అంతర్జాతీయ ప్రమాణాలతో వరంగల్ మెగా టెక్స్ టైల్ పార్క్  

సమీకృత వ్యవస్థగా మెగా వస్త్ర విపణి

0

అంతర్జాతీయ వస్త్ర విపణికి ఓరుగల్లు వేదిక కానుంది. పత్తిసాగులో నెంబర్ వన్ గా ఉన్న వరంగల్.. వస్త్ర పరిశ్రమకు కేరాఫ్ గా మారనుంది. రాష్ట్ర ప్రభుత్వం వరంగల్ రూరల్ జిల్లాలో మెగా టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటు చేయబోతోంది. ఒక సమీకృత వ్యవస్థగా రూపుదిద్దుకోబోతున్నది మెగా టెక్స్ టైల్స్ పార్కు.

వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ-సంగెం మండలాల మధ్య మెగా టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటుకు శరవేగంగా భూసేకరణ జరుగుతోంది. ఎకరం భూమికి దాదాపు పది లక్షల పరిహారం, వంద గజాలఇంటి స్థలంతో పాటు కుటుంబానికి ఒక ఉద్యోగం ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.

నిజానికి వరంగల్ అర్బన్ జిల్లా పరిధిలోని ధర్మాసాగర్ మండలం దేవునూరు-ముప్పారం గ్రామాల మధ్య మెగా టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటు చేయాలని ముందుగా భావించారు. అయితే అక్కడ అవసరమైనంత భూమి అందుబాటులో లేకపోవడంతో గీసుకొండను ఎంచుకున్నారు. మొత్తం 2 వేల 200 ఎకరాల్లో మెగా టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటు కానుంది. తొలి దశలో 1200 ఎకరాలభూమి సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే 1100 ఎకరాల భూసేకరణ పూర్తయింది.

పట్టాదారు పాసు పుస్తకాలు కలిగి ఉన్న పట్టేదారుకు ఎకరానికి 9 లక్షల 95 వేలు ఇస్తున్నారు. ప్రభుత్వ అసైన్డ్ భూమి ఉన్న రైతులకు ఎకరానికి 7 లక్షల 10 వేలు చెల్లిస్తున్నారు. వీటితో పాటు నిర్వాసిత కుటుంబంలో ఒకరికి టెక్స్ టైల్ పార్క్ లో ఉద్యోగం కల్పిస్తామని సర్కారు హామీ ఇచ్చింది. ఎకరం ఇచ్చిన రైతులకు 100 గజాల ఇంటి స్ధలం, అంతకన్నా తక్కువ భూమి ఇచ్చిన వారికి 50 గజాల ఇంటి స్ధలం కేటాయిస్తామని ప్రకటించింది.

ఇకపోతే గీసుకొండ-సంగెం మండలాల మధ్య ఏర్పాటు కాబోతున్న మెగా టెక్స్ టైల్ పార్కుకు ఎన్నో సానుకూలతలు ఉన్నాయి. పక్కనే ఔటర్ రింగ్ రోడ్డు, దగ్గర్లోనే రైల్వే స్టేషన్, మధ్యలోంచి ఎస్సారెస్పీ కాలువ ఏడు కిలోమీటర్ల దూరంలోనే వరంగల్ సిటీ, పైగా అది కాకతీయ అర్బన్ డెవలప్ మెంట్ ఏరియా కావడం.. టెక్స్ టైల్ పార్కుకు సానుకూల అంశాలు. ఇవికాక పార్కు వచ్చే ప్రాంతంలో ఒక్క ఇల్లు కూడా లేకపోవడం, నిరాశ్రయులనే మాటకు తావులేకపోవడం కలిసివచ్చాయి.

రాష్ట్రంలో మేలైన పత్తి సాగుకు ఈ ప్రాంతం నెలవు. ఇక్కడే టెక్స్ టైల్ పరిశ్రమ వస్తుండడంతో పత్తిసాగు మరింత పెరుగుతుంది. పత్తి పంటకు మంచి ధర కూడా పలికే అవకాశం ఉంది. రవాణా ఖర్చు లేకుండా పక్కనే ఉన్న పరిశ్రమకు పత్తి ఇవ్వటం వల్ల ఇటు పారిశ్రామికులకు అటు రైతులకు ఇద్దరికీ ప్రయోజనమే. వరంగల్ నుంచి హైదరాబాద్కు నేరుగా జాతీయ రహదారి ఉండడంతో.. వస్త్ర ఉత్పత్తుల రవాణా కూడా తేలిక కానుంది.

మెగా టెక్స్ టైల్ పార్కు ఒక సమీకృత వ్యవస్థగా రూపుదిద్దుకోనుంది. దారం తయారీ దగ్గర్నుంచి దుస్తుల ఉత్పత్తి వరకు అన్ని రకాల పరిశ్రమలు ఇందులో ఉంటాయి. టెక్స్ టైల్ పార్కులో మౌలిక సదుపాయాల కల్పనపై పరిశ్రమల శాఖ, టీఎస్ఐఐసీ దృష్టి పెట్టాయి. పార్కును అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిన నేపథ్యంలో.. మున్ముందు భూ సమస్య తలెత్తకుండా అదనపు భూమిని సేకరించేందుకు రెవెన్యూ యంత్రాంగం సిద్ధమవుతోంది.

మెగా టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటుతో తెల్లబంగారం పండించే రైతుల జీవితాల్లో వెలుగులు నిండనున్నాయి. గతంలో పొట్ట చేత పట్టుకొని మహారాష్ట్ర, గుజరాత్ వలస వెళ్లిన తెలంగాణ ప్రజలను ఇక్కడికి రప్పించి.. టెక్స్ టైల్ పార్కులో ఉపాధి కల్పించాలని సర్కారు నిర్ణయించింది. పరిశ్రమ చుట్టుపక్కగ్రామాల ప్రజలకు సైతం ఉపాధి దొరకనుంది. మొత్తంగా మెగా టెక్స్ టైల్ పార్కు రాకతో ఆ ప్రాంతం రూపురేఖలే మారిపోతాయి అనడంలో సందేహం లేదు.

Related Stories