మంబైలో తొలి ట్రాన్స్ జెండర్ రేడియో క్యాబ్ డ్రైవర్ !

మంబైలో తొలి ట్రాన్స్ జెండర్ రేడియో క్యాబ్ డ్రైవర్ !

Friday January 22, 2016,

2 min Read

ముంబై ఎప్పుడూ అంతే! దేనికైనా ఇట్టే కనెక్ట్ అవుతుంది! ముంబైకర్లు దేన్నయినా ఈజీగా యాక్సెప్ట్ చేస్తారు! దేనికైనా చాలా వేగంగా స్పందిస్తారు! చాలా స్పోర్టివ్ గా కూడా ఉంటారు! కూసింత ధైర్యం వుంటే చాలు.. మహా నగరం వాళ్లను ఎలాగైనా బతికిస్తుంది! బతకడం నేర్పిస్తుంది! ఇన్‌క్రెడిబుల్ ఇండియా! ఇన్‌క్రెడిబుల్ ముంబై!! ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే..!!!

image


సెక్స్ వర్కర్లుగా మగ్గిపోయి, చౌరస్తాల్లో నిలబడి చేతులు చరిచి, నాలుగు డబ్బుల కోసం నానా తిట్లు తిని, వాళ్లచేత వీళ్లచేత ఛీ కొట్టించుకుని, లోకంలో ఒక మూలకు విసిరేయబడ్డ సమాజాన్ని అక్కున చేర్చుకోవాలంటే- వాళ్ల గుండె ఎంత పెద్దగా స్పందించాలి..? వాళ్ల మనసు ఎంత విశాలంగా ఆలోచించాలి..? అలాంటి పెద్ద మనసున్న కథే ఇది.

ఎల్‌జీబీటీ కమ్యూనిటీ. (లెస్బియన్, గే, బై సెక్సువల్, ట్రాన్స్ జెండర్‌) ముంబైలో ఒక 1500 మంది దాకా ఉంటారు. శాపమో, పాపమో వాళ్ల జీవితాలు అలా మారిపోయాయి. అందరి దృష్టిలో వాళ్లది వేరేజాతి. అంతకంటే విశాలంగా ఆలోచించలేదు మన టిపికల్ వ్యవస్థ. అందుకే వాళ్లు ఈ లోకంలో ఇంకా ఇమడలేదు. వాళ్ల మనోభావాలతో మెజారిటీ జనాలకు పనిలేదు.

ఎల్‌జీబీటీ కమ్యూనిటీ గురించి హమ్సఫర్ ట్రస్ట్ అలా అనుకోలేదు. సెక్స్ వర్కర్లుగా పనిచేయడం, బిచ్చమెత్తడం..ఇలా ఎంతకాలమని? నిత్య పేదరికంతో ఎంతకాలాం బతుకీడ్చాలి. వాళ్లెందుకు ఆత్మగౌరవంతో తలెత్తెకుని బతకొద్దు..? ఇదే కాన్సెప్టుతో వింగ్స్ రెయిన్ బోతో కలిసి ఒక కమ్యూనిటీ ట్రావెల్స్ ప్రాజెక్టు ఏర్పాటు చేసింది. ఎల్‌జీబీటీల్లో ప్రత్యేకించి ట్రాన్స్ జెండర్ల కోసం క్యాబ్ సర్వీసును ప్రవేశపెట్టింది. ఆసక్తి ఉన్న 300 మందితో ఈ ప్రాజెక్టు మొదలైంది. వాళ్లందరికీ డ్రైవింగ్ లో శిక్షణ ఇవ్వడమే కాకుండా క్యాబ్ చేతికిచ్చి- మీరేంటో ప్రపంచానికి చూపించండి అని ఆత్మవిశ్వాసాన్ని పాదుకొల్పింది.

కట్ చేస్తే, ఐదంటే ఐదు నెలల తర్వాత వాళ్ల జీవితాలే మారిపోయాయి. తలా ఎంత లేదన్నా నెలకు 15వేలు సంపాదిస్తున్నారు. ట్రస్టు తరుపు ఒక్కొక్కరికీ డ్రైవింగ్ శిక్షణ, ఇతరాత్రా కోసం నాలుగు వేలు ఖర్చవుతున్నాయి. అందరికీ ఒకేసారి అంటే కష్టమని, ఐదుగురు చొప్పున ట్రైనింగ్ ఇస్తున్నారు.

ఒక్క మన దగ్గరే దరిద్రం. మిగతా అన్ని దేశాల్లో ఎల్జీబీజీటీ కమ్యూనిటీ వాళ్లు గౌరవంగా ఉద్యోగం చేసుకుంటారు. ప్రత్యేకించి థాయ్ లాండ్‌లో అయితే ఇలాంటి వాళ్లు అన్ని సెక్టార్లలో పనిచేస్తారు. మన దగ్గర కూడ మార్పు రావాలి అంటాడు ట్రస్ట్ డైరెక్టర్ ఆఫ్ ప్రోగ్రామ్ పట్నాకర్. ఇంతకాలం ట్రాన్స్ జెండర్లంటే కేవలం సెక్స్ వర్కర్లుగానో, బిచ్చగాళ్లుగానో చూసిన జనాల మైండ్ సెట్ మార్చుతాం అంటోంది పదహారేళ్ల రేడియో క్యాబ్ డ్రైవర్.