విలువైన సేవలకు విశిష్ట పురస్కారాలు

పద్మ అవార్డ్స్- 2017

విలువైన సేవలకు విశిష్ట పురస్కారాలు

Thursday January 26, 2017,

2 min Read

వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారిని కేంద్ర పద్మపురస్కారాలతో సత్కరించింది. మొత్తం 89 మందికి పద్మ అవార్డులు రాగా... అందులో ఏడు పద్మ విభూషణ్, ఏడు పద్మ భూషణ్‌, 75 పద్మశ్రీ అవార్డులున్నాయి. ఈసారి తెలంగాణ నుంచి ఆరుగురికి పద్మశ్రీ అవార్డులు దక్కాయి. 75 మందిలో 19 మంది మహిళలు, ఐదుగురు విదేశీయులు, ఎన్‌ఆర్ఐలు, ఆరుగురు దివంగతులు ఉన్నారు.

దేశ రెండో అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్ అవార్డు ఈసారి బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, గాయకుడు యేసుదాసు, ఆధ్యాత్మిక వేత్త జగ్గీ వాసుదేవ్, వ్యాపారవేత్త ఉడిపి రామచంద్రరావులకు దక్కింది. వీరితో పాటూ దివంగతులైన మధ్యప్రదేశ్ మాజీ సీఎం సుందర్ లాల్ పట్వా, లోక్ సభ మాజీ స్పీకర్ పీఏ సంగ్మా లకు కూడా పద్మవిభూషణ్ ఇచ్చారు.

image


ఇక మూడో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్ కూడా ఏడుగురికి దక్కింది. ఇటీవలే మరణించిన జర్నలిస్ట్ చో రామస్వామి, దేవీ ప్రసాద్ ద్వివేదీ, విశ్వమోహన్ భట్, తెహమ్‌ టోన్ ఉద్వాడియా, రత్న సుందర్ మహరాజ్, స్వామి నిరంజన్ నంద సరస్వతి, ప్రిన్సెస్ మహా చక్రి సిరింద్రోన్ లకు పద్మభూషణ్ ప్రకటించారు.

ఇక తెలంగాణ నుంచి ఆరుగురికి పద్మశ్రీ అవార్డులు వచ్చాయి. అమరవీరుల స్థూపం రూపకర్త ఎక్కా యాదగిరిరావు, కోటి మొక్కలు నాటి వనజీవి రామయ్య, లక్ష్మీ ఆసుయంత్రం సృష్టికర్త చింతకింది మల్లేషం, వాణిజ్యం పరిశ్రమల రంగంలో బీవీఆర్ మోహన్‌రెడ్డి, మెడిసిన్ రంగంలో మహ్మద్ అబ్దుల్‌ వాహిద్, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ రంగంలో చంద్రకాంత్‌ పిత్వా, సివిల్ సర్వీసులో త్రిపురనేని హనుమాన్ చౌదరికి పద్మశ్రీ అవార్డులు దక్కాయి.

క్రీడా రంగంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, రియో ఒలింపిక్స్ లో అద్భుత ప్రతిభ కనబర్చిన సాక్షిమాలిక్, దీపా కర్మాకర్, పారా ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించిన మరియప్పన్ తంగవేలు, అంధుల క్రికెట్ టీం కెప్టెన్ శేఖర్ నాయక్, ప్లేయర్ వికాస్ గౌడ, హాకీ ప్లేయర్ శ్రీజేష్ లకు పద్మశ్రీ అవార్డులు దక్కాయి.

వీరితో పాటూ కలరియపట్టులో శిక్షణ ఇస్తున్న మీనాక్షి అమ్మ, చెఫ్ సంజీవ్ కపూర్, గాయకుడు కైలాష్ ఖేర్, ఫైర్ మెన్ బిపిన్ గణత్ర, ఎయిడ్స్ వ్యాధి పరిశోధకురాలు డాక్టర్ సునితి సాల్మన్, డాక్టర్ సుబ్రతో దాస్, 78 ఏళ్లుగా ఏళ్ల గైనకాలజిస్ట్ గా సేవలందిస్తున్న డాక్టర్ భక్తి యాదవ్, 100 వంతెనలు కట్టిన గిరీష్ భరద్వాజ్, సామాజిక కార్యకర్త అనురాధ కోయిరాలా, బైక్ అంబులెన్స్ సృష్టికర్త కరీముల్లా హక్, మరుగుదొడ్డ నిర్మాణం కోసం ప్రజల్లో అవగాహన పెంచుతున్న మపుస్కర్, ఎకో బాబా బల్బీర్ సింగ్ సీచేవాల్, బంజరు భూముల్లో పంటలు పండించిన రైతు గెనాభాయ్ దర్గాభాయ్ పటేల్, కర్ణాటక ఆదివాసీ సింగర్ సుక్రీ బొమ్మ గౌడ సహా మొత్తం 75 మందిని పద్మశ్రీ వరించింది.

అత్యన్నత పౌర పురస్కారమైన భారతరత్న కోసం పలు ప్రతిపాదనలు వచ్చినప్పటికీ కేంద్రం ఈసారి ఆ అవార్డును ప్రకటించలేదు.