ఎనిమిదేళ్లకే సీఈవో ఎలా అయ్యాడీ కుర్రాడు..?

ఎనిమిదేళ్లకే సీఈవో ఎలా అయ్యాడీ కుర్రాడు..?

Wednesday March 25, 2015,

4 min Read


ఆలోచనకు, సమస్య పరిష్కారానికి వయసుతో సంబంధం లేదు. ఏదైనా ఇబ్బందిని సమస్యగా గుర్తించడం ఆ తర్వాత దాన్ని అధిగమించేందుకు ఉన్న మార్గాలేంటో అన్వేషించడమే ముఖ్యం. కానీ వీటికి వయస్సు, చదువు, లోకజ్ఞానం అవసరమని అనుకుంటాం. కానీ చెన్నైకి చెందిన ఈ బుడ్డోడు మాత్రం మనందరినీ మించిపోయాడు. ఇతడి ఆలోచనా విధానం చూస్తే ఒక్కోసారి పెద్దోళ్లు కూడా చిన్నబుచ్చుకోవాలి. మనకెందుకు ఇలాంటి ఆలోచన తట్టలేదబ్బా... అని విలవిలలాడాలి. అంతేకాదు ఇప్పుడీ అబ్బాయి లేటరాలాజిక్స్ అనే కంపెనీకి సీఈఓ. ఎనిమిదో తరగతిలోనే అందరికీ పనికొచ్చే యాప్స్ డిజైన్ చేసి ఎంఐటి యూనివర్సిటీనే అబ్బురపరిచాడు. ఇప్పుడు నిపుణులైన టెకీస్ రిక్రూట్ చేసుకుని కంపెనీని విస్తరిద్దామని అనుకుంటున్నాడు.

తనేంటో తన ఆలోచనలు ఏంటో స్వయంగా అర్జునే మనతో చెబ్తున్నాడు.

అర్జున్ అనే నేను !

నేను ఎనిమిదో తరగతి విద్యార్థిని, చెన్నైలోని సూర్యాపేట వేలమ్మాల్ విద్యాశ్రమంలో చదువుతున్నాను. నా తల్లిదండ్రులకు నేనొక్కడినే సంతానం. నాకు చిన్నప్పటి నుంచి సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే ఎందుకో చెప్పలేనంత అభిమానం. షటిల్ ఆడడం నా హాబీ అందుకు కోసం ప్రత్యేక శిక్షణ కూడా తీసుకుంటున్నాను. వెస్ట్రన్ కీ బోర్డ్ ప్లే చేయడం కూడా నేర్చుకుంటున్నాను. ప్రోగ్రామింగ్ తో పాటు గ్రాఫిక్, వెబ్ డిజైనింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నా ఫేవరెట్ సబ్జెక్ట్స్. ప్రపంచ వ్యాప్తంగా టెక్నాలజీ రంగంలో వస్తున్న మార్పులేంటో తెలుసుకోవడానికే అధిక ప్రాధాన్యతనిస్తాను.

రెండేళ్ల వయస్సుకే కంప్యూటర్ గురించి తెలుసుకోవడం నా అదృష్టం. కంప్యూటర్ టెక్నాలజీ, ప్రోగ్రామింగ్ వంటివాటిపై నాకు మెల్లిగా అవగాహన పెరిగింది. అయితే నాకు తెలియకుండానే ఎలక్ట్రానిక్స్ పై చెప్పలేనంత ఇష్టత ఏర్పడింది. అందుకే స్వయంగా ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ తయారు చేయడం మొదలుపెట్టాను.

image


ఎనిమిదో ఏట రోబోటిక్స్ ప్రాజెక్టుపై దృష్టిసారించాను. నాకు ఇష్టమైన ఎలక్ట్రానిక్స్, మెకానిక్స్, ప్రోగ్రామింగ్ స్కిల్స్ అన్నీ ఒకేసారి అప్లై చేశాను. రెండేళ్ల క్రితం ఒక రోజు మా నాన్న స్మార్ట్ ఫోన్ కొని తెచ్చుకున్నారు. అది కాసేపు చూడగానే కొన్ని యాప్స్ నా దృష్టిని ఆకర్షించాయి. వాటిపై కాస్త పరిశోధన చేశాను. మసాచుసెట్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వాళ్లు డిజైన్ చేసిన ప్రోగ్రామింగ్ టూల్ 'యాప్ ఇన్వెంటర్' ఉందని తెలుసుకున్నాను. వెంటనే వాటి కోసం పైతాన్, జావా, ఆండ్రాయిట్ SDK ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ పై ఇంట్లోనే కూర్చుని అవగాహన పెంచుకున్నాను.

నాలో కొత్త ఆలోచనలు రేకెత్తించి వాటికి సమాధానం దొరికేందుకు అవసరమైన బొమ్మలను, పరికరాలను చిన్న వయస్సులోనే అందించినందుకు నా తల్లిదండ్రులు, గురువులకు ధన్యవాదాలు చెప్పాలి. వాళ్ల ప్రోత్సాహమే లేకపోతే నాకు ఇన్ని ఆలోచనలు వచ్చేవే కావు.

వెళ్లాను... గెలిచాను !

మాసాచుసెట్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(MIT) వాళ్లు జనవరి 2013లో యాప్ కాంటెస్ట్ నిర్వహించారు. అందులో పాల్గొని ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్నా. వాళ్లు నాకు గూగుల్ నెక్సస్ 7 టాబ్ తో పాటు ఎంఐటి నుంచి సర్టిఫికెట్ కూడా ఇచ్చారు. ‘Ez School Bus Locator' (ఈజీ స్కూల్ బస్ లొకేటర్) అనే యాప్ తయారు చేసినందుకు నాకు ఈ బహుమతి దక్కింది. స్మార్ట్ ఫోన్లే కాకుండా ఆర్డినరీ ఫోన్లకు ఉపయోగపడేలా రూపొందిన ఈ యాప్ వల్ల తల్లిదండ్రులు పొందే ప్రయోజనం మాటల్లో చెప్పలేం.

పిల్లల స్కూల్ బస్సు ఎక్కడుంచో మ్యాప్ లో సలువుగా తెలుసుకోవచ్చు

ఆ బస్సులో తమ పిల్లలు ఉన్నారో లేదో కూడా చెక్ చేసుకోవచ్చు

బస్సు మన ఇంటికి ఎంత సేపట్లో వస్తుందో కూడా తెలుస్తుంది

‘Ez School Bus Locator' యాప్ ను ఎంఐటి జడ్జిలు తెగ మెచ్చేసుకున్నారు. ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే యాప్ ఇదేనని, సృజనాత్మకత వయస్సుతో సంబంధంలేదంటూ నన్ను ఆకాశానికి ఎత్తేశారు. బార్ కోడ్ స్కానింగ్ వల్ల పిల్లలు బస్సులో ఎక్కినప్పుడు, దిగినప్పుడు సమాచారం తెలుస్తుంది. జిపిఎస్ వల్ల బస్సు ఎక్కడుందో కనిపెట్టొచ్చు. ఈ సమాచారమంతా ఆటోమేటెడ్ ఎస్ఎంఎస్ ద్వారా తల్లిదండ్రులకు చేరుతుంది కాబట్టి వాళ్లకూ సులువైన పని. ఈ యాప్ లో రెండు రకాలున్నాయి. ఒకటి తల్లిదండ్రులు, రెండోది స్కూల్ సహాయకులకు ఉపయోగపడ్తుంది. ఒకసారి భారీ వర్షాల వల్ల నేను స్కూల్ నుంచి ఇంటికి రావడం ఆలస్యమైంది అప్పుడు మా అమ్మా, నాన్నలు బాగా కంగారుపడిపోయారు. ఆ ఆలోచన నుంచి పుట్టిందే ఈ యాప్. దీన్ని రూపొందించిన తర్వాత ప్రపంచంలో ఉన్న తల్లిదండ్రులందరికీ దీన్ని అంకితం చేశాను.

ఈ ఏడాది జనవరిలో ఎంఐటి నుంచి మరోసారి ఫస్ట్ ప్రైజ్ గెలుపొందాను. 'యాప్ ఇన్వెంటర్' లో ఉన్న సమస్యలను (బగ్ ఫైండింగ్ కాంటెస్ట్) కనుగొనడమే ఇక్కడ పోటీ. కొస్తారైసా నుంచి వచ్చిన తైఫున్ బార్ కు, నాకూ ఈ విజయం దక్కింది. జనవరి 7,2014 న ఎంఐటి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్ హాల్ అబెల్సన్ ఈ ఫలితాలను ప్రకటించారు.

యాప్ ఇన్వెంటర్ అప్లికేషన్ ను గూగుల్ అభివృద్ధి చేస్తే ప్రస్తుతం ఎంఐటి నిర్వాహణ బాధ్యతలు చూస్తోంది. కంప్యూటర్ ప్రోగ్రామింగ్ పై అవగాహన ఉన్న ఎవరైనా సరే అందులో సాఫ్ట్ వేర్ అప్లికేషన్స్ ఉపయోగించి యాండ్రాయిడ్ యాప్స్ తయారుచేయొచ్చు. ఫస్ట్ ప్రైజ్ కింద నెక్సస్ 5 ఆండ్రాయిట్ స్మార్ట్ ఫోన్ తోపాటు ఎంఐటి నుంచి సర్టిఫికేషన్ కూడా లభించింది.

సేఫ్టీ నా ప్రయార్టీ !

'i-safe' పేరుతో కొత్త యాప్ రూపొందిస్తున్నాను. మహిళలు, యువతుల భద్రతపై ఉన్న ఆందోళనను దృష్టిలో ఉంచుకుని దీన్ని డిజైన్ చేశాను. ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు.. అవతలికి అది తెలిసే సహాయం చేసేందుకు వీలుగా దీని రూపకల్పన జరిగింది. అన్నింటికంటే ముఖ్యమేంటంటే సాధారణ ఫీచర్ ఫోన్లలో కూడా ఇవి పనిచేస్తాయి.

ఎవరైనా అపాయంలో ఉన్నప్పుడు వాళ్లు ఉన్న స్థలం వివరాలతో కూడిన ఎమర్జెన్సీ మెసేజ్ ను ముందే ఫీడ్ చేసిన నెంబర్లకు వెళ్తుంది

image


పోలీసులకో లేక బంధువులతో తెలిసి అక్కడికి వచ్చేలోపు సమయం దాటిపోవచ్చు. అందుకే ఆ యాప్ ఇన్ స్టాల్ చేసుకున్న వాళ్లు దగ్గర్లో ఎవరున్నా సరే వాళ్లకూ సమాచారం అందుతుంది. స్థానికులు అప్రమత్తమైతే అపాయాన్ని సాధ్యమైనంతవరకూ నివారించవచ్చు.

వీళ్లే నా స్ఫూర్తి !

చాలా మంది నుంచి చాలా కొత్త విషయాలు తెలుసుకున్నాం. క్రియేటివిటీ, ఇన్నోవేషన్ అనే పదాలకు అర్థం చెప్పిన ఎంతో మంది గొప్ప వాళ్లే నాకు స్ఫూర్తి. వాళ్లలో స్టీవ్ జాబ్స్, ప్రణవ్ మిస్త్రీ ముందు వరుసలో ఉంటారు.

కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్లతో పాటు దేశ, విదేశీ కంపెనీల నుంచి నాకు నిత్యం ఫోన్లు, లెటర్స్ వస్తూనే ఉంటాయి. నేను చేసే ప్రోగ్రామింగ్ , నా యాప్స్ పై చర్చించేందుకు వాళ్లంతా నన్ను అహ్వానిస్తూ ఉంటారు. రోజు వారి సమస్యలను టెక్నాలజీ ద్వారా ఎలా పరిష్కరించాలో ఆలోచించడంలోనే ఆనందం ఉందని అందరికీ చెబ్తూ ఉంటాను.

నేను నా కంపెనీ !

టెక్నాలజీపై నాకు ఉన్న మమకారమే నన్ను 'లేటరాలాజిక్స్' అనే సొంత కంపెనీ ఏర్పాటుకు కారణమైంది. మనం నిత్యం ఎదుర్కొనే సమస్యలకు పరిష్కారం సూచించడమే మా లక్ష్యం. జీవితాన్ని అత్యంత సులభతరం చేయాలనేదే నా ఆలోచన.

నాలానే ఆలోచించే కొంత మంది డిజైనర్లు, కోడర్స్ తో ప్రస్తుతం కలిసి పనిచేస్తున్నాను.

ప్రపంచంలోనే అత్యంత ఇన్నోవేటివ్, సక్సెస్ ఫుల్ కంపెనీగా లేటరాలాజిక్స్ ను చూడటమే నా కల. 'చిన్న ఆలోచనతోనే పెద్ద సమస్యకు పరిష్కారం' ఇదే కంపెనీ ఆలోచన.

నేనూ సందేశమిస్తా !

"మీ చుట్టూ ఉన్న సమస్యలను చూడండి, వాటి నుంచే స్ఫూర్తి పొందండి. అప్పుడే మీలో కొత్త ఆలోచనలు వస్తాయి. అవే ఈ ప్రపంచంలో జీవనాన్ని సులువు చేస్తాయి''.