డాటా ఇండస్ట్రీలో ట్రెండ్ సృష్టిస్తున్న జర్నలిస్టుల స్టార్టప్

డాటా ఇండస్ట్రీలో ట్రెండ్ సృష్టిస్తున్న జర్నలిస్టుల స్టార్టప్

Thursday April 28, 2016,

4 min Read


ఏదైనా సమాచారం కావాలంటే... మనకు టక్కున గూగుల్ గుర్తుకు వస్తుంది. ఒక్క టాపిక్ కొడితే కొన్ని వందలు, వేల సమాధానాలు వస్తాయి. అందులో కచ్చితమైనది ఏదో నిర్ధారించుకోవడమే మన పని. అంత కచ్చితమైనది ఏదో తెలిస్తే మనకు గూగుల్ ఎందుకు..? ఇలాంటి సమస్య ముఖ్యంగా డాటాతో పాటు కొన్ని కీలకమైన విషయాల్లో వస్తుంది. అలాంటప్పుడు కచ్చితమైన సమాచారం చూపించే విశ్వసనీయమైన సంస్థ చూపించే ఆర్టికల్ పైనే ఆధారపడతాం. కానీ అలాంటివి ఎన్ని ఉన్నాయి..? టక్కున ఆలోచిస్తే ఒక్కటీ గుర్తుండదు. వాస్తవానికి ఇలా డాటా సహా కచ్చితమైన సమాచారాన్ని అందించే సంస్థలు చాలా తక్కువ ఉన్నాయి. అందుకే ఈ రంగంలో ఉన్న గ్యాప్ ను భర్తీ చేయడానికి నలుగురు జర్నలిస్టులు కలిసి ఒక స్టార్టప్ ప్రారంభించారు. దానిపేరే హౌ ఇండియా లైవ్స్ ( HIL )

ఒక్క క్లిక్ తో సమగ్ర సమాచారం

మ్యాట్రిమోనియల్ సైట్లలో జనం దేని కోసం ఎక్కువ సెర్చ్ చేస్తూంటారు..?

ఢిల్లీలో జరుగుతున్న వాహనాల దొంగతనాల్లో ఎక్కవ ఏ బ్రాండ్ వి..?

గుర్గావ్ లాంటి శాటిలైన్ టౌన్ షిప్ ఎలా నిర్మించారు..?

ఇవేవి కాకపోతే.. 1947లో పార్లమెంట్ లో జరిగిన బడ్జెట్ సమావేశాల విశ్లేషణ ఏమిటి..?

వీటికి గూగుల్ లో సెర్చ్ కొడితే చాలా సమాధానాలు రావచ్చు. కానీ వాటిలో అర్థమయ్యేవి ఎన్ని..? వాస్తవికతను ప్రతిబించేవి ఎన్ని..?

ఇలాంటి అనుమానాలు, సందేహాలన్నింటినీ తీర్చేందుకు ప్రారంభమైన స్టార్టప్ " హౌ ఇండియా లైవ్స్.." ( HIL ) ఢిల్లీ కేంద్రంగా ప్రారంభమైన డాటా సెర్చ్ అండ్ విజువలైజేషన్ స్టార్టప్ ఇది. జాన్ శామ్యూల్ రాజా, అవినాష్ సింగ్, ఆనంద్ కృష్ణమూర్తి, ఎన్.ఎస్ రామనాథ్ అనే నలుగురు బిజినెస్ జర్నలిస్టులు దీన్ని ప్రారంభించారు. తర్వాత వీరికి అవినాష్ సెలస్టైన్ అనే మరో డిజిటల్ నిపుణుడు జత కలిశాడు. డాటా విజువలైజేషన్ ను మొత్తం అవినాష్ సైలెస్టైన్ నే చూసుకుంటారు.

జాన్ శామ్యూల్ రాజ్ జర్నలిజంపై ప్యాషన్ ఉన్న వ్యక్తి. కార్పొరేట్ ప్రపంచంలో ఆర్థిక వ్యవహారాలపై ఎన్నో కథనాలు రాశారు. ప్రజాసమాచారం ఆధారంగా రాసిన కథనాలకు పలు అవార్డులు కూడా పొందారు. పబ్లిక్ డాటాను అందిరికీ అర్థమయ్యేలా.. అందుబాటులో ఉండేలా విజువల్ ఫార్మాట్లో తేవాలనే బిజినెస్ ఐడియాకు టో-నైట్ ఫౌండేషన్ పదహారు వేల డాలర్ల ఆర్థిక సాయం చేసింది. ఇది 2012లో జరిగింది. అలా వచ్చిన ఆర్థిక సాయంతోనే హౌ ఇండియా లైవ్స్ స్టార్టప్ కు బీజం వేశారు. జాన్.. ఎకనామిక్ టైమ్స్ లో పనిచేస్తున్నప్పుడు చాలా పెద్ద సంస్థల్లో కూడా చాలా కొద్ది మందికే డాటా యాక్సెస్ చేసుకునే సౌకర్యం ఉందని గుర్తించారు. అందుకే పబ్లిక్ డాటాతో పాటు ముఖ్యమైన ఇతర సమాచారం అంతా అందరికీ అందుబాటులో ఉండేలా, వెదుక్కోగలిగేలా, అర్థమయ్యేలా ఉండాలని భావించేవారు. ఈ పరిస్థితే స్టార్టప్ ఆలోచన ప్రారంభమవడానికి కారణం అయింది. అలాగే డాటాను సేకరించడం, దాన్నిఅర్థం చేసుకోవడం మధ్య ఉన్న గ్యాప్ ను తగ్గించాలని డిసైడయ్యారు.

ఒక రకంగా ఇది సాహసోపేత నిర్ణయమే. కానీ జాన్ వెనుకడుగు వేయలేదు. 2011లో జనాభా లెక్కలను విడుదల చేశారు. దీనిపై దేశవ్యాప్తంగా చర్చ ప్రారంభమయింది. దీన్నే మంచి అవకాశంగా మల్చుకున్నారు. తన కొలిగ్ అవినాష్ తో పాటు మరో ఇద్దరు కలసిపనిచేయడానికి సిద్ధమయ్యారు.

image


లెక్కలేనన్ని సవాళ్లు

ఈ ప్రాజెక్ట్ బృందానికి ఎక్సైటింగ్ గా అనిపించింది. కానీ గ్రాస్ రూట్ లెవల్ నుంచి పని చేసుకుంటూ రావడం మాత్రం చాలా కష్టంగా మారింది. వీరు కచ్చితమైన డాటా కోసం పడిన కష్టం అంతా ఇంతా కాదు. గవర్నమెంట్ దగ్గర ఉన్న సమాచారమే లోపభూయిష్టంగా ఉంటుంది. ఒక్కో శాఖ వద్ద ఒక్కో రకమైన లెక్కలు ఉన్నాయి. ఉదాహరణకు భారతదేశంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయనేదానిపై ఇండియాపోస్ట్, రూరల్ మినిస్ట్రీ, జనాభా లెక్కల విభాగం వేర్వేరు గణాంకాలు చూపిస్తాయి. చాలా గందరగోళంగా ఉంటుంది సమాచారం. ఎవరైనా రీసెర్చ్ స్కాలర్ ఈ సమాచారం కోసం సెర్చ్ చేస్తే కన్ఫ్యూజ్ కు గురికావడం ఖాయం. ఇలాంటి పరిస్థితిని HIL బృందం ఎదుర్కొంది. జనాభా గణాంకాలు విడుదలైన ప్రతీసారి గ్రామాలు, మండలాలు, జిల్లాల సంఖ్యలను వేర్వేరుగా చూపించారు. ఇలాంటి డాటా మధ్య కచ్చితత్వాన్ని మాత్రమే తీసుకోవడానికి HIL బృందానికి చాలా సమయం పట్టింది.

" శ్రీనగర్ పేరుతో నాలుగు రాష్ట్రాల్లో 120 ప్రాంతాలు ఉన్నాయి. ప్రత్యేకంగా శ్రీనగర్ ఒక్కదాన్నే గుర్తించడానికి మాకు మూడు రోజుల సమయం పట్టింది"- అవినాష్

HIL ఇంటర్ ఫేస్ ను అభివృద్ధి చేసే క్రమంలోనే రాష్ట్రాలు, ప్రాంతాలను వేరు చేస్తూ సెర్చ్ చేసేవారికి పెద్దగా ఇబ్బంది లేకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. అలాగే 2001 జనాభా లెక్కల వివరాలు ఇంటర్నెట్ లో పూర్తిస్థాయిలో అందుబాటులో లేవు. పూర్తిగా ప్రభుత్వ విభాగాలు ఇచ్చిన సమాచారం మీద ఆధారపడి కచ్చితత్వాన్ని అంచనా వేసుకున్నారు.

ఆధునిక టెక్నాలజీ కోసం చాలా కష్టపడ్డారు. సేకరించిన సమాచారం, కచ్చితమైన ఇన్ఫర్మేషన్ వీరికి బాగా అర్థమవుతుంది. కానీ సెర్చ్ చేసేవారికి మరింత బాగా అర్థం అయ్యేలా, డాటా విజువలైజ్ చేయడానికి చేయడానికి టెక్నాలజీ కోసం వీరు తీవ్రంగా శ్రమించారు. ఈ క్రమంలో వీరికి వినాయక్ జోషి అనే ప్రొఫెషనల్ వీరికి సాయపడ్డారు. జోషి అంట్రప్రెన్యూర్లుగా మారిన జర్నలిస్టుల ఐడియా ఓ రూపానికి రావడానికి కృషి చేశారు. జోషి వరల్డ్ బ్యాంక్ కోసం ఇంతకు ముందు ఇలాంటి ప్రాజెక్ట్ ఒకటి చేశారు.

image


"ఫ్రీమియం" పద్దతిలో ఆదాయం

HIL ఇటీవలే బేటా వెర్షన్ వెబ్ సైట్ ను లాంఛ్ చేసింది. భారత్ తో పాటు అమెరికా, యూకేల్లో పదమూడు వేల మంది యూజర్లు ఇప్పుడు HILకి ఉన్నారు. ప్రస్తుతం డాటాను ఉచితంగానే అందిస్తున్నారు. త్వరలో "ఫ్రీమియం" పద్దతికి మార్చాలనుకుంటున్నారు. అంటే ఓ స్థాయి వరకే ఉచితంగా డాటా అందించి.. తర్వాత చార్జ్ చేయాలనుకుంటున్నారు.

"డిస్ట్రిక్ లెవల్ వరకు డాటా ను ఉచితంగా యాక్సెస్ చేసుకోనిస్తాం. ఆ తర్వాత మాత్రం కొంచె చార్జ్ చేయాలనుకుంటున్నాం. త్వరలో న్యూస్ ఎజెన్సీస్ కు వర్క్ స్టేషన్స్ తో కూడా ఒప్పందం చేసుకోవాలనుకుంటున్నాం" - జాన్, HIL ఫౌండర్

డాటా సేకరణకు ఇతర సంస్థలతో కలసి HIL పనిచేస్తోంది. షైన్ డాట్ కామ్, భారత్ మేట్రిమోనీ లాంటి వాటితో టైఅప్ అయి... ఆయా సైట్లలో ప్రజలు దేని కోసం ఎక్కువ సెర్చ్ చేస్తున్నారు.. ఎలాంటి సమాచారం కోరుకుంటున్నారు.. అనే అంశాలను విశ్లేషించుకుంటోంది. అలాగే వ్యాపార సంస్థలు తమ వ్యూహాలను అమలు చేసుకునేందుకు కావాల్సిన మార్కెట్ డాటా.. వినియోగదారుల అభిరుచులు.. లెటెస్ట్ మార్కెట్ ట్రెండ్స్ లాంటి సమాచారాన్ని, విశ్లేషణలు కూడా అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. డాటా రంగంలో ఉన్న అవకాశాలను రెండు చేతులా అందిపుచ్చుకునేందుకు అంట్రప్రెన్యూర్లుగా మారిన ఈ జర్నలిస్టులు ఫ్యూచర్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు.