ప్రేమే మార్గం.. సేవే 'లక్ష్యం'. సోషల్ ఆంట్రప్రెన్యూర్‌గా సక్సెస్ అయిన రాశి ఆనంద్

ప్రేమే మార్గం.. సేవే 'లక్ష్యం'. సోషల్ ఆంట్రప్రెన్యూర్‌గా సక్సెస్ అయిన రాశి ఆనంద్

Thursday November 05, 2015,

4 min Read

అమ్మ చూపిన బాటలోనే నడిచింది. సేవే ‘లక్ష్యం’గా ముందుకు సాగుతోంది. చదువుతోనే ప్రపంచాన్ని మార్చగలమని బలంగా నమ్మింది. దాన్ని ఆచరణలో పెడుతూ తనలాంటి యువతకు స్ఫూర్తిగా నిలుస్తోంది ఢిల్లీకి చెందిన రాశి ఆనంద్. ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర అడుక్కుంటూ, జేబు దొంగలుగా మారుతూ, సమాజం వెలివేసిన వీధి బాలలను సన్మార్గంలో పెట్టడానికి ఎనలేని కృషి చేస్తోంది. ఓవైపు ఈవెంట్ మేనేజ్‌మెంట్, అడ్వర్టైజింగ్ ఏజెన్సీలలో తన కెరీర్‌ను కొనసాగిస్తూనే మరోవైపు మెరుగైన సమాజం కోసం పాటుపడుతోంది.

image


తల్లిదండ్రుల ఆస్తికి వారసులు ఉండటంలో ఆశ్చర్యం లేదు. కానీ వారి ఆశయాలనే ఆస్తిగా స్వీకరించి వాటి సాధన కోసం పాటుపడేవారు ఎంతమంది ఉంటారు ? నూటికో కోటికో ఒక్కరు. రాశి ఆనంద్ ఆ కోవకే చెందుతారు. సమాజసేవకే అంకితమైన తన తల్లి ప్రభావం రాశిపై చాలా ఉంది. సరదాగా గడపాల్సిన కాలేజీ రోజుల్లోనే సమాజసేవ బాధ్యతను భుజానికెత్తుకున్నారు రాశి ఆనంద్. ఢిల్లీ ప్రధాన కూడళ్లలో బిచ్చమెత్తుకుంటున్న బాలలను చూసి చలించిపోయిన ఆమె.. వారి కోసం ఏదైనా చేయాలని అనుకున్నారు. పాడైపోయిన ప్లాస్టిక్ బాటిళ్లనే బొమ్మలుగా చేసుకొని ఆడుకుంటున్న వారి దీనస్థిని గమనించిన రాశి.. ఇంటింటికీ తిరిగి పిల్లలు వాడిన పాత బొమ్మలను సేకరించడం మొదలుపెట్టారు. ఢిల్లీలోని పెద్దపెద్ద స్కూళ్ల దగ్గర ఇలా బొమ్మలు సేకరించడానికి ఏర్పాట్లు చేశారు. దీనికి మంచి స్పందన వచ్చింది. సుమారు 60 వేల వరకు బొమ్మలు, పుస్తకాలు సేకరించి వీధి బాలలకు పంచడం మొదలుపెట్టారు. అదే ఆ తర్వాతి కాలంలో ‘లక్ష్యం’ అనే ఎన్జీవో స్థాపనకు దారితీసింది. గతంలో లక్ష్య పేరుతో రాంచీలో తన తల్లి నడిపిన సంస్థ పేరు మీదుగానే ఎన్జీవోకు ‘లక్ష్యం’ అనే పేరు పెట్టారు రాశి ఆనంద్. ఓ మహోన్నత ఆశయ సాధన కోసం ప్రయత్నిస్తున్న తనకు ఇంతకుమించిన పేరు మరేముంటుందని ఆమె అంటారు.

image


పిల్లల కోసం బటర్ ఫ్లై.. మహిళల కోసం రూహ్

సంస్థను స్థాపించిన మొదట్లో ఢిల్లీలోని మురికివాడల్లో తిరిగి వారి సమస్యలను తెలుసుకోవడానికి రాశి ప్రయత్నించారు. పరిపూర్ణమైన విద్యతోనే అక్కడి పిల్లల జీవితాల్లో మార్పు సాధ్యమని గ్రహించారు. పనిలోపనిగా మహిళా సాధికారత కోసం కూడా పాటుపడాలని నిశ్చయించుకున్నారు. పిల్లల చదువు కోసం బటర్ ఫ్లై పేరుతో ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది లక్ష్యం సంస్థ. చదువు పరంగానే కాకుండా ఆరోగ్యం, పారిశుద్ధ్యంపై కూడా వారికి అవగాహన కలిగించేలా ఈ కార్యక్రమం సాగింది. స్వేచ్ఛగా విహరించే సీతాకోకచిలుకలాగా ఉన్నత చదువుతోనే స్వేచ్ఛాయుత జీవితం సాధ్యమని చాటడమే ఈ పేరు పెట్టడం వెనుక ఉన్న ఉద్దేశం. అన్నిరకాలుగా జీవనప్రమాణస్థాయిని పెంచడమే విద్య ముఖ్యలక్ష్యమని ఆమె బలంగా నమ్ముతారు. చదువు చెప్పడంతో పాటు పెయిటింగ్, మ్యూజిక్, డ్యాన్స్, యాక్టింగ్, ధ్యానంలాంటి ఇతర కార్యకలాపాల్లోనూ శిక్షణ ఇస్తున్నారు. లక్ష్యం సంస్థ కొన్ని బస్తీలను దత్తతకు తీసుకొని అక్కడ రెమెడియల్ స్కూళ్లను ఏర్పాటుచేసింది. వీటిద్వారా అక్కడి పిల్లలకు జీవిత పాఠాలు కూడా నేర్పడం ప్రారంభించింది. ఢిల్లీలోని వసంత్ కుంజ్ ప్రాంతంలోని మురికివాడలో ‘సాక్ష్యం’ పేరుతో నడుస్తున్న స్కూల్లో 200 మంది విద్యార్థులు ఉన్నారు. నగరంలోని ఫ్లైఓవర్ల కింద, రెడ్ లైట్ ఏరియాల్లో, రైల్వేస్టేషన్లలో వీధిబాలల కోసం వర్క్ షాప్స్ నిర్వహిస్తున్నారు. పొగాకు, మాదకద్రవ్యాల్లాంటి చెడు అలవాట్ల వల్ల కలిగే దుష్పరిణామాలపై వారికి అవగాహన కల్గిస్తున్నారు.

image


దేశంలోనే తొలి టాయ్ లైబ్రరీ

బొమ్మలే చిన్నారుల తొలి ప్రపంచం. వాటితోనే వారి రోజు మొదలవుతుంది. ఆ ఉద్దేశంతోనే దేశంలోనే తొలి బొమ్మల లైబ్రరీని 2004లో ఢిల్లీలో ఏర్పాటుచేసింది లక్ష్యం సంస్థ. వీధి బాలల కోసం స్థాపించిన ఈ లైబ్రరీ విజయవంతం అవడంతో.. ప్రతి లక్ష్యం సెంటర్లోనూ వీటిని ఏర్పాటుచేశారు. ఇక మహిళా సాధికారత కోసం ‘రూహ్’ పేరుతో ఓ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పురుషాధిక్య సమాజంలో తమ హక్కులను కాపాడుకోవడం ఎలాగో ఈ కార్యక్రమం ద్వారా ప్రచారం చేస్తున్నారు. మహిళలు తమ కాళ్లపై తాము నిలబడటానికి అవసరమైన ఆత్మస్థైర్యాన్ని నూరిపోస్తున్నారు. తాజాగా ‘అభ్యాస్’ పేరుతో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది లక్ష్యం సంస్థ. చిత్తుకాగితాల రీసైక్లింగ్, లక్ష్యం స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా నోట్ బుక్‌లను అందజేయడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఢిల్లీలోని కౌశాంబి కేంద్రంగా నడుస్తున్న లక్ష్యం సంస్థ ఇప్పటివరకు దేశంలోని 11 రాష్ట్రాల్లోని 20,800 కుటుంబాల్లో వెలుగులు నింపింది. ప్రతి సెంటర్ కు ఓ ఆపరేషనల్ డైరెక్టర్ ఉన్నా.. వారంతా రాశి ఆనంద్ మార్గదర్శకంలోనే పనిచేస్తారు.

image


సెలబ్రిటీల అండ

11 రాష్ట్రాల్లో ఈ స్వచ్ఛంద సంస్థ పనిచేస్తున్నా ఇప్పటివరకూ ప్రభుత్వం లేదా కార్పొరేట్ల సాయం మాత్రం తీసుకోలేదు. వ్యక్తులు ఇస్తున్న విరాళాలతోనే నడిపిస్తున్నారు. అన్ని సెంటర్లలో పిల్లలకు ఎలాంటి లోటూ లేకుండా చూడటంతోపాటు సిబ్బందికి జీతాలు ఇవ్వడం సవాలులాంటిదే. తక్కువ మొత్తంలో వస్తున్న విరాళాల కారణంగా ‘లక్ష్యం’ సంస్థను లోబడ్జెట్‌తో నడిపిస్తున్నామని రాశి చెబుతున్నారు. ప్రస్తుతం వీళ్లద గ్గర 15 మంది ఉద్యోగులు, ఆరుగురు బోర్డు సభ్యులు పనిచేస్తున్నారు. అంకితభావంతో పనిచేసే తన టీమ్ వల్లే లక్ష్యం ఇంత విజయవంతమైందని రాశి ఆనంద్ అంటారు. 

విరాళాలు సేకరించడానికి కూడా ఈ సంస్థ వినూత్నరీతిలో ప్రయత్నిస్తోంది. ఫ్యాషన్ ఫర్ ఎ కాజ్, ఢిల్లీ ప్రైమ్స్ పేర్లతో లక్ష్యం నిర్వహించే విరాళాల సేకరణ కార్యక్రమాలకు సెలబ్రిటీలు అండగా నిలుస్తున్నారు. తొలిసారి నిర్వహించిన ఫ్యాషన్ ఫర్ ఎ కాజ్‌లో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ తన స్వచ్ఛంద సంస్థ ‘బీయింగ్ హ్యూమన్’ తరఫున విరాళాలు అందజేశాడు. అంతేకాదు చిన్నారులతో సరదాగా గడిపి వాళ్లలో ఉత్సాహం నింపాడు. ఆ తర్వాతి ఏడాది తుషార్ కపూర్, జిమ్మి షెర్గిల్ లాంటి బాలీవుడ్ స్టార్లు కూడా ‘లక్ష్యం’ కోసం తమ వంతు సాయం చేశారు. సెలబ్రిటీలే కాదు.. మ్యాన్ ఫోర్డ్, సేఫ్ ఎక్స్ ప్రెస్, హ్యాంగ్ ఔట్, ఐఐటీ ఢిల్లీ, ఈబే, బుక్ యువర్ డ్రీమ్ స్టోర్ లాంటి సంస్థలు కూడా చేయూతనిస్తున్నాయి.

అవార్డుల పరంపర

మెరుగైన సమాజం కోసం ఎంతగానో కృషి చేస్తున్న లక్ష్యం సంస్థకు అవార్డులు వరుస కట్టాయి. ఈ ఏడాది షక్సియాత్ అవార్డుల్లో ఈ సంస్థకు ‘ఔట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ సోషల్ వర్క్’ పురస్కారం దక్కింది. గతేడాది యూటీవీ బిందాస్ ‘బీ ఫర్ చేంజ్’ అవార్డుల్లో చేంజ్ మేకర్స్ ఆఫ్ ఇండియాలో రాశి ఆనంద్ కూడా ఒకరు. అంతేకాదు జీటీఎం హోలిస్టిక్ అవార్డుల్లో ‘వుమెన్ ఆఫ్ విజన్’ కూడా రాశిని వరించింది. 2013లో ఈ యంగెస్ట్ సోషల్ వర్కర్‌కు నవరతన్ ఫౌండేషన్ ‘నారి శశాతికరణ్ అవార్డు’ ఇచ్చి సత్కరించింది. అదే ఏడాది ఆంట్రప్రెన్యూర్ ఇండియా సమ్మిట్ రాశి ఆనంద్‌ను ‘సోషల్ ఆంట్రప్రెన్యూర్ ఆఫ్ ద ఇయర్’గా ప్రకటించింది. 2012లో బీబీసీ ఈ ఎన్జీవోపై ప్రత్యేక డాక్యుమెంటరీని ప్రసారం చేసింది.

సవాళ్లు.. లక్ష్యాలు

సమాజ సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న రాశి ఆనంద్ ఎన్నో సవాళ్లనూ ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వీధి బాలలను స్కూళ్లకు పంపించేలా వారి తల్లిదండ్రులను ఒప్పించడానికి చాలా కష్టపడాల్సి వస్తోంది. విద్య వల్ల కలిగే లాభాలేంటో తెలియనివారు తమ పిల్లల చదువుకు అడ్డుపడుతున్నారు. వారిని ఒప్పించడానికి తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది. అయినా తాను కలలుగన్న ప్రపంచం కోసం రాశి అలుపెరుగని పోరాటం చేస్తూనే ఉన్నారు. 

''నేను ఎలా కోరుకున్నానో ప్రపంచం అలా ఉండాలన్నదే నా అతిపెద్ద కల. నేను మహిళా సాధికారత కోసం, పిల్లల సంక్షేమం కోసం పోరాడటం లేదు. వాస్తవానికి ప్రతి ఒక్కరూ తమకు ఎదురయ్యే సమస్యలను తమకు తాముగా పరిష్కరించే నేర్పును పొందే దిశగా వారిని మలచడమే నా లక్ష్యం. పరిపూర్ణమైన విద్య, అభివ్రుద్ధితోనే అది సాధ్యమవుతుందని నేను నమ్ముతాను. లైంగిక వివక్ష నుంచి ఉగ్రవాదం వరకు అన్ని సాంఘిక దురాచారాలకు చదువుతోనే పరిష్కారం కనుగొనగలం'' అని రాశి అంటున్నారు. 

ఆమె ‘లక్ష్యం’ నెరవేరాలని, ఆమె కలలుగన్న ప్రపంచం సాక్షాత్కరించాలని మనస్ఫూర్తిగా మనమూ కోరుకుందాం.