చెరకు సాగులో విప్లవం సృష్టించిన రైతు

రైతుల జీవితాల్లో వెలుగులు నింపుతోన్న రోషన్ లాల్ విశ్వకర్మ

చెరకు సాగులో విప్లవం సృష్టించిన రైతు

Friday January 01, 2016,

4 min Read

‘నెస్సిసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్’.. అవసరం మనిషిచేత ఎంత పనైనా చేయిస్తుంది. కష్టాలను భరించేటట్లు చేస్తుంది. సాహసాలను చేయిస్తుంది. వాటి వల్ల కొత్త కొత్త ఆవిష్కరణలు రూపుదిద్దుకుంటాయి. అలా ఓ సాధారణ రైతు జీవితావసరం చెరకు సాగులో సరికొత్త విప్లవం సృష్టించింది.తనతో పాటు కొన్ని లక్షల మంది రైతుల జీవితాల్లో వెలుగు పూవులు పూయించింది..

image


పరిస్థితి మార్చాలనే సంకల్పంతో

రోషన్ లాల్ విశ్వకర్మ. మధ్యప్రదేశ్ నరహింహాపూర్ జిల్లాలోని మేఖ్ అనే ఓ మారుమూల గ్రామంలో పుట్టిన ఓ సాధారణ రైతు.. ఆర్థిక స్థోమత లేక స్కూల్ విద్యను కూడా సగంలోనే ఆపేసిన రోషన్- తండ్రి తో పాటు వ్యవసాయ పనుల్లో పాలుపంచుకునేవాడు. ఆ తర్వాత సొంతం గా వ్యవసాయం చేయడం ప్రారంభించాడు. మిగతా పంటలతో పోలిస్తే చెరకు సాగు బాగా లాభదాయకమని గ్రహించాడు. కానీ చెరకు మొక్కలను నాటడం వ్యయప్రయాసలతో కూడిన వ్యవహారం కావడంతో అది పూర్తిగా కొద్దిమంది మోతుబరి రైతుల గుత్తాధిపత్యంలోనే ఉండేది. దీని వల్ల పెద్ద రైతులు ఆర్థికంగా మరింత ఎదుగుతుంటే ..చిన్న రైతులు మాత్రం అంతకంతకు చితికిపోతున్నారు. వ్యవసాయం లాభసాటిగా లేక కొంతమంది రైతులు తమ పొలాలను పెద్ద రైతులకు అమ్మి సొంత పొలాల్లో కూలీలుగా మారుతున్నారు. ఈ పరిస్థితులను దగ్గర నుంచి చూసిన రోషన్ ఎలాగైనా ఈ పద్దతిలో మార్పు తీసుకురావాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. చెరకు సాగులో సులభమైన పద్దతులతో పెట్టుబడి తగ్గించే మార్గాలకోసం అన్వేషించాడు. ప్రత్యామ్నాయ పద్ధతిగా, చెరకు అంటు మొక్కలను ఒక్కొక్కటిగా నాటినా ఫలితం లేకపోయింది . అధిక సంఖ్యలో అంటు మొక్కలు అందుబాటులో లేకపోవడం అడ్డంకిగా మారింది. ఆతర్వాత చెరకు మొక్కలను నారుగా నాటే బదులు, పొలాల్లో బంగాళదుంపల పంటను పండించినట్లు చేస్తే ఎలా ఉంటుందని ఆలోచించారు. అలా తన రెండు ఎకరాల భూమిలో సాధారణపద్దతిలో కాకుండా అలుగడ్డలు నాటే పద్దతిలో చెరకు నాటే విధానాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించాడు. ఈ పద్దతి విజయవంతమవ్వడంతో పాటు మమూలు పద్దతిలో కూడా 20 శాతం అధిక దిగుబడి తీసుకొచ్చింది. సాధారణాంగా రైతులు ఎకరా విస్తీర్ణంలో 35-40 టన్నుల చెరుకు గడలు నాటేవారు. కానీ రోషన్ కనిపెట్టిన ఈ కొత్త విధానంలో అంతే విస్తీర్ణంలో 3-4 క్వింటాల్లతో పూర్తి చేశాడు. ఇలా చేయడంవల్ల రైతులకు టైమ్ తోపాటు, లేబర్ చార్జ్, ట్రాన్స్ పోర్ట్ చార్జ్ సేవ్ అవ్వడమే కాకుండా అధిక దిగుబడిని కూడా తీసుకొచ్చింది.

లాభాలే లాభాలు

రోషన్ అభివృద్ది చేసిన ఈ సరికొత్త విధానంతో చెరకు సాగులో పెద్ద రైతుల గుత్తాధిపత్యానికి తెరపడింది. చిన్న రైతులు తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు కళ్ళచూడడం మొదలుపెట్టారు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పాకి మిగతా రైతులు ఈ విధానాన్ని ఆనుసరించడం మొదలు పెట్టారు. రైతుల జీవితాల్లో మార్పు తీసుకురావాలనుకున్న రోషన్ లాల్ తను కనిపెట్టిన ఈ సరికొత్త విధానానికి పేటెంట్ తీసుకోని లాభసాటి వ్యాపారంగా మార్చుకోవాలన్న ఆలోచన చేయలేదు. అ తర్వాత మధ్యప్రదేశ్ తో పాటు దేశంలో ని మహారాష్ట్ర, ఆంద్రప్రదేశ్, కర్ణాటక, ఓడిశా, హర్యానా, ఉత్తరప్రదేశ్, చత్తీస్ గడ్ రైతులు కూడా రోషన్ లాల్ విధానాన్ని ఫాలో అయ్యి మంచి ఫలితాల్ని పొందారు.

మిషన్ బ్రహ్మాండం

దీంతో సంతృప్తి చెందని రోషన్ లాల్ చెరుకు సాగు విధానాన్ని మరింత సులభతరం చేయ్యడానికి ఏమేం చెయ్యాలా అని నిరంతరం అలోచిస్తూ ఉండేవాడు. అప్పట్లో చెరుకు గడలకు మొగ్గలను తొలగించడం రైతులకు భారంగా ఉండేది. మొగ్గలను తొలగించేందుకు తక్కువ ఖర్చులో అయ్యే ఓ యంత్రాన్ని తయారు చెస్తే రైతులకు మరింత శ్రమ తగ్గుతుంది కదాని ఆలోచించాడు. తన ఐడియాని వ్యవసాయ నిపుణులతో పాటు శాస్త్రవేత్తలతో చర్చించి.. వారి సహకారంతో రెండేళ్ళ తరువాత ఒక సులభమైన సాధనాన్ని అభివృద్ధి పరిచాడు. రోషన్ మొదట తయారుచేసిన మిషన్ మూడు న్నర కిలోల బరువుండి గంటకు నాలుగు వందల వరకూ మొగ్గలను తొలగించగల సామర్థ్యం తో పనిచేసింది. ఆ తర్వాత అదే యంత్రాన్ని మరింత మెరుగు పర్చుకుంటూ గంటకు 800 మొగ్గలను తొలగించడంతో పాటు చేతులకు బదులు కాళ్లతోనూ ఆపరేట్ చేసేవిధంగా తీర్చిదిద్దాడు. రోషన్ లాల్ చేసిన ఈ ఆవిష్కరణ నేషనల్ ఇన్నోవేషన్ పౌండేషన్ ఫర్ గ్రాస్ రూట్స్ అవార్డ్ కి ఎంపికైంది. అలా ఈ మిషన్ కేవలం 1500 రూపాయలకే ఇండియాతో పాటు మరికొన్ని ఆఫ్రికన్ దేశాల్లో విపరీతంగా ప్రజాదరణతో అమ్ముడుపోతోంది.


image


ఫుల్ డిమాండ్

ఆ తర్వాత రోషన్ లాల్ తన మిషన్ ని మరింత మెరుగుపర్చి విద్యుత్ తో గంటకు 2000 మొగ్గల్ని తొలగించేలా తయారు చేశాడు. ఈ మిషన్ కి ఇప్పుడు మార్కెట్లో సూపర్ డిమాండ్ ఉంది. చెరకు రైతులతో పాటు మిల్లర్స్ నర్సరీ యజమానులంతా ఈ యంత్రాన్నివిరివిగా ఉపయోగిస్తున్నారు.అంతటితో ఆగని విశ్వకర్మ షుగర్ కేన్ ప్లాంటేషన్ ని మరింత సులభతరం చెయ్యడానికి మరోయంత్రాన్ని కనిపెట్టాడు. ట్రాక్టర్ కి అటాచ్ చేసి ఎంత లోతులో చెరకు గడ నాటాలో ఫిక్స్ చేస్తే దానంతట అదే నాటుకుపోయో యంత్రాన్ని కనిపెట్టాడు. ఈ యంత్రం కేవలం మూడు గంటల్లో ఎకరం పొలంలో విత్తనాల్ని నాటే పని పూర్తి చేస్తుంది. చాలా వ్యవసాయ పరికరాల ఉత్పత్తి సంస్థలు రోషన్ లాల్ కనిపెట్టిన యంత్రాన్ని పెద్ద మొత్తంలో ఉత్పత్తి చేసేందుకు ఆయనతో ఒప్పందం చేసుకునేందుకు ముందుకొస్తున్నాయి. ప్రస్తుతం ఈ మిషన్ ధరను లక్షా 20 వేలు గా నిర్ణయించాడు రోషన్.

రోషన్ లాల్ చేసిన ఈ సరికొత్త ఆవిష్కరణల ఫలితంగా చెరుకు సాగులో విప్లవాత్మకమైన మార్పులొచ్చాయి..రైతులకు తొంబై శాతం వరకూ శ్రమ తగ్గింది. పెద్ద రైతుల గుత్తాధిపత్యానికి తెరపడి చిన్న రైతులూ లాభాలు అందుకుంటున్నారు. ఈయన కనిపెట్టిన ఈ విధానం దేశంలోనే కాకుండా ప్రపంచంలోని వివిద దేశాల రైతులు ఆచరిస్తున్నారు.

శ్రమించే గుణం ఎలాగూ ఉంది దానికి కాస్త సృజన జోడించి.. వ్యవసాయంలోనూ సిరులు పండించొచ్చని నిరూపిస్తున్నాడు రోషన్ లాల్ విశ్వకర్మ.. తాను సక్సెస్ కావడమే కాకుండా కొన్ని లక్షల మంది రైతుల జీవితాల్లోనూ వెలుగులు నింపాడు.చేసే పనిని ప్రేమిస్తే ..ఎన్ని ఆటంకాలు ఎదురైనా విజయం సాధించడం ఖాయం.. రోషన్ లాల్ జీవితమే దానికి ఫర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ కాదంటారా..