ఉసిరి సాగుతో లక్షలు సంపాదిస్తున్న ఆటోడ్రైవర్  

2

ఉసిరికాయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందులో సి విటమిన్ పుష్కలంగా లభిస్తుంది. కాల్షియం, ఐరన్, యాంటీయాక్సిడెంట్స్ కు కొదవలేదు. రోగనిరోధక శక్తిని పెంచి గుండెపోటుని నివారించే గొప్ప ఔషధం. అలాంటి ఉసిరి సాగులో లక్షలు సంపాదించాడో ఆటో డ్రైవర్.

అమర్ సింగ్ సొంతూరు రాజస్థాన్ లోని సమ్మాన్ అనే మారుమూల గ్రామం. ఆర్ధిక స్తోమత అంతంత మాత్రంగా ఉండటంతో, చదువు మధ్యలోనే ఆపేశాడు. పొట్టకూటి కోసం రకరకాల పనులు చేశాడు. ఆటో డ్రైవర్ జీవితం. చాలీచాలని జీతం. దాంతోనే బతుకు బండి నడిపేవాడు.

ఒకరోజు ఉసిరి సాగు ద్వారా వచ్చే లాభాల గురించి తెలుసుకున్నాడు. దాని మీద ఎందుకో గురి కుదిరింది. చేస్తానన్న విశ్వాసం కలిగింది. ఆ నమ్మకమే ఆటో స్టీరింగ్ ని వదిలేసేలా చేసింది. స్థానికంగా ఉండే ఎన్జీవో సాయం తీసుకున్నాడు. ఉసిరి సంబంధిత వివిధ రకాల ఫుడ్ ఐటెమ్స్ తయారు చేశాడు. మొదట్లో అమర్ సెల్ఫ్ గ్రూప్ గా ఉన్న వ్యాపారం కాలక్రమంలో అమర్ మెగా ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ గా మారింది.

ప్రస్తుతం అమర్ సింగ్ కంపెనీ ఏడాది టర్నోవర్ 26 లక్షలు. 15 మందికి ఉపాధి కల్పిస్తున్నాడు. అందులో సగం మంది మహిళలే. 20 ఏళ్ల క్రితం రూ. 1200 పెట్టుబడితో, అరవై ఉసిరి చెట్లతో మొదలైన అతడి ప్రయాణం ఇవాళ లక్షల ఆదాయం వైపు పరుగులు పెడుతోంది.

మొక్కల పెంపకం దగ్గర్నుంచి ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, రవాణా, అమ్మకం దాకా అన్నీ అతనే స్వయంగా చూసుకుంటాడు. ఏనాడూ కొనుగోలుదారుల దగ్గరికి వెళ్లలేదు. వాళ్లే అమర్ సింగ్ కంపెనీని వెతుక్కుంటూ వస్తారు.  

Related Stories

Stories by team ys telugu