రాయడంపై ఆమెకు ఉన్న విశ్వాసం చాలామందికి నచ్చింది. ప్రముఖ ప్రచురణకర్త, ఫిల్మ్ ఏజెంట్ పీటర్ మిల్లర్ ఆమె రచనను అచ్చేసేందుకు ముందుకొచ్చారు. చేతితో రాసిన ఆ కథను చూసిన 48 గంటల్లోనే ఆయన అంగీకారం తెలపడంతో శిల్ప ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.‘‘నా కథను ముద్రించేందుకు అంగీకరించానంటూ ఆయన విమానాశ్రయం నుంచి ఫోన్ చేసి చెప్పారు’’ అని శిల్ప పొంగిపోయారు.

సృజనాత్మకత కలిగిన రచయితల ప్రపంచంలో తానూ ఒకరినని ఆమె ఆందోళన చెందలేదు. ‘‘మా కుటుంబ కథను ప్రపంచానికి చెప్పేందుకు నేను ఎంతో సన్నద్ధమయ్యాను. కుటుంబంలో ఒకరిగా ఆ కథను నేను వివరిస్తున్నాను. ఇతర చెయ్యి తిరిగిన రచయితల కంటే ఓ యువతిగా నాకు చెప్పేందుకు విభిన్న అంశం దొరికిందన్నది నా భావన’’ అని ఆమె చెప్పారు.

చివరి మజిలీ..

శిల్ప రాసిన కథను తీసుకున్న పీటర్, దాన్ని పబ్లిష్ చేయించే ముందు మంచి ఎడిటర్‌తో దాన్ని ఎడిట్ చేయిస్తే బాగుంటుందని భావించారు. అలా చేయడం వల్లే శిల్ప జీవిత కథ మంచి పుస్తకంగా తయారై, బెస్ట్ సెల్లర్ అవుతుందన్నది ఆయన యోచన. అయితే ఆమెకిప్పుడు పుస్తకాన్ని ప్రచురించేంత స్తోమత లేదు. దీంతో మరికొందరి సాయంతో దాన్ని పబ్లిష్ చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం క్రౌడ్ ఫండింగ్‌కు పిలుపునివ్వడంతో అపూర్వమైన స్పందనే వచ్చింది. 25 రోజుల్లోనే దాదాపు 70 మంది 15 వేల డాలర్లను అందించేందుకు ముందుకు వచ్చారు.

ఈ పుస్తకం ఆమెకు ఆరంభం మాత్రమే. చిన్న పిల్లల సైకాలజిస్ట్ కావాలన్నది ఆమె కల. పేద తల్లిదండ్రుల పెంపకంలో, కావాల్సినది దొరకనప్పుడు పెరిగే పిల్లలకు జరిగే నష్టాలను స్వయంగా అనుభవించిన శిల్ప ఇప్పుడు తన కలను సాకారం చేసుకునే దిశగా ప్రయణిస్తున్నారు. వచ్చే ఐదేళ్లలో చైల్డ్ సైకాలజీ అంశంలో తన పీహెచ్‌డీని పూర్తి చేయాలని ఆమె లక్ష్యంగా పెట్టుకున్నారు. తనను పేదరికం, సాంఘీక అవమానం నుంచి బయటపడేందుకు శాంతి భవన్ చేసినట్టుగానే పేదరికంలో ఉన్న పిల్లల జీవితాల్లో మార్పులు తీసుకురావాలని శిల్ప భావిస్తున్నారు. ఆమె లక్ష్యం నెరవేరాలని ఆశిద్దాం..