చారిత్రక ఓరుగల్లు నగరానికి ఐటీ మహర్దశ..!  

0

బేసిగ్గా ద్వితీయ శ్రేణి పట్టణాలంటే పారిశ్రామికవేత్తలకు చిన్నచూపు. ఎందుకంటే మానవ వనరులు ఆశించిన స్థాయిలో ఉండవు. మౌలిక సదుపాయాలు అనుకున్నంత మెరుగ్గా కనిపించవు. గవర్నమెంటు నుంచి అందే ప్రోత్సాహకాల్లో సవాలక్ష అనుమానాలు. ఇవన్నీ బేరీజు వేసుకుని ఎందుకొచ్చిన రిస్కులే అనుకుని వెనకడుగు వేస్తారు. మహా అయితే ఒక బీపీవో సెంటర్ పెట్టి చేతులు దులుపుకుంటారు.

అయితే వరంగల్ విషయంలో అదంతా తప్పని రుజువైంది. చైతన్యానికి మారుపేరైన వరంగల్ నగరంలో ఐటీ విప్లవానికి పునాది పడింది. చారిత్రక నగరం ఓరుగల్లు గడ్డమీద ఇన్ఫోటెక్ కాలుమోపింది. ప్రపంచంలోనే మేటి ఐటీ దిగ్గజానికి రెక్కలు తొడిగి మరీ రప్పించుకుంది.

చారిత్రక నగరం ఓరుగల్లు ఐటీ సొబగులు అద్దుకుంటున్నది. వరంగల్- హైదరాబాద్ జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న మడికొండలో 45 ఎకరాల విస్తీర్ణంలో ఐటీ పార్కుకు పునాదిరాయి పడింది. రెండెకరాల్లో రూ.4.5 కోట్ల వ్యయంతో ఇంక్యుబేషన్ సెంటర్‌ను మొన్ననే మంత్రి కేటీఆర్ లాంఛనంగా ప్రారంభించారు. దాంతోపాటు ఇన్ఫోటెక్ (సయెంట్ గ్రూపు) ఈ కంపెనీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

ఇన్ఫోటెక్. ప్రపంచంలోని 32 దేశాల్లో దాదాపు 13-14వేల మందికి ఉపాధి కల్పిస్తున్న ఐటీ దిగ్గజం. ఒక్క హైదరాబాదులోనే 7వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అలాంటి కంపెనీ వరంగల్ లాంటి చారిత్రక నగరాన్ని ఎంచుకోవడం అభినందించాల్సిన విషయం. ఇక వరగంల్ నగర యువతీ యువకులు డిగ్రీ అవగానే ఉపాధి కోసం హైదరాబాదుకో బెంగళూరుకో పోనవసరం లేదు. చదువుకున్న చోటే ఉద్యోగం చేయడానికి ఐటీ దిగ్గజం ఓరుగల్లు గడ్డమీద కాలుపెట్టింది.      

                                   

బొంబాయికి పుణె.. బెంగళూరుకు మైసూరు ఎలా అయితే ఉన్నాయో... హైదరాబాదుకు వరంగల్ అలావుంది. రాజధాని నుంచి కేవలం గంట-గంటన్నర జర్నీ నగరానికి కలిసొచ్చే అంశం. అదీగాక సాంస్కృతిక వారసత్వం కలిగిన నగరం. చరిత్రలో ప్రత్యేక స్థానం ఉన్న నగరం. ఇప్పటికే వరంగల్ ఎడ్యుకేషన్ హబ్ గా పేరొందింది. దాదాపు 16 ఇంజినీరింగ్ కాలేజీలున్నాయి. ఒక నిట్ ఉంది. భౌగోళికంగా చూసినా, మేథోపరంగా చూసినా అన్ని అర్హతలు ఉన్న సిటీ వరంగల్. ఆల్రెడీ ప్రభుత్వం దానికి నగిషీలు దిద్దడానికి 300 కోట్ల బడ్జెట్ కేటాయించింది. పైగా వరంగల్ అంటే ప్రభుత్వానికి అవ్యాజమైన ప్రేమ కూడా ఉంది. నాస్కాం ఛైర్మన్ మోహన్ రెడ్డి మద్దతుతో ద్వితీయ శ్రేణి నగరాలైన వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం లాంటి నగరాలకు ఐటీ సంస్థలను తీసుకురావాలని సర్కారు సంకల్పించింది. ఈ నేపథ్యంలోనే కేవలం నెలరోజుల్లోనే వరంగల్ నగరానికి ఇన్ఫోటెక్ దిగ్గజాన్ని తీసుకురాగలిగారు. ఐదెకరాల్లో 70వేల చదరపు అడుగుల్లో బ్రహ్మాండమైన ఆఫీసు కడుతున్నారు. ఉద్యోగులకు అక్కడే వసతి కూడా కల్పించనున్నారు. పక్కనే ఇంక్యుబేషన్ సెంటర్ కూడా ఉంది. దానికోసం అదనంగా 5 కోట్లు విడుదల చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.

స్టార్టప్ లకు ఊతమిచ్చేలా హైదరాబాద్ నగరానికి టీ హబ్ ఎలావుందో వరంగల్ నగరంలో కూడా అలాంటి సెంటర్ ఏర్పాటు చేయాలని సర్కారు నిర్ణయించింది. నాస్కాం ఛైర్మన్ మోహన్ రెడ్డి సాయంతో వరంగల్ మహా నగరంలో ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. దాంతోపాటు నిట్ లో కూడా ఒక ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. విద్యార్ధుల్లో నైపుణ్యానికి పదును పెట్టేలా ప్రవేశపెట్టిన టాస్క్ ప్రోగ్రాంను కూడా వరంగల్ నగరంలో అమలు చేయబోతున్నారు. సిటీలో ఉన్న 16 ఇంజినీరింగ్ కాలేజీలే కాకుండా, అన్ని డిగ్రీ కాలేజీల విద్యార్ధలకు టాస్క్ పూర్తి స్థాయిలో శిక్షణ ఇవ్వబోతోంది.

భారతదేశంలో ఐటీ గ్రోథ్ రేట్ 13 శాతం. అందులో తెలంగాణ శాతం 16. ఇదొక్క ఉదాహరణ చాలు.. ఐటీ రంగంలో హైదరాబాద్ ఎంత నిక్షేపంగా వుందో చెప్పడానికి. మరోవైపు ఐటీ పరిశ్రమలన్నీ హైదరాబాద్‌ లోనే కేంద్రీకృతం కాకుండా, రాజధానికి దగ్గరగా అన్ని వసతులున్న వరంగల్‌లో విస్తరించేందుకు తెలంగాణ ప్రభుత్వం శరవేగంగా అడుగులు ముందుకు వేస్తోంది. ఇటు ఎన్నారైలు కూడా వరంగల్ ఐటీ భవిష్యత్ పై ఆశలు పెట్టుకున్నారు. హైదరాబాద్ తర్వాత అంతటి ప్రాముఖ్యత ఉన్న వరంగల్‌లో ఐటీ భవిష్యత్‌కు ఢోకా లేదనేది చాలామంది పారిశ్రామికవేత్తల అభిప్రాయం. ప్రభుత్వ ప్రోత్సాహకాలు, స్థల లభ్యత మీద కూడా ఎవరికీ ఎలాంటి అనుమానం లేకపోవడం- నగరంలో ఐటీ అభివృద్ధికి కలిసొచ్చే అంశం.  

Related Stories

Stories by team ys telugu