మెడికల్ టూరిజం హబ్‌గా హైదరాబాద్

మెడికల్ టూరిజం హబ్‌గా హైదరాబాద్

Tuesday January 24, 2017,

3 min Read

వైద్యం అనగానే అమెరికా మాత్రమే ఏదో గొప్పగా చేస్తుందని, యూరప్ అయితేనే చికిత్స అద్భుతంగా ఉంటుందని చాలామంది భ్రమపడుతుంటారు. కానీ అంతకంటే గొప్ప చికిత్సా విధానం హైదరాబాదులో అందుబాటులో ఉంది. ప్రపంచస్థాయి ప్రమాణాలు, అత్యాధునిక వైద్యపరికరాలు, నిష్ణాతులైన వైద్యులు.. వెరసి భాగ్యనగరం మెడికల్ టూరిజం హబ్‌ గా రూపుదిద్దుకుంటోంది.

ప్రపంచం ఇప్పుడు హైదరాబాద్ వైపు చూస్తోంది. ఐటీ దిగ్గజ కంపెనీలన్నీ కొలువు దీరాయి. రాకెట్ వేగంతో ఫార్మా ఇండస్ట్రీ డెవలప్ అయింది. నిర్మాణం రంగానికి తిరుగులేదు. శాంతిభద్రతలకు ఢోకాలేదు. మానవ వనరులకు కొదవలేదు. సకల రంగాలకు ఆలవాలంగా నిలిచిన హైదరాబాద్ మెడికల్ టూరిజంలోనూ అంతే వేగంగా అభివృద్ధి చెందుతోంది.

image


సాధారణంగా వైద్యం అనగానే అమెరికాలో అద్భుతంగా ఉంటుందని, యూరప్ కంట్రీల్లో అయితే మెరుగైన చికిత్స అందిస్తారనే అపోహ ఉంది. దాన్ని పటాపంచలు చేస్తూ అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తోంది హైదరాబాద్. విదేశాల్లో కూడా సాధ్యంకాని ఎన్నో సర్జరీలను విజయవంతంగా చేసి చూపించాయి ఇక్కడి కార్పొరేట్ ఆసుపత్రులు.

గత పదేళ్లుగా అంతర్జాతీయ పేషెంట్ల రాక ఎక్కువైంది. ఆఫ్రికా దేశాలైన నైజీరియా, సూడాన్, మిడిలీస్ట్ దేశాలు ఒమన్, ఇరాక్, యెమన్, అటు బంగ్లాదేశ్ ఇటు ఆఫ్ఘన్ నుంచి కూడా రోగులు వస్తున్నారు. గత మూడేళ్లుగా చూసుకుంటే, ఇండియన్ మెడికల్ టూరిజం విలువ 3 బిలియన్ డాలర్లు. 2020కల్లా ఆ సంఖ్య 8 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. దేశంలోని బెస్ట్ హాస్పిటల్ ఉన్న నగరాల జాబితాలో హైదరాబాద్ టాప్ ఫైవ్‌ లో నిలిచింది. ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు తర్వాత హైదరాబాదే ఉంది. ద్వితీయ శ్రేణి నగరాలైన పుణె, కొచ్చిన్, అహ్మదాబాద్ లో ఇప్పుడిప్పుడే మెడికల్ టూరిజం అభివృద్ధి చెందుతోంది.

ఎలాంటి ప్రచార ఆర్భాటం లేకున్నా.. కేవలం ఆ నోటా ఈనోటా వినడం ద్వారానే ఇంత మార్కెట్ సంపాదించగలిగింది హైదరాబాద్. దానికి కారణాలు అనేకం. ఇక్కడి వాతావరణం. ఇక్కడి మనుషుల అభిమానం, ఆప్యాయత. కోలుకున్న పేషెంట్లలో ఎవరిని కదిలించినా ఇదే ఫీడ్ బ్యాక్ ఇస్తారు. ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే.. లండన్ వెళ్లినా, అమెరికా వెళ్లినా అక్కడ కూడా ఇండియన్ డాక్టర్లే. ఇంటర్నేషనల్ పేషెంట్ల తాకిడి పెరగడానికి ఇదొక ముఖ్య కారణం.

లక్షలు ఖర్చుపెట్టి, సవాలక్ష ఆంక్షలతో అమెరికాకి వెళ్లడం కంటే.. స్నేహపూర్వకంగా ఉండే ఇండియాకి రావడమే బెస్ట్ అనుకుంటున్నారంతా. పైగా ఖర్చు కూడా చాలా తక్కువ. ఉదాహరణకు అమెరికాలో ఒక సర్జరీకి లక్ష రూపాయలైతే, అదే శస్త్రచికిత్స మన దగ్గర 15 వేలలో పూర్తవుతుంది. ఇవన్నీ మెడికల్ టూరిజం విస్తరించడానికి ముఖ్యకారణాలుగా నిలుస్తున్నాయి.

ఉదాహరణకు బోన్ మారో ఆపరేషన్ చూసుకుంటే. ఇతర దేశాలతో పోల్చుకుంటే మన దగ్గర ఆ సర్జరీకి తిరుగులేదు. ఇప్పటిదాకా 100 ఆపరేషన్లు చేస్తే, అందులో 15 శాతం ఇతర దేశాలవారికి చేసినవే. బోన్ మారో సగం మ్యాచ్ అయినా సరే, సర్జరీ విజయవంతం చేసిన ఘనత మనకే దక్కింది. చెప్పాలంటే ప్రపంచ వైద్య చరిత్రలోనే ఇది తొలిసారి. అంతర్జాతీయ ప్రమాణాలతో, అత్యాధునిక చికిత్సా పరికరాలతో హెల్త్ సెక్టారులో ఇండియాను గ్లోబల్ ప్లాట్ ఫాం మీద నిలబెట్టడంలో మన ఆసుపత్రులు కీలకపాత్ర పోషిస్తున్నాయి.

ఇకపోతే, అంతర్జాతీయ పేషెంట్లను చూసుకునే పద్ధతి కూడా ఎంతో హుందాగా, ఆప్యాయంగా ఉంటుంది. వాళ్లు మెడికల్ క్వైరీ పంపిన దగ్గర్నుంచీ ట్రీట్మెంట్ ప్లాన్, ఇన్విటేషన్, వీసా, ఎయిర్ పోర్ట్ నుంచి పికప్, డ్రాప్, గెస్ట్ హౌజ్, నర్సింగ్ ఇలా ప్రతీ విషయంలో వారికి ఏమాత్రం లోటు లేకుండా చూసుకుంటారు. సర్జరీ చేయడం ఒకెత్తయితే, పేషెంట్ తో ఎమెషనల్ గా కనెక్టవడం మరొక ఎత్తు. డబ్బొక్కటే ప్రధానం కాకుండా , అతిథి దేవోభవ అనే సూత్రంతో అటు ఇమోషనల్ గా అటు ప్రొఫెషనల్‌ గా పేషెంట్లతో కనెక్టవుతారు. వేరే దేశం వారు అన్న భావన సిబ్బందిలో రానీయరు. పేషెంట్లకూ ఆ ఫీలింగ్ కలగనీయరు.

కోలుకుని వెళ్లిపోయిన పేషెంట్స్ కూడ డాక్టర్లతో నిత్యం వాట్సాప్ లో కాంటాక్టులో ఉంటారు. ఫాలోఅప్ కోసం ఇండియాకు రావడానికి వాళ్లు ఆసక్తి చూపుతారు. డాక్టర్ల నుంచి నర్సుల దాకా లాబ్ నుంచి హౌజ్ కీపింగ్ వరకు వాళ్లు అటాచ్ అవుతారు. కోలుకున తిరిగి తమ దేశానికి వెళ్లేటప్పుడు పేషెంట్ బంధువులు స్వీట్లు పంచి సెలబ్రేట్ మరీ చేసుకుని వెళ్తారు.

ప్రస్తుతానికి మెడికల్ టూరిజంలో దేశంలోనే ఐదో స్థానంలో ఉన్నాం. భవిష్యత్‌ లో నెంబర్ వన్ అవుతామని కార్పొరేట్ ఆసుపత్రులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.