చెత్త నుంచీ బిజినెస్ పిండిన ఇద్దరు ఇంజనీర్లు

చెత్త నుంచీ బిజినెస్ పిండిన ఇద్దరు ఇంజనీర్లు

Thursday March 26, 2015,

4 min Read

ఇండియా అంతా ఇప్పుడు నడుస్తున్నది స్వచ్ఛ్ భారత్ సీజన్. గల్లీ నుంచి ఢిల్లీ దాకా చీపుర్లు పట్టుకొని ఫోటోలకు పోజులిచ్చేస్తున్నారంతా. మరి వీళ్లు ఊడ్చేసిన చెత్తంతా ఏమవుతోంది ? ఆ చెత్తను ఏం చేస్తారు? అసలా చెత్త వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం కావాలంటే 'బన్యన్' అనే ఓ సంస్థ గురించి తెలుసుకోవాలి. కొండలా పేరుకుపోతున్న చెత్త సంక్షోభం నుంచి ఇండియాను కాపాడటమే లక్ష్యంగా ఇద్దరు స్థాపించిన ప్రాజెక్ట్ ఇది. అమెరికాలో భారీ జీతాలిచ్చే ఉద్యోగాలను వదిలిపెట్టి దేశసేవతో పాటు చెత్త నుంచి కూడా బిజినెస్ చేయొచ్చని నిరూపించి సక్సెస్ అయ్యారు. వాళ్లే మణి వాజ్ పేయి, సంస్థ సీఈఓ. మరొకరు రాజ్ మదన్ గోపాల్, టెక్నాలజిస్ట్. ఈ ఇద్దరి కృషితో రూపుదిద్దుకున్నదే ఈ బన్యన్ ప్రాజెక్ట్.

మణి వాజ్ పేయి, రాజ్ మదన్ గోపాల్

మణి వాజ్ పేయి, రాజ్ మదన్ గోపాల్


బన్యన్ ప్రాజెక్ట్ ఏంటీ?

చెత్త... చెత్త... చెత్త... భారతదేశంలో ఎక్కడ చూసినా చెత్తే. కొండలా, పర్వతంలా పేరుకుపోతుంది తప్ప తగ్గట్లేదు. సమస్య సమస్యలానే ఉంది కానీ పరిష్కార మార్గాలు కనిపించట్లేదు. ప్రభుత్వాలు డంపింగ్ చేస్తూ చేతులు దులుపుకుంటోంది తప్ప... దానివల్ల వచ్చే దుష్ప్రభావాలపై దృష్టిపెట్టలేదు. ఈ సమస్యే అమెరికాలోని ఇద్దరు భారతీయులను కదిలించింది. వ్యర్థాలను రీసైకిల్ చేయడం ద్వారా చాలా సమస్యలకు చెక్ చెప్పొచ్చని నిరూపించారు. ఇండియాలో సరైన రీసైక్లింగ్ పద్ధతులు లేకపోవడమే ఓ అవకాశంగా అందిపుచ్చుకున్నారు. బన్యన్ పేరుతో సోషల్ వెంచర్ ను స్థాపించారు. అత్యున్నత సాంకేతిక పద్ధతులతో సక్సెస్ ఫుల్ గా ప్రాజెక్ట్ ను నిర్వహిస్తున్నారు. పనికిరానిదంతా చెత్తకుప్పలోకి పోతుందని మనం అనుకుని వదిలేస్తాం. కానీ చెత్తకుప్పలోంచి కూడా పనికొచ్చేది చాలా ఉందని వీరి ప్రాజెక్ట్ ను చూస్తే తెలుస్తుంది.

బన్యన్ ప్రాజెక్ట్ ఎలా పుట్టింది?

ఇండియాలోని సామాజిక సమస్యల్ని టెక్నాలజీ సాయంతో పరిష్కరించాలన్నదే మా తపన అంటారు సంస్థలోని టెక్నాలజిస్ట్ రాజ్ మదన్ గోపాల్. రాజ్, మదన్ గోపాల్ మణి స్నేహితుడు. విదేశాల్లో చదువుకునే సమయంలో కాలేజీకి బంక్ కొట్టి తరచూ కలుసుకునే వీరిద్దరు ఆ తర్వాత ప్రాణమిత్రులయ్యారు. ఆ సమయంలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో మణి పీహెచ్ డీ చేస్తున్నాడు. రాజ్ మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతున్నారు. కాలేజీ చదువుల తర్వాత వీరిద్దరూ వేర్వేరు రంగాలకు వెళ్లిపోయారు. మణి క్వాల్ కామ్ సంస్థలో చేరితే, రాజ్ ఓ మొబైల్ స్టార్టప్ లో పనిచేశాడు. ఓ పదేళ్లు ఫోన్లో మాట్లాడుకునేవారు. ఆ సమయంలో మణి తన ఆలోచనలను పంచుకున్నాడు. ఇండియాలో వేస్ట్ మేనేజ్ మెంట్ అంతంతమాత్రమేనని, ఈ సమస్యను పరిష్కరించేందుకు ఏదైనా చేయాలన్న ఆలోచన ఉందని చెప్పాడు. బెర్కిలీ, కొలంబియా బిజినెస్ స్కూళ్ల కోసం తాను రూపొందించిన బిజినెస్ మోడల్ గురించి వివరించాడు. కొలంబియాకు చెందిన గ్రీన్ హౌజ్ ఇంక్యుబేటర్ ప్రాజెక్ట్ వర్క్ లో భాగంగా మణి, రాజ్ లిద్దరూ కలిసి హైదరాబాద్, బెంగళూరుల్లో పర్యటించారు. ఆ సమయంలోనే ఈ ప్రాజెక్ట్ ఆలోచనకు బీజం పడింది. విదేశాల్లో ఉన్నట్టు ఇండియాలో వేస్ట్ మేనేజ్ మెంట్ లేదని గుర్తించి ఆ అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. "హైదరాబాద్ లో పెద్దపెద్ద మల్టీనేషనల్ కంపెనీల్లో పదుల సంఖ్యలో ఫెసిలిటీస్ మేనేజర్లను కలిశాం. వారితో పాటు హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్లతో మాట్లాడాం. ప్రైవేట్ వేస్ట్ మేనేజ్ మెంట్ కాంట్రాక్టర్లు, రాగ్ పిక్కర్స్ వాళ్లతో మాట్లాడి సిటీలో చెత్త పరిస్థితుల గురించి తెలుసుకున్నాం" అంటాడు మణి. ఇలా మూడు నెలల పాటు రీసెర్చ్ చేశారు. ఇండియాకు సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ అవసరమేంటో అప్పుడు అర్థమైంది. చెత్తను సేకరించడం, తరలించడం దగ్గర్నుంచీ రీసైకిల్ చేయడం, చెత్తతో విద్యుత్ ను ఉత్పత్తి చేయడం వరకు అన్ని అంశాలపై ఉన్న అవకాశాలను స్టడీ చేశారు. తిరిగి యూఎస్ వెళ్లిన తర్వాత ఈ ఇద్దరూ మూడు నెలల పాటు అమెరికాలో వేస్ట్ మేనేజ్ మెంట్ ప్రాసెస్ పై అక్కడి డంప్ యార్డుల చుట్టూ తిరిగి స్టడీ చేశారు. న్యూయార్క్ సిటీ లాంటి పెద్ద నగరాల్లో పర్యటించి చెత్త నుంచి విద్యుత్ ను ఉత్పత్తి చేసే ప్లాంట్లు ఎలా పనిచేస్తున్నాయో తెలుసుకున్నారు. వాళ్లకు పూర్తి అవగాహన వచ్చింది. వెంటనే వాళ్ల ఉద్యోగాలను వదిలి పెట్టారు. జూలై 2013లో ఇండియాకు వచ్చి బన్యన్ ను ప్రారంభించారు. మొదట్లో మున్సిపల్ సాలిడ్ వేస్ట్ ను ఏం చేస్తున్నారన్న దానిపై దృష్టి పెట్టారు. "దేశంలోని టెండర్లన్నింటినీ పరిశీలించాం. తర్వాత శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన బయోగ్యాస్ ఎనర్జీ కంపెనీ అయిన రౌర్కెలా స్టీల్ ప్లాంట్ తో ఒప్పందం కుదుర్చుకున్నాం" రాజ్.

ఇండియాలో బన్యన్ సంస్థ... ఓ కీలక అడుగు

ప్రభుత్వంపైన, మున్సిపాలిటీలపైన ఆధారపడకుండా సొంతగా సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ కంపెనీ ప్రైవేట్ గా మొదలు పెట్టడం భారతదేశంలో కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు. "ప్రతీ ఏడాది భారత దేశంలో రీ సైక్లింగ్ కు అవకాశమున్న 67 లక్షల టన్నుల వ్యర్థాలను డంప్ చేస్తున్నారు. వీటి విలువ కనీసం 20 వేల కోట్లు ఉంటుంది. వీటిని ఇలా డంప్ చెయ్యడం ద్వారా పర్యావరణ సమస్యలు కూడా వస్తున్నాయి" అంటారు మణి. అంతేకాదు... ఇండియాలో దళారులు చెత్తను ఎలా సొమ్ము చేసుకుంటున్నారన్న విషయాన్ని గుర్తించారు. చెత్తను ఏరుకునే ర్యాగ్ పిక్కర్స్ మార్కెట్ ధర కంటే దగ్గర తక్కువకే వ్యర్థాలను కొనుగోలు చేసి, దళారులు ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నారు. ఇవన్నీ స్టడీ చేసి బిజినెస్ మోడల్ ను తయారు చేశారు. ఈ ఆలోచన గురించి బంధువులకు, కుటుంబ సభ్యులకు, స్నేహితులకు చెప్పగానే... వారంలో యాభై లక్షల రూపాయలకు పైగా సాయం చేశారు. బన్యన్ సంస్థను ఏర్పాటు చేసి దానికి టెక్నాలజీని జోడించారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది చురుగ్గా పనిచేసేలా వ్యవస్థను రూపొందించారు.

బన్యన్ ప్రాజెక్ట్ లో ఏం చేస్తారు?

ఎక్కడెక్కడ కొండలా చెత్త, వ్యర్థాలు పేరుకుపోయాయో చూడటం, వాటిని రీసైకిల్ చేయడం ఈ ప్రాజెక్ట్ పని. ప్రీ సార్టింగ్, కలెక్షన్, పోస్ట్ సార్టింగ్, ఆ తర్వాత రీసైక్లింగ్... ఇలా పలు స్టేజెస్ ఉంటాయి. "రీ సైక్లింగ్ కు అవకాశాలను గుర్తించడం, రీసైక్లింగ్ విధానాన్ని ప్రోత్సహించడం, టెక్నాలజీ ద్వారా జీవన నైపుణ్యాలను పెంపొందించడమే కాకుండా చెత్త రీసైక్లింగ్ ద్వారా ఆదాయాన్ని సమకూర్చడమే ఈ సంస్థ లక్ష్యం" అంటారు బన్యన్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ మణి వాజ్ పేయ్. నిజమే... చెత్త నుంచి అద్భుతమైన బిజినెస్ చేయొచ్చన్న ఐడియానే అద్భుతం. ఇది భారతదేశానికి అవసరం కూడా. మణి రూపొందించిన బిజినెస్ మోడల్ విదేశాల్లోని యూనివర్సిటీల గుర్తింపు పొందిందంటే ఆశ్చర్యమే. స్టీవ్ బ్లాంక్స్ లీన్ లాంచ్ ప్యాడ్ ప్రోగ్రామ్ తో పాటు, కొలంబియా బిజినెస్ స్కూల్ లోని గ్రీన్ హౌజ్ ఇంక్యుబేటర్ లో బన్యన్స్ బిజినెస్ మోడల్ ను ఆవిష్కరించడం మరో గొప్ప విషయం.