మూడు సార్లు ఫెయిల్ ! 'స్నాప్ షాపర్' అనే ఇమేజ్ సెర్చింగ్ అప్లికేషన్‌తో సూపర్ హిట్

మూడు సార్లు ఫెయిల్ ! 'స్నాప్ షాపర్' అనే ఇమేజ్ సెర్చింగ్ అప్లికేషన్‌తో సూపర్ హిట్

Sunday October 25, 2015,

4 min Read

ఆన్‌లైన్‌ షాపింగ్ అనే పదం ఇప్పుడు దాదాపు ప్రతీ ఇంటా మారుమోగిపోతోంది. ఇంట్లోనే కూర్చుని దుస్తుల దగ్గర నుంచి ఫర్నీచర్ వరకూ అన్నీ ఫింగర్ టిప్స్ మీద ఆర్డర్ చేసుకోవడం ద్వారా గంటలు గంటలు షాపుల చుట్టూ తిరగడం ఇష్టపడని వారు సైతం షాపింగ్ ఫ్రీక్స్‌గా మారిపోతున్నారు. అయితే.. అన్ని వర్గాల వారికీ ఆన్ లైన్ షాపింగ్‌పై అవగాహన పెరుగుతున్న కొద్దీ... కొన్నిసార్లు నచ్చిన వస్తువును కొనుగోలు చేసేందుకు సరైన కీవర్డ్స్ దొరక్క ఇబ్బంది పడే వారి సంఖ్యా రోజు రోజుకీ పెరుగుతోంది. ఇలాంటివారి కోసమే AI స్నాప్ షాపర్ అందుబాటులోకి వచ్చింది. సైట్స్‌లో వివిధ ప్రోడక్ట్స్ క్యాటగిరీలకు పేరులు కాకుండా... ఫొటోలను వినియోగించడం ద్వారా ఆన్ లైన్ షాపింగ్ మరింత సులభంగానూ, సౌకర్యంగానూ మారుస్తోంది.

image


2014 సెప్టెంబర్ లో నవనీత్ శర్మ, దెబాశిశ్ పట్నాయక్ లాంచ్ చేసిన ఈ స్నాప్ షాపర్ ఆన్‌లైన్ వినియోగదారులకే కాదు... రిటైలర్లకూ ఎంతో ఉపయోగకరంగా మారింది. ఇమేజ్ సహాయంతో కస్టమర్లకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఇప్పుడు దేశంలోని పెద్ద పెద్ద ఈ-కామర్స్ జెయింట్లు కూడా ఉత్సాహం చూపిస్తున్నాయి. దీని ద్వారా వినియోగదారులు సైతం తమకు కావాల్సిన వస్తువులను సులభంగా పొందవచ్చు. 'ఆన్ లైన్ వినియోగదారులు చేయవలసిందల్లా ఓ ఫొటోను తీయడమే... ఆ వెంటనే వారు తమకు కావాల్సిన వస్తువును కొనుగోలు చేసుకోవచ్చు' అని అంటారు స్నాప్ షాపర్ వ్యవస్థాపకుడు నవనీత్.

జీవితాన్ని మార్చేసిన ఐడియా

నవనీత్ కలలకు ప్రతిరూపమే ఈ స్నాప్ షాపర్. మ్యాథ్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ, VIT యూనివర్శిటీ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ చేసిన నవనీత్ AI రీసెర్చ్ గ్రూపునకు 18నెలలు నాయకత్వం వహించాడు. రోబోటిక్స్, డేటా సైన్స్‌లో 40మంది విద్యార్ధులకు మార్గదర్శకత్వం చేశాడు. ఇప్పటికీ యూనివర్శిటీలో సలహాదారుగా సేవలు అందిస్తున్నాడు ఈ యంగ్ ఆంట్రప్రెన్యూర్.

తన కలల సౌథమైన స్నాప్ షాపర్ కోసం... తమ AI టీమ్‌లో చేరమని యాపిల్ సంస్థను నుంచి వచ్చిన ఆఫర్‌ను సైతం నవనీత్ తిరస్కరించాడు. ఫేస్ బుక్‌లో యంగ్ డేటా సైంటిస్ట్స్ అనే గ్రూప్‌ను క్రియేట్ చేసి బెంగళూరు కేంద్రంగా AI లర్నప్ సిరీస్ మొదలుపెట్టాడు. ఓ స్టార్టప్‌ను స్థాపించే దిశగా నవనీత్ చేసిన నాలుగో ప్రయత్నం ఇది. కాలేజీ రోజుల్లోనే మూడుసార్లు ఈ దిశగా ప్రయత్నాలు చేసి విఫలమైన నవనీత్... ఆఖరికి అనుకున్నది సాధించాడు.

అయితే స్నాప్ షాపర్ ఆలోచన వ్యక్తిగత అనుభవం అధారంగానే ఊపిరి పోసుకుందని అంటాడు నవనీత్. తన గర్ల్ ఫ్రెండ్ పుట్టినరోజు కోసం ఓ సారి షాపింగ్‌కు వెళ్లిన నవనీత్ ఓ మంచి డ్రెస్ సెలక్ట్ చేసుకున్నాడు. కానీ, ఆ డ్రెస్ చాలా ఖరీదైనది కావడంతో... ఈ-కామర్స్ సైట్స్‌లో అచ్చంగా అలాంటి డ్రెస్ కోసమే వెతకడం ప్రారంభించాడు.

కానీ, ఎంతగా ప్రయత్నించినా, ఎన్ని సర్చింగ్ టూల్స్ ఉపయోగించుకున్నా అతడికి ఆ డ్రెస్ లభించలేదు. అప్పుడే ఫ్యాషన్ అపరెల్స్, యాక్ససరీస్‌ను కొనుగోలు చేసుకునేందుకు విజువల్ టూల్స్ ఉండాలన్న ఆలోచన తట్టింది. అదే స్నాప్ షాపర్‌ ఏర్పాటుకు కారణమైంది.

image


బృంద నిర్మాణం

'2014జూన్ లో ఈ ఐడియాను దెబాశిష్‌తో పంచుకున్నాను. ఆ వెంటనే ఈ ఆలోచనను ఆచరణలో పెట్టి, బృంద నిర్మాణానికి శ్రీకారం చుట్టాము' అని తమ స్టార్టప్ తొలిరోజులను గుర్తుచేసుకున్నాడు నవనీత్.

బ్యాచిలర్స్ డిగ్రీ పట్టభద్రుడైన దెబాశిష్.. బెంగళూరులోని తన సొంత స్టార్టప్ ను ప్రారంభించడానికి ముందు కాగ్నిజెంట్‌లో మూడేళ్ల పాటూ పనిచేశాడు. అయితే తన స్టార్టప్ ప్రారంభించిన ఆరు నెలలకే నవనీత్‌తో చేతులు కలిపిన దెబాశిష్... స్నాప్ షాపర్‌ సహ వ్యవస్థాకుడయ్యాడు. ప్రస్తుతం డాటా సైన్స్, ఇంజినీరింగ్ విభాగాల్లో సేవలు అందిస్తున్నాడు. ఇక స్నాప్ షాపర్ రీసెర్చ్ విభాగాన్ని పర్యవేక్షించేందుకు ఆ రంగంలో నిష్ణాతుడైన వివేక్‌ను ఆశ్రయించాడు నవనీత్. ' నేను అతడికి ఓ చిన్న నిజాన్ని చెప్పాను. నేటి రోబోటిక్స్ హార్డ్ వేర్ కన్నా సాఫ్ట్‌వేర్ లోపం వల్లే అక్కరకు రాకుండా పోతున్నాయి. వాటిలో మంచి విజన్ సిస్టమ్ ఉండాలి. అతడు దృష్టి సారించాల్సిన అంశం అదేనని వివరించాను' అని తెలిపాడు నవనీత్.

ఆ తరువాత ప్రోగ్రామర్‌గా రిచాను తమ బృందంలో చేర్చుకున్నారు. అంతకుముందు టెక్సాస్ లో అర్జించిన అనుభవంతో రిచా ఈ సంస్థలో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించింది. స్నాప్ షాపర్ లక్ష్యాన్ని గుర్తించిన రిచా... మహిళలు షాపింగ్ చేసే సమయంలో ఏం కావాలనుకుంటారు, ఎలా ఆలోచిస్తారు అన్న అంశాలపై తమ బృందానికి కావాల్సిన సమాచారాన్ని అందిస్తుంది. 'కొంతకాలానికి ఇంకో స్టార్టప్‌తో చేతులు కలిపిన తరువాత కూడా రిచా ఇంకా స్నాప్ షాపర్ కు తగిన సహకారం అందిస్తూనే ఉంది. మా ఎదుగుదలలో ఆమె కృషి ఎంతో ఉంద'ని గర్వంగా చెబుతారు నవనీత్.

సవాళ్లు

ఓ సమర్థవంతమైన నెట్వర్క్‌ను రూపొందించడమే తాము ఎదుర్కొన్న అతిపెద్ద సవాలు అంటారు నవనీత్. ఓ ప్రముఖ కాలేజీ నుంచి బయటకు వచ్చినా అక్కడ గడించిన వ్యాపార దృక్ఫథం అతడికి ఏమాత్రం ఉపయోగపడలేదు. 'మొదటి నుంచీ ప్రారంభించాల్సి వచ్చింది. ఫేస్ బుక్ ద్వారా పలు స్టార్టప్స్ ఫౌండర్లతో పరిచయాలు పెంచుకున్నాను. వారిలో ఇద్దరు నాకు మార్గదర్శకులుగా వ్యవహరించారు. ఇప్పటికీ వారి సలహాలు సూచనలు తీసుకుంటుంటాం' అని తన స్టార్టప్ తొనినాళ్లను గుర్తుచేసుకుంటాడు నవనీత్.

స్నాప్ షాపర్‌ను ఓ చిన్ని స్టార్టప్‌గా అభివర్ణించే నవనీత్ బృందం... సరైన బిజినెస్ మోడల్‌ను రూపొందించేందుకు చాలా సమయాన్నే వెచ్చించింది. ఇక ఈ టెక్నాలజీని త్వరగానే అడాప్ట్ చేసుకున్న రిటైలర్లు... స్నాప్ షాపర్ ఎదుగుదలకు మరింత దోహదపడుతున్నారు.

గూగుల్ ఎక్స్‌పో 15లో బెస్ట్ యాప్ రన్నరప్ గా నిలిచిన స్నాప్ షాపర్ అనంతరం గూగుల్ లాంచ్ ప్యాడ్ వీక్‌లో టాప్ 16 స్టార్టప్స్‌లో ఒకటిగా నిలిచింది. లెట్స్ ఇగ్నైట్ 15లోనూ టాప్ 30 స్టార్టప్స్‌లో ఒకటిగా నిలిచింది. ఇవన్నీ స్నాప్ షాపర్ బృందంలో ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంపొందించాయి.

image


మార్కెట్

టెక్నాలజీ, డిజైన్ల ద్వారా సమస్యను పరిష్కరించడంలోని వైవిధ్యమే మా ప్రత్యేకత అని అంటారు నవనీత్. టాప్ ఆర్టిఫీషియల్ టీమ్‌తో పనిచేసేకన్నా..... ఈ రంగంలో అపారమైన అనుభవం గడించిన వారితో పటిష్ఠమైన బృందాన్ని నిర్మించుకోవడమే తమ విజయ రహస్యం అని పేర్కొంటారు స్నాప్ షాపర్ బృందం.

APIను వినియోగించే భాగస్వాముల ద్వారా ఆదాయాన్ని పెంపొందించుకుంటోంది స్నాప్ షాపర్. 'SaaS మోడల్ మాదిరే కస్టమర్ల అవసరాలకు తగ్గట్లు వివిధ ప్రణాళికలు రూపొందిస్తాం. మొబైల్ ఫోన్స్ వాడకం, m- కామర్స్ వినియోగం ఎక్కువ అవుతున్న కొద్దీ మా మార్కెట్ కూడా విస్తరిస్తుంది. ఫ్లిప్ కార్ట్, పిన్ట్రెస్ట్ వంటి పెద్ద సంస్థలు వినియోగించే విజువల్ సెర్చ్ టెక్నాలజీ కన్నా కాస్త భిన్నమైనదైనప్పటికీ.. స్నాప్ షాపర్ ను త్వరలోనే మెయిన్ స్ట్రీంలోకి తీసుకుని వెళతాం' అని నమ్మకంగా చెబుతాడు నవనీత్.

కాంపిటీషన్, AI స్పేస్

ఇటీవలి కాలంలో ఫ్లిప్ కార్ట్, వూనిక్, క్రాఫ్ట్స్ విల్లా వంటి ఈ-కామర్స్ సంస్థలు ఇమేజ్ సర్చ్ టెక్నాలజీని బాగా వాడుకలోకి తీసుకువచ్చాయి. వూనిక్, క్రాఫ్ట్స్ విల్లా.... మ్యాడ్ స్ట్రీట్ డెన్స్ టెక్నాలజీని వినియోగిస్తుండగా... ఫ్లిప్ కార్ట్ సింగపూర్‌కు చెందిన స్టార్టప్ టెక్నాలజీని వినియోగిస్తోంది.

అయితే ఇమేజ్‌లను ఉపయోగించి షాపింగ్ చేసే ఈ రకమైన టెక్నాలజీ కాస్త సులభంగానే కనిపిస్తున్నప్పటికీ ఇది కంప్యూటర్లకు వర్తించదు. ఫేస్ బుక్, మైక్రోసాఫ్ట్ , గూగుల్ వంటి బడా సంస్థలు ఈ రకమైన టెక్నాలజీపై భారీ పెట్టుబడులు పెడుతున్నాయి.

'మొబైల్‌లో సర్చింగ్ ను సులభతరం చేయడమే మా లక్ష్యం. ప్రస్తుతం ఈ సమస్యలోని ఓ చిన్ని భాగంపైనే మా దృష్టి నిలిపాం. అయితే మాకు ఉన్న పటిష్ఠమైన బృంద సహకారంతో త్వరలోనే దీనికి ఓ శాశ్వత పరిష్కారం కనుగొంటాం. భవిష్యత్తులో కార్లు, రోబోటిక్స్, డ్రోన్స్ వంటి భారీ యంత్రాలకూ ఈ టెక్నాలజీని వర్తింపజేయాలని భావిస్తున్నాం. అందుకే స్నాప్ షాపర్ లోని పరిశోధనా విభాగాన్ని ప్రత్యేకమైన యూనిట్ గా నిర్వహిస్తున్నాం' అని నవనీత్ తమ ఫ్యూచర్ ప్లాన్స్ ను యువర్ స్టోరీతో షేర్ చేసుకున్నాడు.

website