ఈసారి 40 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యంగా హరితహారం

0

కోతులు వాపస్ పోవాలి.. వానలు వాపస్ రావాలి అనే నినాదంతో తెలంగాణ ప్రభుత్వం హరితహారం అనే కార్యక్రమాన్ని చేపట్టింది. గత రెండేళ్లుగా కొనసాగుతున్న ఈ హరితజయ్ఞం మూడోదశను సీఎం కేసీఆర్ లాంఛనంగా ప్రారంభించారు. లోయర్ మానేరు డ్యాం దిగువన మహాగని అనే ఔషధ మొక్కను నాటారు. కరీంనగర్ పట్టణానికి ఆనుకుని ఉన్న ఎల్‌ఎండీ కట్ట వెంబడి సుమారు 11 కిలోమీటర్ల మేర రకరకాల పూలు, ఔషధ మొక్కలు సుమారు పదివేలు నాటారు. అదే స్ఫూర్తితో పట్టణంలో లక్ష మొక్కలు నాటుతున్నారు.

తొలి రెండు విడుత హరితహారం కార్యక్రమంలో దాదాపు 48 కోట్ల మొక్కలను నాటిన ప్రభుత్వం ఈసారి 40 కోట్ల మొక్కలు నాటాలని నిర్ణయించింది. ఈసారి ప్రజలను ఎక్కువ సంఖ్యలో భాగస్వామ్యం చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్ణయించారు. ఏడాది పొడవునా మొక్కల్ని సంరక్షించేందుకు ఊరూరా గ్రీన్ బ్రిగేడియర్లు ఏర్పాటు చేశారు.

సీఎం కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా హాబిటేషన్, గ్రామ, మండల, జిల్లా స్థాయిలో రాష్ట్ర మంతటికీ వర్తించేలా గ్రీన్ బ్రిగేడ్లు ఏర్పాటు చేస్తున్నారు. పర్యావరణహితం కోసం ఫ్రెండ్స్ ఆఫ్ హరితహారం గ్రూపులను తయారు చేస్తున్నారు. స్కూల్ నుంచి యూనివర్సిటీ దాకా.. వార్డు నుంచి గ్రామం, మండలం, జిల్లా స్థాయిల్లో గ్రీన్ బ్రిగేడ్లు ఏర్పాటు చేస్తున్నారు.

గ్రీన్ బ్రిగేడియర్లు ఏర్పాటుకు సంబంధించిన కమిటీ సభ్యులు, లీడర్ వివరాలతో ఉత్తర్వులు జారీ చేసి TGFMIS వెబ్ సైట్లో నమోదు చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రీన్ ఫోర్స్ ఏర్పాటు చేసి మొక్కలు నాటడం, వాటి సంరక్షణ చూడటం లాంటి బాధ్యతలు వారికి అప్పగిస్తారు.

హరితహారం కోసం అంకితభావంతో పనిచేసిన వ్యక్తులు, సంస్థలకు అవార్డులు, రివార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో దాదాపు 425 అవార్డులు ఇస్తారు. ఒక లక్ష నుంచి 15 లక్షల రూపాయల దాకా నగదు పురస్కారాలు కూడా ఉంటాయి. మొత్తం 15 కోట్ల రూపాయల విలువైన రివార్డులు అందజేస్తారు.

జిల్లా స్థాయిలో వ్యక్తిగత కేటగిరీలో ఒక్కో జిల్లాకు 3 చొప్పున 93 అవార్డులు, ఉత్తమ హరిత గ్రామపంచాయతీ, ఉత్తమ మండలం, ఉత్తమ పాఠశాల, ఉత్తమ హైస్కూల్, ఉత్తమ జానియర్, డిగ్రీ, టెక్నికల్ కాలేజీలకు అవార్డులు ఇస్తారు. రాష్ట్ర స్థాయిలో బెస్ట్ ఎమ్మెల్యే, బెస్ట్ కలెక్టర్, బెస్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ కేటగిరీలో కూడా అవార్డులు ఉంటాయి. అలాగే రాష్ట్ర స్థాయిలో 18 అవార్డులు ఇవ్వబోతున్నారు.

గత హరితహారంలో ఉత్సాహంగా పాల్గొన్న వారితో పాటు మహిళలు, యువకులు, వాకర్స్ గ్రూప్స్, పారిశ్రామిక, కార్పొరేట్ బాడీలు, ప్రభుత్వరంగ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలను పాల్గొనేలా చూస్తున్నారు. రోటరీ క్లబ్బులు, ఎన్సీసీ క్యాడెట్స్, స్కౌట్స్ అండ్ గైడ్స్, ఎన్‌ఎస్‌ఎస్‌ గ్రూపులు, బార్ ఆసోసియేషన్లు, ఎన్జీవోలు, సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్లను భాగస్వామ్యులను చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

మరోవైపు ఈనెల15న విద్యా శాఖ గ్రీన్ డే పాటిస్తోంది. ఇందులో ప్రైవేట్ విద్యా సంస్థలు కూడా తప్పనిసరిగా హరితహారంలో పాల్గొనాలని ఆదేశాలు ఇచ్చారు.  

Related Stories