ఈమె కాళ్లు రెండూ పోయాయి..! అయినా గెలుపు బాట వీడలేదు..!!

అలలకు తలవంచటం కాదు.... పాదాక్రాంతం చేసుకున్న ధీర వనిత గాథ

ఈమె కాళ్లు రెండూ పోయాయి..! అయినా గెలుపు బాట వీడలేదు..!!

Friday January 22, 2016,

3 min Read

కష్టాలను సింగిల్ హ్యాండ్ తో ఎదుర్కొనే సత్తా కొందరికే ఉంటుంది.. సమస్యలను కూడా అవకాశాలుగా మలుచుకునే స్థైర్యం చాలా కొద్దిమందికే ఉంటుంది. ఆ కోవలోకే వస్తారామె. ఓ యాక్సిడెంట్ వీల్ చైర్ కి పరిమితం చేసింది. జీవితం క్షణాల్లో రివర్సయింది. ఆమె ఫ్యూచర్ చక్రాల బండికి చిక్కుకుపోయిందనుకున్నారంతా. అయితే, ఆగింది నడక మాత్రమే. కానీ, ఆమె స్వప్నాలు మాత్రం గమ్యం వైపు పరుగు ఆపలేదు. వాటి సాధన కోసం కఠోర శ్రమ ఆగలేదు. ఫలితం ఏమై ఉంటుందో చెప్పనక్కర్లేదు కదా.. !!

వీల్ చైర్ తో నాకు స్వేచ్ఛ వచ్చింది..

వీల్ చైర్ తో నాకు స్వేచ్ఛ వచ్చింది..


చుంకీ దత్తా... వీల్ చైర్ లో తిరుగుతూ ఉండే ఆమెను మొదటిసారి చూసిన వాళ్లు ఎవరైనా సాధారణంగా జాలిపడతారు.. అయ్యో అనుకుంటారు. ఇంకా చెప్తే ఆమె ఆరోగ్యం బాగయి నడవాలని కోరుకుంటారు. కానీ, ఆమె జర్నీ తెలిసిన వాళ్లు బాప్ రే అని నోరెళ్లబెడతారు.

అది 2003.. వణికించే చలి. రాత్రి 2 గంటలకు కారెక్కిందామె. కట్ చేస్తే ఆ రాత్రి 3గంటలకల్లా ఆపరేషన్ టేబుల్ పై ఉంది. విషయం సింపుల్. యాక్సిడెంట్ అయింది. వెన్నుపూసకు గాయమయింది. ఇకముందు నడవటం కష్టమన్నారు డాక్టర్లు.

మనం ఎన్నో అనుకుంటాం. ఏవేవో ప్లాన్స్ వేస్తాం. కానీ, క్షణాల్లో జీవితం అనుకోని మలుపు తిరుగుతుంది. చుంకీ పరిస్థితి కూడా సరిగ్గా అదే. అయితే అంత పెద్ద కుదుపు వచ్చినా, జీవితం ఊహించని మలుపు తిరిగినా, భవిష్యత్తు మీద ప్రణాళిక మాత్రం చెక్కుచెదరలేదు. ఆమె ఓ నిలువెత్తు ధైర్యం. కొండంత ఆత్మవిశ్వాసం. “నీలోనే శక్తి అంతా ఉంది. నువ్వేదైనా చేయగలవు” అనే వివేకానందుడి మాటలు గుర్తు చేస్తుంది.

ఎవరీ చుంకీ దత్తా...?

చుంకీ దత్తా. ధైర్యం, సాహసం గుండెల్లో మెండుగా నింపుకున్న ఓ బెంగాలీ మహిళ. ఆమెకు ధైర్యంగా ముందుకెళ్లటం కొత్త విషయం కాదు. మొదటి సపోర్ట్ తండ్రి అయితే, పెళ్లి తర్వాత భర్త తథాగథ దత్తా నిలిచారు. స్కూల్ డేస్ నుంచే ఇండిపెండెంట్ థింకింగ్, ధైర్యంగా నిలబడటం అలవడింది. కోల్కతా లోని ప్రముఖ స్కూల్ లోరెటో హౌస్ లో చదువుకుంన్నారు చుంకీ దత్తా. స్కూలింగ్ టైమ్ లో క్రికెటర్ గా కూడా మంచి టాలెంట్ చూపారు. ఎడ్వర్టైజింగ్ లో స్పెషలైజేషన్ చేసిన ఆమె, లీడింగ్ శారీ బ్రాండ్స్ కు మోడల్ గా కూడా పనిచేశారు. ఓ దశలో సినిమాల్లో అవకాశాలు కూడా వచ్చాయి. కానీ, పెళ్లి తర్వాత భువనేశ్వర్ కు షిఫ్ట్ అయ్యారామె.

భువనేశ్వర్ లాంటి చిన్నపట్టణంలో, మేల్ డామిటెడ్ స్టేట్ లో, అనేక ప్రతికూలతల మధ్య చుంకీ దత్తా తన కలలు సాకారం చేసుకునే పని మొదలు పెట్టారు. 1993లో మాస్టర్ మైండ్ పేరుతో ఓ ఎడ్వర్టైజ్ మెంట్ ఏజన్సీ మొదలు పెట్టారు. అప్పటికే చాలా ఏజన్సీలు భువనేశ్వర్ లో పాతుకుని ఉన్నాయి. కానీ, ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటం తెలిసిన చుంకీ, అలలకు తలవంచటం కాదు.. వాటిని పాదాక్రాంతం చేసుకుని ముందుకు సాగటం తెలిసిన చుంకీ దత్తా... చాలా కొద్ది కాలంలోనే మాస్టర్ మైండ్ ని ఒడిషాలో టాప్ టెన్ ఎడ్వర్టైజింగ్ ఏజన్సీలలో ఒకటిగా నిలిపారు..

కానీ, 2003లో ఆమె జీవితం యాక్సిడెంట్ రూపంలో మలుపు తిరగింది. నాకే ఎందుకిలా జరిగింది? నా భవిష్యత్తేంటి? మొదలైన ప్రశ్నలు కూడా ఆమెను చుట్టుముట్టాయి. కానీ, అది చాలా స్వల్పకాలమే. భర్త సపోర్ట్ ఆమెకు తిరిగి మామూలు కావటానికి చాలా ఉపయోగపడింది. ఇప్పుడామె సహచరుడు భౌతికంగా లేరు. కానీ, ఆయన అందించిన ధైర్యం, ఆమె జీవితాన్ని మళ్లీ మామూలుగా మార్చటానికి ఆయన పడిన తపన ఆమెకు బాగా గుర్తున్నాయి. అలా ఇప్పుడు ఒడిషా సిల్క్ సిటీ బెర్హంపూర్ సమీపంలో ప్రకృతి ఒడిలో ఉంటూ తన జీవితాన్ని చాలా కమాండింగ్ గా తీర్చిదిద్దుకుంటున్నారు. తన వీల్ చెయిరే తనకు స్వతంత్రం తెచ్చిందని ఆమె నమ్ముతున్నారు.

ప్రకృతే ఇప్పుడామె నేస్తం...

ప్రకృతే ఇప్పుడామె నేస్తం...


సడలని ఆత్మవిశ్వాసం ఆమె సొంతం

ఆమెకిప్పుడు సాధారణ కంపెనీల నుంచి, కార్పొరేట్ సెక్టార్ వరకు క్లయింట్స్ ఉన్నారు. ఎడ్వర్టైజింగ్ ఏజన్సీతో పాటు ఆమె భువనేశ్వర్ లో ఓ కార్పొరేట్ గెస్ట్ హౌస్ నడుపుతున్నారు. అంతే కాదు, అంగవైకల్యం ఉన్న మహిళల సాధికారత కోసం పనిచేసే, శాంత మెమోరియల్ రీహాబిలిటేషన్ సెంటర్ బోర్డ్ మెంబర్ గా కూడి పని చేస్తున్నారు.

ఇప్పుడు చుంకీ పేరు చెప్తే కఠోర శ్రమ, సడలని ఆత్మవిశ్వాసం గుర్తొస్తాయి. తన వ్యాపారంలో ఎవరైనా ఆమె వైకల్యం ఆధారంగా ఇబ్బంది పెట్టబోతే దానికి చాలా గట్టి సమాధానం ఇస్తారు. అంతే కాదు, బెర్హంపూర్ పరిసర ప్రాంతాల్లో డిజేబుల్డ్ మహిళల కోసం పనిచేస్తున్నారు. పబ్లిక్ ప్లేసుల్లో అంగవైకల్యం ఉన్న మహిళల కోసం ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేయాలని పోరాడుతున్నారు. అంతే కాదు.. ప్రత్యేక కోర్టులను కూడా ఏర్పాటు చేయాలని వాదిస్తున్నారు. దీనికోసం ఆమె స్థానిక మహిళలతో వాట్సాప్ గ్రూపులతో నిత్యం టచ్ లో ఉంటున్నారు.

చుంకీ దత్తా.. ఈ పేరు వింటే ఓ ప్రేరణ, ఓ ఉత్సాహం...

చుంకీ దత్తా.. ఈ పేరు వింటే ఓ ప్రేరణ, ఓ ఉత్సాహం...


అంగవైకల్యం ఎలా ఇబ్బంది పెడుతుందో ఈ సమాజానికి తెలియని విషయం కాదు. నిత్య జీవితంలో అనేక సందర్భాల్లో ఎన్నో సమస్యలు. సాధారణ వ్యక్తుల్లా తిరగలేరు. ఇక సినిమాలు, షికార్లనేవి ఊహించటమే కష్టం. ప్రయాణాలంటే అంతులేని ఇబ్బంది . అది మహిళలకైతే మరింత సమస్య.. ఇదంతా గమనించిన చుంకీదత్తా అంగవైకల్యం ఉన్న మహిళల హక్కులకోసం పోరాడుతున్నారు.

ఇప్పుడు చుంకీ జీవితం గురించి సింపుల్ గా చెప్పాలంటే... ఆమె ఓ సాధకురాలు. ఆమె ఓ ప్రేరణ. అత్యంత కష్టమైన పరిస్థితులను కూడా ఎదుర్కొని, తట్టుకుని నిలబడి ఆమె తన పయనాన్ని గెలుపు పాఠంగా మలుచుకున్నారు. తన జీవితాన్ని మలుపు తిప్పిన విధినే పరిహసించి, దానిపై విజయం సాధించిన చుంకీ దత్తా అందరికీ ఆదర్శప్రాయం..